కర్నూల్

కరవును ఎదుర్కొనేందుకు సమాయత్తం కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 40 మండలాల్లో కరవు
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు, డిసెంబర్ 19:రానున్న 6 నెలల కాలంలో కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సమాయత్తం కావాలని కలెక్టర్ విజయమోహన్ పిలుపునిచ్చారు. జిల్లాలో కరవు పరిస్థితులను అధిగమించేందుకు చేపట్టాల్సిన వ్యూహంపై శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది 28 శాతం, ఈ సంవత్సరం 31 శాతం వర్షపాతం తక్కువ నమోదై వర్షభావ పరిస్థితుల వల్ల ప్రభుత్వం 40 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించిందన్నారు. కావున కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది చిత్తశుద్ధి, అంకితభావం, మానవతా దృక్పథంతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలు వలస పోకుండా ఉపాధి హామీ పనులు కల్పించేందుకు పనులు గుర్తించి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో మూడు విడతల్లో 100 ఫారంపాండ్లు తవ్వుకునేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా పెద్దహోతూరు గ్రామంలో 800 ఫారం పాండ్లు తవ్వించారని అదే స్ఫూర్తితో ప్రతి గ్రామంలో 6 నుంచి 7వేల ఫారంపాండ్లు తవ్వుకునేందుకు లక్ష్యాంగా నిర్ధేశించుకోవాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ అధికారులు ఫారంపాండ్ల తవ్వకంలో కీలకపాత్ర పోషించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో కూలీలకు కనీసం రూ. 50 వేలు చెల్లించేలా ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో 1452 వాగులు ఉన్నాయని ఉపాధి హామీ కింద వాగుల చుట్టూ జంగిల్ క్లియరెన్స్, వాగుల్లో పూడిక తీత పనులు చేపట్టేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కృషి చేయాలన్నారు. వాగుల గట్లను పటిష్టం చేయడంతో పాటు ఇరు పక్కల మొక్కలు నాటాలన్నారు. ఇరిగేషన్ అధికారులు వాగులను పరిశీలించి ఎస్టిమేట్ ప్రతిపాదనలు పంపాలన్నారు. పశుగ్రాసం కొరతను నివారించేందుకు అన్ని ప్రాంతాల్లో పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేసే పశుగ్రాసం పెంపుదలకు వ్యవసాయాధిరులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో 20 ఎకరాల్లో పశుగ్రాసం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమగ్ర రక్షణ మంచి నీటి పథకాల పనితీరు, చేతి పంపుల మరమ్మతులు వెంటనే చేపట్టి తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. సమావేశంలో జెసి హరికిరణ్, వ్యవసాయశాఖ జెడి ఉమామహేశ్వరి, ఆర్‌డిఓలు ఓబులేసు, సుధాకర్‌రెడ్డి, రఘుబాబు, డ్వామా పిడి పుల్లారెడ్డి, డిఆర్‌డిఎ పిడి రామకృష్ణ, సిపిఓ ఆనందనాయక్ పాల్గొన్నారు.
విద్యాసంస్థల్లో వసతులపై
సమగ్ర నివేదిక సిద్ధం చేయండి
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు, డిసెంబర్ 18:హైకోర్టు ఉత్తర్వుల మేరకు పాఠశాలలు, కళాశాలల్లో టాయ్‌లెట్లు, ప్రహరీ తదితర వౌలిక సదుపాయాల కల్పనపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం తన ఛాంబర్‌లో విద్యాసంస్థల్లో వౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత హైస్కూళ్లు, జూనియర్ డిగ్రీ కాలేజీల్లో టాయ్‌లెట్లు, అదనపు తరగతి గదులు, తాగునీరు, ప్రహరీ తదితర అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి శనివారం లోపు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 21వ తేదీ సంబంధిత నివేదికలను హైకోర్టులో సమర్పించాల్సి వుంటుందని ఈ మేరకు అఫిడవిట్ ప్రకారం తీసుకున్న చర్యలను సమర్పించాలని సూచించారు. 2014-15, 2015-16లో చేపట్టిన పనులు, పూర్తయిన పనులు, పూర్తి కావాల్సిన పనులపై సిర్ట్ఫికెట్‌లు ఇవ్వాలని ఎస్‌ఎస్‌ఎ ఇఇ ప్రకాష్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఇలను ఆదేశించారు. తాగునీరు, టాయ్‌లెట్లకు సంబంధించి రాబోయే 3 నెలల్లో చేపట్టే పనులపై నివేదిక ఇవ్వాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇని ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, ఎస్‌ఎస్‌ఎ పిఓ వెంకటకృష్ణుడు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ సురేంద్రనాధ్, డివిఇఓ సాలాబాయ్, ఎస్‌ఎస్‌ఎ ఇఇ ప్రతాప్‌రెడ్డి, తదతరులు పాల్గొన్నారు.
రైతు కుటుంబాలను ఆదుకుంటాం
* సిపిఎం జాతీయ నేత ప్రకాష్‌కారత్
కర్నూలు సిటీ, డిసెంబర్ 18:ప్రభుత్వ రుణమాఫీ అమలుకాక వరుస కరవులు వెంటాడడంతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, వారి కుటుంబాలను ఆదుకుంటామని సిపిఎం జాతీయ నాయకులు ప్రకాష్ కారత్ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు శుక్రవారం నగరంలోని సుందరయ్య భవన్‌లో ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకూ 52 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా వారిలో కేవలం 25 మంది రైతులను మాత్రమే ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఆయా రైతుల కుటుంబాలకు ఒక్క పైసా కూడా ఆర్థిక సహాయం అందించ లేదన్నారు. దీంతో సిపిఎం, సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5 వేల చొప్పున 20 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, సిఐటియు నాయకులు అంజిబాబు, రమేష్ కుమార్, రాధాకృష్ణ పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను
గౌరవిస్తాం..
* దక్షిణ మధ్య రైల్వే జిఎం రవీంద్రగుప్త
నంద్యాల, డిసెంబర్ 18: ప్రజా ప్రతినిధులు ఇచ్చిన విజ్ఞప్తులను గౌరవించడంతోపాటు సాధ్యమైన సమస్యలను పరిష్కరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త తెలిపారు. శుక్రవారం నంద్యాల రైల్వే స్టేషన్‌లో ఎంపి ఎస్పీవైరెడ్డి అనారోగ్యంతో ఉండడంతో ఆయన అల్లుడు అందజేసిన వినతిపత్రాన్ని జిఎం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చిన వినతిపత్రాలలోని విషయాలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైన వాటిని అమలు చేస్తామన్నారు. ఎంపి ఎస్పీవైరెడ్డి అల్లుడు శ్రీ్ధర్‌రెడ్డి వినతిపత్రం అందజేసిన అనంతరం మాట్లాడుతూ నంద్యాల రైల్వే స్టేషన్‌లో, రైల్వే ఆసుపత్రిలో మహిళా డాక్టరును నియమించాలని కోరారు. 2,3 ప్లాట్‌ఫామ్‌లకు పూర్తిస్థాయిలో పైకప్పు నిర్మించాలన్నారు. నంద్యాల - డోన్ 57328 ప్యాసింజర్ రైలుకు అదనంగా 5 కోచ్‌లు వేయాలన్నారు. గుంటూరు - కాచిగూడ రైలును ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చాలని కోరారు. మచిలీపట్నం - యశ్వంతపూర్ రైలును ప్రతి రోజు నడపాలని కోరారు. అలాగే విశాఖపట్నం నుండి గుంటూరు వరకు నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నంద్యాల వరకు పొడిగించాలన్నారు. కాకినాడ నుండి ముంబాయి వరకు వెళ్లే రైలును గుంటూరు, నంద్యాల, గుంతకల్లు మీదుగా నడపాలని కోరారు. అలాగే నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద దక్షిణం వైపున ఉన్న జాతీయ రహదారి నుంచి ఉత్తరం వైపు రోడ్డు వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. నూతన రాజధాని అమరావతికి కనెక్టివిటీ రైళ్లను పెంచాలని కోరారు. అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలుకు తత్కాల్ కోటాను నంద్యాలకు పెంచాలన్నారు. పగటి పూట నడిచే గుంటూరు - కాచిగూడ ప్యాసింజర్ రైలుకు అదనపు కోచ్‌లు వేయాలన్నారు. ఈ సందర్బంగా జిఎం రవీంద్రనాధ్ గుప్త మాట్లాడుతూ ఎంపి నిధులు కేటాయిస్తే నంద్యాల రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. అదేవిధంగా నంద్యాల పురపాలక సంఘంలోని టిడిపి కౌన్సిలర్ ఫాతిమున్నిసా, మూలసాగరం నాయకులు బషీర్, హమానుల్లా, యూనుస్ తదితరులు జి ఎంకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూలసాగరం రైల్వే గేటు ప్రతి పది నిమిషాలకు ఒక సారి వేస్తున్నారని, దీంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయని రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని కోరారు. జిఎం మాట్లాడుతూ మూలసాగరం వద్ద ఆర్‌ఓబి నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపామని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బి అధికారుల వద్ద ఆ దస్త్రం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వారి భాగం నిధులు విడుదల చేస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఆర్‌ఓబి నిర్మాణం కోసం త్వరలో మూలసాగరం వద్ద ట్రాఫిక్ సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వైకాపా కౌన్సిలర్లు ముడియం కొండారెడ్డి, కృపాకర్‌లు రైల్వే ఆస్తుల పరిరక్షణ కోసం ఒక వినతిపత్రాన్ని అందజేశారు. కుందూనది ఆవలి వైపు రైల్వేకు 22 ఎకరాల పొలం ఉందని, ఆ పొలం కబ్జా దారుల చేతుల్లోకి పోయిందని, ఇది వరకు కూడా ఈ విషయంపై వినతిపత్రం అందజేశామని, ఇప్పటికైనా కబ్జాదారుల నుండి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. దీంతో కబ్జా చేసిన పొలాన్ని స్వాధీనం చేసుకోవాలని సంబంధిత శాఖ అధికారికి జిఎం ఆదేశించారు.
అవాంఛనీయ సంఘటనలను అరికడతాం:ఎస్పీ
కర్నూలు, డిసెంబర్ 18:జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది పూర్తిస్థాయిలో పెట్రోలింగ్ చేయాలని ఎస్పీ ఆకే.రవికృష్ణ ఆదేశించారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న పరేడ్ మైదానంలో శుక్రవారం సివిల్, ఏఆర్ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌కు ఎస్పీ హాజరై పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరేడ్ వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, తద్వారా వృత్తి పట్ల గౌరవం పెంపొందుతుందన్నారు. ఇకపోతే ఆరోగ్యం చాలా ముఖ్యమైందని, మంచి అలవాట్లను కలిగి ప్రశాంతమైన జీవితం గడపాలన్నారు. పోలీసుశాఖలో ఉద్యోగరీత్యా ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతుంటారని, ఒత్తిడిని జయించడానికి, సమస్యలను ఎదుర్కోవడానికి యోగా, నడక, పరుగు లాంటిని జీవితంలో భాగం కావాలని, అప్పుడే సమస్యలను, సవాళ్లను ఎదుర్పొని ఒత్తిడిని జయించడానికి వీలుపడుతుందన్నారు. గ్రామాలపై నిఘా పెంచాలని, ఎస్సీ కేసులను తగ్గించాలన్నారు. పారిశ్రామికంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి పరిశ్రమలు రావాలన్నారు. పరిశ్రమలు వచ్చినప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్న అసాంఘిక శక్తుల పట్ల చట్టపరంగా కఠినంగా వ్యవహరించి, అటువంటి వాటిని దీటుగా ఎదుర్కోవాలన్నారు. అనంతరం కొత్తగా నిర్మించుచున్న కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ను ఎస్పీతో కలిసి పోలీసు, పంచాయతీ అధికారులు పరిశీలించారు. ఎస్పీతో పాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, నగర సిఐలు రామకృష్ణ, ములకన్న, ఆర్‌ఐ రంగముని, పంచాయతీ అధికారి సురేంద్రనాథ్ పాల్గొన్నారు.
చాగలమర్రి డివిజన్‌లో
రూ. 50 కోట్ల విద్యుత్ బకాయిలు
* డిఇ నరేంద్రకుమార్
చాగలమర్రి, డిసెంబర్ 18: డివిజన్‌లో రూ. 50 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు డిఇ నరేంద్రకుమార్ తెలిపారు. శుక్రవారం చాగలమర్రిలోని సబ్ స్టేషన్‌లో జరిగిన సమావేశంలో విద్యుత్ సరఫరా చక్కగా ఇవ్వాలని, విద్యుత్ బిల్లులు వసూలుచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి రూ. 10 లక్షలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటిలకు సంబందించి రూ. 40 కోట్లు బకాయిలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక ముందు రూ. 125లకే విద్యుత్ మీటర్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 250 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. చిన్నకంబలూరు, హరినగరం, సీతారాంపురం గ్రామాల్లో కొత్తగా విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటుకై ప్రతిపాధనలు పంపినట్లు తెలిపారు. చింతలచెరువు, అహోబిలం, ఆర్ కృష్ణాపురం, యల్లావత్తుల, ఉయ్యాలవాడ విద్యుత్ సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లో ఓల్టేజి సమస్య ఉండబోదన్నారు. ఈ సమావేశంలో ఎఇ రాజగోపాల్ పాల్గొన్నారు.

నక్సల్స్ కదలికల్లేవు..
* ఎస్పీ ఆకే రవికృష్ణ
ఆత్మకూరు, డిసెంబర్ 18:జిల్లాలో ఎక్కడా నక్సలైట్ల కదలికలు లేవని ఎస్పీ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. ఎస్పీ శుక్రవారం ఆత్మకూరు, కొత్తపల్లె పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేసి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నల్లమల అడవిలో ప్రశాంత వాతావరణ నెలకొని ఉందన్నారు. తాము తీసుకున్న చర్యల కారణంగా జిల్లాలో ఫ్యాక్షన్ కార్యకలాపాలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. శాంతి, భద్రతల కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రజా క్షేమం కోసం పోలీసు సిబ్బందిని మరింత పెంచుతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం పోలీసు నిఘా ముమ్మరం చేసి అసాంఘిక శక్తుల కదలికలను పరిశీలిస్తూ ఉంటామన్నారు. ప్రజా భద్రతకు ఎవరు భంగం కలిగించిన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సిద్దాపురం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. ఆత్మకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దివాకరరెడ్డి ఆధ్వర్యంలో సిద్దాపురం గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ సుప్రజ, సిఐ, ఎస్‌ఐలు ఉన్నారు.