సంపాదకీయం

రాజధానుల రీతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన ‘అమరావతి’ నిర్మాణ ప్రక్రియ నుంచి ‘ప్రపంచ బ్యాంకు’ తప్పుకొనడం భారతీయుల స్వాభిమాన గరిమను పెంపొందించగల శుభ పరిణామం. ‘అంతర్జాతీయ స్థాయి’ అంటే విదేశీయ సంస్థల లేదా అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం- అన్న భ్రాంతికి గురి అయి ఉండిన అధికార, ప్రతిపక్ష రాజకీయవేత్తలకు ఇది జ్ఞానోదయ ఘట్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు చిన్న రాష్ట్రాలుగా వికేంద్రీకృతమైన తరువాత ఉభయ ప్రాంతాలలో ప్రగతి వేగవంతమైందన్నది నిరాకరింపజాలని నిజం. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రభుత్వాలు రెండూ సహజంగానే ‘వికేంద్రీకృత వ్యవస్థ’లలో నిహితమై ఉన్న ‘ప్రగతి’ని గుర్తించాయి. గుర్తించాయన్న ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం బహుళ ప్రయోజన బృహత్ జలవాహిని పరుగులు తీయడం ఒక ఉదాహరణ. గోదావరి జలాలు కృష్ణమ్మతో సంగమించడం- పట్టిసీమ- మరో నిదర్శనం. ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. కానీ ‘చిన్న రాష్ట్రాల’ను ప్రగతికి ప్రాతిపదికగా గుర్తిస్తున్నవారు ‘చిన్న రాజధానుల’ను ‘హరిత రాజధానుల’ను ‘కాలుష్యం లేని రాజధానుల’ను, ‘రద్దీలేని రాజధానుల’ను ఏర్పాటుచేసుకోవాలన్న ధ్యాసకు ఎందుకని దూరమై ఉన్నారు? రాజధాని కేవలం పరిపాలన కేంద్రంగా ఉండడం భారతీయుల అనాది జీవన విధానం. విద్యానగరాలు, వాణిజ్య నగరాలు, క్రీడా నగరాలు, చెత్త సినిమాలను జనం నెత్తిన రుద్దగల విచిత్ర నగరాలు ‘రాజధాని’లో ఏర్పడరాదన్నది ‘హరిత’ సూత్రం. ఈ సూత్రానికి భిన్నంగా రూపొందిన ‘హైదరాబాదు’ దశాబ్దులపాటు ‘కాలుష్య కేంద్రం’గా మారి ఉంది. అనంతగిరి ఓషధులతో కలసి ప్రవహించి ఆరోగ్యప్రదమైన జలాలతో జనం దప్పితీర్చిన అవిరళ, అమలిన ముచికుందా నదీ ‘మూసీ మురుగు’గా మారి ఉండడానికి కారణం కేంద్రీకరణ వికృతి! రాష్ట్రంలోని సగం జనం రాజధానిలోనే కేంద్రీకృతం అయ్యేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిలువున పెరిగింది. ఈ కాలుష్య చరిత్ర నుంచి ఉభయ తెలుగు ప్రాంతాల ప్రభుత్వాలు గత ఐదు ఏళ్లకు పైగా గుణపాఠాలను నేర్చుకొని ఉండాలి! ‘ఉండినట్టయితే’ తెలంగాణ ప్రభుత్వ సచివాలయ, శాసనసభ, శాసన మండలి, ఉన్నత న్యాయస్థాన, ఇతర ప్రధాన కార్యాలయాల భవన సముదాయాన్ని జంట నగరాలకు ఆవల కనీసం యాబయి కిలోమీటర్ల దూరంలో నిర్మించాలన్న పథకం సిద్ధమై ఉండేది. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు చిన్న, ముచ్చటైన, హరిత శోభల ఆరోగ్యప్రదమైన ‘అమరావతి’ని రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ‘విచక్షణ’ వికసించి ఉండేది. ఈ రెండూ జరగలేదు. జరుగక పోవడానికి కారణం ఆవహించి ఉన్న అంతర్జాతీయపు నకిలీ పారవశ్యం..! ‘విదేశాల నుంచి మనకు పెట్టుబడులు వస్తే తప్ప మనం ప్రగతిని సాధించలేము’అన్న జాతీయాత్మ న్యూనతాభావం ఈ అంతర్జాతీయపు నకిలీ పారవశ్యం. దోచుకొని వెళ్లడానికై చొఱబడుతున్న విదేశీయ, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు రాజధానిలోను, శివారులోను మాత్రమే తిష్ఠవేయాలన్నది సహజ స్వభావం. గ్రామీణ ప్రాంతాలకు అవి తరలిరావు. అందువల్ల ‘కేంద్రీకరణ’ పెరిగింది, పెరుగుతోంది...
ఈ కేంద్రీకృత కాలుష్య విస్తరణకు తాత్కాలికంగానైనా విఘాతం కలుగడం ఆనందకరం. ‘అమరావతి’పై- ఆంధ్రప్రదేశ్ రాజధానిపై- ప్రపంచ బ్యాంకు ‘ఉక్కుపాదం’ పడటం లేదు, వికృత హస్తం ‘అమరావతి’ని కెలకబోదు.. ఇదీ హర్షణీయ పరిణామం. సంపన్న దేశాలు ప్రవర్థమాన దేశాలను నియంత్రించడానికి వీలుగా ఏర్పడిన తథాకథిత-సోకాల్డ్- అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో అతి ప్రధానమైనది ‘ప్రపంచ బ్యాంక్’! అంతర్జాతీయ ద్రవ్యనిధి- ఇంటర్ నేషనల్ మానిటరీ ఫండ్-, ‘ఆసియా అభివృద్ధి బ్యాంక్’వంటివి కూడ ఉన్నాయి. ఈ ‘సంస్థలు’ సంపన్న దేశాల నియంత్రణకు గురై ఉండడం దశాబ్దుల వైపరీత్యం. మన అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రగతి పథకాలకు పెట్టుబడులను మంజూరుచేసిన ‘ఆసియా అభివృద్ధి బ్యాంక్’ ఆ తరువాత చైనా దౌత్య దుర్మార్గానికి లొంగిపోయింది, పెట్టుబడులను విడుదల చేయలేదు. పదేళ్లకు పూర్వం జరిగిన ఘటన ఇది. ఇప్పుడు ‘ప్రపంచ బ్యాంక్’ వారు ‘దయ’తో అమరావతిలో వౌలిక సదుపాయాల కోసం ఆరువేల కోట్ల రూపాయలను ప్రదానం చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆరువేల కోట్ల రూపాయలు పెద్దమొత్తం కాదు. అరవై వేల కోట్లు కాదు, ఆరు లక్షల కోట్లూ కాదు. ఈ చిన్నమొత్తం కోసం మన దేశపు ఆర్థిక సార్వభౌమత్వాన్ని, ఆర్థిక స్వతంత్రాన్ని తాకట్టుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అందువల్ల ఘనత వహించిన ‘ప్రపంచ బ్యాంకు’ వారు ఈ ఆరువేల కోట్ల రూపాయల ‘ఆర్థిక దయాభిక్ష’ను ఉపసంహరించుకున్నారట! అంతర్జాతీయ పీడ వదిలింది. లక్షల కోట్ల రూపాయల వార్షిక ఆదాయ వ్యయ ప్రణాళికలు కల మన ప్రభుత్వాలకు ఈ ఆరువేల కోట్ల రూపాయల వల్ల పెద్దగా ఒరిగేదేముంది? ఒరుగుతుందనుకోవడం ప్రగతి భ్రాంతి..
ప్రభుత్వానికి అమరావతి నిర్మాణం కోసం వలసిన నిధులను ప్రజల నుండి సేకరించుకోవచ్చు. కాలవ్యవధి రాజధాని నిర్మాణ నిధి పత్రాల- టైమ్‌బౌండ్ కాపిటల్ కన్‌స్ట్రక్షన్ బాండ్స్- ద్వారా నిధులను సేకరించడం వల్ల ప్రజలలో భాగస్వామ్య భావం పెరుగుతుంది. స్వజాతీయ స్వాభిమానం పెరుగుతుంది. అమరావతి నిర్మాణంలో ఇది వౌలిక అంశం. ‘ప్రపంచ బ్యాంకు’ మంజూరు చేసిన నిధులను ఉపసంహరించడానికి కారణం మన దేశపు అంతరంగ కలాపాలలో ఈ సంస్థ అక్రమ ప్రమేయాన్ని మన ప్రభుత్వం అంగీకరించకపోవడం. తమ నిధులతో అమలుజరుగుతున్న వౌలిక సదుపాయ ప్రగతి పథకాల నిర్మాణపు తీరుతెన్నులను గురించి ‘దర్యాప్తు’ జరిపే హక్కు తమకుండాలన్నది ‘ప్రపంచ బ్యాంక్’వారి వాదం. అందువల్ల తమ బృందాలను దర్యాప్తుచేయడానికి అనుమతించాలన్నది ‘ప్రపంచ బ్యాంకు’వారి కోరిక. ఈ కోరికను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ‘అమరావతి’లో వౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలో ప్రపంచ బ్యాంక్ దర్యాప్తులకు, పర్యవేక్షణలకు, సమీక్షలకు, నిర్వాకాలకు అనుమతి ఇచ్చినట్టయితే దేశవ్యాప్తంగా ఈ ‘బ్యాంక్’ సహకారంతోను ఇతర అంతర్జాతీయ సంస్థల సహకారంతోను అమలుజరుగుతున్న అన్ని పథకాల విషయంలోను ఇలాంటి జోక్యం పెరిగిపోతుంది! ఇప్పటికే ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ చొఱబాటు కారణంగా మన దేశంలో విదేశీయ వాణిజ్య సామ్రాజ్యాలు ఏర్పడి ఉన్నాయి. 2014లో అమరావతి నిర్మాణానికి శ్రీకారం జరిగిన నాటి నుంచి- భూమి సేకరణతో మొదలు- ఐదేళ్లపాటు జరిగిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. జాతీయ స్వాభిమాన గరిమకు ఘోరమైన అవమానం ఈ అంతర్జాతీయ ఆర్భాటం. అమరావతి నిర్మాణానికి భారతీయ స్థపతులు- ఇంజినీర్లు- కాని, నిర్మాణ సంస్థలు- కన్‌స్ట్రక్షన్ కంపెనీలు- కాని, స్వదేశీయ పరిజ్ఞానం కాని, నిపుణులు కాని, స్వదేశీయమైన నమూనాలు కాని పనికిరాలేదు. చివరికి నిర్మాణ కార్యక్రమానికి ‘రాళ్లను ఎత్తే’ శ్రమజీవులను, తాపీమేస్ర్తిలను సైతం సింగపూర్ నుంచి, మలేసియా నుంచి దిగుమతి చేసుకుంటారేమోనన్న భ్రాంతి వ్యాపించింది. ప్రస్తుత అమరావతి ప్రాంగణంలోనే సుదీర్ఘ గతంలో మరో అమరావతి వేల ఏళ్లు పరిఢవిల్లింది. ఆ ‘్ధన్య కటకం’ నిర్మాణ విస్తరణ రీతులను మాత్రం మన ప్రభుత్వాలు అధ్యయనం చేసిన జాడలేదు. విదేశాలలోని ‘గొప్ప’ నమూనాలను మాత్రం ఘనత వహించిన వారు ఐదేళ్లు కూలంకషంగా నేర్చుకున్నారు..
కృష్ణానదీ తీరంలోని ‘అమరావతి’ ఒక ధాన్యకటకం.. గోదావరి తీరం లోని ‘కోటిలింగాల’ మరో ధాన్యకటకం. ఈ రెండూ వివిధ కాలాలలో తెలుగువారికి- ఆంధ్రులకు- రాజధానులు. కృష్ణాతీరంలోని ధాన్య కటకం గురించి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన ‘భగవంతుని మీద పగ’అన్న చారిత్రక నవలలో ఇలా చెప్పి ఉన్నాడు- ‘.. ఇవి అన్నియు విడివిడిగానుండును. కానీ ఈ పల్లెటూళ్లన్నియు కలిపి ఒక్కటియే మహానగరముగా వ్యవహరింతురు. ఇంద్రకీలాద్రి మొదలు వేదాద్రి పై వరకు వ్యాపించి ఉన్న ఆ పలు పల్లియల సముదాయమునకంతకు ధాన్యకటకమనియే పేరు..’. రాజధాని ఇలా పలు పల్లెల, సముదాయంగా ఉన్నప్పుడు అది ‘హరిత’నగరం కాగలదు. పల్లెకూ పల్లెకూ- మధ్య పొలాలు.. పొలాలమధ్య పల్లెలు! ఇదీ ‘హరిత నగరం’- గ్రీన్ సిటీ- స్వరూపం! ఇప్పుడైనా ప్రాచీన భారతీయ నిర్మాణ పద్ధతులను అధ్యయనం చేయండి....