తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఉత్తరాది పెత్తనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్రలో ఎప్పుడూ అన్ని నదీమ సంస్కృతులపై గంగానది పెత్తనమే. తుంగభద్ర, కావేరి, కృష్ణా, గోదావరి తదితర నదులపై దాని ఆధిపత్యమే. భాష కావచ్చు. లిపి కావచ్చు. చరిత్ర కావచ్చు, మతం కావచ్చు. వైదికం, శక్త్యారాధన కావచ్చు. ఆర్య ద్రావిడ సిద్ధాంతం కావచ్చు. తెలుపు, నలుపుల వర్ణవివక్ష కావచ్చు. ఎత్తుపల్లాల భౌగోళిక దృక్పథం కావచ్చు. ఉత్తర భారతం దక్షిణ భారతాని కన్నా మిన్న అనే భావన సదా విర్రవీగుతుంటుంది. భారతీయ సాహిత్యం అన్నా, సంస్కృతి అన్నా, నాగరికత అన్నా, రంగు, రుచి అన్నా ఉత్తర భారతానిదే. పాకిస్తాన్, కశ్మీరం, నేపాల్ వంటి దేశాల, ప్రాంతాల సమస్యలు అక్కడే తిష్టవేసి భారతీయులకు శాంతి లేకుండా చేస్తున్నాయి. అయినా ఉత్తరాది సస్యశ్యామలమే అన్న ఇమేజి. దక్షిణాన అంతా సవ్యంగా, శాంతియుతంగా ఉన్నా ఎందుకోగాని అశాంతిమయం అన్న ఆలోచన వ్యాపించి ఉంటుంది.
నిజానికి అత్యంత ధనిక రాష్ట్రాలు గల దక్షిణ భారతం ఉత్తర భారతానికి అప్రత్యక్షంగా కప్పం రూపంలో పన్నుల్ని కడుతూనే ఉంటుంది. మనవంటి దేశానికి రెండో రాజధాని అవసరం. అనునిత్యం ఉగ్రవాదం, దాయాదుల పోరు, ఇతర రాజ్యాలతో ఘర్షణలు పడుతున్నా దక్షిణాన రెండో రాజధాని ఏర్పాటుచేయడానికి ఉత్తరాది రాజకీయ నాయకులు ఏమాత్రం అంగీకరించరు. భారతదేశం అంటే ఉత్తర భాగమే అని విదేశాలలో కూడా గుర్తింపునివ్వడానికి వెనకాడరు.
పైగా గంగానది సంస్కృతిని, మహాభారత సంస్కృతిని అంతటా పులమడానికి నిత్యం యత్నాలు జరుగుతుంటాయి. అది హిందీ భాష పేరుతో కావచ్చు. పరిపాలన కేంద్రం పేరుతో కావచ్చు. పార్లమెంటు భవనం కావచ్చు. దేశానికి రాజధాని అవసరమే. అది విదేశీ రాజ్యాల రాయబార భవనాలు నిర్మించుకోవడం కోసం కావాలి. అంతే కాని స్వదేశీయులను రాజధాని పేర దూరంగా నెట్టేయడం జరగకూడదు. దేశం మధ్య భూమిలో రాజధాని ఉండాలి. సరిహద్దులకి దగ్గరగా ఉండకూడదన్నది రాజ్యనీతి. దేశంలో కొనసాగే పరిపాలనలో సగం దేశానికి అవమానం జరగకూడదు. రాజధాని ఉత్తర భారతంలో ఉన్నంత మాత్రాన, ఆ ప్రాంతానికి చెందిన అధికారులే అత్యున్నత స్థానంలో ఉండాలనే నియమం లేదు. కాని స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి ఇదే తంతు. రాజకీయ రంగంలోనూ ఈ పెడ ధోరణే. ప్రధానిగా ఒక్క పి.వి. తప్ప, మిగతా వాళ్ళంతా ఉత్తర భారతీయులే. అందుకే కరుడుగట్టిన ఆధిపత్య భావన గడ్డగట్టి పోయింది.
అప్పుడప్పుడు దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాల్ని దెబ్బతీయాలంటే జాతీయ భాష పేరుతో రాజకీయాలు చే స్తారు. ఆంగ్ల భాష దేశం అంతటా విస్తరిస్తుంటే అందుకు పచ్చజెండా ఊ పే జాతీయ పాలక వర్గం దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దాలని ప్రయత్నిస్తుంది. మళ్ళీ మొన్న పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులకు దేశాధ్యక్షుడు ఆమోదించారు. దీనివల్ల కేంద్ర మంత్రులు సైతం చేసే అధికారిక ప్రసంగాలు అన్నీ హిందీలోనే ఉండాలట. సిబిఎస్‌ఇ సిలబస్‌లోనూ, అన్ని కేంద్రీయ విద్యాలయాలలోనూ ఎనిమిదో తరగతి నుండి పదివరకు హిందీ తప్పనిసరి పాఠ్యాంశం చేయాలట. నిజానికి ఈ సిఫారసుని దక్షిణాది రాష్ట్రాల మాతృభాషల పట్ల వివక్షగానే చూడాలి. ఇక్కడి పాలకుల బుద్ధి తక్కువతనం వల్ల మాతృభాషలు కనుమరుగు అయ్యే ప్రమాదం ఏర్పడింది. కొన్ని రాష్ట్రాలలో మాతృభాషలలో విద్యాబోధన గరపక పోవడం, ఆంగ్ల వ్యామోహంలో పడిపోవడంవల్ల హిందీ భాషని రాష్ట్రాల నెత్తిన రుద్దడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు హిందీయేతర రాష్ట్రాలన్నీ కలసి హిందీ సామ్రాజ్యవాదాన్ని నిలువరించవలసి ఉంది. ఇందుకు పాలకులే ముందు కదలాలి. పౌర సమాజం కూడా ఆలస్యం చేయకూడదు. ఉత్తరాది సంస్కృతి పెత్తనం పట్ల వ్యతిరేక పోరాటాలను ఏకకాలంలో చేబట్టాలి. మాతృభాష తెలుగు పట్ల గౌరవం లేని మేధావులు హిందీ భాషాధిపత్యం గురించి ఇపుడు ఏమంటారని ప్రశ్నించాలి.
పవన్‌కళ్యాణ్ వంటి సినీ రాజకీయ నాయకుడు ఉత్తరాది పెత్తనాన్ని గురించి ప్రశ్నించినందుకు సంతోషం. ఐతే ఆయన టిటిడి ఈవోగా ఉత్తరాదివాడిని నియమించినందుకు బాధపడ్డాడు. అది సరిపోదు. ఆ ఆలోచనని అన్ని రంగాలలోకి విస్తరింపజేయగలిగిన సత్తా అతనికి లేకపోవచ్చు. కాని పౌర సమాజంలోని, కొందరు మేధావులతోనైనా సంప్రదింపులు చేయలేకపోవడం సరికాదు. తాను లేవనెత్తిన ఆ అంశం మీద నిలబడగలిగితే అతను దేశంలోనే ఒక రాజకీయ తాత్విక చర్చకు తావిచ్చినవాడిగా గుర్తింపు పొందేవాడు. ఒక ధైర్యశాలిగా పేరుపొందేవాడు. అతని రాజకీయాలకు అదే అంశం ఒక తాత్విక పునాదిగా ఏర్పడేది. చాలా రాజకీయ పార్టీలకన్నా భిన్నంగా, శక్తిమంతమైన సవాలు అయ్యుండేది. మాట్లాడిన ఏ ఒక్క అంశంపై నిర్దిష్టంగా నిలబడలేనితనమే అతని బలహీనత. ఉత్తరాది పెత్తనం మీద నిలబడగలగడానికి ధైర్యం కావాలి. చరిత్ర మీద పట్టుకావాలి.
ఎన్ని ఘర్షణలున్నా రెండు తెలుగు రాష్ట్రాల అధిపతులు కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి దాసులే. రెండూ ప్రాంతీయ పార్టీలే. ప్రజల వెన్నుదన్నుతో నిలిచే పార్టీలే. ఆ విషయం మరిచి జాతీయ, జాతీయవాద పార్టీముందు దాసోహమైనప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కూడా అర్పించబడిన విషయమే. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఎత్తుగడగా దెబ్బతిన్నాయో అక్కడ కొత్తగా ఏర్పడే పార్టీ ఆ అవకాశాన్ని స్వీకరింపవలసి ఉండింది. మా రాష్ట్రం- మా పాలన. మా భాష- మా పాలన. మా చదువు- మా భాష అనే నినాదాలు మాత్రమే ప్రాంతీయతకి దర్పణాలు. ఒక్కో రాష్ట్రంలో గల వివిధ మతాలు, వారి భాషలను గౌరవించుకోవాలి. ఆదివాసీలు, మైనారిటీలు వారి మాతృభాషలను ప్రేమించుకోవాలి. అభివృద్ధిపరుచుకోవాలి. ప్రాంతీయ పార్టీలు అందుకు సహకరించాలి. ఉత్తరాది తెలుపు, దక్షిణాది నలుపు. ఇది ఇంగ్లీషువాడు చేసిన తేడా కాదు. అది దేశీయమైన ఆర్య- అనార్య సిద్ధాంతం. తెలుపు,నలుపు అనే వర్ణ భేదం. ఉత్తర దక్షిణాలకు ఆపాదించి అణగదొక్కే ఔత్తరాహుల కుట్ర! ఏదిఏమైనా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి పార్టీలు దక్షిణాది రాష్ట్రాలపై స్వారీ చేయడమే తప్ప వాటిపట్ల గౌరవం చూపడం లేదు. ప్రజల గౌరవం గుర్తించలేని ప్రాంతీయ పార్టీలు తమ ప్రజల గౌరవాన్ని తుంగలోకి తొక్కడం దాసోహం అనడమే. పార్టీల పరిధులను దాటి ఐదు దక్షిణాది రాష్ట్రాలు ఒక్కటై పార్లమెంటుని ఆక్రమిస్తేనే దక్షిణ భారతీయులు సమాన గౌరవం పొందగలరు. ఇప్పుడు ఎవరైతే అలాంటి ఆలోచనలు చేయగలరో వారే నిజమైన రేపటి కథానాయకుడు. ఉత్తరాది పెత్తనాన్ని నిలువరించగలిగినవాడే దక్షిణాదిన ప్రజావీరుడు. మనకిప్పుడు కావలసింది రాజకీయ దళారులు కాదు. వీరోచిత త్యాగధనులు. *

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242