మెదక్

అభివృద్ధికి దోహదపడుతున్న ఉపాధి హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*వివిధ శాఖలకు ఊరట * రూ.244 కోట్ల ఖర్చు
సంగారెడ్డి, మార్చి 10: రైతులు, రైతు కూలీల వలసల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతోంది. ఉపాధి హామి పనుల క్రింద గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు 244 కోట్ల రూపాయలను వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా గ్రామ పంచాయతీ భవనాలు, స్మశాన వాటికలకు ప్రహరి గోడలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సిసి రోడ్లు, మురికి కాలువలు, మండల సమాఖ్య భవనాలు, వ్యవసాయ స్టోరేజి గోదాములు, అంగన్‌వాడీ భవనాలు, పశువుల తొట్లు, పశువుల పాకలు, పౌల్ట్రీ ఫాంలు, హరితహారం మొక్కల పెంపకం, ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములకు నీటిని అందించే కార్యక్రమం, వాటర్‌షెడ్ పథకం పనులను ఉపాధి హామీ పథకం కింద నిరాటకంగా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని రోజుల్లో వంద రోజుల పాటు పని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటి వరకు 5,54,474 జాబ్ కార్డులను జారీ చేసారు. 4,10,609 కుటుంబాల్లోని 9,29,895 మందికి 11.58 కోట్ల పని దినాలను కల్పించారు. ఇందులో 4,29,152 కుటుంబాలకు వంద రోజుల పని దినాలను కల్పించారు. 1,79,448 పనులు పూర్తి చేసి 1789 కోట్ల 79 లక్షల రూపాయలను ఖర్చు చేసారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 2,52,212 కుటుంబాల్లోని 4,65,041 మందికి పని కల్పించారు. 244 కోట్ల 58 లక్షలు ఖర్చు చేసి ఒక కోటి 58 లక్షల పని దినానులు కల్పించడంతో పాటు 56,882 కుటుంబాలకు వంద రోజులు పని దినాలను కల్పించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టే దిశగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య నిర్వహణ కొరకు మరుగుదొడ్లు, మ్యాజిక్ సోక్‌పిట్స్ నిర్మాణం, డంపింగ్ యార్డుల నిర్మాణం, స్మశాన వాటికల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటి వరకు నిర్మల్ భారత్ అభియాన్, స్వచ్ఛ్భారత్ పథకాల క్రింద 62,108 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం పరిపాలన అనుమతి పొందగా 35,956 నిర్మాణాలు పూర్తికాగా 13,932 పురోగతిలో ఉన్నారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి 12 వేల చొప్పున ఉపాధి హామి నిధుల నుంచి చెల్లిస్తున్నారు. జిల్లాలో 40,794 మ్యాజిక్ సోక్‌పిట్స్‌కు ఆమోదం లభించగా 3,675 సోక్‌పిట్స్ నిర్మాణం పూర్తి చేయగా 4,495 పురోగతిలో ఉన్నాయి. ఒక్కో సోక్‌పిట్‌కు 4 వేల నిధులు చెల్లిస్తున్నారు. 725 డంపింగ్ యార్డులకు అనుమతి లభించగా రెండింటిని పూర్తి చేయగా 183 డంప్ యార్డుల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఒక్కో డంప్ యార్డు నిర్మాణానికి 1.70 లక్షలు ఉపాధి నిధుల నుంచి చెల్లిస్తున్నారు. 128 స్మశాన వాటికల నిర్మాణానికి ఆమోదం లభించగా 43 పనులు పురోగతిలో ఉన్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో కలిసి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, సిసి రోడ్లు, మురికి కాలువలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 220 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి పరిపాలన ఆమోదం లభించగా 29 భవనాలు పూర్తికాగా 179 పనులు పురోగతిలో ఉన్నాయి. ఒక్కో భవనానికి 13 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. 44 మండల సమాఖ్య భవనాలకుగాను 4 భవనాలు పూర్తి చేసిన అధికారులు 34 వాటి పనులను వివిద దశల్లో కొనసాగిస్తున్నారు. పశు సంవర్ధక శాఖ సమన్వయంతో జిల్లాలో పశువుల త్రాగునీటి తొట్టీల నిర్మాణాలు, పశువులు, మేకల కొట్టాలు, పౌల్ట్రీ ఫారముల నిర్మాణం చేస్తున్నారు. 1243 పశువుల తొట్ల నిర్మాణానికి ఆమోదం లభించగా 32 నిర్మాణాలు పూర్తి చేసారు. 283 పురోగతిలో ఉన్నాయి. వీటికి ఒక్కో యూనిట్‌కు 22,104 రూపాయల చొప్పున ఉపాధి నిధులు చెల్లిస్తున్నారు. 6 పశువుల పాకల నిర్మాణానికిగాను 92,592 రూపాయలు, 10 మేకలకు అవసరమైన పాక నిర్మాణానికి 49671 రూపాయలు, కోళ్ల ఫారాలకు 100 కోళ్లకు అనుకూలంగా 38,138 రూపాయలు నిర్మాణాలకు చెల్లిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా 2014-15లో అటవి శాఖ సమన్వయంతో 84,56,537 మొక్కలు నాటారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల టేకు మొక్కలు 65 నర్సరీల్లో పెంచుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పడావుగా ఉన్న 75 వేల ఎకరాల బీడు భూములకు నీటి వసతి కల్పించి వినియోగంలోకి తీసుకురావడానికి 4 సంవత్సరాల కాల పరిమితితో పనులు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 10 ఎకరాలను ఒక బ్లాకుగా ఏర్పాటు చేసి ఒక్కో బ్లాకుకు ఒక బోరు బావి, పంపుసెట్, రీచార్జి స్ట్రక్చర్, విద్యుదీకరణ చేస్తున్నారు. ఇప్పటి వరకు 69,640 ఎకరాల భూమిలో భూగర్భ జలాలకు సంబంధించిన సర్వే చేపట్టారు. 4,294 బోర్లు వేసి వీటిలో 3214 బోర్లు విజయంతమయ్యారు. 2489 బోర్లకు పంప్‌సెట్లు అమర్చగా వీటి ద్వారా 16 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా మారాయి.
ఈ పథకం కింద ఇప్పటి వరకు 60.11 కోట్లు ఖర్చు చేసారు. ఉమగ్ర నీటి యాజమాన్య పథకం ద్వారా జిల్లాకు 31 ప్రాజెక్టులు మంజూరుకాగా ఇప్పటి వరకు 1,61,718 హెక్టార్ల భూమిని అభివృద్ధి చేయుటకు 194 కోట్ల పైచీలుకు నిధులు మంజూరయ్యాయి. ఇందులోంచి 8.80 కోట్లు ఖర్చు చేసి రహదారికి ఇరువైపుల మొక్కలు పంపకం చేపట్టారు. 96.33 లక్షల ఖర్చుతో ఇపిఎ పథకం కింద పశువుల ఆరోగ్య శిబిరాలు, పశువుల నీటి తొట్టెలు, ట్రైవిస్‌లు, క్యాస్‌ట్రెటర్స్ నిర్మించారు. కోడి పిల్లల పంపిణీ చేసారు. 1.97 కోట్లతో 914 సోలార్ లైట్లు 113 గ్రామాల్లో అమర్చారు. 16.74 లక్షల ఖర్చుతో మంచినీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయించారు. 21 లక్షలతో త్రాగునీటి పైపులై, 66 లక్షలతో చిన్న నీటి ట్యాంకులను నిర్మించారు. గ్రామీణ నిరుపేద కుటుంబాలకు ఉపాధి పనులు కల్పించి వలసలను నివారిస్తూనే గ్రామాల అభివృద్ధికి ఈ పథకం ద్వారా కోట్లాది రూపాయలతో వివిధ రకాల పనులు చేపడుతుండటం విశేషమని చెప్పవచ్చు.

ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల ధర్నా
సంగారెడ్డి , మార్చి 10: ఎన్డీయే ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని, కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలను తగ్గించి కార్మికులకు కనీస వేతనం 15 వేలుగా నిర్ణయించాలని అన్ని ట్రేడ్ యూనియన్ల నాయకులు డిమాండ్ చేసారు. గురువారం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఐటిఐ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, ఎటిటియుఎస్ రాష్ట్ర కార్యదర్శి యూసూప్ మాట్లాడుతూ అభివృద్ధి, మార్పు, ఉపాధి కల్పన, అవినీతి రహిత పాలన అంటూ అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వ పాలన రెండు సంవత్సరాలు కావస్తుందని మేక్ ఇన్ ఇండియా నినాదంతో విదేశి పెట్టుబడుల కోసం ఎర్ర తివాచీలు పరిచి మోకరిల్లుతుందని ధ్వజమెత్తారు. వృద్ధ్దిరేటు పెరుగుతుందని చాటింపు చేస్తున్నారని విమర్శించారు. స్తూలంగా ఈ విధానాలు కార్మికులను యథేచ్ఛగా దోపిడీ చేసేందుకు కార్పొరేట్లకు మరింత సంపద చేకూర్చేందుకు దోహదపడుతున్నాయన్నారు. అచ్ఛేదిన్ సంపన్నులకే కానీ సామాన్యు ప్రజానికానికి ఒరిగిందేమి లేదన్నారు. కార్మిక చట్టాలను కార్పొరేట్ పెట్టుబడుదారుల ప్రయోజనాలకు అనుగుణంగా సవరించడం వెంటనే మానుకోవాలని డిమాండ్ చేసారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న వాటిని నియంత్రించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. కార్మికుల జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసోరు. ఇందుకుగాను కార్మికులకు కనీసం 15 వేల జీతం ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి ప్రవీన్‌కుమార్, నాయకులు బాగారెడ్డి, మహబూబ్, మహేష్‌కుమార్, బీంరావు, షఫీ, గంగాధర్‌రావు, అబ్దుల్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి

సంగారెడ్డి, మార్చి 10: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31లోగా వంద శాతం ఆదాయ పన్నులు, సిసి చార్జీలు రాబట్టి రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుదామని ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన హైదరాబాద్ నుండి వీడియో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓలతో పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన అనేక అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున రహదారులు, త్రాగునీటి సరఫరాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, స్థానిక సంస్థలు విధిగా, నిర్మోహమాటంగా ఆస్తి పన్నులు వసూలు చేయాలన్నారు. దశల వారిగా ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. మార్చి 31లోగా ఆస్తి పన్నులు, సిసి చార్జీలు రికవరి చేయాలన్నారు. రాష్ట్రంలో పెన్షన్లకే ఏటా 4500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, ఈ దశలో కేవలం 400 కోట్ల పన్నులను చెల్లించుటలో ప్రజలు ఎటువంటి వ్యతిరేకత చూపరని అభిప్రాయపడ్డారు. అధికారులు ప్రజలను ఈ దశగా చైతన్య పరచవలసి ఉంటుందన్నారు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై వడ్డీ క్రింద 148 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసినందున ప్రజలు పెద్ద ఎత్తున పన్ను చెల్లించేందుకు ముందుకు వస్తారన్నారు. పన్నులు చెల్లిస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుందనే విషయాన్ని ప్రజలు చెప్పాలని తద్వారా వారు ఆత్మ శోధన చేసుకుని సహకారం అందిస్తారని తెలిపారు. మెదక్ జిల్లాలో గత సంవత్సరం వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని అభినందిస్తూ ఈ జిల్లాను ఆదర్శంగా తీసుకుని ఇతర జిల్లాల్లో కూడా లక్ష్య సాధన చేయాలని హితవుపలికారు.
102 కోట్ల సిసి చార్జీలు పెండింగ్
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంత మునిసిపాలిటీల్లో 102 కోట్ల రూపాయల సిసి చార్జీలు పెండింగులో ఉన్నాయని, మునిపల్ చైర్మన్లు, కమిషనర్లు బాధ్యత తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లాలో మొత్తం 40 కోట్ల సిసి చార్జీలు పెండింగులో ఉన్నాయని అధికారులు తగిన శ్రద్ద వహించాలని సూచించారు.
మార్చి 31లోగా ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు
రాష్ట్రంలోని అన్ని నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో మార్చి 31లోగా ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. విద్యుత్ చార్జీలు పెరుగుతున్న దశలో వినియోగదారుల ఖర్చుతో పాటు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను ఆదా చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు శాఖ, ఆర్‌టిసిలో కూడా ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లను అమరుస్తామన్నారు. మొత్తం 8770 గ్రామ పంచాయతీలు, 68 నగర పంచాయతీలలో ఈ ప్రీ పెయిడ్ మీటర్లు బిగిస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీలకు ప్రతి ఇంటికి రెండు ఇఎస్‌ఎల్ తొమ్మిది వాట్ల బల్బులను పంపిణీ చేస్తామన్నారు. ప్రతి బల్బు ధర 74.60 రూపాయలు ఉంటుందని కేవలం బల్బుకు రవాణా ఖర్చుల క్రింద పది రూపాయల చొప్పున సమీకరించి బల్బులను ఉచితంగా అందిస్తామన్నారు.
వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం
రాష్ట్రంలోని 68 నగర పంచాయతీలను (యుఎల్‌బి) రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు బహిరంగ మల విసర్జన లేని పట్టణాలుగా ప్రకటించనున్నట్లు మంత్రి కెటిఆర్ స్పష్టం చేసారు. కలెక్టర్లు ఎంపిక చేసిన పట్టణాల్లో ఏప్రిల్ 30లోగా ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
స్వచ్చ భారత్ మిషన్ క్రింద
383 కోట్లు మంజూరు
స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద సాలిడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా 383 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని పద్నాలుగు పురపాలక సంఘాల పరిధిలో డంపింగ్ యార్డులు, కంపోస్టు యార్డుల ఏర్పాటుకు ఐదు ఎకరాల చొప్పున స్థలాలను వెంటనే గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. అదనపు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు వివరిస్తూ జిల్లాలో ఆస్తి పన్ను క్రింద 37.74 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 26.73 కోట్లు వసూలు చేసామని మార్చి 31లోగా వంద శాతం వసూలు చేసి మరోసారి మెదక్ జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరి గోపాల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ కమిషనర్ దానకిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్, సంగారెడ్డి నుంచి డిపిఓ సురేష్‌బాబు, మున్సిపల్ కమిషనర్లు, ఐకెపి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

విలేఖరులపై విసుగెందుకో?
*మంత్రికి ఫిర్యాదు చేసినా తీరు మార్చుకోని జడ్పీ సిఇఓ
*నల్లటి వస్త్రంతో నిరసన తెలిపిన జడ్పీటిసి
*చైర్‌పర్సన్ ఆదేశాలతో మధ్యాహ్నం అనుమతి
సంగారెడ్డి, మార్చి 10: ప్రజల సమస్యలపై చర్చించే జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాల కవరేజికి వెళ్లిన విలేఖరులను అనుమతించకుండా కొత్త పంథాను అనుసరిస్తున్న జడ్పీ సిఇఓ వ్యవహారాన్ని మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకువెళ్లినా తీరు మార్చుకోకుండా మరోమారు అనుమతికి నిరాకరించి తనలోని విసుగును వ్యక్తం చేయడం గమనార్హం. బుధవారం నాటి జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను కవరేజ్ చేయడానికి వెళ్లిన విలేఖరులను అనుమతించకపోవడంతో ఆగ్రహించిన జర్నలిస్టు సంఘాల నేతలు మంత్రి హరీష్‌రావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. కలెక్టర్ రొనాల్డ్ రాస్‌కు సైతం సమాచారం ఇచ్చి సిఇఓ వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేసారు. గురువారం ఉదయం 9 గంటలకే స్థాయి సంఘాల సభ్యులు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోకి వెళ్లగా విలేఖరులను మాత్రం యథావిధిగా అనుమతి నిరాకరించారు. విస్తుపోయిన విలేఖరులు చేసేదేమి లేక మిన్నకుండిపోయారు. ఈ విషయాన్ని గమనించిన జడ్పీటిసి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఓ దశలో జిన్నారం జడ్పీటిసి సభ్యుడు ప్రభాకర్ నల్లటి కండువాను ధరించి నిరసనకు దిగాడు. చివరకు చైర్ పర్సన్ రాజమణి కల్పించుకుని విలేఖరులను అనుమతించాలని ఆదేశించడంతో మధ్యాహ్నం 12.30 గంటలకు స్థాయి సంఘ సమావేశాలకు అనుమతించారు. అప్పటికే ప్రధాన శాఖలపై సభ్యులు చర్చించగా చివరకు వ్యక్తిగత మరుగుదొడ్లపై జరిగిన చర్చను విలేఖరులు కవరేజ్ చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించారు. అధికార యంత్రాంగానికి, సమాజానికి వారదులుగా ఉంటూ సమాచారాన్ని చేరవేస్తున్న విలేఖరులంటే సిఇఓకు విసుగెందుకో అర్థం కావడం లేదని ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తున్నారు. విలేఖరులు సమావేశ మందిరంలోకి వెళ్లగానే సిఇఓ ముభావంగా ఉంటూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం గమనార్హం. చైర్ పర్సన్ మాట్లాడాలని ఆదేశించినా ఉలుకు పలుకు లేకుండా కూర్చుండి తన మొండి తనాన్ని మరోమారు నిరూపించుకోవడం విశేషం.

విద్యుత్ చార్జీల పెంపు
నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
*సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం
సంగారెడ్డి రూరల్, మార్చి 10: 2016కు సంబంధించి డిస్కాంలు 7.5 శాతం నుండి 10 శాతం వరకు చార్జీలు పెంచుతూ తెలంగాణా విద్యుత్ రెగ్యులేటరి కమిషన్‌కు ప్రతిపాదనలు సమర్పించారని, నిర్వహణ అవకతవకల వల్ల ప్రజలపై 2 వేల కోట్ల భారం వేయడంతో పాటు మరో 6800 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ రాబట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.20 కోట్ల మంది వినియోగదారుల్లో 68 శాతం మందికి చార్జీల పెంపుదల లేదని ఒకవైపు డిస్కాంలు ప్రకటిస్తూనే మరోవైపు భారాలు వేసే విధంగా టారిప్ విధానాన్ని రూపొందించారని ఆరోపించారు. గృహ వాడకాన్ని 14 శ్లాబ్‌ల నుండి 4 శ్లాబ్‌లకు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి వినియోగంలో వంద యూనిట్ల వరకు టారిఫ్ చార్జీ పెంచకున్నా 1 యూనిట్ పెరిగితే 2.60 రూపాయల నుండి 3.25 రూపాయలకు చార్జి పెరుగుతుందన్నారు. సామాన్యులు మద్య తరగతిపై భారాలు వేయడానికి కుట్ర జరుగుతుందన్నారు. డిస్కాంలు నిర్వహణలో చేస్తున్న లోపాల వల్ల చార్జీల పెంపుదల అనివార్యమవుతున్నట్లు నిపుణలు వెల్లడిస్తున్నారని తెలిపారు. విద్యుత్ ప్రసార పంపిణీ నష్టాలు పెరుగుతున్నాయని, వీటిని తగ్గించుకోవడానికి డిస్కాంలు, ట్రాన్స్‌కో ఏలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించరా. ఎర్తింగ్ లేని ట్రాన్స్‌ఫార్మర్లు, ఏబి స్విచ్‌లు లేని ట్రాన్స్‌ఫార్మర్లు అనేకంగా ఉన్నాయని 40 సంవత్సరాల క్రితం వేసిన కండక్టర్‌తోనే విద్యుత్ ప్రసారం కొనసాగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంల ఓ19 లక్షల పంపు సెట్ల క్రింద సాగు కావల్సిన 40 లక్షల ఎకరాల్లో 7, 8 లక్షల ఎకరాలే సాగు అవుతుందని దీంతో విద్యుత్ మిగులు అవుతుందన్నారు. దీనిని అడ్డంగా పెట్టుకుని విద్యుత్ కొరత నివారించామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో 3500 వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ముడి సరుకు కొరత వల్ల మూతపడ్డాయని, విద్యుత్ మిగులుకు ఇదో కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రోజుకు 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని కానీ డిమాండ్ మాత్రం 125 లోపుకు తగ్గిందన్నారు. డిస్కాంలు, ట్రాన్స్‌కో చార్జీలు పెంచకుండా తమ అంతర్గత నైపుణ్యాన్ని పెంపుదల చేసుకోవడం ద్వారా టారిప్ రేట్ల భారాన్ని వినియోగదారులపై పడకుండా చూడాలని కోరారు. ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి ప్రారంభించిన, ప్రారంభిస్తున్న విద్యుత్తును వినియోగంలోకి తెచ్చుకొని చార్జీలను తగ్గించాలన్నారు. అధిక భారానికి గురయ్యే పిపిఎలను రద్దు చేసి ప్రతిపాధించిన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
* గ్రామస్థుల ఆందోళన * పరిస్థితి ఉద్రిక్తం - పోలీసుల రంగప్రవేశం
గజ్వేల్, మార్చి 10: గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో ఆగ్రహించిన గ్రామస్థులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజ్ఞాపూర్‌కు చెందిన రొట్టెల కృష్ణ (34), శ్రీలత (30) దంపతులు బైక్‌పై గజ్వేల్‌కు వెళ్తుండగా వెనుక నుండి అతివేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ సంఘటనతో ఆగ్రహించిన గ్రామస్థులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గజ్వేల్ సిఐ సతీష్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన తీవ్రతను సిద్దిపేట డిఎస్‌పి శ్రీ్ధర్‌కు చేరవేశారు. దీంతో ఆయన ప్రజ్ఞాపూర్‌కు చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇస్తూ వారిని శాంతింప చేశారు. అయితే గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డు నిర్మాణంలో జాప్యం ఫలితంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం కాగా ప్రమాదానికి కారణమైన అందరిపై కేసులు నమోదు చేస్తామని సిఐ సతీష్ పేర్కొన్నారు. కాగా మృతుడికి కుమారుడు రాహుల్, కూతురు రుచిత ఉండగా ఈ సంఘటనతో ప్రజ్ఞాపూర్, గజ్వేల్ పట్టణాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

పెరుగుతున్న మాస్ కాపీయింగ్?

సంగారెడ్డి, మార్చి 10: మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా పట్టుదలతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై భవిషత్ చదువులకు వెళ్లాలని అధికారులు, అద్యాపకులు, తల్లిదండ్రులు చేసే సూచనలను బేఖాతర్ చేస్తూ విద్యార్థులు తమ పాత పద్దతులను కొనసాగిస్తుండటంతో రోజు రోజుకు మాస్‌కాపీయింగ్‌లో పట్టుబడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 14 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. సిట్టింగ్ స్క్వాడ్స్, స్పెషల్ స్క్వాడ్స్, ఇతర అధికారులు పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా విద్యార్థులు తీరు మార్చుకోకుండా తమ భవిషత్తును కాలరాసుకుంటున్నారు. నారాయణఖేడ్ ప్రాంతంలోనే ఎక్కువగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండం దురదృష్టకరమని చెప్పవచ్చు. ఇంగ్లీష్ మాద్యం ద్వితీయ సంవత్సరం పరీక్ష రోజున ఏకంగా ఏడుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. అనంతరం రోజుకు ఒకటి రెండు కేసులు తగ్గకుండా అధికారులకు పట్టుబడుతున్నారు. మాస్‌కాఫీయింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని ఒకరిద్దరు విద్యార్థుల కోసం ప్రతిభావంతులైన వారు పక్కదారి పట్టకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌ఐఓ కిషన్ నాయక్ వెల్లడించారు. మరింత పకడ్బందీగా పరీక్షలను నిర్వహించి ప్రశాంతంగా ముగింపజేస్తామన్నారు. విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా అన్ని సౌకర్యాలు కల్పించినా కొంత మంది విద్యార్థులు తప్పుదారులు వెతుక్కోవడం బాదాకరంగా ఉందన్నారు. ప్రధానంగా రెగ్యులర్ విద్యార్థులు మాస్‌కాఫీయింగ్‌కు పాల్పడరని, గతంలో పెయిలైన వారు మాత్రమే ఇలాంటి తప్పుడు విధానాలను అనుసరించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మెదక్ జిల్లాలో మాస్‌కాఫీయింగ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, పరీక్షలకు గైర్హాజర్ సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందన్నారు. మొత్తంమీద ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తికావస్తున్నందుకు సంతృప్తికరంగా ఉందన్నారు. ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలోనే ఉంటాయని ఆర్‌ఐఓ ధీమా వ్యక్తం చేసారు. కాగా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం నాడు సంగారెడ్డి పట్టణంలోని వివిధ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు. విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్న తీరును దగ్గర గమనించారు. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా పరీక్ష కేంద్రాల్లో తిరుగుతూ పర్యవేక్షించడం గమనార్హం.

మరుగుదొడ్ల బిల్లులు మరుగున పడ్డట్టేనా?
*మూడేళ్లుగా లబ్ధ్దిదారుల ఇబ్బందులు *మంత్రి సమక్షంలో హామీ ఇచ్చినా నిర్లక్ష్యం వీడని అధికారులు
*సిఇఓ తీరుపై చైర్‌పర్సన్ ఆగ్రహం
సంగారెడ్డి రూరల్, మార్చి 10: ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని, బహిరంగ మలవిసర్జన లేని సమాజంగా నిర్మిద్దామని ప్రభుత్వాలు ఘోషిస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాల్లో భాగంగా గురువారం నాడు నిర్వహించిన సమావేశాల్లో జిన్నారం జడ్పీటిసి సభ్యుడు ప్రభాకర్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌తో పాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం బిల్లుల విషయాన్ని తీసుకురాగా వెంటనే పరిష్కరిస్తామని హామి ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు బిల్లులు చెల్లింలేదని విమర్శించారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేసారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు న్యాయం చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. లక్షలాది బిల్లులు సైతం రోజుల్లోనే అందుతున్నా మరుగుదొడ్ల బిల్లులను చెల్లించడంలో అధికారులు ఇంతటి అలసత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడం, మొక్కుబడిగా తాము చేసిన సూచనలకు తలూపుతున్నారే కానీ క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. గృహ నిర్మాణ శాఖపై కూడా సభ్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టాలని సభ్యులు సూచించారు. పటన్‌చెరుకు సంబంధించి 10 లక్షల జడ్పీ నిధులతో అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా పనులు నిర్వహించారని జడ్పీటిసి శ్రీకాంత్‌గౌడ్ విచారం వ్యక్తం చేసారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేద్దామంటూనే మరోవైపు అధికార పార్టీ నాయకులు తమను అగౌర పరుస్తున్నారని అన్నారు. అంతకుముందు జడ్పీ సిఇఓ వర్షిణిపై చైర్ పర్సన్ రాజమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. విలేఖరులను సమావేశానికి అనుమతించకపోవడంతో జడ్పీటిసి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రభాకర్, మనోహర్ గౌడ్‌లు కల్పించుకుని ప్రజాసమస్యలపై ప్రజాప్రతినిధులు చర్చించిన తీరును ప్రజలకు తెలియజెప్పే విలేఖరులను సమావేశానికి ఎందుకు అనుమతించడం లేదని నిలదీసారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ కల్పించుకుని విలేఖరులను లోపలికి అనుమతించాలని లేనిపక్షంలో నీవే సమావేశం నిర్వహించుకో నేను వెళ్లిపోతానని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయినా ససేమిరా అనడంతో ఒక అధికారిగా ఈ రోజు ఉంటారు రేపు వెళ్లిపోతారు ప్రజాప్రతినిధిగా తాను ఇక్కడే ఉంటానని తనకు విలేఖరులతో ఎప్పుడు అవసరం పడుతుందని అనుమతించాలని ఆదేశించడంతో సిఇఓ మిన్నకుండిపోయారు. మొత్తంమీద సిఇఓ తీరుపై ప్రజాప్రతినిధులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయన్న వాస్తవ సత్యం చైర్ పర్సన్ ఆగ్రహం ద్వారా తేటతెల్లమవుతోంది.

ఆధునిక వ్యవసాయంతోనే అధిక దిగుబడులు
*గజ్వేల్ ఎడిఎ శ్రావణ్‌కుమార్
గజ్వేల్, మార్చి 10: ఆదునిక వ్యవసాయంతోనే అధిక దిగుబడులు రైతులు పొందవచ్చని గజ్వేల్ ఎడిఎ శ్రావణ్ పేర్కొన్నారు. గురువారం వర్గల్ మండలం నర్సంపల్లిలో జరిగిన రైతు సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. హైబ్రిడ్ వంగడాల వినియోగంతో అధిక ప్రయోజనం జరుగనుండగా వర్మీకంపోస్టు ఎరువుల తయారీపై రైతులు దృష్టిసారించాలని కోరారు. ముఖ్యంగా రసాయన, క్రిమిసంహ్మారక మందుల వినియోగాని తగ్గించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం శ్రేయస్కరం కాగా ప్రభుత్వం సబ్సీడిపై ఇస్తున్న గ్రిప్, స్పిక్లర్లను సద్వినీయోగం చేసుకోవాలని కోరారు. అలాగే విద్యుత్ ఆదాతో పాటు నీటి వినియోగం తగ్గించుకునేందుకు ఆరుతడి, కూరగాయలు, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు సాగుచేయాలని వివరించారు.

వింటే పూల దండలతో సత్కారం..
లేదంటే శిక్షలతో సంస్కరిస్తాం...
సంగారెడ్డి , మార్చి 10: ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ వాహనాలను నడిపే వారి పట్ల ఉదాసీనతను వదిలిపెట్టి కఠినంగా వ్యవహరిస్తామని తప్పని సరిగా లైసెన్సు కలిగివుండి హెల్మెట్‌ను ధరించాలని సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న వాహన చోదకులకు అవగాహన కల్పించారు. గురువారం సాయంత్రం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలను నడిపే వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ లేకుండా మోటారు బైకులు నడుపుకుంటూ వచ్చే వారికి వినూత్న తరహాలో పూలమాలలు వేసి సత్కరిస్తూ అవగాహన కల్పించారు. మొదటి సారి తప్పుకు మెడలో పూలదండ వేసి గుర్తుంచుకోవాలని పరోక్షంగా హెచ్చరిక చేస్తున్నట్లు డిఎస్పీ వెల్లడించారు. రెండవ సారి తప్పు చేస్తే జరిమానా మరోమారు పునరావృతమైతే జైలుకు పంపాల్సి వస్తోందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారే ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారని, వేగంకంటే ప్రాణం గొప్ప అన్న విషయాన్ని మరిచిపోకూడదన్నారు.
ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా రోడ్డుకు ఎడమవైపుగా ద్విచక్ర వాహనాలను నడిపితే ప్రమాదాలు సంభవించిన ప్రాణహాని తక్కువగా ఉంటుందన్నారు. మద్యం తాగి వాహనాలను నడిపించడం చట్ట రిత్య నేరమని ఇప్పటికే అనేక మందిపై కేసులు నమోదు చేయగా భారీ మొత్తంలో జరిమానాలు చెల్లించుకున్నారని డిఎస్పీ వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో రాజీ కుదుర్చుకోమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్యామల వెంకటేశంతో పాటు ఆర్టీఎ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.