క్రైమ్ కథ

మధ్య గుండీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది జో రివాల్వర్‌తో మొదలవలేదు. నిజానికి నేమీ సెకండ్ ఎవెన్యూలోని ఓ రెస్ట్‌రెంట్లో వెయిట్రెస్‌గా పని చేస్తూండగా ఆరంభమైంది. ఆ రెస్ట్‌రెంట్‌కి తరచు వచ్చే జో విసిరిన గాలానికి నేమీ చేపపిల్లలా త్వరగా, లోతుగా చిక్కుకుంది. అది సినిమాలోని మొదటి రీల్.
రెండో రీల్లో వాళ్లిద్దరికీ పెళ్లైంది. జో పెళ్లిని వాయిదా వేయాలని ప్రయత్నించినా నేమీ బలవంతం చేసి అతన్ని పెళ్లికి ఒప్పించింది. తను చేసింది పొరపాటని నేమీ ఓ నెల్లో గ్రహించింది. నిజానికి రెండో నెల్లో. మొదటి నెల నించే ఆమెలో ఆ అనుమానం కలిగింది. జో ఉద్యోగం చేయకపోయినా అతని దగ్గర ఎప్పుడూ డబ్బుండేది. ఎక్కువ డబ్బు కాదు. సరిపడ. వాళ్లు అద్దెకి తీసుకున్న మూడు గదుల చవక ఇంటికి అద్దె చెల్లించేంత. సరుకులు కొనేంత డబ్బు మాత్రమే ఉండేది. అంత మటుకే. తన దగ్గర డబ్బై పోగానే అతను రాత్రిళ్లు బయటకి వెళ్లేవాడు. వచ్చేపుడు అతని దగ్గర డబ్బుండేది. అడిగినా అది ఎలా వచ్చిందో వివరించేవాడు కాదు.
మొదట్లో నేమీకి అనుమానం మాత్రమే ఉండేది. కాని ఓసారి అతని రివాల్వర్ని చూసాక ఆ అనుమానం నిజమని తేలింది. ఓ మంగళవారం ఉదయం నేమీ ఆ రివాల్వర్ని మొదటిసారి చూసింది. అతని దుస్తులు ఉంచుకునే డ్రెసర్ డ్రాయర్లో షర్ట్‌ల మధ్య అది ఆమెకి కనపడింది. నికెల్ ప్లేట్ గల చవక రివాల్వర్ అది. ఆమె దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తూంటే జో ఆ గదిలోకి వచ్చి ఆమె వెనక నిలబడ్డాడు. ఆమె డ్రెసర్‌కి ఉన్న అద్దంలో అతని ప్రతిబింబాన్ని చూసింది. అతని మొహం ఎప్పటిలా మామూలుగా లేదు. వికృతంగా, ప్రమాదకరంగా కనిపించింది.
‘నువ్వు దీన్ని తెరిచి ఉండకూడదు బేబీ’ అతను చెప్పాడు.
అతని కంఠం కూడా వికృతంగా ఉంది. అతను ఆమె చేతిలోని రివాల్వర్ని అందుకుని నిర్లక్ష్యంగా దాని గొట్టాన్ని నేమీ వీపునకు ఆనించాడు.
‘తుపాకులు ప్రమాదకరం బేబీ. ముఖ్యంగా గుళ్లు నింపినవి. దీంట్లో గుళ్లున్నాయి.’
‘జో’ భయంగా చెప్పింది.
అతని వేళ్లు వెంటనే రివాల్వర్ చుట్టూ బిగుసుకున్నాయి. నిర్లక్ష్యం మాయమైంది. అతని కంఠం కోస్తున్నట్లుగా చెప్పింది.
‘అడక్క’
చాలాసేపు వాళ్లిద్దరిలోని ఎవరూ కదల్లేదు. తర్వాత నేమీని ఓవైపు నెట్టి జో రివాల్వర్ని యథాస్థానంలో ఉంచి దాని మీద షర్ట్‌లని ఉంచాడు. డ్రాయర్ని మూసి పక్క గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత వాళ్లు మళ్లీ ఎన్నడూ ఆ రివాల్వర్ గురించి ఒకరితో మరొకరు ప్రస్తావించలేదు. మాట్లాడకపోయినా నేమీ మనసులోంచి అది పోలేదని జోకి తెలుసు. ఆ సంగతి జోకి తెలుసుని నేమీకి కూడా తెలుసు.
ఆ తర్వాత రాత్రుళ్లు జో బయటకి వెళ్లినప్పుడల్లా నేమీ డ్రాయర్ తెరిచి దాని కోసం చూసేది. దాన్ని అతను తన వెంట తీసుకెళ్లడంతో కనపడేది కాదు.
ఆ రాత్రి కూడా అతను దాన్ని వెంట తీసుకెళ్లాడు. రాత్రి చాలాసేపటి తర్వాత తలుపు తెరిచి, మూసిన చప్పుడైంది. వచ్చింది జో అని నేమీ గ్రహించింది. అతను లోపలకి వచ్చి లైట్ వేసి డ్రాయింగ్ రూమ్‌లో రాకింగ్ చైర్‌లో కూర్చునున్న నేమీని అడిగాడు.
‘నేమీ! ఇల్లంతా చీకటి చేసావే?’
ఆమె జవాబు చెప్పలేదు. అతను ఆమె వంక చూస్తూ ఎక్సయిటింగ్‌గా నవ్వాడు. అతనిలో ఎన్నడూ లేని ఉత్సాహం పెల్లుబుకుతోంది. అతని హాలివుడ్ తరహా బ్లేజర్ ఒంటి మీద కాక అతని ఎడం చేతి మీద వేలాడుతోంది. ఆ ఎర్ర గుండీల మాసిపోయిన పసుపు రంగు బ్లేజర్ని అతను బల్ల మీద పడేసి అడిగాడు.
‘మాట్లాడవే? నీ నాలికకి ఏమైంది?’
నేమీ జవాబు చెప్పలేదు. ఓ సిగరెట్ వెలిగించి పడక గదిలోకి వెళ్లాడు. డ్రెసర్ డ్రాయర్ తెరిచి మూసిన శబ్దం ఆమెకి వినిపించింది.
‘బేబీ! బయటకి వెళ్దాం పద. పార్టీ చేసుకుందాం. మన దగ్గర చాలా డబ్బుంది’ లోపల్నించి గట్టిగా చెప్పాడు.
‘ఏం డబ్బు జో?’ నేమీ ప్రశ్నించింది.
‘అది నీకు అనవసరం. మొన్న కొన్న ఆ ఎర్ర రంగు కొత్త డ్రెస్ వేసుకో. బయటకి వెళ్దాం’
‘అది ఆకుపచ్చ రంగు గౌన్ జో’
‘ఎరుపు - ఆకుపచ్చ. ఆ రెండూ నాకు ఒకటే కాని బయటకి వెళ్దామా? వద్దా?’ విసుగ్గా అడిగాడు.
అతను గదిలోంచి బయటకి రాగానే నేమీ తలని అడ్డంగా ఊపి చెప్పింది.
‘ఒద్దు. రాత్రి ఒంటిగంట దాటింది. నాకు బయటకి వెళ్లాలని లేదు కూడా’
‘నీకు పిచ్చా? ఇప్పుడు సమయం ఐదు నిమిషాలు తక్కువ పనె్నండు’ అతను వెంటనే పడక గదిలోంచి అలారం క్లాక్‌ని తెచ్చి చూపిస్తూ చెప్పాడు.
‘నేను దాన్ని గంట క్రితం చూసినప్పుడు టైం పనె్నండైంది’ నేమీ చెప్పింది.
‘నువ్వు పొరబడ్డావు. నేను చెప్పినట్టు ఇప్పుడు టైం ఐదు నిమిషాల తక్కువ పనె్నండు. అది మర్చిపోకు’
అతని కంఠంలో కరకుదనాన్ని నేమీ గుర్తించింది.
‘తేడా ఏముంది?’ అడిగింది.
‘కూపీ లాగే ప్రయత్నం చేయక. గుర్తుంచుకో. నేను ఇంటికి పనె్నండుకి మునుపే వచ్చాను. ఏం?’
‘సరే జో’
‘మర్చిపోకు’
‘మర్చిపోను జో’
అతను గడియారంతో మళ్లీ పడక గదిలోకి వెళ్లాడు. అతను మంచం మీద పడుకున్నట్లుగా అది కిర్రుమంది.
‘నేను నిద్రపోతున్నాను. నువ్వూ రా’ పిలిచాడు.
‘వస్తున్నాను’
ఆమె రాకింగ్ చెయిర్లోంచి లేచి ఆ గదిలోని లైట్ ఆర్పి పడక గదిలోకి వెళ్లింది.
* * *
రాత్రి ఆమె సరిగ్గా పడుకోలేదు. మర్నాడు ఉదయం ఆరుకి నిద్ర లేచింది. కళ్లు ఎర్రబడి మండుతున్నాయి. ఆమెలోని భయం ఆమెని నిద్రపోనీలేదు. ఆరున్నరకి బయటకి వెళ్లి ఓ మూల ఉన్న ధినపత్రికల స్టాండ్‌లో ఆ రోజు దినపత్రికని కొన్నది. తిరిగి ఇంటికి నడుస్తూ ఆ వార్త కోసం వెదికి దాన్ని చదివింది.
దాని గురించి ఎక్కువ వివరాలు లేవు. దుండగుడు ఓ మనిషిని దోచుకున్నాక మూడుసార్లు కాల్చి చంపాడు. ఆ నేరం అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఆధారాలేం దొరకలేదు. ఐతే హతుడి గుప్పెట్లో ఓ ఎర్రరంగు గుండీ చిక్కుకుని కనిపించింది.
నేమీ ఆ దినపత్రికని రోడ్ మీది చెత్త డబ్బాలో పడేసి ఇంట్లోకి వెళ్లింది. కుర్చీలో కూర్చుని కిటికీలోంచి బయట కనపడే ఆకుపచ్చ చెట్ల వంక చూడసాగింది.
ఉదయం పదకొండుకి జో మంచం మీద కదిలిన శబ్దం వినిపించింది. అతను వెంటనే బయటకి రాలేదు. ఆమె లేచి పడక గదిలోకి వెళ్తే అతను మంచం మీద కూర్చుని నికెల్ ప్లేట్ రివాల్వర్ని శుభ్రం చేస్తూ కనిపించాడు.
‘నేను బిజీగా ఉన్నాను బేబీ’ చెప్పాడు.
ఆమె గుమ్మంలోంచి కదల్లేదు.
‘బిజీగా ఉన్నాను అన్నానా?’ ఆమె ప్రశ్నలని వినడానికి ఇష్టపడని జో కఠినంగా చెప్పాడు.
‘నీకా డబ్బు ఎక్కడ నించి వచ్చింది?’
‘ఏ డబ్బు?’
‘ఏ డబ్బో నీకు తెలుసు. నిన్న రాత్రి నువ్వు బయటకి వెళ్లినప్పుడు నీ దగ్గర డబ్బు లేదు’
అతను నెమ్మదిగా ఆమె వైపు తిరిగి చెప్పాడు.
‘పేకాటలో గెల్చుకున్నాను’
‘నీకు సరిగ్గా అబద్ధం ఆడటం రాదు జో’
‘నేను చెప్పింది నువ్వు నమ్మాలి. ఎవరడిగినా అదే చెప్పాలి’ కఠినంగా చెప్పాడు.
‘నేను నీ భార్యని. నిజం తెలుసుకునే హక్కు నాకుంది’
జో రివాల్వర్ని ఓ పాత బట్టతో రెండుసార్లు పాలిష్ చేసి రుద్దాక ఆమెకి గురి పెట్టి దాని ట్రిగర్ని లాగాడు. గుళ్లు లేకపోవడంతో అది రెండుసార్లు క్లిక్‌మన్న శబ్దం చేసింది. అతను కావాలని ఆ ఆరు చేంబర్లలోకి నింపాదిగా ఆమె చూస్తూండగా ఆరు గుళ్లని నింపాడు. అది నేమీ వైపు గురిపెట్టబడింది.
‘నువ్వు గుర్తుంచుకోవాల్సిందల్లా కోర్ట్‌కి వచ్చి నీ భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే అది ఈ దేశంలో చట్టసమ్మతం కాదని’
‘విడాకులిచ్చి నేను నిన్ను విడిచిపెట్టేయచ్చు’ కొద్ది క్షణాలు ఆలోచించి ఆమె చెప్పింది.
అతను రివాల్వర్ వంక, నేమీ వంక మార్చిమార్చి చూసి చెప్పాడు.
‘అలాగా? అది నాకు నచ్చదు బేబీ. నాకు కోపం తెప్పిస్తుంది. తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు’
నేమీ తలుపు మూసి వెళ్లి మళ్లీ రాకింగ్ ఛెయిర్లో కూర్చుంది. జో వెలిగే సిగరెట్‌తో బయటకి వచ్చి కిటికీ ముందు నిలబడ్డాడు.
‘పొద్దున పేపర్ కొని తెచ్చావా?’ కొద్దిసేపాగి అడిగాడు.
‘లేదు’
‘సరే. ముందు నువ్వు నా బ్లేజర్కి గుండీని కుట్టు. నిన్న రాత్రి ఒకటి తెగిపోయింది’
‘ఆ గుండీ ఏది?’ అడిగింది.
‘నాకేం తెలుసు? అది ఎక్కడ తెగి పడిపోయిందో నాకు తెలీదు. సరిగ్గా అలాంటిదే ఇంకోటి కుట్టు. అర్థమైందా?’ అడిగాడు.
‘ఐంది జో’
ఆమె కుర్చీలోంచి లేచి పడక గదిలోకి బ్లేజర్ని తీసుకెళ్లి దాన్ని పరుపు మీద పరిచింది. అది ఐదు ఎర్ర బటన్స్ గల బ్లేజర్. మధ్యది మాయమైంది. ఆమె కుట్టు వస్తువులు ఉంచే బుట్టలో కోరుకున్న గుండీని వెదికి తీసింది. ఓ దారపు బంతిని ఎన్నిక చేసి తీసి నెమ్మదిగా బ్లేజర్‌కి ఆ గుండీని కుట్టసాగింది. అది పూర్తయ్యేసరికి అతను బయటకి వెళ్లి తిరిగొచ్చాడు.
‘సరిగ్గా అలాంటి గుండీనే కుట్టావా?’ అడిగాడు.
‘చూడు. తేడా తెలుస్తోందా?’ అడిగింది.
‘లేదనుకుంటా. అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. గంటలో వస్తాను’
అతను బ్లేజర్ని తొడుక్కుని బయటకి వెళ్లి మూల ఉన్న దినపత్రికల స్టేండ్‌లో ఓ దినపత్రికని కొని చదువుతూ నడిచాడు.
మధ్యలో ఓసారి అతని వేళ్లు నేమి కొత్తగా కుట్టిన గుండీని తడిమాయి. అది ఇంకా ఉంది. ఆ దినపత్రికని జేబులో ఉంచుకుని ఈల వేస్తూ ఓ బార్లోకి నడిచాడు.
జోని చూడగానే బార్ టెండర్ అతను కౌంటర్ దగ్గరికి వచ్చేలోగా బీర్
గ్లాస్‌లో బీర్ని పోసి సిద్ధంగా ఉంచాడు. జో దాన్ని అందుకుని సగం పైనే ఒకే గుక్కలో తాగి జేబులోంచి దినపత్రికని బయటకి తీసి చెప్పాడు.
‘నిన్న రాత్రి ఇక్కడికి దగ్గర్లో ఒకడు చచ్చాడు’
‘అవును. చదివాను’ బార్ టెండర్ చెప్పాడు.
‘పాపం’
‘అవును’
‘ఎక్కడో డబ్బు కట్టని జేబులోంచి బయటకి తీసుంటాడు’
‘అవును. అలా జరిగి ఉండచ్చు’
‘గ్లాస్‌ని నింపు’ జో మొత్తం ఖాళీ చేసి కోరాడు.
‘డిటెక్టివ్ పాలన్ మళ్లీ వచ్చాడు’ బార్ టెండర్ చెప్పాడు.
జో తల వెనక్కి తిప్పి చూశాడు. తలుపు తెరచుకుని ఓ వ్యక్తి లోపలకి వస్తూ కనిపించాడు. ఓ బల్ల ముందు కూర్చున్న అతనికి బార్ టెండర్ మైక్ బీర్ సీసాని, గ్లాస్‌ని ఇచ్చి వచ్చి జోకి రహస్యంగా చెప్పాడు.
‘ఓ ఎర్ర బటన్‌ని పోగొట్టుకున్న అతని కోసం ఆ డిటెక్టివ్ వెదుకుతున్నాడు’
‘అది నేను కాదు. నాకు అన్ని బటన్సూ ఉన్నాయి.’
మైక్ దృష్టి అతని బ్లేజర్ బటన్స్ మీదకి మళ్లింది. మధ్య బటన్ చూడగానే మైక్‌లో భయం కలిగింది. అతను జో భుజాల మీంచి అవతల కూర్చున్న డిటెక్టివ్ వైపు చూశాడు.
‘ఏమిటి?’ అది గ్రహించిన జో తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు.
‘ఏం లేదు’
‘నా గుండీలన్నీ ఉన్నాయిగా?’
‘ఉన్నాయి’
మైక్‌ని గమనించిన ఆ డిటెక్టివ్ తన బీర్‌ని మర్చిపోయి నెమ్మదిగా లేచి జో దగ్గరికి వచ్చాడు. అతని దృష్టి జో వొంటి మీది బ్లేజర్ మధ్య కొత్తగా కుట్టిన గుండీ మీద నిలిచింది. అతను చిన్నగా నవ్వాడు. జో లో భయం మొదలైంది.
‘ఏమిటలా చూస్తున్నారు? దేని వంక?’ అడిగాడు.
డిటెక్టివ్ చెయ్యి కోటు జేబులోంచి రివాల్వర్‌తో బయటకి వచ్చింది. దాన్ని జోకి గురి పెట్టి చెప్పాడు.
‘కదలక’
‘నా గుండీలన్నీ ఉన్నాయి’ జో వెంటనే కంగారుగా చెప్పాడు.
అతను నవ్వి ఎడం చేత్తో జో మధ్య గుండీ వంక చూపిస్తూ అడిగాడు.
‘పై రెండూ, కింద రెండూ ఎర్ర గుండీలు. మధ్య గుండీ మాత్రం ఆకుపచ్చ రంగుది ఎందుకు ఉంది?’
జో తను కలర్ బ్లైండ్ అని చెప్పలేదు. తన భార్యని తిట్టసాగాడు. కాని అది అతనికి సహాయం చేసే పని కాదు. అతని ఇంట్లోని, డబ్బు, రివాల్వర్ అతనికి హాని చేసేవి.
(కర్ట్ హేమ్లిన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి