కర్నూల్

ఓటర్లలో చైతన్యం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 26:అర్హత ఉన్న ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేయించండి, ఓటు వున్న ప్రతి వ్యక్తి ఓటు వేసేలా చైతన్యం పెంపొందించాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మంగళవారం ప్రిన్సిపాల్స్, హెడ్‌మాస్టర్స్, ఎంఈఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, మున్సిపల్ సూపర్‌వైజర్లు, క్యాంపస్ అంబాసిడ్లతో స్వీప్(ఓటర్లకు క్రమబద్ధమైన అవగాహన, ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు భాగస్వామ్యం)పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పటాన్‌శెట్టి రవిసుభాష్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. అలాగే ఓటర్లకు ఈవీఎం, వీవీ ప్యాట్స్‌పై అవగాహన కల్పించడమే స్వీప్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. భారత ఎన్నికల సంఘం ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు స్వీప్ కార్యక్రమాన్ని 2011 నుంచి ప్రారంభించిందన్నారు. ఓటరు తాను ఓటు వేసిన వ్యక్తికే ఆ ఓటు పడిందో లేదో పరిశీలించుకోవడానికి భారత ఎన్నికల సంఘం కొత్తగా ఈసారి వీవీ ప్యాట్స్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. గత ఎన్నికల్లో ఓటింగ్ 76శాతం నమోదైందని, ఈ సారి 85శాతం పైగా నమోదుయ్యేలా ప్రతి ఓటరును చైతన్య పరచాలన్నారు. గతంలో ఒక్క ఓటు తేడాతో సీఎం అభ్యర్థి ఓడిన దాఖాలాలున్నాయని, అందుకే ఓటు విలువను చాటి చెప్పాలన్నారు. 18ఏళ్లు నిండిన విద్యార్థులు, ఉపాధి కూలీలు, స్వయం సహాయక సంఘ సభ్యులతో ఓటు లేని వారిని గుర్తించి ఓటర్లు నమోదు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అహోబిలేశుని సేవలో గవర్నర్ దంపతులు
రుద్రవరం, ఫిబ్రవరి 26: అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తుల పల్లకిని రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమల నరసింహన్ మంగళవారం దర్శించుకున్నారు. కడప నుండి ఆళ్లగడ్డకు చేరుకొని రోడ్డు మార్గాన నర్సాపురం నుండి రుద్రవరం చేరుకున్నారు. గవర్నర్ రుద్రవరం చేరుకోగానే కలెక్టర్ సత్యనారాయణ, జేసీ రవి శుభాష్, ఎస్పీ ఫక్కిరప్ప, ఆర్డీఓ వెంకటనారాయణమ్మలు గవర్నర్ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. అహోబిలం ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ గవర్నర్‌కు మేళ తాళాలతో స్వాగతం పలికారు. ఉత్సవ పల్లకిలో కొలువుదీరి ఉన్న నరసింహస్వామి, ప్రహ్లాద వరద స్వాములకు గవర్నర్ దంపతులు విశేషంగా పూజలు చేశారు. అనంతరం పారువేట ఉత్సవాలను గూర్చి పండితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అహోబిలం చేరుకున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ, ఆళ్లగడ్డ డీఎస్పీ తిప్పేనాయక్, శిరివెళ్ల సీఐ శివశంకర్, సీఐ దస్తగిరిబాబుతోపాటు ఎస్‌ఐ చిన్న పీరయ్య యాదవ్‌లు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వంతెన నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
* మంత్రి ఫరూక్
నంద్యాల, ఫిబ్రవరి 26: పట్టణంలోని బొమ్మలసత్రం వద్ద నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఉపరితల వంతెనను మంగళవారం ఆరోగ్య శాఖ మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపరితల వంతెన నిర్మాణాలను పూర్తి చేసుకొని వాహనాల రాకపోకలకు అనుమతి లభించిందని, ఉపరితల వంతెన నిర్మాణంతో బొమ్మలసత్రం వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించినట్లు అయిందన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడం వల్ల చాపిరేవుల వైపు ఈ వంతెన పొడగించే ఆస్కారం లేదని, మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాపిరేవుల పనులు తిరిగి ప్రారంభిస్తామన్నారు. అనంతరం బొమ్మలసత్రం వద్ద ఉపరితల వంతెన కింది భాగంలో డ్రైన్‌ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జయరామిరెడ్డి, ఈఈ వెంకటరెడ్డి, డీఈ ముక్తియార్ అహ్మద్‌లతోపాటు మున్సిపల్ అధికారులు, టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రంథాలయాల్లో శాశ్వత సభ్యత్వం తీసుకోండి
* జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంబాల
బనగానపల్లె, ఫిబ్రవరి 26:జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ అధికారులు విద్యార్థులకు శాశ్వత సభ్యత్వం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంబాల ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో మంగళవారం బనగానపల్లె మండల గ్రంథాలయ అధికారి పీ.రాఘవరెడ్డి విద్యార్థుల శాశ్వత సభ్యత్వ కార్డులను అంబాల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా అంబాల మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారిగా బనగానపల్లె గ్రంథాలయ అధికారి విద్యార్థుల శాశ్వత సభ్యత్వ కార్డుల పంపింణీని ప్రారంభించారని అభినందించారు. ఈ సభ్యత్వం పొందిన విద్యార్థులు రాష్ట్రంలో ఏ గ్రంథాలయంలోనైనా సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. బనగానపల్లె మండల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.