క్రైమ్ కథ

నేరము - శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్క్‌కి మరణశిక్ష పడింది. అతను అతి హీనంగా ఓ బాలికను బలాత్కారం చేసి హత్య చేశాడు. అతను మానవ రూపంలోని రాక్షసుడిగా జైలు సిబ్బంది అంతా భావించారు. మర్నాడు అతన్ని ఉరితీస్తారని తెలిసినా, సాధారణంగా చావబోయే వాడి మీద సహజంగా కలిగే జాలి, సానుభూతి వారికి బర్క్ మీద కలగలేదు.
ఇంకొన్ని గంటల్లో అతనికి మరణశిక్ష విధిస్తారనగా జైలర్ బర్క్ సెల్‌లోకి వచ్చాడు.
‘ఇంకొద్ది గంటల్లో నువ్వు చావబోతున్నావు’ చెప్పాడు.
బర్క్ జైలర్ని కోర్ట్‌లోనే చూశాడు. శిక్ష ఖరారయ్యాక జైలరే మరో ఇద్దరు సాయుధ పోలీసులతో కలిసి అతన్ని జైలుకి తీసుకువచ్చాడు. బర్క్ అతని వంక నిర్లక్ష్యంగా చూశాడు.
‘కాని నీకు ఉరి పడకూడదని ఉంది. అవునా?’ జైలర్ ప్రశ్నించాడు.
‘అవును’ బర్క్ కాలర్ని నిర్లక్ష్యంగా సర్దుకుని చెప్పాడు.
‘నీకు శిక్ష విధించిన జడ్జ్ బడేకర్‌కి ఉరి జడ్జ్ అని ముద్దు పేరు. ఏ హత్య కేసుని ఆయన విచారించినా ఉరిశిక్షనే విధిస్తాడు. ఇంతదాకా ఆయన ఎన్నడూ, ఎవరికీ యావజ్జీవ కారాగార శిక్షని విధించలేదు.’
బర్క్ మాట్లాడలేదు.
‘ఇంకో జడ్జ్ ఐతే ఉరిశిక్షని విధించేవాడు కాదు’
మాట్లాడాల్సిన అవసరం లేక బర్క్ వౌనంగా ఉండిపోయాడు.
‘ముఖ్యంగా ఈ ఊరికి వచ్చి నేరాలు చేసే బయటి వాళ్లని ఆయన అసలు బతకనివ్వడు’
‘కాని నేను అమాయకుడ్ని’ బర్క్ చెప్పాడు.
‘కావచ్చు. కాని ఓ మనిషిని ఉరి తీయడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు’
‘ఉరి తీసేది మీరా?’ బర్క్ జైలర్ వంక భయంగా చూస్తూ అడిగాడు.
‘అది నా బాధ్యతల్లోని ఓ బాధాకరమైన భాగం. ఉరి తీయడానికి ఈ ఊరికి ప్రత్యేకంగా బడ్జెట్ లేదు. నేను చాలా మందిని ఉరి తీసాను. కాని నిన్ను మాత్రం ఉరి తీయను’ జైలర్ స్థిరంగా చెప్పాడు.
‘ఉరి తీయరా?’ అతను ఆశ్చర్యంగా అడిగాడు.
‘లేదు’
‘మరి ఎవరు తీస్తారు?’
‘నేను తీయకపోతే ఎవరూ తీయరు’
బర్క్‌లో కొత్త ఆశ మొదలైంది.
‘కాళ్ల కింద చెక్క కదలడానికి వీలుగా దానికి నూనె రాయాలి. దాన్ని లాగే లివర్‌కి కూడా. నీ బరువుని తూచి దాని ప్రకారం తాడు పొడవుని నిర్ణయించాలి. నీ బరువు గల వస్తువుని ఉరితీసి తాడు మధ్యలో తెగదని రూఢీ చేసుకోవాలి’
‘ఏమిటి విషయం?’ అతను గొంతు తగ్గించి అడిగాడు.
‘సిగరెట్?’ జైలర్ అడిగాడు.
బర్క్ తల ఊపి, కృతజ్ఞతగా ఓ సిగరెట్‌ని తీసుకుని వెలిగించాడు.
‘తాడు సరైన పొడవులో ఉండేలా జాగ్రత్త పడాలి. మరీ పొడవైతే ఉరి పడ్డ నేరస్థుడు మరణానికి మునుపు చాలాసేపు బాధపడతాడు. తక్కువ పొడవైనదైనా అంతే. సరైన పొడవుగల తాడైతే, ఉరి పడగానే మెడ విరిగి బాధ పడకుండా క్షణాల్లో మరణిస్తాడు’
‘ఆ వివరాలు నాకు అనవసరం’ బర్క్ భయంగా చెప్పాడు.
‘ఇది నిజానికి తలారి పని. కాని తలారి లేకపోవడంతో దాన్ని ననే్న చేయమని జడ్జ్ తీర్పులో ప్రతీసారి చెప్తాడు. నేనా పని చేయకపోతే నాకు శిక్ష తప్పదు’
‘ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారు? ఇంతకీ నన్ను మీరేం చేయదలచుకున్నారు? ఉరి తీస్తారా? మానేస్తారా?’ బర్క్ కోపంగా అరిచాడు.
జైలర్ ఓ సారి ఆ జైలు సెల్ కటకటాల దగ్గరికి వెళ్లి, చెవి ఉంచి విని మళ్లీ బర్క్ దగ్గరికి వచ్చాడు. జేబులోంచి మడిచిన ఓ బట్టని తీసి దాన్ని విప్పాడు. దాంట్లోని తుప్పు పట్టిన అరంగుళం వెడల్పు గల ఏడు హక్సా బ్లేడ్‌లని బర్క్ ఆసక్తిగా చూసాడు. వాటిని చూపిస్తూ జైలర్ చెప్పాడు.
‘వీటిని నీ పరుపు కింద దాచు’
బర్క్ వాటి వంక, అతని వంకా చూసి ఆ పని చేసాడు.
‘నేను జైలర్‌గా కొనసాగుదామని అనుకున్నాను. కాని తలారిగా మారాను. ఉరి తీసిన రాత్రి, ఆ మాటకొస్తే వరసగా కొన్ని రాత్రులు నాకు నిద్ర పట్టదు. నా భార్య లారా.. ఆమె నన్ను ఉరి తీయమని ప్రోత్సహిస్తోంది. ప్రతీ ఉరికి నాకు కొంత అదనపు రుసుము చెల్లిస్తారు. దాంతో లారా షాపింగ్ చేస్తుంది. పైగా జైలర్ భార్యగా గుర్తింపబడటం కూడా లారాకి గర్వంగా ఉంటుంది.’
జైలర్ తను కూడా ఓ సిగరెట్ వెలిగించి కొనసాగించాడు.
‘నాకు పెళ్లి కాకపోతే ఈ భయంకర ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నడో ఈ ఊరి వదిలి వెళ్లిపోయేవాడిని. జైల్లో ఉండడం ఎలా ఉంటుందో నాకు తెలుసు బర్క్. నేను చాలా సంవత్సరాలుగా జైల్లోనే నా రోజులోని అధిక భాగం గడుపుతున్నాను’
జైలర్ మరోసారి తలుపు దగ్గరికి వెళ్లి బయటి శబ్దాలని జాగ్రత్తగా విని, తిరిగి బర్క్ దగ్గరికి వచ్చాడు.
‘నువ్వు కిటికీ చెక్క ఫ్రేమ్‌ని కోసి పారిపోవచ్చు. అందుకు రెండు గంటలు చాలు. కిటికీ చెక్కలు పాతవి. మంచుకి, వానకి చీకిపోయాయి. అందువల్ల నేను నిన్ను ఉరి తీయాల్సిన అవసరం రాదు. ఒకవేళ నీకు ఉరి తీయబడటం ఇష్టం ఉంటే తప్ప’
‘నిజంగా?’
‘అవును’
‘కాని తప్పించుకున్నాక నేను మళ్లీ పట్టుబడకుండా పారిపోవడం ఎలా? కాలినడకన వెళ్తే పట్టుకుంటారు’
‘నిన్ను మళ్లీ పట్టుకుంటే నిన్ను నేను ఉరి తీయక తప్పదు. పట్టుబడకుండా ఓ ఉపాయం ఉంది.’
బర్క్ టైలర్ వంక ఆశగా చూస్తూ అడిగాడు.
‘ఇది క్రూరమైన ప్రాక్టికల్ జోక్ కాదు కదా?’
‘కాదు. రోడ్ మీదకి వెళ్లద్దు. జైలు వెనక చెట్లల్లోకి అర కిలోమీటర్ వెళ్తే నీకు నా ఇల్లు కనిపిస్తుంది. అక్కడ ఓ రోజు దాక్కుని పారిపోవచ్చు. పారిపోయిన ఖైదీ జైలర్ ఇంట్లో దాక్కుంటాడని ఎవరూ అనుకోరు.’
‘మీ ఇంట్లోనా?’ బర్క్ గొంతు తగ్గించి ఆశ్చర్యంగా అడిగాడు.
‘అవును. లారా పిల్లలతో వాల్లఅమ్మ దగ్గరికి వెళ్లింది. అందుకే నీకీ అవకాశం ఇస్తున్నాను. తర్వాత నీ ఇష్టం’ చెప్పి జైలర్ బయటకి వెళ్లిపోయాడు.
* * *
మొదటి నాలుగు బ్లేళ్లూ సగం చెక్క ఫ్రేమ్ దిగాక విరిగాయి. ఐదో దాని పళ్లు మొద్దుబారి ఉన్నాయి. ఐదోది తళతళ మెరవకుండా, కొద్దిగా తుప్పు పట్టినా, వాడని బ్లేడ్ అని దాంతో కోస్తూ బర్క్ అనుకున్నాడు. పూర్తిగా తెగేసరికి అర్ధరాత్రి ఒంటిగంటైందని జైలు గంటని బట్టి గ్రహించాడు. ఇంకో మూడు గంటల దాకా ఎవరూ లోపలకి రారు.
కిటికీని తొలగించి కిందకి, తడి గడ్డి మీదకి దూకాడు. చేతి వేళ్లకైన గాయాలవల్ల నొప్పిగా ఉంది. లేచి ఒంగొని, జైలర్ చెప్పిన గుర్తుల ప్రకారం పరిగెత్తాడు. జైలుకి దూరమై, చెట్లు దగ్గరయ్యే దాకా ఒంగొనే పరుగెత్తాడు. అతను ఓసారి చెట్లలోకి కనుమరుగయ్యాక నిటారుగా నిలబడి పరిగెత్తసాగాడు.
స్వేచ్ఛ అంత ఆనందాన్ని ఇస్తుందని అతనికి అంతకు మునుపు ఎన్నడూ తెలీదు. దాన్ని పొందడానికి మనిషి ఏమైనా చేస్తాడని అనిపించింది.
కొన్ని ఇళ్ల వెనక నించి పరిగెత్తుతూంటే ఓ ఇంట్లోంచి కుక్క మొరిగిన శబ్దం వినిపించింది. కాని కొద్దిసేపట్లో అది ఆగిపోయింది. దూరంగా తెల్లటి కంచె, దాని వెనక ఓ ఇల్లు కనిపించాయి. ఆ ఇంటికి బూడిద రంగు వేసి ఉంటుందని, కాని చీకట్లో దాన్ని అతను గుర్తించలేడని జైలర్ చెప్పాడు. దాని బయట బెల్‌వ్యూ రోడ్ అనే బోర్డు కనిపించాక అదే జైలర్ ఇల్లు అని గ్రహించాడు. ఇంట్లో లైట్లు వెలగడంలేదు.
తన మెడ చుట్టూ తాడు బిగుసుకునే బదులు ఆ చలిరాత్రి తనకో వెచ్చటి గది, సౌకర్యవంతమైన పడక లభిస్తున్నందుకు బర్క్‌కి జైలర్ మీద కృతజ్ఞతా భావం కలిగింది. అతను పోర్చ్‌లోకి వెళ్లి తలుపు తోసాడు. జైలర్ చెప్పినట్లే అది లోపలకి తెరచుకుంది.
టీ షర్ట్, హాఫ్ నిక్కర్ తొడుక్కుని పడక్కుర్చీలో కూర్చున్న జైలర్ నోట్లో ఓ పైప్ వెలుగుతోంది. జైలర్ అతన్ని చూసి లేచాడు. ఆయన కుర్చీ ముందు కార్పెట్ మీద ఓ మహిళ బర్క్‌కి కనిపించింది. పొట్టిగా, లావుగా ఉన్న ఆమె తల నించి రక్తం కారుతోంది. ఆమె మొహం గుర్తు పట్టడానికి వీల్లేనంతగా చితికిపోయింది. పక్కనే రక్తసిక్తమైన ఇనప పోకర్ పడి ఉంది. బర్క్ ఆ శవంక వంక నివ్వెరపోతూ చూసాడు.
‘నా భార్య లారా గురించి చెప్పాను. గుర్తుందా? ఈమే’
జైలర్ చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది. దాన్ని అతను తనకి గురి పెట్టడంతో బర్క్ నిర్ఘాంతపోతూ చూసాడు. అతని మనసులో చెలరేగిన ప్రశ్నలకి జైలర్ జవాబు చెప్పాడు.
‘ఈ ఉదయం ఉరి తీయబడే హంతకుడు జైల్లోంచి ఎలాగో పారిపోయి ఇక్కడికి వచ్చాడు. చప్పుడికి మెలకువ వచ్చిన లారా తను చూస్తానని లేచింది. ఆమె అరుపు విని నేను ఇక్కడికి వచ్చాను. కాని అప్పటికే ఆలస్యమైంది. ఆమెని మూడోసారి బాదే హంతకుడు నాకు కనిపించాడు.’
బర్క్ ఆయన వంక నమ్మలేనట్లుగా చూసాడు.
‘ఎవరో నా ఇల్లు ఎక్కడుందో చెప్పారు. ఇక్కడ దాక్కుంటే తనని ఎవరూ పట్టుకోలేరని భావించాడు. నేను అతన్ని గుర్తుపట్టాను. ఓ రివాల్వర్ గుండు ద్వారా మరణశిక్షని అమలుపరిచి సరైన బడ్జెట్ లేని ఈ ఊరికి నేను ముప్పై డాలర్లు ఆదా చేసాను అని నేను నిన్ను చంపడం గురించి చెప్పింది పేపర్లలో రాస్తారు’
‘ఇది మోసం! అన్యాయం!’ బర్క్ అరిచాడు.
‘కాదు. నేను నిన్ను జైల్లోంచి విడిపించాను. నువ్వు కూడా నన్ను నా కుటుంబ జైల్లోంచి విడిపించి నీ రుణం తీర్చుకున్నావు బర్క్’
బర్క్ ఏదో మాట్లాడాలి అనుకున్నాడు కాని భయంతో గొంతు పెగల్లేదు.
‘నువ్వెటూ ఉరితో చావాల్సిన వాడివే. ఈ చావు చాలా తేలికైంది. సౌకర్యవంతమైంది. ఊపిరి కోసం ప్రాణం కొట్టుకోకుండా త్వరగా పోతావు. నేను చెప్పినట్లుగా ఉరి తీయాల్సిన బాధాకరమైన అనుభవం కూడా నాకు ఉండదు.’
తెగించిన బర్క్ ఆత్మరక్షణకి జైలర్ వైపు దూకాడు. దాన్ని ఎదురుచూసిన జైలర్ చేతిలోని రివాల్వర్ రెండుసార్లు పేలింది.
జైలర్ చేసిన ఘాతుకం బయటపడుతుందా? లేదా? జడ్జ్ బడేకర్ అతని కేసు విచారిస్తాడా? లేదా? అన్నది బర్క్‌కి కలిగిన ఆఖరి ఆలోచన.
(బ్రైస్ వాల్టన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి