కర్నూల్

కర్నూలు కేరాఫ్ దివాలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 17:కర్నూలు నగరం దివాలాదారులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఆయా వ్యాపారులను నమ్మి అప్పులు ఇచ్చిన తోటి వ్యాపారులు, ఆయా వ్యాపారాల్లో వ్యాపారులు ప్రవేశపెట్టిన పథకాల్లో సభ్యులుగా చేరిన సామాన్యుడు దివాలాదారుల వలలో పడి విలవిల్లాడుతున్నారు. నగరంలో ఇప్పటికే ఇద్దరు వ్యాపారులు తాము చేసిన అప్పులు చెల్లించలేని స్థితిలో ఉన్నామంటూ కోర్టును ఆశ్రయించగా మరో ముగ్గురు వ్యాపారులపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక పలు వ్యాపారులు సైతం ఏదో ఒక రోజు ఐపీ పెట్టడం ఖాయమన్న భావనతో వారి వద్ద పథకాల్లో చేరిన సామాన్యులు, వడ్డీకి అప్పు ఇచ్చిన తోటి వ్యాపారులు తమ సొమ్మును రాబట్టుకునేందుకు ఒత్తిడి పెంచినట్లు చర్చించుకుంటున్నారు. 6 నెలల క్రితం నగరంలోని ఒక ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారి కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆయన ఆస్తులు, వ్యాపారాలను పర్యవేక్షించడానికి ఒక అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. దాంతో సదరు వ్యాపారి నుంచి డబ్బులు రావాల్సిన వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. సామాన్యుడు వ్యాపారిని నమ్మి పథకాల్లో చేరడం, చిన్న, చిన్న మొత్తాలను వడ్డీకి ఆశ పడి ఇచ్చి ఇప్పుడు నరకం చవి చూస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఆ తరువాత మరో వ్యాపారి కూడా కోర్టులో ఐపీ పిటిషన్ వేశాడని, ఈ విషయంలో కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉందని జనంలో చర్చ సాగుతోంది. వీరు కాక అప్పుల భారం పేరుతో ముగ్గురు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వారిలో ఒకరు బంగారు నగల వ్యాపారి అని తెలుస్తోంది. ఆయన సెల్ ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లు సైతం మూగబోయాయని దుకాణాలు మూసివేశారని ప్రజలంటున్నారు. దాంతో ఆయన త్వరలోనే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిసింది. మరో ఇద్దరు వ్యాపారులు కూడా కేవలం ఫోన్లలో మాత్రమే సమాధానం ఇస్తున్నారని వ్యక్తిగతంగా కలవడం లేదని బాధితులు వాపోతున్నారు. కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నా వారు తమకేమీ తెలియదని, ఇంటికి రావడం లేదని, ఎక్కడ ఉన్నారోనన్న సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన కూడా ఐపీ పెడతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీ దారిలో ఉన్న వ్యాపారులకు వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారు వౌనంగా ఉండటంతో వారిపై కూడా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల నుంచి తమకు రావాల్సిన సొమ్మును వడ్డీతో సహా తీసుకుని వౌనం దాల్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిక వడ్డీకి ఇచ్చిన వ్యాపారులు తాము అప్పు ఇచ్చిన వారి వ్యాపార బాగోగులను నిశితంగా పరిశీలిస్తూ ఏ మాత్రం అనుమానం వచ్చినా ఒత్తిడి చేసి తమ సొమ్మును తిరిగి రాబట్టుకోవడంతో వ్యాపారం నిర్వహించలేక ఐపీ పెడుతున్నారని భావిస్తున్నారు. మరో వైపు తమకు రావాల్సిన సొమ్ము విషయం బయటకు పొక్కితే ఆదాయ పన్ను అధికారుల నుంచి ఇబ్బందులు వస్తాయని సొమ్ము రాకపోయినా బాధలేదని వౌనం వహించినట్లు మరి కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద కర్నూలులో దివాలాదారుల సంఖ్య పెరుగుతుండటంతో వ్యాపారులకు వడ్డీకి అప్పులు ఇవ్వాలన్నా, వారి పథకాల్లో చేరాలన్నా ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.