కర్నూల్

వీధికుక్కల నియంత్రణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూన్ 16:పట్టణాల్లోని వీధుల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే గ్రామ సింహాలకు (వీధి కుక్కలు) హైకోర్టు ఆదేశాలతో చెక్ పడనుంది. కుక్కలను క్రూరంగా చంపకుండా వాటి సంతతిని నియంత్రించే ప్రక్రియను 150 రోజుల్లో పూర్తి చేయాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ అదికారులు ప్రణాళికలు రూపొందిం చి, అందులో భాగంగా యానిమల్ బర్త్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసి, కుక్కల సంతతి నియంత్రణకు చర్య లు చేపడుతున్నారు. కుక్కలు పట్టణాల్లోని వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ చిన్న పిల్లలను మొదలుకుని పెద్దలను సైతం వదలకుండా కొరుకుతున్నాయి. కుక్క గాట్ల వల్ల రాబిస్ వ్యాధితో పాటు అనేక వ్యాధు లు సక్రమించి ప్రాణపాయస్థితి కూడా వస్తుంది. ఈ విధంగా ప్రజలకు తీవ్ర సమస్యగా మారిన కుక్కల నియంత్రణకు కర్నూలు, నంద్యాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గురువారం కర్నూలులో సుంకేసుల రోడ్డులోని పాత పంప్‌హౌస్ వద్ద రూ. 25 లక్షలతో కుక్కలకు ప్రత్యేకంగా శస్తచ్రికిత్స లు చేసేందుకు గదులు, బోను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా అతి తక్కువ సమయంలో కర్నూలు, నంద్యాల కుక్కలకు శస్త్ర చికిత్స చేసేందుకు కెనె్నల్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రవాణా కింద ఒక్కో కుక్కకు రూ. 100, శస్త్ర చికిత్సకు రూ. 700 కేటాయించిందని అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 65 వేలకు పైగా వీధి కుక్కలుంటాయని అధికారులు అంచనా వేశారు. కేవలం పట్టణ ప్రాంతాల్లో అయితే 21,445 వీధి కుక్కలు ఉంటాయని తెలుపుతున్నారు. వాటిలో కర్నూలులో 9,672, నంద్యాల 3,800, ఆదోని 2,250, ఎమ్మిగనూరు 650, డోన్ 50, నందికొట్కూరు 2,500, గూడూరు 653, ఆళ్లగడ్డ 1020, ఆత్మకూరులో 850 కుక్కలు ఉన్నట్లు అంచనా వేసి, వాటి శస్తచ్రికిత్సల కోసం రూ. 1.6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కుక్క కరిస్తే ఏ విధమైన వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు యానిమల్ అండ్ బర్డ్ సొసైటీకి బాధ్యతలు అప్పజెప్పారు. కుక్కలకు శస్త్ర చికిత్స చేసిన తర్వాత వారం రోజుల పాటు అక్కడే పరిశీలనకు ఉంచి, అనంతరం ఎక్కడ నుంచి పట్టుకొచ్చారో అక్కడే వదిలేస్తారు. ఈ విధంగా చేస్తే కుక్కల సంతతి తగ్గిపోవటమే కాకుండా అవి మనుషులపై దాడి చేసి కరచినా ఏవిధమైన వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక టీకా వేస్తారు. తద్వారా కుక్కల బారి నుంచి కొంత మేరకు ప్రజలకు ప్రమాదం తప్పుతుంది.

నేరాలను కట్టడి చేయండి
* పగలు, రాత్రి గస్తీ పెంచండి
* నేర సమీక్ష సమావేశంలో ఐజి శ్రీ్ధర్‌రావు
కర్నూలు, జూన్ 16:జిల్లాలో జరుగుతున్న నేరాలను కట్టడి చేయాలని రాయలసీమ ఐజి ఎన్.శ్రీ్ధర్‌రావు పోలీసు అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో కర్నూలు రేంజ్ డిఐజి బివి రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజి మాట్లాడుతూ జిల్లోలో నేరాలను తగ్గించేందకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ ఆదేశించారు. ఎస్‌ఐలు ఆయా స్టేషన్ల పరిధిలో జరిగే నేరాలకు పూర్తిస్థాయిలో బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని, చిన్న చిన్న నేరాలు జరిగినప్పుడు కూడా స్పందించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా పరిధుల్లోని పోలీసు అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. చోరీలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పగలు, రాత్రి వేళల్లో కానిస్టేబుళ్ల గస్తీని పెంచాలన్నారు. విధుల పట్ల అలసత్వం వహించకుండా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. అంతకుముందు ఆళ్లగడ్డ ఏఎస్పీగా విధులు నిర్వహించి వెళ్లిన శశికుమార్ మృతికి పోలీసు అధికారులందరూ 2 నిమిషాల పాటు వౌనం పాటించి, సంతాపం తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, ఎజి కృష్ణమూర్తి, హుస్సేన్‌పీరా, రామచంద్ర, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, దేవదానం, ఈశ్వర్‌రెడ్డి, హరినాథరెడ్డి, బాబాఫకృద్దీన్, కొల్లి శ్రీనివాసరావు, సుప్రజ, సిఐలు పార్థసారధి, రామకృష్ణ పాల్గొన్నారు.

కొలనుభారతి సరస్వతీ మాతకు
నూతన ఆలయం
* పురాతన ఆలయం తొలగింపు పనులు ప్రారంభం
* రూ. కోటి నిధులతో పునఃనిర్మాణం
పాములపాడు, జూన్ 16:చాళుక్యు ల కాలం నాటి కొలను భారతి సరస్వ తీ ఆలయాన్ని దేవాదాయ శాఖ కృష్ణా పుష్కరాల సందర్భంగా వాస్తుకు అనుగుణంగా రూ. కోటి వ్యయంతో నిర్మించనుంది. ఆత్మకూరు అటవీ ప్రాంతంలోని నల్లమలలో వెలసిన ఏకైక సరస్వతీ ఆలయం కొలను భారతి క్షేత్రం. ఈ క్షేత్రంలో గురువారం సంప్రదాయ క్రతువుల మధ్య పురాతన ఆలయాన్ని తొలగింపు చర్యలకు శ్రీకారం చుట్టా రు. దేవదాయ శాఖ ఇఇ శ్రీనివాసులు పర్యవేక్షణలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఏకాదశి జ్యేష్ట మా సం ఉదయం 11.25 గంటలకు సుముహూర్తంలో ఆలయ తొలగింపు పను లు చేపట్టారు. దేవాదాయ స్తపతి పరమేశ్వరప్ప సూచనలతో నూతన ఆలయం నిర్మించబడుతోంది. హో మా లు, యజ్ఞాల అనంతరం ప్రధాన అర్చకులు చంద్రశేఖర్‌శర్మ, శ్రీనివాసశర్మ పురాతన రాతి శిలలను తొలగించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐజయ్య పాల్గొన్నారు. ఏపిలోని ఏకైక సరస్వతీ ఆలయం కొలను భారతి క్షేత్రం ఎట్టకేలకు జీర్ణోద్ధరణ దశ దాటి ఏకంగా నూతన ఆలయం పునఃనిర్మాణానికి నోచుకుంది. అందులో భాగంగా మొదట ఆలయ ధ్వజ స్తంభం, విఘ్నేశ్వరుని విగ్రహాలను స్థల విసర్జన కలశాలతో నిక్షిప్తం చేస్తూ తొలగింపు చర్యలు చేపట్టారు. పూర్వపు ఆలయ స్థానంలోనే సరస్వతీ అమ్మవారు గర్భాలయంలో యథాస్థానంలో ఉంటారని, స్ర్తి చక్రాన్ని సైతం స్థాన భ్రంశం చేయకుండా పూర్తిగా కొత్త ఆలయం నిర్మించాలని సూచించారు. సిజిఎఫ్ కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఆలయ పునఃనిర్మాణం చేపడుతామని, ఏడాది లోపు పూర్తి ఆలయం సిద్ధమవుతుందని స్తపతి పరమేశ్వరప్ప స్పష్టం చేశారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆలయాన్ని పాక్షికంగా తొలగిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, కావున నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నారు. గర్భాలయం, అంతరాలయం, మండపం తదితర నిర్మాణాలను వాస్తుకు అనుగుణంగా నిర్మిస్తామని తెలిపారు. క్రతువులో డిఇ శ్రీనివాసప్రసాద్, ట్రస్టు చైర్మన్ చంద్రశేఖర్‌యాదవ్, ఇఇ చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీటిసి పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ సంతోషమ్మ పాల్గొన్నారు.

పనుల్లో నాణ్యత లోపిస్తే
బ్లాక్ లిస్టులో పెడతాం
* నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు
* కాంట్రాక్టర్లకు కలెక్టర్ హెచ్చరిక
కర్నూలు సిటీ, జూన్ 16:మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని కలెక్టర్ విజయమోహన్ హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు కార్పొరేషన్‌ను స్మార్ట్‌సిటీగా రూపొందించే క్రమంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అవినీతికి తావు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటించి గుత్తేదారులు నిజాయితీగా పనులు చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. గుత్తేదారులు పనుల్లో ఏవైనా సమస్యలుంటే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పనులను గడువులోగా పూర్తి చేయాలని, కొందరు ఆలస్యంగా చేయటమే కాకుండా నాసిరకంగా చేస్తున్నారని అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. కార్పొరేషన్ అధికారులు పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని గుత్తేదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే గుత్తేదారులను, అధికారులను ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్పొరేషన్ అధికారులు ఇతర శాఖల సహకారం, అవసరం ఉన్నంత వరకూ సమన్వయం తో వ్యవహరించి పనుల్లో పురోగతి సాధించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, మున్సిపల్ గుత్తేదారు ల అసోసియేషన్ అధ్యక్షుడు రంగ య్య, కార్యదర్శి షరీఫ్, గుత్తేదారులు మనోహర్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.

అటవీ హక్కుల చట్టంపై
చెంచులకు అవగాహన
ఆత్మకూరు, జూన్ 16:అటవీ హక్కు ల చట్టంపై చెంచులకు అవగాహన కల్పించాలని ఐటిడిఏ అధికారి రామాంజినేయులు సూచించారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో గురువారం ఐటిడిఓ ఆధ్వర్యంలో అటవీ హక్కుల చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఆది మానవ జాతికి చెందిన చెంచుల అభివృద్ధే ఐటిడిఓ ధ్యేయమన్నారు. ప్రభుత్వం వారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. చెంచులు నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండడం వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా చెంచులకు వ్యవసాయం చేసుకునేందుకు భూములు పంపిణీ చేయడంతో పాటు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. అడవిలో వ్యవసాయం చేయడం వల్ల అడవి పంది లాంటి జంతువుల వల్ల జరిగే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అలాగే వారి జీవితంలో వెలుగులు నింపడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఎండాకాలంలో చెంచులకు పనులు ఉండవని దీంతో ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. సదస్సులో కెజి నాయక్, అన్ని మండలాల చెంచులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నిస్తే
అమరావతి ముట్టడి
* చిరంజీవిని తెలుగు రాష్ట్రాల్లో తిరుగనియ్యం
* మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
కర్నూలు సిటీ, జూన్ 16:సిఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేయాలని ప్రయత్నిస్తే రాజధాని అమరావతి ని ముట్టడిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య హెచ్చరించారు. చెన్నయ్య గురువారం జిల్లాలో పర్యటించి అనంతరం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు గతంలో మాల, మాదిగలను ‘విభజిం చు పాలించు’ పద్ధతిలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి వారి మధ్య చిచ్చుపెట్టారని విమర్శించారు. అంతేకాకుండా మాలలపై కపట ప్రేమ చూపిస్తూ నామినేటెడ్ పదవులను ఇచ్చి దొంగచాటున ఎస్సీ వర్గీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని కొట్టివేసిందన్నారు. అయితే కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మళ్లీ ఎస్సీ వర్గీకరణ చేయాలని సిఎం చంద్రబాబుకు లేఖ రాయ డం ఏంటని ప్రశ్నించారు. ఉన్నత న్యా య స్థానం కంటే చిరంజీవి విధానం గొప్పదా, స్వార్థ రాజకీయాల కోసం మాల, మాదిగల పట్ల చిచ్చు పెట్టాలని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో తిరగనీయమని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల కంటే ముందుగా వచ్చే నెల 18వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు. ఇక పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా సాక్షి టీవి ఛానల్ ప్రసారాలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాధవస్వామి, మల్లికార్జున, మద్దిలేటి, సుధాకర్, విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచండి
* ఎంపి బుట్టా రేణుక
కర్నూలు సిటీ, జూన్ 16:పారిశుద్ధ్య పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కర్నూ లు ఎంపి బుట్టా రేణుక అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గురువారం ఆమె సమీక్ష నిర్వహించగా పాణ్యం ఎమ్మె ల్యే గౌరు చరితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి రేణుక మాట్లాడుతూ నగరంలో ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తూ డంపు యార్డును తలపిస్తోందని, కావున ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు పారిశుద్ధ్య పనులును చేపట్టాలని ఆదేశించారు. ము ఖ్యంగా నగరంలో కుక్కలు, పందుల బెడద ఎక్కువగా ఉందని వాటి నియంత్రణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. శివారు కాలనీల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. కర్నూలు నగరం భవిష్యత్తులో స్మార్ట్ సిటీగా ఏర్పాటుకానుందని, అందుకోసం కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే చరితారెడ్డి మాట్లాడుతూ కల్లూరు పరిధిలోని వార్డుల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్డుల ప్రజలు కూడా ఆదాయ, నీటి పన్నులు చెల్లిస్తున్నా రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. ఇక పారిశుద్ధ్య పనులను కూడా నెలలో రెండు సార్ల కంటే ఎక్కువగా చేపట్టడం లేదని, దీంతో డ్రైనేజీలు చెత్తతో నిండి దుర్గంధం వెదజల్లుతూ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు. నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు 947మంది కార్మికులు ఉన్నారని, వారు నగరంలోని 13 డివిజన్లలో విధులు నిర్వర్తిస్తుంటారన్నారు. శివారు కాలనీలు శరవేగంగా విస్తరిస్తున్నాయని అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులు లేరని, అయినా ఇంటి ఇంటింటి చెత్త సేకరణ చేపట్టడమే కాకుండా నిరంతరం కాలువలను శుభ్రం చేస్తూ రోడ్లు ఊడుస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని స్పష్టం చేశారు. అభివృద్ధి పట్ల వివక్ష లేదని అవసరం మేరకు పనులు చేపడుతున్నామని వెల్లడించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎస్‌ఇ శివరామిరెడ్డి, ఎంఇ రాజశేఖర్, డిఇఇలు నబీరసూల్, శేషసాయి, మనోహర్‌రెడ్డి, ఎంహెచ్‌ఓ కళ్యాణచక్రవర్తి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
బనగానపల్లె, జూన్ 16:మండల పరిధిలోని బత్తులూరుపాడు గ్రామానికి చెందిన కేశవరెడ్డి(49) గురువారం ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపిన వివరాలు.. బత్తులూరుపాడుకు చెందిన కేశవరెడ్డి గ్రామ సమీపంలోని రాచెరువు వద్దకు వెళ్లగా అక్కడ చెరువు పనులు చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ రివర్స్ చేసే క్రమంలో ట్రాక్టర్ అతడిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆయన చెరువుకట్ట మీద నుంచి కిందకుపడిపోవడం అదే సమయంలో ట్రాక్టర్ కూడా అదుపుతప్పి అతడి మీదుగా దొర్లడంతో కేశవరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వైభవంగా స్వాతి వేడుకలు
ఆళ్లగడ్డ, జూన్ 16: నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని వేడుకలు ఇఓ తిమ్మనాయుడు ఆధ్వర్యంలో గురువారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నల్లమలలో వెలసిన నవనారసింహులను ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు పూజలు చేశారు. ఎగువన స్వయంభువుగా వెలసిన నరసింహాస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లను, దిగువన వెలసిన శ్రీ ప్రహ్లాదవరదుడు, అమృతవల్లి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులు ప్రహ్లాదవరదుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లనుప్రత్యేకంగా అలంకరించి అద్దాల మండపంలో వుంచి ప్రధానార్చకులు వేణుగోపాలన్, అర్చక బృందం సుదర్శన హోమం నిర్వహించారు. అనంతరం ప్రధానార్చకులు మాట్లాడుతూ లోకం సుభిక్షంగా వుండాలని వర్షాలు సంవృద్దిగా కురిసి పాడిపంటలతో కళకళలాడాలని కోరుతూ హోమం నిర్వహించామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. స్వాతి రోజున నల్లమల అరణ్యంలో వెలసిన నవ నారసింహులను దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. నల్లమల అరణ్యంలో వెలసిన జ్వాలా, అహోబిల, మాలోలా, క్రోడా, కారంజ, భార్గవ, యోగానందా, ఛత్రవట, పావన(పాములేటయ్య) నరసింహులను దర్శించుకోవడానికి ఆంద్రా నుండే కాక తమిళనాడు, కర్ణాటక ల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వాతి దర్శనానికి వచ్చిన భక్తులకు పావనా, కారంజ, మాలోల, యోగానంద ఆలయాల వద్ద అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేశారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు.