కర్నూల్

జలాశయాలు నిండుగా.. భూములు బీడుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, అక్టోబర్ 14: తరతరరాల పాలకుల నిర్లక్ష్యం జిల్లాలో పడమటి ప్రాంతాలైన ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాలకు తీరని శాపంగా మారింది. కళ్లముందే హగరీ, హంద్రీ, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం డ్యాంకు నీరు చేరుతున్నాయే తప్పా పడమటి ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. అందువల్ల ఆదోని డివిజన్ ప్రాంతం సాగు, తాగునీరు కోసం ఏళ్ల నాటి నుండి పాలకుల నిర్లక్ష్యానికి బలైపోయింది. ఆదోని డివిజన్‌లోని హాలహర్వి, హొళగుంద, మండలాల మీదుగా కర్నాకటలోని రారావికి చేరుకొని అక్కడ దగ్గరలో ఉన్న కూడదరహాల్ గ్రామం వద్ద తుంగభద్రలో కలుస్తుంది. అందువల్ల హగరీ నది నీటిని వినియోగంలోకి తీసుకురావాలని, ఇక్కడ వేదావతి నీటి ప్రాజెక్టు నిర్మించాలని స్వయంగా తెలుగుదేశం పార్టీ ఆలూరు ఇన్‌ఛార్జి వీరభద్రగౌడ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాకుడు పదేపదే వేదావతి నిర్మాణం చేస్తామని లెక్కలేనన్ని సభల్లో హామీ ఇచ్చారు. కాని బాబుపాలన మూడు సంవత్సరాలు దాటినా వేదావతి ప్రాజెక్టు నిర్మాణం సర్వే కూడా సాగలేదు. హంద్రీనది మద్దికెర ప్రాంతంలోని కొండల్లో పుట్టి మద్దికెర, పత్తికొండ, గోనెగండ్ల మండలాల మీదుగా ప్రవహించి కర్నూలు వద్ద తుంగభద్రలో కలుస్తుంది. హంద్రీ నదిపై గోనెగండ్ల వద్ద ప్రాజెక్టు నిర్మించారు. కాని ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పడమటి ప్రాంతాలకు ఎలాంటి ఫలితం లేదు. కర్నూలు, డోన్ ప్రాంతాలకు తాగునీటికి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. ఈప్రాజెక్టు కింద స్థిరీకరించిన 20 వేల ఎకరాల ఆయకట్టు నీరులేక బీడు పడింది. ఈవిధంగా పడమటి ప్రాంతాల్లో పుట్టిన హంద్రీ ఈ ప్రాంతానికి ఒక్క చుక్క నీరు కూడా అందించని పరిస్థితి ఏర్పడింది. తుంగభద్ర నది ఆదోని డివిజన్‌లో మేళిగనూరు, కుంబళనూరు గ్రామాల నుండి ప్రారంభమై కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం, మండలాల గుండా ప్రవహించి సుంకేసుల ప్రాజెక్టుకు నీరు చేరి అక్కడ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు తరలి వెళ్తుంది. ప్రతి సంవత్సరం తుంగభద్ర నది నుంచి 100 టిఎంసిల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరడం జరుగుతుంది. కర్నాటకలో ఉన్న తుంగభద్ర డ్యాంలో నుంచి పడమటి ప్రాంతానికి ఖరీఫ్, రబీ కలిపి లక్ష 4వేల ఎకరాలకు నీరు అందించాలి. కాని ఇప్పటికీ 60వేల ఎకరాలకు నీరులేక పొలాలు బీడు పడ్డాయి. గత మూడు సంవత్సరాల నుంచి తుంగభద్ర డ్యాం ద్వారా రెండవపంటకు నీరు సరఫరా కావడం లేదు. అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోయింది. తుంగభద్ర నదిపైన ఆర్డీఎస్ ఆనకట్ట కట్టారు. ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతానికి నీటిని తరలిస్తున్నారు. ఆదోని డివిజన్‌కు ఉపయోగపడే కుడి కాలువ నిర్మాణం జరగలేదు. ఈ చర్య పడమటి ప్రాంతానికి 60 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయం. కృష్ణానీటి పంపాలకు వేసిన బ్రిజేష్‌కుమార్ కమిటీ ఆర్డీఎస్ కెనాల్ నుంచి ఐదు టిఎంసిల నీటిని వినియోగించుకోవచ్చునని ఆమోదం తెలిపింది. అయితే ఇంతవరకు సర్వే కూడా సాగలేదు. కొంతమంది నాయకులు ఈ 5 టిఎంసిలను కూడా కర్నూలు వైపు మళ్లించడానికి ప్రయత్నాలు చేయడంవల్ల పడమటి ప్రాంతం మరి నష్టపోతాయి. హంద్రీ సుజలస్రవంతి నీటి పథకాన్ని 30 సంవత్సరాల క్రితం ఆదోని డివిజన్‌లో ఉన్న నాగలదినె్నగ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మించి అనంతపురం, కడప, చిత్తూరుతోపాటు ఆదోని డివిజన్ ప్రాంతానికి నీరు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆదోనిలో ఉన్న చిన్న నీటి పారుదల కార్యాలయంలో హంద్రీనీవా సుజల స్రవంతి కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. కాని కోస్తాంధ్ర, కర్నూలు జిల్లాలోని కొందరి నాయకుల వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకోని హంద్రీ సుజల స్రవంతికి నీరు ఇచ్చే విధంగా మార్పు చేశారు. అప్పుడు కూడా ఆదోని డివిజన్ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎంఎల్, బిజెపి పార్టీలు ఉన్నా ఎవ్వరు కూడా నోరు మొదపలేదు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి అధిక నీరు వాడుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఏకంగా కృష్ణబోర్డుకు ఫిర్యాదు చేశారు. మొట్టమొదట నాగలదినె్న వద్ద ఈప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే కరవు ప్రాంతం అయిన ఆదోని డివిజన్‌కు న్యాయం జరగడమే కాకుండా గుంతకల్లు మీదుగా అనంతపురం, కడప, చిత్తూరుకు ఎలాంటి ఆటకం లేకుండా నీరు చేరి ఉండేది. ఇప్పుడు హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం ఉన్న అనంతపురం జిల్లాకు నీటిని తీసుకుపోతున్నారే తప్పా ఈప్రాంతానికి ఎలాంటి ఉపయోగం లేదు. హంద్రీ, హగరీ, తుంగభద్ర నదుల నుంచి ఆదోని డివిజన్ మీదుగానే ఏటా 150 టిఎంసి నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నాయి. కాని ఆదోని డివిజన్‌లో నదులు ఉన్న ప్రజలకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇక్కడి రైతులు కరవు కోరల్లో చిక్కుకున్నారు. ఇప్పటికీ పాలకులు కళ్లు తెరవలేదు. సుంకేసుల ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల దూరంలోనే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి కర్నూలు నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఆదోని డివిజన్‌లో కౌతాళం, మంత్రాలయం, నాగలదినె్న ప్రాంతాల్లో ప్రాజెక్టు నిర్మిస్తే అందరికీ మేలు జరుగుతుంది. గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం 10 సంవత్సరాలైన పూర్తి కాలేదు. ఆర్డీఎస్ కెనాల్ వద్ద వినియోగించుకునే 5 టిఎంసిల నీటిని సాతనూరు, కోసిగి మీదుగా ఆదోని, ఆలూరు ప్రాంతాలకు కాలువలు తవ్వి నీటిని వినియోగించుకుంటే ఆదోని డివిజన్‌కు మేలు జరుగుతుంది. నేతలు తాము చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకునే అవకాశముంటుందని, ఇప్పటికైనా ఆదోని డివిజన్‌కు తుంగభద్ర, హంద్రీ, హగరీ నీటిని వినియోగించుకోవడానికి ప్రాజెక్టు నిర్మించాలి. అప్పుడే పడమటి ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి. సిఎం ఇచ్చిన హామీ మేరకు వేదావతిపై వెంటనే ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. పడమటి ప్రాంతం నుంచి వెళ్తున్న 150 టిఎంసిల నీటిపై ఈ ప్రాంతం ప్రజలకు హక్కు ఉంది. ఆ హక్కును వినియోగించుకోవటానికి కాంగ్రెస్, వైకాపా, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, బిజెపి నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోని రావాల్సిన బాధ్యత ఉంది.

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
* 7 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం, అక్టోబర్ 14: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి 1,94,000 క్యూసెక్కుల నీరు శ్రీశైల జలాశయానికి చేరుతోంది. దీంతో శనివారం శ్రీశైలం జలాశయం మరో మూడు గేట్లు ఎత్తారు. దీంతో మొత్తం ఏడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1,94,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగుల కాగా ప్రస్తుతం 884.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215టి ఎంసిలు కాగా, ప్రస్తుతం 211.4759 టిఎంసిలుగా ఉంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 1,94,031 క్యూసెక్కుల నీరు శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి 2,82,125 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 1,61,078 క్యూసెక్కులు, రోజా ప్రాజెక్టు నుంచి 31,353 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 2వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. మొదటి పవర్ ఆఫ్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,056 క్యూసెక్కులు, రెండో పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 42,378 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 13 క్యూసెక్కుల నీరు, పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా 11వేల క్యూసెక్కులు, కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ ద్వారా 2,400 క్యూసెక్కుల నీరు బ్యాక్ వాటర్ నుంచి తరలిస్తున్నారు. జలాశయం గేట్లు ఎత్తడంతో చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
వైకాపా ఫిర్యాదుతో ఉపాధి నిధుల్లో జాప్యం
ఆళ్లగడ్డ, అక్టోబర్ 14: రాష్ట్భ్రావృద్ధి వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని, ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఫిర్యాదు చేయడంతో ఉపాది నిధులు విడుదల్లో జాప్యం అయ్యాయని పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. మండలంలోని కోటకందుకూరులో మోడల్ పాఠశాల, కస్తూరీభా గాంధీ పాఠశాలల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రహరీ నిర్మాణాలను, వంటశాలను, గ్రామంలో సిసి రోడ్లను ఆమె ప్రారంభించారు. మోడల్ పాఠశాలలో సెక్యూరిటీ, రోడ్డు అవసరమని మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే కస్తూరిబా పాఠశాలలో కూడా రోడ్డు కావాలని అడిగారు. అందుకు మంత్రి స్పందించి త్వరలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం పంచాయతీ భవనంలో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సిఎం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దాన్ని అడ్డుకునేందుకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఉపాధి నిధులు దుర్వినియోగం అయ్యాయని వైకాపా ఎంపిలు కేంద్రానికి ఫిర్యాదు చేశారని, కేంద్రం విచారణ జరిపి నిధులు విడుదల చేస్తోందన్నారు. ప్రతిఇంటి ముందు మరుగుదొడ్డి లక్ష్యంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల ప్రతి ఇంటికి మురుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. ఎవరైనా అలా చేయని పక్షంలో మార్చిలోగా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకొనిరావాలన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ఎవరు అడ్డుకుంటున్నారు. ఎవరు చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇటీవలి కురిసిన వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని, రైతులు తమ దృష్టికి తెచ్చారన్నారు. ఇంటింటికీకి తెలుగుదేశంలో భాగంగా అనేక మంది పేదలు రేషన్‌కార్డులు, ఇంటి స్థలాలు, పెన్షన్లు, రోడ్లు అడుగుతున్నారన్నారు. నియోజకవర్గానికి 2 వేల పెన్షన్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారన్నారు. డిశెంబర్ నెలాఖరు నాటికి పెన్సన్లు పంపిణీకి ప్రయత్నం చేస్తామన్నారు. అంతకుముందు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించి ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ బివి రామిరెడ్డి, గ్రామ సర్పంచ్ రాంమ్మోహన్‌రెడ్డి, బాచ్చాపురం శేఖర్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, తహశీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

నిండిన దద్దనాల ప్రాజెక్టు
బనగానపల్లె, అక్టోబర్ 14: మండలంలోని జిల్లాలో పేరుగాంచిన దద్దనాల ప్రాజెక్టు భారీవర్షాలకు పూర్తిగా నిండింది. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు నీరుచేరక ఆయకట్టు రైతులకు నీరు అందించలేకపోయింది. గత వారం రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు ఎగువ నుండి భారీ వరదనీరు వచ్చిచేరడంతో వారం రోజుల వ్యవధిలోనే నిండి రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టు కింద యాగంటిపల్లె, మీరాపురం, మాదాసుపల్లె, పాతపాడు, జ్వాలాపురం తదితర గ్రామాలకు చెందిన 1,541 ఎకరాల సాగు భూమి వుంది. ఇప్పుడు ఆ రైతులు ఈసారైనా నీరు అందుతుందని ఆనందపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు నిండుగా నీరుచేరితే బనగానపల్లె సహా 10, 12 గ్రామాలకు భూగర్బ జలాలు పెరగడం, వేసవిలో కూడా నీటి ఎద్దడి పరిస్థితులు రాకుండా వుంటాయి. జుర్రేరు వాగుకు వరదనీరు చేరుతుండడంతో వాగు వారం రోజుల నుండి నిరంతరాయంగా పారుతోంది. బనగానపల్లె పట్టణం మధ్యగా వెళుతున్న జుర్రేరువాగు కళతో ప్రజలను కనువిందు చేస్తుంది. ఎమ్మెల్యే బిసి జనార్థనరెడ్డి జుర్రేరువాగులో చెక్‌డ్యాంలు ఏర్పాటు చేయడంతో, వాగులో చెత్తాచెదారాన్ని తొలగింప చేయడంతో ఈ వాగు చూపరులకు ఆకర్షిస్తుంది. దద్దనాలా ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల అంచువరకు నిండుగా వరదనీరు వచ్చి చేరింది. మరో వర్షం పడిన, వరదనీరు మరింతగా వచ్చినా గేట్లు ఎత్తవలసి వస్తుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేసుకుని అప్రమత్తంగా వున్నారు. బనగానపల్లె మండలంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ నెల గత ఆది, సోమ, బుధవారాల్లో సుమారు 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో మండలంలోని వాగులు, వంకలు ఏకమయ్యాయి. మండలంలోని అన్ని చెరువులు నిండుకుండలా వున్నాయి. పలుకూరు నాపరాయి గనుల్లో నీరు సంపూర్తిగా నిలిచి గనుల్లో పనులు నిలిచిపోయాయి.

నేటి నుండి పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
* ఎస్పీ గోపీనాథ్‌జెట్టి
కర్నూలు, అక్టోబర్ 14: ఈ నెల 15వ తేదీ నుండి 21 వరకు నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు సిద్ధం కావాలని ఎస్పీ గోపినాథ్‌జెట్టి తెలిపారు. జిల్లాలోని అన్ని సబ్‌డివిజన్లలో పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలను నిర్వహించాలన్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేయించాలన్నారు. వ్యాసరచన, పెయింటింగ్, కార్జున్ల వంటి పోటీలు నిర్వహించాలన్నారు. పోలీసు ఆయుధాల విడిభాగాల సమాచారం గురించి స్కూల్ విద్యార్థులకు, పోలీసు కుటుంబాలకు, ప్రజలకు తెలియజేయాలన్నారు. పోలీసుస్టేషన్ల పరిధుల్లో ఉన్న పోలీసు కుటుంబాల సమస్యలను తెలుసుకోవాలన్నారు. సబ్‌డివిజన్లు సర్కిళ్లు, పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో అమరవీరుల వారోత్సవాల బ్యానర్లు ఏర్పాటు చేయించాలన్నారు. ర్యాలీలు నిర్వహించి మిడియాకి, ప్రజలకు తెలియజేయాలన్నారు.
మారుమూల గ్రామాలకూ తపాలా సేవలు
కర్నూలు, అక్టోబర్ 13: ప్రపంచలోని అన్ని దేశాల్లో తపాలాశాఖ సేవలను ప్రైవేటుపరం చేసినా మన దేశంలో ఆశాఖ కొనసాగుతుందంటే ఉద్యోగులు, సిబ్బంది వల్లేనని రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ అన్నారు. నగరంలోని శనివారం జాతీయ తపాలా వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగిదింది. ఈ సందర్భంగా దేశంలోని మారు మూల గ్రామాలకు సైతం కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రారంభించి, ఇప్పటికి కొనసాగిస్తున్నా ఏకైకశాఖ తపాలాశాఖ అన్నారు. తపాలాశాఖ సేవలను తాము ప్రారంభం నుండి వినియోగించుకున్నామని, ఆశాఖ అందించిన టెలిగ్రామ్, టెలిప్రింటర్ తదితర సేవలను ఆయన గుర్తు చేశారు. గతంలో ఎక్కడ నుండి ఎక్కడికి సమాచారం చేర వేయాలన్నా తపాలాశాఖ ఒక్కటే మార్గమన్నారు. తపాలాశాఖలో పని చేసే ప్రతి ఒక్కరూ మార్కెటింగ్ మ్యాన్‌గా పని చేస్తేనే ప్రస్తుతమున్న పోటీని తట్టుకుని మరింత కాలం మనుగడ సాగిస్తుందన్నారు. ప్రస్తుతం అందిస్తున్న బ్యాంకింగ్, సుకన్య సమృద్ధియోజన వంటి పథకాలకు జోడు మరే ఇతరసేవలు అందించే వీలున్నా తన దృష్టికి తీసుకువస్తే దానిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతొ దశాబ్దాల కాలం నుండి మారుమూల గ్రామాలకు సైతం కమ్యూనికేషన్ వ్యస్థను చేరవేసిన ఘనత తపాలాశాఖదేనన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక వ్యవస్థను అందిపుచ్చుకుని ప్రైవేటు సంస్థలకు తపాలాశాఖ పోటీగా నిలవడం అభినందనీయమన్నారు. తపాలాశాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సైతం ప్రజలకు చేరవేయడం ఆ సంస్థ గొప్పతనాన్ని సూచిస్తోందన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరుచిరితారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఒక్కరూ తపాలా సేవలను వినియోగించుకుని సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ముందుగా పోస్టల్‌శాఖ అందిస్తున్న బ్యాంకింగ్ సేవలను ఆధరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరిటెండెంట్ డా.చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో తమకు టెలిగ్రామ్ వంటి సేవలు ఎంతో ఉపయోగపడ్డాయని, పోస్టల్‌శాఖ అభివృద్ధికి ఎంపి టిజి కృషి చేస్తారన్నారు. పోస్టల్‌శాఖ సూపరింటెండెంట్ సుబ్బారావు పోస్టల్‌శాఖ అందిస్తున్న సేవల గురించి వివరించారు. అనంతరం పోస్టల్‌శాఖలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి బహుమతులను అందజేశారు.

జాతీయ పునర్నినిర్మాణమే ఎబివిపి లక్ష్యం
కర్నూలు ఓల్డ్‌సిటీ, అక్టోబర్ 14: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ పుననిర్మాణమే లక్ష్యంగా పని చేస్తుందని ఎబివిపి నాయకులు నాగఫణి శాస్ర్తీ అన్నారు. శనివారం స్థానిక నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలోని భరతమాత దేవాలయంలో ఎబివిపి నగర సైద్దాంతిక శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎబివిపి నాయకులు నాగఫణి శాస్ర్తీ, విద్యావికాస్ విద్యా సంస్థల అధినేత రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎబివిపి జాతీయ వాద భావం కలిగినటువంటి సంస్థగా అనేక విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తూ, దేశ సమస్యలపై తమదైన శైలిలో ఉద్యమాలు చేస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తుందని అన్నారు. ఎబివిపి 1949 జూలై 7వ తేదిన ఆవిర్భవించి నాటి నుండి నేటి వరకు అనేక విద్యార్థి సమస్యలపై పోరాటాలు చేసిందని నాగఫణిశాస్ర్తీ అన్నారు. జాతీయ పునర్‌నిర్మాణమే లక్ష్యంగా విద్యార్థి కేంద్రీకృతంగా పునర్ నిర్మాణం సాధ్యమన్నారు. జ్ఞానం, శీలం, ఏకత సిద్ధాంతాలు కల్గి విద్యార్థులకు నైతిక విలువలను పెంపొందించుటకు జాతీయ భావాలను నింపుతూ, దేశభక్తిని విద్యార్థుల్లో నింపుతూ ముందుకెళ్తుందన్నారు. ఉగ్రవాదులను, బంగ్లాదేశ్ చొరబాటుదారులను దేశం నుండి వెళ్లగొట్టటానికి 2008లో కార్యక్రమం చేట్టామని తెలిపారు. ఎబివిపి కార్యకర్తలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం కోసం ప్రాణాలర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు సునీల్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మహేంద్ర, యూనివర్శిటీ నాయకులు మహేష్, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఎబివిపి నగర నూతన కార్యవర్గం
ఎబివిపి నగర నూతన కార్యదర్శిగా హర్షవర్థన్‌రెడ్డి, నగర సహాయ కార్యదర్శులుగా సురేష్, చంద్రకాంత్, నగర ఉపాధ్యక్షులుగా రాఘవేంద్ర, రాజు, నగర టెక్నికల్ కన్వీనర్, కో-కన్వీనర్లుగా బాబ్జిగౌడ్, అరుణ్‌లు, నగర హాస్టల్ కన్వీనర్‌గా రాజశేఖర్, జోన్ ఇంచార్జిగా రాజవార్థన్, రమేష్, హరి, జయచంద్రలు, కార్యవర్గ సభ్యులుగా మధు, సురేష్, హరిలను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా నిషేధం
* అక్రమ బాణసంచా నిల్వలపై తనిఖీలు -ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ
కర్నూలు, అక్టోబర్ 14: అనుమతి లేని ప్రదేశాల్లో అక్రమంగా నిల్వ ఉంచే బాణసంచా స్థావరాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎస్పీ గోపినాథ్‌జెట్టి శనివారం పోలీసు అధికారులను ఆదేశించారు. ఎవరైన బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా పేల్చితే వారిపై కఠినపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండ శాంతియుత వాతావరణంలో దీపాళి పండుగను జరుపుకోవాలని ఎస్పీ కోరారు. టపాసులకు చిన్నారులను దూరంగా ఉంచేలా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ శబ్దాలు వచ్చే టపాసులను వాడకూడదన్నారు.

బిజినెస్ అనెలిటిక్స్‌లో వర్క్‌షాపు
కర్నూలు ఓల్డ్‌సిటీ, అక్టోబర్ 14: శనివారం స్థానికి పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలోని ఎంబిఎ విభాగం ఆధ్వర్యంలో ఎంబిఎ విద్యార్థులకు బిజినెస్ అనెలిటిక్స్‌ల స్ప్రెడ్‌షీట్ ఉపయోగంపై ఒక రోజు వర్క్‌షాపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్నో ఐఐటి రిసోర్సు పర్సన్ ఆచార్యులు డాక్టరు వివేక్ గుప్త హాజరై మాట్లాడుతూ స్ప్రెడ్‌షీట్ వలన వ్యాపార నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి వీలౌతుందని అందువల్ల నష్టాలు రాకుండా నేర్పు అలవర్చుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబిఎ విభాగాధిపతి, కార్పొరేట్ వ్యవహరాల డీన్ డాక్టరు ఎం.గిరిధర్ కుమార్, అధ్యాపకులు నాగ గణేష్, ఎల్లనాయుడు పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన ప్రారంభం
కల్లూరు, అక్టోబర్ 14: అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు బాండ్లను ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కౌంటర్‌ను నిర్వహించి శనివారం పోలీస్ సిబ్బంది బాండ్లు పరిశీలించి వాటిని ఆన్‌లైన్ నమోదుచేశారు. ఈసందర్భంగా ప్రత్యేక పోలీస్ సిబ్బంది రాంబాబు, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ లో డిపాజిట్లు కట్టిన ప్రతి బాథితుడు తమ ఒర్జినల్ బాండ్లతోపాటు జీరాక్స్ కాఫీలను తీసుకరావాలన్నారు. గత కొన్ని నెలల నుండి అగ్రిగోల్డ్ వారు నష్టాల ఊబిలో సంస్థ ఉందని చేతులు ఎత్తివేశారని డిపాజిట్లు చేసుకున్న బాధితులు రోడ్లపై నిరసలు చేయడంతో ప్రభుత్వ ఆదేశాలు రావడంతో జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక నమోదుకేంద్రాలు ఏర్పాటుచేసి వాటి ద్వారా బాధితుల డిపాజిట్ పత్రాలను ఈనెల 27వ తేదీ వరకు పరిశీలన చేసి వాటి వివరాలు ఆన్‌లైన్ వెబ్‌సెట్‌లో నమోదుచేస్తారన్నారు. బాధితులు తప్పకుండా తమ వివరాలు తెలిపే డిపాజిట్ పత్రాలు, మత ఆధార్ కార్డులు తీసుకరావాలన్నారు. ఈకార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నేడు ఆనంద లహరి కార్యక్రమం
కర్నూలు ఓల్డ్‌సిటీ, అక్టోబర్ 14: కర్నూలు నగర పాలక సంస్థ అధ్వర్యంలో ఈ నెల 15వ తేదిన సాయంత్రం స్థానిక మున్సిపల్ ఓపెన్ థియేటర్‌లో అనంద లహరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంల కూచిపూడి, భరత నాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజిక్ షో ఉంటుందని ఆయన తెలిపారు. నగర ప్రజలు, యువత పాల్గొని విజయంతం చేయాలని ఆయన కోరారు.

నేలంపాడు వరద బాధితులకు ఆర్థిక సహాయం
చాగలమర్రి, అక్టోబర్ 14: మండలంలోని నేలంపాడు వరద బాధితులకు శనివారం ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పంపిణీ చేశారు. మొత్తం 297 మంది వరద బాధితులకు రూ.12లక్షలను అందించారు. ఒక్కొక్కరికి రూ.4వేలు చొప్పున ఇచ్చారు. మరో 40మందికి ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తానని మంత్రి వరద బాధితులకు హామీనిచ్చారు. భవిష్యత్తులో శాశ్వతంగా గ్రామంలోగాని, పంట పొలాల్లో గాని వర్షపు నీరు రాకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. రోడ్లు వేయించి కల్వర్టులు, వంతెనలు నిర్మిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ను ఆహ్వానించి గ్రామానికి వచ్చి సమస్యలను తిరిగి తెలుసుకుంటామని ఆమె చెప్పారు. గ్రామంలో వర్షం నీరు ప్రవహిస్తుండడంతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకై ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా మందుల పంపిణీకి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. నేలంపాడు ప్రజల సమస్యల పరిష్కారానికి తమ తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు కృషి చేస్తూ వచ్చారన్నారు. వారి బాటలోనే నడిచి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ బివి రామిరెడ్డి, తహశీల్దార్ మాలకొండయ్య, విఆర్‌ఓ హసన్, మండల సర్వేయర్ అహమ్మద్ హుశేన్, సర్పంచ్ సత్యనారాయణ, ఎంపిటిసి లక్ష్మీదేవి, మండల టిడిపి కన్వీనర్ నరసింహారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటరామిరెడ్డి, జగదీశ్వరరెడ్డి, పుల్లయ్య, నాగరాజు, ఖాదర్‌బాషా, చిన్నారెడ్డి, ఇండ్ల లక్ష్మీరెడ్డి, నరసింహులు పాల్గొన్నారు.
గొట్లూరు బాధితులను ఆదుకోవాలి...
మండలంలోని గొట్లూరు వరద బాధితులను ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ లక్ష్మీనరసమ్మ, ఎంపిటిసి అన్నపురెడ్డి సరోజమ్మ, టిడిపి నాయకులు జగదీశ్వరరెడ్డి, దస్తగిరిరెడ్డిలు శనివారం పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియకు వినతిపత్రం సమర్పించారు. వందల ఎకరాల పంట నీటి పాలైందని, ఇళ్ళల్లో వర్షపు నీరు ప్రవహించిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చి బాధితులను ఆదుకుంటామని హామీనిచ్చారు. పంట పొలాల్లో నీరు తగ్గాక పంట నష్ట వేయిస్తామని తెలిపారు.

ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం
* కోవెలకుంట్ల బస్టాండులో లోపించిన పారిశుద్ధ్యం.. ఎమ్మెల్యే బిసి.జనార్ధన్‌రెడ్డి
కోవెలకుంట్ల, అక్టోబర్ 14: కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండు జలమయమై పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తడానికి ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఎమ్మెల్యే బిసి.జనార్ధన్‌రెడ్డి అన్నారు. గత కొంత కాలంగా కురుస్తున్న వర్షాలకు కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండు ప్రాంగణమంతా జలమయమై బస్టాండు జలదిగ్బంధంలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ విషయమై స్పందించిన ఎమ్మెల్యే ఇటీవల బస్టాండు ప్రాంగణం పరిశీలించి ఇక్కడ తలెత్తిన సమస్యలకు కారణాలు, పరిష్కారంపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమస్యకు పూర్తిగా ఆర్టీసీ అధికారుల తప్పిదమే కారణమని, ఆర్టీసీ ప్రాంగణం చుట్టూ కనీసం ప్రహరీని కూడా ఏర్పాటు చేసుకోకపోవడం, అటువైపు చర్యలు తీసుకోవపోవడంతో ఆర్టీసీ బస్టాండు చుట్టు పక్కల నుండి వచ్చేనీరు ఆర్టీసీ ప్రాంగణంలోకి చొచ్చుకుని వచ్చి నిలిస్తోందన్నారు. ఈ నీటిని డ్రైనేజీ ద్వారా బయటకు పంపేందుకు ప్రయత్నించగా ఆర్టీసీ బస్టాండు చుట్టు పక్కల, బస్టాండు రోడ్డులో వివపరీతంగా స్థలం ఆక్రమణకు గురై డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయసి స్థితికి చేరుకున్నట్లు గుర్తించామన్నారు. దీంతో ఆర్‌అండ్‌బి అధికారులు, పోలీసు సిబ్బందితో కలసి వారం క్రితం దురాక్రమణలకు పాల్పడిన వారి వద్దకు వెళ్లి అక్రమకట్టడాలు తొలగించేందుకు సమయం కూడా గతంలో ఇచ్చామన్నారు. తీరు మారకపోగా శనివారం ఉదయం నుండి తానే స్వయంగా జెసిబి, ట్రాక్టర్లు ఇతర పరికరాలను రప్పించి ఆర్‌అండ్‌బి రహదారికి ఇరువైపులా మురుగు కాల్వలపై వున్న అక్రమకట్టడాలను తొలగించి డ్రైనేజీ వ్యవవస్థను పునరుధ్ధరించేందుకు చర్యలు చేపట్టానన్నారు. అలాగే ఆర్టీసీకి సంబంధించి విలువైన ఆస్తులను పరిరక్షించుకోవడంలో కోవెలకుంట్ల డిపో ఆధికారులు పూర్తి నిర్లక్ష్యం వహించారని, డిపో ఆదాయానికి నిర్మించిన దుకాణాల సముదాయాలవారు నిర్ణీత స్థలం కంటే ముందుకు జరిగి అక్రమకట్టడాలు కట్టుకుంటున్నా చూసి చూడనట్లు వ్యవహరించారన్నారు. ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో కోట్లు విలువ చేసే ఖాళీ స్థలాన్ని స్థానికులకు, స్థానిక నాయకులకు కూడా సమాచారం లేకుండా, ఎటువంటి ప్రకటణలు లేకుండా వేలం వేసి బడాబాబుల చేతుల్లోకి చేర్చారన్నారు. కోవెలకుంట్ల ఆర్టీసీ డిపోలో ప్రయాణించే ప్రయాణికులు కొనే ప్రతి టికెట్టులో రూ.1 డిపో అభివృద్ధికి సెస్ వుందని, కాని ఆర్టీసీ అధికారులు ఆయా డిపోల నుండి వచ్చే ఈ సెస్‌లను కేవలం జిల్లా కేంద్రాలు, నగరాల్లోని డిపోల అభివృధ్ధికి వాడుతూ పలు డిపోలను నిర్లక్ష్యం చేస్తుండడం శోచనీయమన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రవాణా శాఖామంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ప్రస్తుతం డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరనకు కనీసం 7రోజుల వ్యవధి పడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు, అధికారులు, ఎస్సై మంజునాధ్, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అదుపుతప్పి తిరగబడ్డ ట్రాలీ, ట్యాంకర్
కొలిమిగుండ్ల, అక్టోబర్ 14: మండలంలోని కనకాద్రిపల్లె సమీపంలో శనివారం సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్రాలీ ట్యాంకర్ ఎత్తయిన ప్రదేశాన్ని ఎక్కలేక వెనుకకు వచ్చి రోడ్డుకు అడ్డంగా తిరిగి నిలిచిపోయింది. ట్యాంకర్ భారీ వాహనం కావడంతో డబుల్ రోడ్డు అయినా కూడా పూర్తిస్థాయిలో రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఇదే సమయంలో తాడిపత్రి వైపు నుంచి కొలిమిగుండ్లకు వస్తున్న ఆర్టీసీ బస్సు ట్రాలీ ట్యాంకర్‌ను తప్పించబోయి రోడ్డు పక్కకు వెళ్లిపోయి నిలిచిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు కేకలు వేస్తూ ప్రాణభయంతో బస్సులో నుంచి కిందకు దిగి పరుగులు తీశారు. అయితే ట్రాలీ ట్యాంకర్ భారీ వాహనం కావడంతో రోడ్డు నుంచి పక్కకు తీయడానికి దాదాపు 3గంటల సమయం పట్టింది. సాయంత్రం 3గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకోగా 6గంటల వరకు వాహనాన్ని తీసేందుకు సమయం పట్టింది. దీంతో అటు ఇటు వైపున 6కి.మీ మేరా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించడంతో పాటు అత్యవసర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలిసిన వెంటనే ఎఎస్‌ఐ గని సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నారు. బస్సు డ్రైవర్ చాకచక్యంతో డ్రైవ్ చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
పేదల అభ్యున్నతే చంద్రబాబు ధ్యేయం
డోన్, అక్టోబర్ 14: పేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, పేదల సంక్షేమమే బాబు ద్యేయమని టిడిపి ఇన్‌చార్జి కెయి ప్రతాప్ అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీ, అంబేద్కర్ కాలనీ, టీచర్స్ కాలనీ, శ్రీరామ నగర్, వైఎస్ నగర్, పోచా నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీచర్స్ కాలనీ, సుందర్ సింగ్ కాలనీ ప్రాంతాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీ సమస్య అధికంగా వుందని తెలిపారు. అంతేగాక వారానికి ఒకసారి కూడ కాల్వలను శుభ్రం చేయక పోవడం వల్ల దుర్వాసన వెదజల్లు తోందని ఫిర్యాదు చేశారు. మున్సిపల్ సిబ్బంది పనితీరు సక్రమంగా లేదని పలువురు మహిళలు కెయి ఫిర్యాదు చేశారు. 14వ వార్డులోని పలు వీధుల్లో త్వరలోనే కాల్వల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. పారిశుద్యం గురించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ పక్కాగృహాలు, పెన్షన్లు మంజూరు చేయిస్తామన్నారు. ఆర్థిక లోటులో రాష్ట్ర బడ్జెట్ వున్నప్పటికి ఎన్నో సంక్షేమ పథకాలు మంజూరు చేసిన ఘనత టిడిపికే దక్కుతుందని, పేదల కోసం అహర్నిశలు పాటుపడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల సహకార సంఘ జిల్లా అధ్యక్షులు వై నాగేశ్వరరావు, ఎపిఐడిసి మాజీ డైరెక్టర్ ధర్మవరం సుబ్బారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గాయత్రిదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ టిఇ కేశన్న గౌడ్, టిడిపి పట్టణ అధ్యక్షులు కెవి ఫణిరాజ్, తెలుగు యువత నాయకులు కాలేషా, కౌన్సిలర్లు పెద్దయ్య, భాష్యం సుజాత, దేశం నాయకులు తిమ్మయ్య యాదవ్, వెంకట రమణ గౌడ్, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు రంగరత్నం గౌడ్, భాష్యం శ్రీనివాసులు గౌడ్, భాష్యం శ్రీ్ధర్ గౌడ్, కో ఆష్షన్ సభ్యులు కెయి శ్యామ్, జాకీర్ హుసేన్, ఇక్బాల్ హుసేన్, విజయ్ భట్టు తదితరులు పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతే ప్రధాన లక్ష్యం
*ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
మహానంది, అక్టోబర్ 14: పేదవాడి ఇంట సిరులు కురిపించేందుకు గూడు నీడ కల్పిస్తూ పేద ప్రజల అభ్యున్నతికై అహర్నిశలు కృషి చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం అని, ఎన్నో పథకాలను తీసుకుని వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని తిమ్మాపురంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మండల ఎంపిపి చింతం నాగమణి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం చంద్రన్న బీమా పథకం ద్వారా ఇటీవల అబ్బీపురం గ్రామానికి చెందిన 5మంది ప్రమాదంలో మృతి చెందగా వారికి చంద్రన్న బీమా పథకం ద్వారా వచ్చిన రూ.5లక్షల ఇన్సూరెన్స్‌ను ఐకెపి ద్వారా అందజేశారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. తిమ్మాపురం గ్రామంలో చాలా వరకు మురికికాల్వలు గుర్తించామని, దీనిపై సిఎం దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మరికొంతమంది పెన్షన్, నీటి సౌకర్యం కావాలన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర విభజన తరువాత అ ప్పుల ఊబిలో ఉన్న ఎపిని అభ్యున్నతికి తీసుకుని వస్తున్న ఘనత చంద్రబాబుదే అన్నారు. అమరావతిని సుందరంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఎన్నికలకు ముందే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాబోవు ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆశీర్వదిస్తూ టిడిపికి పట్టం కట్టాలన్నారు. వీరివెంట మహానంది చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, సర్పంచ్ చెన్నకేశవరావు, మండల కన్వీనర్ కందుల రఘురామిరెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
సుంకేసుల బ్యారేజికి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
గూడూరు, అక్టోబర్ 14: సుంకేసుల బ్యారేజికి ఇంకా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శనివారం ఎగువ ప్రాంతాల నుంచి 24 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజికి రావడంతో ఈ నీటిని అంతే పరిమాణంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 1.2 టి ఎంసి నీరు నిల్వ ఉందని నీటి పారుదల అధికారులు తెలిపారు. అలాగే కెసి కాల్వలకు రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఎఎస్‌ఐ మృతి
చాగలమర్రి/ఉయ్యాలవాడ/ఆళ్లగడ్డ, అక్టోబర్ 14: మండలంలోని నగళ్ళపాడు గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉయ్యాలవాడ ఎఎస్‌ఐ రాధాకృష్ణ(56) మృతి చెందారు.