కర్నూల్

జీరో వ్యాపారాలకు కాలం చెల్లినట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 29 : ఎలాంటి పన్ను చెల్లించకుండా జీరో వ్యాపారం చేస్తున్న వ్యాపారుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. దర్జాగా ఇంత కాలం వ్యాపారం చేసిన వారు ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో బెంబేలెత్తిపోతున్నారు. ఇక ముందు జీరో వ్యాపారం చేయలేమన్న భావనతో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నుంచి వ్యాపారానికి లైసెన్స్ కోసం కొందరు ప్రయత్నిస్తుండగా ఇప్పటికే లైసెన్స్ ఉన్న వారు బ్యాంకు ఖాతాలు తెరిచి తద్వారా వ్యాపారం చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. జీరో వ్యాపారం ద్వారా భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్న వ్యాపారుల్లో అత్యధికంగా రియల్ ఎస్టేట్, బంగారు వ్యాపారులు ఉన్నట్లు వాణిజ్య పన్ను శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. వీరితో పాటు పలు తినుబండారాల తయారీదారులు, కిరాణా టోకు వ్యాపారులు ఉన్నట్లు వెల్లడవుతోంది. జీరో వ్యాపారం ద్వారా సగటున రోజుకు రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకూ లావాదేవీలు జరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరంతా నగదు లావాదేవీలతో వ్యాపారం చేస్తూ ఎలాంటి పన్నులు చెల్లించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వీరిపై గతంలో చర్యలు తీసుకున్నా అవి నామమాత్రమే కావడంతో యథావిధిగా జీరో వ్యాపారం చేసేవారని వారంటున్నారు. తాజాగా పెద్ద నోట్ల రద్దు ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో ఇక ముందు నగదు లావాదేవీలకు అడ్డుకట్ట పడనుందని తెలియడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో రోజు వారీ రూ. 15వేలకు మించి వ్యాపార లావాదేవీలు నిర్వహించే ప్రతి ఒక్కరూ స్వైపింగ్ యంత్రం ద్వారా నగదు మార్పిడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యాపారులు తప్పనిసరి పరిస్థితుల్లో జీరో వ్యాపారానికి స్వస్థి పలికేందుకు సిద్ధపడ్డట్లు సమాచారం. ఇదే జరిగితే జిల్లాలో జీరో వ్యాపారుల ద్వారా ప్రతి రోజూ లక్షల రూపాయల పన్ను వసూలవుతుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక భూముల కొనుగోలుకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో నగదు లావాదేవీలకు వీలులేని పరిస్థితి రాబోతోందని, దీని వల్ల అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుందని వెల్లడిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నగదు మార్పిడితో వాస్తవంగా భూమి కొన్న ధర అధికారికంగా నిర్ధారణ అవడం వల్ల పన్నులు ఎగవేసేందుకు వీలుకాదని వారంటున్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సామాన్య ప్రజలు ఇబ్బందులు పడినా ఏడాది తరువాత ప్రయోజనం పొందుతారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
బ్యాంకుల్లో కరెన్సీ కొరత!
* వేతన సొమ్ములు చేతికి అందేనా...
* ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు
నంద్యాల, నవంబర్ 29: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8వ తేదీన అకస్మాత్తుగా ప్రకటించిన పెద్ద నోట్లు రూ. 1000, రూ. 500 రద్దు కావడంతో పేద, మధ్యతరగతి ప్రజలు, దినసరి కూలీలు, రైతులు, చిన్న వ్యాపారులు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటి వరకు రూ. 100, రూ. 50 నోట్ల కోసం కనాకష్టాలు పడ్డారు. ఎటిఎంలలో కేవలం ఒక్క రూ. 2000 నోటు తప్ప ఇతర నోట్లు రావలేదు. ప్రస్తుతం రిజర్వు బ్యాంకు నుండి రూ. 500 కొత్త నోట్లు జిల్లా కేంద్రానికి చేరినప్పటికి పట్టణాలు, మండల కేంద్రాలకు ఇంత వరకు రాలేదు. గురువారం డిసెంబర్ 1వ తేదీ కావడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యంగా 4వ తరగతి, 3వ తరగతి ఉద్యోగులు నెల జీతం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే బ్యాంకుల్లో కరెన్సీ కొరత కారణంగా నెల జీతాలు 1వ తేదీ నాడు తీసుకొనే అవకాశం కనపడడం లేదు. నంద్యాల పట్టణంలోని ఎస్‌బిఐ ప్రధా న శాఖకు ఇప్పటి వరకు కొత్త నోట్లు రాలేదని బ్యాంకు ఉన్నతాధికారులు అంటున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 1వ తేదీ నాడు తమకు రావాల్సిన జీతాలు, పెన్షన్‌లు తీసుకోగలమా? అన్న డైలామాలో పడ్డారు. నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌బిఐ ప్రధాన శాఖను సంప్రదించగా, నోట్ల కొరత కారణంగా 1వ తేదీ నాటికి జీతాలు, పెన్షన్లు చెల్లించలేమని తమ నిస్సాహయతను వ్యక్తం చేశారు. దీంతో చేసేదిలేక పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు ఫ్యాక్స్ ద్వారా వినతిపత్రాన్ని అందజేశారు. నంద్యాల పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో కూడా కరెన్సీ కొరత తీవ్రంగా వేదిస్తోంది. ధనవంతులు, ఉనర్నతస్థాయి ఉద్యోగులకు పెద్దనోట్ల రద్దు పెద్దగా ప్రభావం చూపలేదు. చిరుద్యోగులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త రూ. 500 నోట్లు, రూ. 100, రూ. 50 నోట్లు అందక నానా యాతన పడుతున్నారు. ఎటిఎంలలో రూ. 2000ల నోటు అందినా, కిరాణా కొట్టులో చిల్లర ఇవ్వడం లేదు. పెట్రోలు బంకుల్లో సైతం పాత నోట్లు తీసుకోకపోగా, రూ. 2000 నోటు ఇస్తే రూ. 300ల పెట్రోలు పోసి మూడు పాత రూ. 500 నోట్లు, రెండు రూ.100ల నోట్లు చేతిలో పెట్టి పంపుతున్నారు. దీంతో ఎటు దిక్కుతోచక దినసరి కూలీలు, చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా నంద్యాల ప్రాంతంలో ఖరీఫ్ వరి కోతకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు పూర్తికాగా, గిట్టుబాటు ధర లేక రైతులు అమ్ముకోలేకపోతున్నారు. ప్రారంభంలో 75 కిలోల బస్తా ధర సన్నకరం వరి రూ.1500 పలుకగా, నేడు రూ.1200లకు కూడా అడిగే దిక్కులేదు. వరి ధాన్యం కొనుగోలుకు కొత్త కరెన్సీ అందుబాటులోకి పూర్తిస్థాయిలో రాకపోవడంతో అమ్మకాలు తగ్గిపోయి రైతులు ధాన్యాన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇళ్లకు తరలిస్తున్నారు. మరికొంత మంది నల్లకుబేరులు తమ వద్ద ఉన్న పాత నోట్లతో వరి ధాన్యం ధరను పెంచి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నా రైతులు పాత నోట్లు తీసుకొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో రైతాంగం పండించి పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక నష్టాలపాలవుతున్నారు. మొత్తంమీద పెద్దనోట్లరద్దు ప్రభావం ధనవంతులకు, ఉన్నతాధికారులకు పెద్దగా కనిపించకపోయినా, 70 శాతం మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవలనే మహానంది దేవస్థానంలో ఉద్యోగులు రద్దయిన పెద్దనోట్ల స్థానంలో చిన్న నోట్లను పర్సెంటేజీలకు కక్కుర్తిపడి బయటకు తరలించడం, విషయం బయటకు పొక్కి ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్‌కు గురయ్యారు. ఇదేకాక చాలా చోట్ల ఈ తంతు సాగుతోంది. నంద్యాలలో కూడా భారీ మొత్తంలో పాత నోట్లకు బదులు కొత్త కరెన్సీతోపాటు చిన్న నోట్లు కూడా తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడు తాను కష్టపడి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును తీసుకోవాలంటే అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల ఓ రైల్వే ఉద్యోగి తన కూతురు పెళ్లి కోసం ఓ బ్యాంకులో రూ.6 లక్షలు దాచుకున్నాడు. ఈనెల 24వ తేదీన కూతురు పెళ్లి ఉండడంతో నాలుగు రోజుల ముందు బ్యాంకు అధికారులను సంప్రదిస్తే సవా లక్ష ప్రశ్నలు వేస్తూ ముప్పతిప్పలు పెట్టారు. కష్టార్జితం సొమ్ము సురక్షితంగా బ్యాంకుల్లో ఉంటుందని దాచుకున్న పేద, మధ్యతరగతి ప్రజలు తమ అవసరాల కోసం డబ్బు చేతికి రాక నానా తిప్పలు పడ్డారు. తమ పిల్లల చదువుకు కట్టాల్సిన ఫీజులు సైతం పెద్ద నోట్ల రద్దు కారణంగా కట్టలేక, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలలో ఫీజుతోపాటు ఫెనాల్టీ కట్టేందుకు వెనుకాడలేదు. మొత్తం మీద ప్రధాని మోదీ నల్లధనాన్ని వెలికి తీసే ఉద్దేశ్యంతో పెద్ద నోట్లను రద్దు చేసి 80 శాతం ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ, రూ.2000 నోటు కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని ప్రాణాలు ఫణంగా పెట్టినా బ్యాంకర్లు కనికరించలేదు. డిసెంబర్ 1వ తేదీ నాటికి కరెన్సీ కొరత ఇదేవిధంగా ఉంటే పెన్షనర్లు, చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, కూలీ, నాలీ చేసుకొనే నిరుపేదలు చిన్న వ్యాపారులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
పేదల అభ్యున్నతే ధ్యేయం
* పెద్దనోట్ల రద్దుతో జగన్‌కు జ్వరం..
* జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు
డోన్, నవంబర్ 29 : పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయం అని కార్మికశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. డోన్ పట్టణంలోని ఆగ్నిమాపక కేంద్రం ఆవరణలో మంగళవారం నిర్వహించిన ‘చంద్రన్న పసుపుకుంకుమ’ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందన్నారు. అందు లో భాగంగా 3,061 పొదుపు గ్రూపులకు రూ. 9.61కోట్ల చెక్కులను పంపి ణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన డ్వాక్రా సంఘాల వల్లే మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారన్నారు. మహిళా సాధికారత కోసం చంద్రబాబు గతంలో ఎవ్వరూ చేయని విధంగా రుణమాఫీ చేసి ఆదుకున్నారన్నారు. మహిళలపై నమ్మకంతో బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని వాటిని సద్విరనియోగం చేసుకోవాలని సూచించారు. అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం చంద్రన్నబీమా ప్రవేశపెట్టారని ఆ పథకాన్ని విజయవంతం చేయడానికి దాని బాధ్యతను మీకు అప్పగించారని తెలిపారు. 2017 మే 31వ తేదీ నాటికి రాష్ట్రంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేశారు, రుణమాఫీ, రూ. 1000 పింఛను, ప్రతి నిరుపేదకు 5 కిలోల బియ్యం, చంద్రన్నబీమా, ఆరోగ్యబీమా, అందరికీ విద్య, తదితర ఎన్నో పథకాలను అమలు చేస్తున్నా ప్రతిపక్ష నేత జగన్ మాత్రం టిడిపి ప్రభుత్వం ఏమి చేయడం లేదని విమర్శలు చేయడం శోచనీయమన్నారు. జగన్ మాటలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లు రద్దు చేయడంతో వైకాపా అధినేత జగన్‌కు జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా ఒకరోజు కూడా నోరు మెదపలేదని విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టించుకోని పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 2017 జనవరి 1వ తేదీ నుంచి రూ. 100కే ఆరోగ్యబీమా చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అంతకుముందు మంత్రి పట్టణంలోని మార్కెట్‌యార్డ్‌లో రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య, జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, డిఆర్‌డిఎ పిడి రామకృష్ణ, నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్, గొర్రెల సహకార సంఘం చైర్మన్ నాగేశ్వరరావుయాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కొట్రికే గాయత్రీదేవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, టిడిపి పట్టణ అధ్యక్షుడు కొట్రికె ఫణిరాజు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ముమ్మరంగా ఫైబర్ నెట్ పనులు
* నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, నవంబర్ 29 : ఇంత వర కూ అతి తక్కువ ధరకు ఇంటర్నెట్, టీవి, టెలిఫోన్ సేవలు అందజేసేందు కు ఉద్దేశించిన ఫైబర్ నెట్ సేవల్లో ఇక ముందు నగదు లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతి గ్రామంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇంటర్నెట్ తప్పనిసరిగా నిర్వహించాల్సించిన పరిస్థితి ఏర్పడిన కారణంగా ఫైబర్‌నెట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్ విజయమోహన్‌ను ఆదేశించింది. సాంకేతిక శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 2,300 కిలోమీటర్ల మేర ఫైబర్ తీగలను లాగాల్సి ఉందని తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే 1600 కి.మీకు పైగా పనులు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని మరో నెల రోజుల్లోగా పూర్తి చేసేందుకు శ్రమించాల్సి ఉందని వారంటున్నారు. జనవరి 1వ తేదీ నాటి కి ఫైబర్‌నెట్ ద్వారా ప్రభుత్వం అందజేయాల్సిన ఇంటర్‌నెట్, టీవి ప్రసారాలు, టెలిఫోన్ సదుపాయాలు అం దించాల్సి ఉందని వెల్లడిస్తున్నారు. ఒక వైపు ఫైబర్‌నెట్ తీగలు లాగుతూనే వీటికి అనుసంధానంగా కంట్రోల్ రూంలను నెలకొల్పే పనులు జరుగుతాయని వెల్లడిస్తున్నారు. ప్రతి గ్రామం లో సగటున 20 ఎంబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్ పని చేస్తుందని వారంటున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటుకు అవసరమైన సెట్ టాప్ బాక్సులు డిసెంబర్ 15వ తేదీ నాటికి జిల్లాకు వచ్చే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఫైబర్‌నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు ప్రారంభమైతే గ్రామాల్లో కూడా మార్చి 31వ తేదీ నాటికి నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ఆటంకాలు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పట్టణాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న వారంతా లావాదేవీలను బట్టి స్థానిక సంస్థల్లో కానీ వాణిజ్య పన్నుల శాఖలో కానీ నమోదు చేసుకోవాలని నిబంధన ఉందని, రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదేవిధంగా ఉంటుందని పేర్కొంటున్నారు. నగదు రహిత లావాదేవీలు దేశవ్యాప్తంగా తప్పనిసరి అయిన నాటి నుంచి ఇంటర్నెట్ వినియోగం అధికమవుతుందని దీని కారణంగా సేవల్లో అంతరాయం, లోపం రాకుండా పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నాణ్యమైన సెట్ టాప్ బాక్సులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నగదు రహిత లావాదేవీలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆన్‌లైన్ విధానానికి అలవాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడటంతో గ్రామీణులు ఈ విషయంపై ఆసక్తి చూపుతూ వాటి వివరాలు తెలుసుకోవడం, స్మార్ట్ఫోన్‌లో యాప్‌ల వినియోగం గురించి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు.
నేరాలను కట్టడి చేయండి
* బ్యాంకుల వద్ద ప్రజలకు సహకరించాలి:ఎస్పీ రవికృష్ణ
కర్నూలు, నవంబర్ 29:నేరాలు, చోరీలను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికతో పని చేయాలని ఎస్పీ ఆకే రవికృష్ణ జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత గవర్నర్ నుంచి రెడ్‌క్రాస్ సేవా అవార్డు అందుకున్న ఎస్పీని పోలీసు అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రాపర్టీ కేసులను రికవరీ చేయాలన్నారు. ఇంతకుముందు కొందరు అధికారులు తప్పుడు పనులు చేసి సస్పెన్షన్ వేటుకు గురయ్యారని, అలాకాకుండా చిత్తశుద్ధితో పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. బ్యాంకుల దగ్గర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయూతనందించాలన్నారు. తమ కుటుంబాల గురించి ఆలోచించి భద్రత లోన్ కింద రుణ సౌకర్యం పొంది భవిష్యత్తును భద్రత పరచుకోవాలన్నారు. రోడ్డు మధ్యలో ఆటోలు ఆపేస్తున్నారని ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, కావున పోలీసులు యూనిఫారం, లైసెన్సు, ఆధార్డుకార్డు లేని ఆటో డ్రైవర్లపై, నెంబర్‌లేని ఆటోలపై జరిమానా విధించాలన్నారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు బీట్‌ల విధుల సమచారం చేరవేయాలన్నారు. మహిళలపై జరిగే దాడులకు కారమవుతున్న మద్య బెల్టు షాపులను నియంత్రించాలన్నారు. సత్ప్రవర్తన కలిగి ఐదేళ్లు పూర్తి చేసుకున్న రౌడీషీటర్లపై రౌడీషీట్ తీసివేయాలన్నారు. కారణం లేకుండా ఎవరిపై కేసు నమోదు చేయవద్దన్నారు. అరాచకాలు సృష్టించే వారిని అణచివేయాలన్నారు. హత్యలు, తదితర కేసుల్లో దర్యాప్తులు చేసేటప్పుడు ఫీల్డ్‌కు వెళ్లి చూసి నిజాయితీగా చేయాలన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడేలా ఉండాలన్నారు. సమాజాన్ని ప్రేమించని వారు పోలీసులే కాదని, ఫిట్‌గా ఉండి బాధ్యతతో పని చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. త్వరలో సబ్‌డివిజన్‌ల పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేస్తానని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఈశ్వరరెడ్డి, హరినాథ్‌రెడ్డి, కొల్లి శ్రీనివాసులు, మురళీధర్, వినోద్‌కుమార్, ఏజి కృష్ణమూర్తి, సుప్రజ, రామచంద్ర, హుస్సేన్‌పీరా, సిఐలు తదితరులు పాల్గొన్నారు.
టిడిపి ప్రభుత్వంతోనే అభివృద్ధి
* ఎమ్మెల్యే బిసి
బనగానపల్లె, నవంబర్ 29:టిడిపి ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని జ్వాలాపురం గ్రామంలో మంగళవారం జనచైతన్యయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామంలో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి చేసే నాయకుడినే ఎన్నుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతులు, డ్వాక్రా రుణాలమాఫీ, చంద్రన్నబీమా, పేదలకు రేషన్ బియ్యం పంపిణీ తదితర పథకాల గురించి ప్రజలకు వివరించారు. జ్వాలాపురం సమీపంలోని కుక్కలగంటు చెరువుకు రస్తా, పూడికతీత పనులు తామే చేశామని, అలాగే దద్దనాల ప్రాజెక్టును నీటితో నింపుతామన్నారు. గ్రామంలో తాము రూ. లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి వుందని, ప్రజల శ్రేయస్సే టిడిపి లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కోడి నాగరాజు యాదవ్, పిఎల్‌ఎన్ కుమార్, ఎంపిటిసి ఉశేని, యాగంటిపల్లె దస్తగిరి పాల్గొన్నారు.
సాంకేతిక కారణాలతో
‘ముచ్చుమర్రి’ ట్రయల్ రన్ వాయిదా!
నందికొట్కూరు, నవంబర్ 29:పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామ సమీపంలో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి బుధవారం రెండు పంపుల ద్వారా కెసి కాలువకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక కారణాలతో ట్రయల్ రన్ వాయిదా పడింది. మోటార్ల అమరికలో సాంకేతిక కారణాలు నెలకొనడం వల్ల నిర్ణయించిన సమయంలోపు ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆటంకంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. మోటార్‌లో కంట్రోల్ ప్యానల్ సమస్య ఉండడంతో జాప్యం జరిగిందని త్వరలోనే సీనియర్ ఇంజినీర్లను రప్పించి మోటార్ మరమ్మతులు చేయిస్తామని అధికారులు తెలిపారు. కాగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద జరుగుతున్న పనులను మంగళవారం ఆర్‌డిఓ రఘుబాబు పరిశీలించి పనుల పురోగతిపై ప్రాజక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పిల్ల కాలువల ఏర్పాటులో
అధికారులు విఫలం!
* బీడుగా మారిన 190 ఎకరాలు..
అవుకు, నవంబర్ 29:అవుకు రిజర్వాయర్ నిర్మించినప్పటి నుంచి సు దూర ప్రాంతాలకు కూడా తాగు, సా గునీరు అందుతోంది. వేలాది ఎకరాలకు పంట పొలాల ద్వారా రిజర్వాయర్ నీరు చేరుతుంది. అయితే రిజర్వాయర్‌కు అత్యంత సమీపంలో వున్న పొలాలకు మాత్రం నీరు చేరడంలేదు. పంట కాలువలు లేక వందల ఎకరాలు బీడుగా మారాయి. ఓబుళాపురం, శింగనపల్లె మార్గ మధ్యలో వున్న సుమారు 120 ఎకరాల పంట పొలాలు అలాగే నిచ్చెనమెట్ల, అవుకు మార్గమధ్యలో వున్న 70 ఎకరాల పొలాలకు పంట కాలువలు లేక నీరు చేరడంలేదు. ఈ విషయం తెలిసిన చిన్ననీటి పారుదల శాఖ అధికారులు పంట కాలువల ఏర్పాటులో విఫలమయ్యారని రైతులు పేర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు, ప్రభుత్వం స్పం దించి ప్రధాన కాలువల ద్వారా చిన్న కాలువలు ఏర్పాటు చేసి బీడు భూములకు సాగునీరు అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
వర్క్ ఇన్‌స్పెక్టర్లను
విధుల్లోకి తీసుకోవాలి
* సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమన్న
కర్నూలు సిటీ, నవబంబర్ 29:హౌసింగ్ శాఖలో తొలగించిన వర్క్ ఇన్‌స్పెక్టర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపి హౌసింగ్ కార్పొరేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమన్న మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వారు 9 ఏళ్లుగా గృహనిర్మాణ శాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పని చేస్తున్నారని, అయితే చంద్రబాబు సిఎం అయిన తర్వాత నిర్ధాక్షిణ్యంగా తీసి వేశారన్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించగా కోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తూ తొలగించిన వర్క్ ఇన్‌స్పెక్టర్లను యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే సిఎం చంద్రబాబు కొత్తగా వర్క్ ఇన్‌స్పెక్టర్ల నియామాకం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛను సొమ్ము
లబ్ధిదారుల ఖాతాల్లో జమ
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు సిటీ, నవంబర్ 29:డిసెంబర్ నుంచి పింఛనుదారుల పింఛను మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖతాలోకి జమ చేస్తామని కలెక్టర్ విజయమోహన్ మంగళవారం తెలిపారు. జిల్లాలో ఎన్‌టిఆర్ భరోసా పింఛనుదారులు దాదాపు 3,07,140 మంది ఉన్నారని, వారికి డిసెంబర్ నెలకు గానూ రూ. 33.97కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అయితే గతంలో పింఛను సొమ్మును నేరుగా పింఛనుదారులకే నగదు రూపంలో చెల్లించేవారని, ప్రస్తుతం బ్యాంకుల వద్ద పింఛన్ల పంపిణీకి సరిపడా నగదు అందుబాటులో లేనందు వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నవంబర్ నెల మొత్తాన్ని డిసెంబర్ 1వ తేదీ పింఛనుదారుల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామన్నారు. గ్రామాల్లో కూడా పింఛనుదారులు పింఛను మొత్తాన్ని పొందటానికి మండల లేదా పంచాయతీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని తద్వారా ఆయా గ్రామాల్లోని బ్యాంక్‌ల్లో కానీ ఏటిఎంలో కానీ పొందవచ్చని వివరించారు. డెబిట్ కార్డు, ఏటిఎం, రూపే కార్డుల ద్వారా నగదు పొందవచ్చన్నారు. బ్యాంక్ ఖాతా లేని పింఛనుదారులు వెంటనే మీకు పింఛను పంపిణీ చేసే అధికారికి మీ ఆధార్‌నెంబర్, రెండు ఫొటోలతో పాటు పిఎంజెడివై దరఖాస్తు పత్రాన్ని అందజేస్తే మీ ఖాతాను త్వరితగతిన ప్రారంభిస్తారన్నారు.
జిల్లా అభివృద్ధిని
విస్మరించిన చంద్రబాబు
* సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్
ఆళ్లగడ్డ, నవంబర్ 29: సిఎం చంద్రబాబు జిల్లా అభివృద్ధిని విస్మరించారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్ విమర్శించారు. పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు జిల్లా అభివృద్ధికి 26 అంశాలపై హామీలు ఇచ్చారన్నారు. అయితే వాటి లో ఒక్క దానిని కూడా ఆయన నెరవేర్చలేదని ప్రజల్లో వుందన్నారు. 1952లో కర్నూలులో వున్న రాజధానిని హైదరాబాద్‌కు తరలించే సమయంలో జిల్లాను ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తామని చెప్పారని, కానీ జిల్లా అన్ని అంశాలలో పాలకుల నిర్లక్ష్యానికి గురైందన్నారు. చంద్రబాబు జిల్లాను నిర్లక్షయం చేస్తున్నారన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో వున్నాయన్నారు. పెండింగ్‌లో వున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ముఖ్యంగా తెలుగుగంగ పంట కాల్వలు, హంద్రీనీవా, గాలేరు నగరి, లిష్ట్ ఇరిగేషన్ పనులు అసంపూర్తిగా వున్నయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలన్నారు.