సంపాదకీయం

రాజ్యాంగానికి కొత్త భాష్యం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రాష్ట్రంలో విధించిన రాష్టప్రతి పాలనను కేవలం రెండు గంటల పాటు తొలగించడం విచిత్రమైన రాజ్యాంగ పరిణామం. మే 10న ఉత్తరఖండ్‌లో ఇలా తొలగించడం సర్వోన్నత న్యాయస్థానం మేనెల ఆరవ తేదీన ఇచ్చిన తీర్పు ఫలితం విచిత్రంకావచ్చు గాక, వినూతన ప్రజాస్వామ్యపు సంప్రదాయాలు అంకురిస్తుండడం నిరంతర రాజ్యాంగపు పరిణామ ప్రగతికి చిహ్నం. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు హరీశ్ రావత్ మార్చి 27న ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడానికి కారణం హఠాత్తుగా విరుచుకొనిపడిన రాష్టప్రతి పాలన...హరీశ్‌రావత్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో 10వ తేదీన ఉత్తరఖండ్ శాసనసభలో జరిగిన బలపరీక్ష ఫలితం! ఈ నలబయి ఐదు రోజుల ప్రక్రియలో జరిగిన పరిణామాలు కుతూహలగ్రస్తులను దేశవ్యాప్తంగా ఉత్కంఠకు గురి చేయడం తాత్కాలికం. అలాగే రావత్ పదవిని కోల్పోవడం మళ్లీ ముఖ్యమంత్రి కావడం చిన్న రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరఖండ్ ప్రాంతానికి పరిమితమైన రాజకీయ ప్రహసనం. ఈ ప్రహసనంలో ఎవరు న్యాయంగా ప్రవర్తించారు? ఎవరు అన్యాయానికి ఒడిగట్టారు? కాంగ్రెస్ పార్టీనా? భారతీయ జనతా పార్టీనా? అన్న ప్రశ్నలకు సమాధానాలు విభిన్నంగా ఉండవచ్చు! ఈ మొత్తం ప్రహసనంలో కాంగ్రెస్ గెలిచినట్టు జరుగుతున్న ప్రచారం గురించి కూడ ఏకాభిప్రాయం లేదు...రావత్ అవినీతి చర్యలకు ఒడిగట్టినట్టు కొనసాగుతున్న అభియోగాలలోని నిజానిజాలు న్యాయస్థానాలలో నిగ్గు తేలేవరకు జనానికి స్పష్టమైన అవగాహన కుదరదు. కానీ ప్రస్తుత ఘట్టంలో భాజ పా అపకీర్తిని మూటగట్టుకుం ది, జాతీయ స్థాయిలోను, ఉత్తరఖండ్ స్థాయిలోను అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు గొప్ప వెసులుబాటు లభించింది...ఇదంతా రాజకీయం, ఉత్తరఖండ్ వ్యవహారం. కానీ ఈ హరీశ్‌రావత్ పదవిని కోల్పోయిననాటినుంచి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవరకు హైకోర్టు, సుప్రీంకోర్టు చేసిన నిర్ణయాలు దేశమంతటికీ వర్తించగల వినూతన రాజ్యాంగ సంప్రదాయాలకు ప్రాతిపదికలయ్యాయి. న్యాయాధికార పరిధి మరింతగా విస్తరించింది! మితిమీరిన న్యాయ ప్రమేయం గురించి నోళ్లు పారేసుకుంటున్న వారు నోరు మెదపలేని స్థితి ఏర్పడింది! శాసనసభల అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలకు లేదన్న వాదం వీగిపోవడం ఈ మొత్తం వ్యవహారంలో అతి ప్రధాన పరిణామం! రాష్టప్రతి పాలనను తొలగించడానికి తిరిగి విధించడానికి సైతం సర్వోన్నత న్యాయస్థానానికి అధికారం ఉందన్న రాజ్యాంగ సంప్రదాయం వ్యవస్థీకృతమైంది...
రాజ్యాంగంలోని 356వ అధికరణం ప్రకారం రాష్టప్రతి పాలన విధించిన తరువాత రెండు నెలలలోగా పార్లమెంటు ఉభయ సభలు ఆ విధింపును ఆమోదించవలసి ఉంది. అలా ఆమోదించని పక్షంలో రాష్టప్రతి పాలన రద్దయిపోయి ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించవలసి ఉంది. ఉత్తరఖండ్‌లో రాష్టప్రతి పాలన విధింపునకు సంబంధించిన ఉత్తరువును రెండు నెలలలోగా లోక్‌సభ ఆమోదించి ఉండినా రాజ్యసభలో ప్రతిఘటన ఎదురయి ఉండేది. రాజ్యసభ తిరస్కరించి ఉంటే ఏమయి ఉండేది. ఇంతవరకు మన రాజ్యాంగ చరిత్రలో అలాంటి స్థితి ఎదురైన దాఖలా లేదు. ఇలా ఒక సభ ఆమోదించిన తరువాత మరోసభ ఆమోదించకపోయినప్పుడు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం జరపాలా? వద్దా? ఆర్థికేతర బిల్లులను ఒక సభ ఆమోదించిన తరువాత మరో సభ ఆమోదించనప్పుడు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది. ఇదే సూత్రం రాష్టప్రతి పాలన విధింపునకు సంబంధించిన తీర్మానాలకు వర్తిస్తుందా? రాజ్యాంగంలోని 108వ అధికరణం ప్రకారం ఉమ్మడి సమావేశం జరగాలన్న నియమం రాజ్యాంగ సవరణ బిల్లులకు వర్తించడం లేదు. రాజ్యాంగ సవరణలను ఉభయ సభలు విడివిడిగా ఆమోదించవలసిందే. రాష్టప్రతి పాలన తీర్మానాలకు వర్తిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం లభించాలి? సుప్రీంకోర్టు కలుగచేసుకుని ఉండకపోతే రెండు నెలలల గడువు ముగిసే లోగా ఈ సంగతి స్పష్టమయి ఉండేది. రాజ్యసభలో అధికార పక్షానికి మెజారిటీ లేదు కాబట్టి ఉత్తరఖండ్ రాష్టప్రతి పాలనను బహుశా రాజ్యసభ తిరస్కరించి ఉండేది..
రాష్టప్రతి పాలన ఉన్న సమయంలో శాసనసభ రద్దయి ఉంటుంది లేదా ఆచలన రహితం-సస్పెండెడ్ అనిమేషన్-గా ఉంటుంది. అందువల్ల శాసనసభ సమావేశం కావాలంటే రాష్టప్రతి పాలన రద్దు కావాలి. రాష్టప్రతి పాలనను తాత్కాలికంగా రెండు గంటలపాటు సుప్రీంకోర్టు రద్దు చేయవచ్చునన్న నిబంధన రాజ్యాంగంలో లేదు. కానీ సుప్రీంకోర్టు రద్దు చేయగలిగింది. ఇలా రద్దయిన సమయంలో పరిపాలన అధికారం ఎవరికి సంక్రమిస్తుంది? రాష్టప్రతి పాలన రద్దు కాగానే ప్రాతినిధ్య ప్రభుత్వం ఏర్పడాలి? అలాంటి ప్రభుత్వాన్ని నిర్వహించే రాజకీయ పక్షం శాసనసభలో అధికార పక్షం...కానీ ఈ రెండు గంటల సమయంలో అలాంటి ప్రాతినిధ్య ప్రభుత్వం ఏర్పడిన దాఖలా లేదు. రాష్టప్రతి పాలన లేదు, మంత్రివర్గంతో కూడిన ప్రాతినిధ్య ప్రభుత్వం లేదు. అంటే ఉత్తరఖండ్‌లో ఆ రెండు గంటలపాటు ప్రభుత్వ రహిత స్థితి ఏర్పడిందన్నమాట. ఇలా ఏర్పడకుండా సుప్రీంకోర్టు ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించకపోవడం న్యాయ వైపరీత్యం! శాసనసభకు సంబంధించినంత వరకు, శాసనసభా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి యాదవ్‌సింగ్ పర్యవేక్షణలో బలపరీక్ష జరిగింది, స్పీకర్ పర్యవేక్షణలో కాదు! సుప్రీంకోర్టు చేసిన ఈ నిర్ధారణ ప్రకారం జరిగింది బలపరీక్ష మాత్రమే, విశ్వాస పరీక్ష కాదు! ఇది కూడ కొత్త సంప్రదాయం. గతంలో ఝార్‌ఖండ్ శాసనసభలో సంయుక్త బలపరీక్ష-కాంపోజిట్ ఫ్లోర్ టెస్టింగ్ జరిగింది. కానీ అప్పుడు ఈ సంయుక్త బలపరీక్ష జరుపవలసిందిగా సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్‌ను ఆదేశించింది. ఇప్పుడు ఉత్తరఖండ్‌లో స్పీకర్‌కు అలాంటి ఆదేశాన్ని సుప్రీంకోర్టు జారీ చేయలేదు. 2005 మార్చి రెండవ తేదీన ఝార్‌ఖండ్ ముక్తిమోర్చా అధ్యక్షుడు శిబూ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించిన గవర్నర్ చర్యను భాజపా సవాలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు జరగవలసిన బలపరీక్ష జరగకుండానే అప్పుడు సోరెన్ రాజీమానా చేశాడు. భాజపా నాయకుడు అర్జున్ ముండా ముఖ్యమంత్రి అయ్యాడు..
అందువల్ల ఉత్తరఖండ్ శాసనసభలో జరిగిన రీతిలో బలపరీక్ష గతంలో జరగలేదు. రాష్టప్రతి పాలన విధించిన తరువాత కూడ శాసనసభ సమావేశం జరగడానికి, బలపరీక్షలు జరగడానికి వీలుందన్న నూతన రాజ్యాంగ సంప్రదాయాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు నెలకొల్పింది. అయితే బలపరీక్ష తరువాత మళ్లీ ఏర్పడిన రాష్టప్రతి పాలనను సుప్రీంకోర్టు తొలగించలేదు. కేంద్ర ప్రభుత్వమే తొలగించడానికి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది...మళ్లీ ముఖ్యమంత్రి పదవిని పొందిన రావత్ ఇలా వినూతన రాజ్యాంగ సంప్రదాయాలు నెలకొనడానికి దోహదం చేశాడు...