కర్నూల్

సాగునీరందక రబీలో లక్ష ఎకరాలు బీడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఫిబ్రవరి 1: సీమకే వరప్రసాదిని అయిన తుంగభద్ర డ్యాం నుంచి ప్రతి సంవత్సరం సగటును 175 టిఎంసిల నీరు సీమ ప్రాంతానికి ఉపయోగ పడకుండానే నిరుపయోగంగా శ్రీశైలానికి తరలిపోతున్నాయి. సీమ ప్రాంతంలో మాత్రం నీటి కటకటతో ఆయుకట్టు భూములు బీడు భూములుగా మారిపోయాయి. ఈసంవత్సరం తుంగభద్ర దిగువ కాలువ కింద కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌లో సాగవుతున్న లక్ష ఐదు వేల ఎకరాలకు నీరు సరఫరా కాక ఆయకట్టు భూములు బీడు భూములుగా మారాయి. అనంతపురం జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. లక్షల ఎకరాలు అనంతపురం జిల్లాల్లో కూడా నీరులేక బీడు పడిపోయాయి. తుంగభద్ర జలాలను నమ్ముకుని వ్యవసాయం సాగిస్తున్న సీమ ప్రజలు కళ్ళముందే భూములు బీడు పడడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో రబీ సీజన్‌కు నీరు లేని పరిస్థితి ఏర్పడడం ఇదే ప్రథమం కావడంతో రైతులు భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఎదురైతే భూములను అమ్ముకోవాల్సిదేనని ఆందోళన చెందుతున్నారు. ఈ సంవత్సరం తుంగభద్ర దిగువ కాలువకు 12.456 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటికీ మన వాటా కింద 1.69 టీఎంసీల నీరు మాత్రమే మిగిలినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే కర్నాటక అధికారులు మైనస్ ఇన్‌ఫ్లో పేరుతో, తుంగభద్ర డ్యాంలో బ్యాక్ వాటర్ పేరుతో, రాయ బసవ కేనాల్‌కు 11 నెలలు నీటిని సరఫరా చేసే లెక్కలను కోటా కింద చేర్చుకోక పోవడం వల్ల అలాగే బళ్ళారి, దరోజి, ట్యాంకులలో అక్రమంగా నింపిన మూడు టీఎంసీల నీటిని లెక్కలు చూపకుండా, కాలువకు సరఫరా అవుతున్న సమయంలో షెట్టర్లు దించి ఉదయం పూట లెక్కలు చూపుతున్న నీటి జల చౌర్యాన్ని లెక్కలకు చూపకుండా మనకు మన రాష్ట్ర నీటి వాటాకు గండి కొట్టి తమకు నీరు మిగిలినట్లు లెక్కలు చెబుతున్నారు. అందువల్లే మన రాష్ట్రా వాటా నీటికి గండి కొట్టారు. ఇది ప్రతి సంవత్సరం సాగుతున్న తంతే. అయితే డ్యాంకు పూర్తిస్థాయిలో నీరు చేరడం, వరద రావడం వల్ల సీమకు నీటి కష్టాలు ఉండేవి కావు. అయితే ఈ సంవత్సరం డ్యాం నిండకపోవడంతో సీమ రైతులకు కష్టాలు మొదలైనాయి. రక రకాల పేరుతో కర్నాటక అధికారులు లెక్కలు చూపి నీటిని గండికొట్టారు. ఇక కాలువలకు సరఫరా అవుతున్న నీటిలో కర్నాటక రైతులు జలచౌర్యానికి పాల్పడి గండి కొట్టారు. దీంతో మన నీటి కోటా అయిపోయిందని కర్నాటక అధికారులు లెక్కలు చూపించారు. మైనస్ ఇన్‌ఫ్లో అంగీకరించేది లేదని మన అధికారులు వ్యతిరేకించిన కర్నాటక అధికారులు పట్టించుకోలేదు. మన ఓట్లు వేసి ఎన్నుకున్న మన ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు నోరు కూడా విప్పలేదు. ఫలితంగానే ఈరోజు ఒక కర్నూలు జిల్లాలోనే రబీ సీజన్‌లో పంటలు పండాల్సిన లక్ష 5వేల ఎకరాల ఆయకట్టు బీడు పడిపోయింది. తాగునీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. తాగునీటికి సరఫరా చేసే నీటికి కూడా కర్నాటక రైతులు గండి కొట్టారు. అప్పుడైన ఏ నాయకుడు నోరు మొదలపలేదు. అందువల్ల సీమ రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయి. వాస్తవానికి 10 సంవత్సరాలు లెక్కలు తీసుకుంటే ప్రతి సంవత్సరం 175 టీఎంసీల తుంగభద్ర జలాలు నిరుపయోగంగా కృష్ణమ్మలో కలుస్తున్నాయి. ఆనీరు కోస్తాకు తరలిపోతున్నాయి. 175 టీఎంసీల నీరు ఆదోని డివిజన్, కర్నూలు డివిజన్, నంద్యాల డివిజన్ ప్రాంతాల నుంచి తరలిపోతున్న వాటిని వినియోగించుకునే పథకాలు నిర్మించాలని ఒక్క నాయకుడు కూడా ప్రభుత్వ దృష్టికి తెచ్చిన పాపానపోలేదు. వేదావతి, హంద్రీ నదీల నుంచి మరో 50 టీఎంసీల కృష్ణమ్మలో కలుస్తున్నాయి. ఈ నదులపైన ఎత్తిపోతల పథకాలు నిర్మించాలన్న డిమాండ్‌ను కూడా నేతలు ముందుకు తీసుకురాలేదు. గురురాఘవేంద్ర కెనాల్ పూర్తి చేయడానికి నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాలేని పరిస్థితి ఉంది. 175 టీఎంసీలు 300 కిలో మీటర్లు ప్రవహిస్తూ నిరుపయోగంగా ఈప్రాంతం నుండి తరలిపోతున్న నేతలు తుంగభద్ర నది పరివాహక ప్రాంతం నుంచి సమాంతర కాలువలను తీసి నీటిని వినియోగించుకుని ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ద్యాసేలేని నేతలు ఉండడం సీమ చేసుకున్న పాపం. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నాయకుల ఆలసత్వం మూలానే ఆరోజు ఒక్క తుంగభద్ర దిగువ కాలువ కిందనే లక్ష ఎకరాలు బీడు భూములుగా మారాయి. రైతులు మాత్రం బీడు భూములను చూసి రోదిస్తున్నారు. ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా నేతలకు అభివృద్ధిపై అస్సలు ద్యాసే లేదు. నిర్మాణం పనులలో వచ్చే పర్సెంటేజీలపైన, మట్కా, మద్యం లాంటి అక్రమ వ్యాపారులపైన, భూ కబ్జాలపైన ఉన్న దృష్టి ప్రాంతం అభివృద్ధిపైన నేతలకు లేదు. రైతులు కరువుతో అల్లాడుతున్నారు. తుంగభద్ర దిగువ కాలువలో సాగునీరు లేక భూములు బీడు పడ్డాయి. గ్రామాలకు గ్రామాలే తాగునీరులేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా నేతలకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. కర్నాటక జలచౌర్యాన్ని నేతలు ప్రశ్నించడం లేదు. ముఖ్యమంత్రి పట్టించుకోడు. అందువల్లే సీమ రైతుల కన్నీటి వ్యథ ప్రతి సంవత్సరం తెరమీదకు వస్తూనే ఉంది. ఈసంవత్సరం మళ్ళీ మితిమీరిపోయింది. ఏకంగా లక్ష ఎకరాలు రబీలో నీరు లేక బీడు పడ్డాయి. రైతులు కన్నీరు పెడుతున్నారు. రైతన్నల శాపం నేతలకు, ప్రభుత్వానికి తగలక మానదు.

ఇంకుడు గుంతలు తవ్వండి..
దారిద్య్రాన్ని తరమండి
* కలెక్టర్ విజయమోహన్
దేవనకొండ, ఫిబ్రవరి 1:రైతులు పలుగు, పార పట్టి తమ పొలాల్లో విరివిగా ఇంకుడు గుంతలు తవ్వుకుని వర్షం నీటిని భూమిలోకి ఇంకింప చేసుకుని దారిద్య్రాన్ని తరమాలని కలెక్టర్ కప్పట్రాళ్ళ గ్రామ ప్రజలకు తెలిపారు. సోమవారం రాత్రి ఎస్పీ రవికృష్ణతో కలిసి ఆయన కప్పట్రాళ్ళలో పల్లెనిద్ర చేశారు. అంతకు ముందు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన రైతుల నుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్థుతం భూమిలో బావులు, బోర్ల ద్వారా నీటిని పొలాలకు తోడడం వల్ల భూగర్భజలాలు బాగా ఆడుగంటాయని వాటిని పెంపొందించుకునేందుకు పొలాల్లో ఇంకుడు గుంతలు తవ్వుకుని అందులో వర్షం నీటిని నిలువ ఉంచుకుని ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అత్యంతంగా వర్షపాతం కురుస్తున్న మెట్ట ప్రాంత రైతుల స్థలాల్లో పంటలు పండించాలంటే వర్షం నీటిని భూమిలోకి ఇంకింప చేయడమే ప్రధాన మార్గమని అన్నారు. గ్రామాలలోనే ఫారంపాండ్స్, చెక్‌డ్యాం పనులు వేగవంతంగా లేవని ఈ పనులను వేగవంతం చేసి రైతులకు, కూలీలకు ఉపాధి కల్పించి వలసలు నివారించాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ పథకం పనులు గ్రామాలలో సక్రమంగా జరగడం లేదని అన్నారు. ఉపాధి హామీ పథకం సిబ్బంది వారు పని చేస్తున్న గ్రామంలో రోజుకు 14 గంటలు ఉండాలని అన్నారు. సరిగా పని చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఉపాధి హామీ అధికారులు గ్రామాల్లోని ప్రజలతో కలిసి ఉండాలని అన్నారు. అన్ని సమస్యలకు పరిష్కారం నీళ్లు అని అన్నారు. చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు ఆదర్శంగా ఉన్నాయని అధికంగా ఫారంపాండ్స్ నిర్మించుకున్న పొలాల్లో భూగర్భజలాలు పెరిగాయని అక్కడ అధిక విస్తీర్ణంలో రైతులు పంటలు కూడా పండించుకున్నారని కలెక్టర్ తెలిపారు. వంకలు, వాగులలో నీరు ఎంత మాత్రం వృథా చేయరాదని వాటిని భూమిలోకి ఇంకింప చేసేందుకు ప్రతి ఒక్క రైతు బాధ్యతగా పని చేయాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతోగ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్, ఎస్పీలు కప్పట్రాళ్ళలో హైస్కూల్‌లో పల్లేనిద్ర చేశారు. ఈకార్యక్రమంలో జేడిఏ ఉమామహేశ్వరమ్మ, డ్వామా పిడి పుల్లారెడ్డి, డిపిఓ శోభాస్వరూపరాణి, జిల్లా వయోజన విద్యాశాఖ అధికారిణి జయప్రద, డిసిఆర్‌ఓ విజయలక్ష్మీ, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహశీల్దార్ తిరుమలవాణి, ఎంపిడిఓ ఉమామహేశ్వరమ్మ, ఏఓ మధుసూదకర్, పత్తికొండ సిఐ గంటా సుబ్బరావు, ఎంపిపి రామచంద్రనాయుడు, ఆస్పరి జడ్పీటిసి బొజ్జమ్మ, ఏపిఓ కృష్ణమోహన్, టిడిపి నాయకులు ఉచ్చిరప్ప, మలకన్న, ఎంపటిసి హైమావతి, గ్రామ, ప్రజలు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూలుకు ‘తుని’ వీడియోలు
* నంద్యాల నుంచి భారీగా వెళ్లిన కాపులు
* నిందితులను గుర్తించే పనిలో పోలీసులు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఫిబ్రవరి 1:తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో కాపు గర్జన సభ అనంతరం తలెత్తిన సంఘటనలకు సంబంధించిన వీడియోలను పోలీసు ఉన్నతాధికారులు కర్నూలు పోలీసులకు పంపారు. తుని రైల్వే స్టేషన్‌లో రైలును తగులబెట్టిన సంఘటనతో పాటు పోలీసు స్టేషన్లపై దాడి అక్కడి వాహనాలకు నిప్పు పెట్టడం, అవి పోలీస్‌స్టేషన్లకు పాకి రికార్డులు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. జాతీయ రహదారిపై రాళ్లు రువ్విన దృశ్యాలు వీడియోల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా సంఘటనల్లో పాల్గొన్న వారిలో జిల్లాకు చెందిన వారు ఎవరైనా ఉన్నారా అనే విషయంపై పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. కాగా తుని సభకు నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి కాపులు పెద్దఎత్తున తరలివెళ్లినట్లు పోలీసు నిఘా వర్గాలు ఉన్నతాధికారులకు అంతకు ముందే సమాచారం అందించారు. వెళ్లిన వారు ఏ నాయకుడి ఆధ్వర్యంలో వెళ్లారో కూడా వారు నివేదికలో పంపారు. కర్నూలు నగరం నుంచి కూడా సుమారు 10 ప్రత్యేక వాహనాల్లో తుని సభకు వెళ్లినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. కాపు గర్జన సభకు జనాన్ని తరలించిన నేతల వివరాలను పోలీసులు సేకరించారు. ఇక ఉన్నతాధికారుల నుంచి వచ్చిన వీడియోలను పరిశీలించిన అనంతరం ఆయా నాయకులను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలుస్తోంది. మరో వైపు కాపు సభకు వెళ్లిన వారు ఆ కులస్థులేనా ఇతరులు, నేర చరిత్ర ఉన్న వారు ఎవరైనా వెళ్లారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు. వెళ్లిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఆ వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపుతారని స్పష్టమవుతోంది. తుని ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సభకు వెళ్లిన తమ కుటుంబీకులు ఏ పరిస్థితుల్లో ఉన్నారోనన్న భయం ఆయా కాపు కుటుంబాల్లో కనిపించింది. సెల్‌ఫోన్ల ద్వారా క్షేమ సమాచారం తెలుసుకున్న వారు ఊపిరి పీల్చుకోగా ఎలాంటి సమాచారం లేని కుటుంబాలు తిరిగి వచ్చేంత వరకూ ఏం జరిగిందోనన్న ఆవేదనతో గడిపినట్లు తెలుస్తోంది. కాగా జాతీయ రహదారిపై రాస్తారోకో కారణంగా వెంటనే తిరిగి రావాలనుకున్నా ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల అనుకున్న సమయానికి రాలేకపోయామని కాపు కార్యకర్తలు కుటుంబీకులకు తెలిపినట్లు వెల్లడవుతోంది. తాము విధ్వంస ఘటనల్లో పాల్గొనలేదని బస్సులోనే ఉండి, ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిన వెంటనే బయల్దేరి వచ్చామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తుని ఘటనలకు సంబంధించిన వీడియోలను పరిశీలిస్తున్న పోలీసు అధికారులు విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పేర్కొంటున్నారు.
అహోబిలంలో వైభవంగా
స్వాతి వేడుకలు
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 1:నల్లమల అరణ్యంలో వెలసిన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి ని వేడుకలు ఈఓ తిమ్మనాయుడు ఆధ్వర్యంలో సోమవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నల్లమల అరణ్యంలో వెలసిన నవనారసింహులను ప్రత్యేకంగా అలంకరించి అర్చకు లు పూజలు చేశారు. ఎగువన స్వయంభువుగా వెలసిన నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లను, దిగువన వెలసిన శ్రీ ప్రహ్లాదవరదుడు, అమృతవల్లి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తి సుదర్శనమూర్తి, పానా నరసింహస్వామిలను ప్రత్యేకంగా అలంకరించి కొలువు మండపంలో ఉంచి ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాల న్, అర్చక బృందంతో సుదర్శన హో మం నిర్వహించారు. అనంతరం ప్రధానార్చకులు మాట్లాడుతూ లోకం సుభిక్షంగా వుండాలని వర్షాలు సంమృద్ధిగా కురిసి పాడిపంటలతో కళకళలాడాలని కోరుతూ హోమం నిర్వహించామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.
అహోబిలేసుని సన్నిధిలో తమిళనాడు మంత్రి
ప్రముఖ పుణ్య క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని తమిళనాడు పర్యాటకశాఖా మంత్రి వెంకటాచలపతి తమ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎగువ అహోబిలంలో స్వయంభువుగా వెలసిన నరసింహాస్వామిని, చెంచులక్ష్మి అమ్మవారిని, దిగువన వెలసిన శ్రీ ప్రహ్లాద వరదస్వామి, అమృతవల్లి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. అలాగే దిగువలో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జరుగుతున్న స్వాతి సుదర్శన హోమంలో పాల్గొన్నారు.
గాజులదినె్న ప్రాజెక్టు నుంచి
కెసికి నీటి మళ్లింపునకు రంగం సిద్ధం!
* వ్యతిరేకిస్తున్న హంద్రీనదీ పరివాహక ప్రజలు..
* కోడుమూరు, డోన్, పత్తికొండ ప్రజల దాహం తీరేదెలా..
కోడుమూరు, ఫిబ్రవరి 1:గాజులదినె్న ప్రాజెక్టు నుంచి తుంగభద్ర దిగువ కాలువ ద్వారా కెసి కెనాల్‌కు నీరు మళ్లించాలని కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు తుంగభద్ర దిగువ కాలువ సబ్ డివిజన్ అధికారులు గాజులదినె్న ప్రాజెక్టు నుంచి నీటి మళ్లింపునకు సంబంధించిన పనులు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. గాజులదినె్న ప్రాజెక్టు నుంచి దిగువ కాలువ ద్వారా కెసి కెనాల్‌కు నీరు చేరేందుకు కాలువలకు తాత్కాలికంగా పనులు చేపట్టేందుకు నీటి పారుదల శాఖ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పనులకు కలెక్టర్ రూ. 50 లక్షలు విడుదల చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది వర్షాభావంతో గాజులదినె్న ప్రాజెక్టు కింద ఉన్న ఆయకుట్టు భూములకు సాగు నీరు ఇవ్వలేకపోయినా కనీసం హంద్రీ నదీ తీర ప్రాంతాల వాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు నీటి పారుదల శాఖ అధికారులను కోరిన విషయం విదితమే. అయితే ఇక్కడి ప్రజల గొంతు తడపాల్సిన నీటిని కెసి కాలువలకు మళ్లించేందుకు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
ఎడారిగా మారనున్న హంద్రీ నదీ తీరప్రాంతాలు
గాజులదినె్న ప్రాజెక్టు నుంచి కెసి కాలువలకు నీటి మళ్లింపు జరిగితే హంద్రీ నదీ తీరప్రాంతాలు ఎడారిగా మారునున్నాయి. ఇప్పటికే హంద్రీ నదీ తీర ప్రాంతాల వాసులు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గాజులదినె్న ప్రాజెక్టు నుంచి పత్తికొండ, క్రిష్ణగిరి, డోన్ ప్రాంతా ల ప్రజల దాహార్తి కోసం అధికారులు నీటిని మళ్లిస్తున్నారు. ఇది గమనించకుండా ఇక్కడి నీటిని కెసికి మళ్లిస్తే కోడుమూరు, డోన్, పత్తికొండ తాలూకాల ప్రజల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకమే. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల హంద్రీ నదిలో నీటి వనరులు పూర్తిగా ఇంకిపోవడంతో ఆయా గ్రామాల మంచి నీటి పథకాలు మొరాయిస్తున్నాయి. ప్రస్తుతం గాజులదినె్న ప్రాజెక్టులో 0.98 టిఎంసిల నీటి సామర్థ్యం ఉంది. ఈ కాస్తంత నీటిని దాదాపు వంద కిలో మీటర్ల దూరం ఉన్న కెసి కాలువలకు నీటి మళ్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని రైతులు, ప్రజలు మండిపడుతున్నారు.
కోడుమూరు ప్రజల దాహం తీరేదెలా..
కోడుమూరు ప్రజలకు గాజులదినె్న ప్రాజెక్టే జీవనాధారం. ఇక్కడి ప్రజలకు నీటి సమస్య తలెత్తిన సందర్భంలో వెంట నే గాజులదినె్న ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించేవారు. అయి తే నేడు గాజులదినె్న ప్రాజెక్టులో ఉన్న కాస్తంత నీటిని కూడా అధికారులు కెసి కాలువలకు మళ్లిం చి డ్యాంలో నీరు లేకుండా చేసేందుకు చర్యలకు పూనుకోవడం గమనార్హం. ఇదే జరిగితే కోడుమూరు ప్రజలు తాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు తప్పవు.
అర్హులందరికీ
సంక్షేమ పథకాలు అందాలి
* అధికారులకు ఎమ్మెల్యే బుగ్గన ఆదేశం
బేతంచెర్ల, ఫిబ్రవరి 1:అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని ఎమ్మె ల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అపహాస్యం చేసిందని విమర్శించారు. పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ బొద్దుల రోజమ్మ అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రా మాల ప్రజాప్రతినిధులు, నాయకులు వారి వారి పరిధిలో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బుగ్గన మాట్లాడుతూ సిమెంట్‌నగర్‌లో లాండ్రి కొట్టాలు వాసులకు పట్టాలు ఇవ్వాలని తహశీల్దార్ అంజనాదేవికి సూచించా రు. పింఛన్లు, పక్కాగృహాల మంజూ రు విషయంలో ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి జన్మకమిటీ ఆమోదిస్తున్నారని అపోహపడాల్సిన అవసరంలేదని, జన్మభూమి కమిటీ ఆమో దం తెలపకపోయినా అర్హులకు అధికారులే వాటిని మంజూరు చెస్తారని కలెక్టర్ చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలకు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం శ్రీనగర్ కాలనీలో నూతనంగా చేపడుతున్న మురికి కాలువల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపిపి కిట్టమ్మ, తహశీల్దార్ అంజనాదేవి, పంచాయతీరాజ్ ఏఇ మహేష్, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఇ ముక్తార్‌బాషా, ఇఓఆర్‌డి మహమ్మద్ దౌలా, విద్యుత్ ఏఇలు నాగరాజు, గర్జప్ప, ఎంఇఓ ఈరన్న, ఇఓ నాగేంద్ర, మండల ఉపాధ్యక్షుడు మునీశ్వరరెడ్డి, పాల్గొన్నారు.
ప్రజల సమస్యలు గుర్తించి
పరిష్కరించండి
* నోడల్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు..
కర్నూలు, ఫిబ్రవరి 1:నోడల్ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ ఆదేశించారు. కష్టపడి పని చేసి జిల్లా అభివృద్ధితో భాగస్వాములు కావాలని సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో సోమవారం కలెక్టర్ తాగునీటి సమస్య, ఫారంపాండ్స్, పశుగ్రాసం పంపిణీపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోడల్ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి గ్రామాలను సందర్శించి తాగునీటి ఎద్దడి నివారణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. అందులో భాగంగా బోరుబావులను డీపెనింగ్, ప్లషింగ్ చేయడంతో పాటు భూగర్భ జలాలు అధికంగా ఉన్నచోట బోర్ల తవ్వకానికి పాయింట్లు గుర్తించాలన్నారు. అవసరమైతే తాగునీటిని ఎక్కడి నుంచైనా సరఫరా చేసుకునేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఇకపోతే కమాండ్ ఏరియాలో మండలానికి 1000 చొప్పున నాన్ కమాండ్ ఏరియాలో మండలానికి 2 నుంచి 3 వేల ఫారంపాండ్లు తవ్వకానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే ఫారంపాండ్ల ప్రయోజనాల గురించి రైతులకు వివరించి వాటి తవ్వకానికి ప్రోత్సహించాలని సూచించారు. గ్రామాల్లో పశుగ్రాసం కొతరను అధిగమించేందుకు కిలో రూ. 2 కే పాతరగడ్డిని రైతుకు పంపిణీ చేస్తున్నామని అలాంటి గ్రామాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. దీనికి తోడు తేమ ఉన్న ప్రాంతాల్లో పశుగ్రాసం విత్తనాలు కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. సమావేశంలో జెసి-2 రామస్వామి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, జడ్‌పి సిఇఓ ఈశ్వర్, డ్వామా పిడి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కెఇని విమర్శించే అర్హత ఏరాసుకు లేదు
* జడ్‌పి చైర్మన్ రాజశేఖర్
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 1:మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డికి డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తిని విమర్శించే అర్హత లేదని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ వెల్లడించారు. నగరంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్ అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జి ఏరాసు ఏనాడు పార్టీ కార్యకర్తల గురించి పట్టించుకోకుండా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో దేవస్థానాల పాలకవర్గంలో తన వారికే పదవులు ఇవ్వాలని కోరడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యంగా ఏరాసు ఏకపక్ష్యంగా వ్యవరిస్తూ ఒక వర్గం వారి వైపే మొగ్గుచూపుతూ మిగతా వారిని పట్టించుకోవటం లేదని విమర్శించారు. కాపు వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత కల్పిస్తూ మిగతా కులాల వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కెడిసిసి బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ కెఇ సోదరుల సహకారంతో చాలా మందికి నామినేటెడ్ పదవులు వచ్చాయని, వారు జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతానికి ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ కనీసం జన్మభూమి కమిటీ సభ్యులను ఎన్నుకోకపోవడమే అతడి పనితీరుకు నిదర్శనమన్నారు. అలాంటి వ్యక్తి కెఇ సోదరులను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ధనారెడ్డి మాట్లాడుతూ ఏరాసు మొదటి నుంచి కార్యక్తల గురించి పట్చికోవటం లేదని, దీంతో పాణ్యం నియోజకవర్గంలో టిడిపి మూడవ స్థానంలో ఉందని గుర్తు చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉన్న కల్లూరు మండలంలో దాదాపు 18 వార్డులు ఉన్నాయని అన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు దేవేంద్రరెడ్డి, బాబురాజ్, మహేష్‌గౌడ్, రాంబాబు, హనుమంతరాయచౌదరి, తదితరులు పాల్గొన్నారు.
జగన్‌పై విమర్శలు తగదు
* వైకాపా ఎమ్మెల్యేల మండిపాటు
కర్నూలు సిటీ, పిబ్రవరి 1:కాపునాడు గర్జన సభలో చోటుచేసుకున్న సంఘటనకు వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డిని బాధ్యుడిని చేస్తూ టిడిపి నాయకులు విమర్శించడం తగదని వైకాపా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నగరంలోని వైకాపా కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఎస్వీ.మోహన్‌రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరుచరిత మాట్లాడుతూ కాపు గర్జన సభలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో కాపునాడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. అలాగే కాపులను బిసి జాబితాలో చేరుస్తున్నట్లు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో జీఓ నెం.30ని తెరపైకి తెచ్చారని, అయితే అప్పటి నుంచి ఇంతవరకూ వాటి గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు లేవనెత్తారని మండిపడ్డారు. ఎస్వీ.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కాపు గర్జన సభకు దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన వారు హాజరయ్యారని తెలిపారు. అయితే తుని సంఘటనకు జగన్‌ను బాధ్యిడిగా పేర్కొనడం సిగ్గుచేటన్నారు. పాకిస్థాన్, అమెరికాలపై దాడులు చేస్తే అవి కూడా జగనే చేయించాడని విమర్శిస్తారా అని ఎద్దేవా చేశారు. కాపు గర్జన సభకు రాష్ట్ర ప్రభుత్వం అవాంతరాలు కల్పించిందని దానికి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాల్సింది పోయి జగన్‌పై నిందలు వేయటం ఏంటని ప్రశ్నించారు. ఐజయ్య మాట్లాడుతూ తుని సంఘటనకు జగన్‌ను బాధ్యుడిని చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో వైకాపా నగర కన్వీనర్ పిజి.నరసింహులుయాదవ్, సిహెచ్.మద్దయ్య, సత్యంయాదవ్, గోపీనాథ్‌యాదవ్, నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.