కర్నూల్

స్మార్ట్ పల్స్ సర్వేకు సన్నద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 4 : రాష్ట్రంలోని ప్రజల సమగ్ర సమాచారం సేకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి ఇంటింటి సర్వే(స్మార్ట్ పల్స్ సర్వే)కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సర్వే అనంతరం రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతివ్యక్తికి సంబంధించిన వివరాలు ప్రభుత్వం వద్ద ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సర్వే మొదటి విడత గత నెల 20 తేదీనే ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వీలుకాలేదు. దాంతో ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆదేశించినా ఆ రోజు రంజాన్ పర్వదినం కావడంతో ఆ మరుసటి రోజు నుంచి సర్వేను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో విఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకూ ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండి ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని సిఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రతి ఇంటి నుంచి 23 రకాల వివరాలను సేకరించడంతో పాటు ఆ ఇంటిని ఫొటో తీసి జియో ట్యాగింగ్ చేయనున్నారు. వివరాలు అందజేసిన కుటుంబ సభ్యుడితో పాటు అందుబాటులో ఉన్న వారి వేలి ముద్రలను బయోమెట్రిక్ విధానంలో సేకరిస్తారు. సర్వే నిర్వహించడానికి జిల్లా వ్యాప్తంగా ఎన్యుమరేటర్లు వారికి సహాయమందించేందుకు కంప్యూటర్ ఆపరేటర్ల నియమాకం, శిక్షణ కార్యక్రమం ఇప్పటికే పూర్తి చేశారు. ఒక్కో ఎన్యుమరేటర్ ప్రతి రోజూ 14 గృహాలు మొత్తం మీద 430 నుంచి 460 గృహాలను సర్వే చేసేలా నిర్ధేశించారు. ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యే సర్వే మధ్యాహ్న భోజన విరామం ఒక గంట మినహా సాయంత్రం 6గంటల వరకూ నిర్విరామంగా కొనసాగాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ఆయా గృహాల్లోని సభ్యుల నుంచి పూర్తి వివరాలను క్రమం తప్పకుండా అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రూపొందించిన పద్ధతి ప్రకారం అన్ని వివరాలను సేకరించి అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా ప్రతి ఎన్యుమరేటర్‌కు ట్యాబ్‌లను 3జి సిమ్ కార్డులను అందజేశారు. ఇంటర్నెట్ సమస్య ఉన్న సమయంలో ట్యాబ్‌లో నమోదు చేసి ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రాగానే వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో చేర్చాలని సాంకేతిక నిపుణులు ఎన్యుమరేటర్లకు వివరించారు. సమయం వృథా చేయకుండా వీలైనంత వేగంగా సర్వే కార్యక్రమం పూర్తి చేసేలా తక్కువ గృహాలను ఎన్యుమరేటర్లకు కేటాయించారని పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త పడాలని శిక్షణలో వెల్లడించారు. ఏ ఇంటి వారైనా సర్వే సమయంలో లేని పక్షంలో ఆ తరువాత సమయం ఉన్నపుడు నిర్ణీత గడువులోగా ఆ కుంటుంబం వివరాలు సేకరించాలన్నారు. అంతేగాకుండా సర్వే నిర్వహిస్తున్న సమయంలో ఏ ఇంటిలోనైనా జనణ, మరణాలు సంభవిస్తే వాటిని కూడా తగిన ఆధారాలతో సర్వేలో పొందుపరచాలన్నారు. ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ ఉంటారని, ఒక మండలంలోని సర్వే బృందాలపై తహశీల్దార్, ఎంపిడిఓల పర్యవేక్షణ ఉంటుంది. తమ డివిజన్ పరిధిలోని మండలాల్లో సర్వే జరుగుతున్న తీరును ఆర్డీఓలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఎక్కడా పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలతో తీసుకునే వివరాల ఆధారంగా ప్రభుత్వ భవిష్యత్తు కార్యక్రమం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా బ్యాంకు ఖాతా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని కుటుంబాలు, వ్యక్తులు ఉంటే వాటి కోసం అభ్యర్థనలను ఆన్‌లైన్‌లోనే అధికారులకు పంపుతారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం అందుతుందని కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. తొలి విడతలో జరిగే సర్వేలో చోటుచేసుకునే పొరపాట్లను సరిదిద్ది మలి విడతలో మరింత పకడ్బందీగా సర్వే చేస్తామని కలెక్టర్ పేర్కొంటున్నారు.