కర్నూల్

సాగునీటి ప్రాజెక్టుల పనులపై నిరంతరం సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 19:జిల్లాలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులపై దసరా నుంచి ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందింది. హంద్రీ-నీవా, గాలేరు- నగరి, ఎస్‌ఆర్‌బిసి, అవుకు సొరంగంతో పాటు ఇతర పనులపై ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. దసరా రోజున అమరావతిలో మాస్టర్ కంట్రోల్ రూం ప్రారంభం కానుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఆ తరువాత ప్రతి సోమవారం సిఎం చంద్రబాబు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం శ్రీశైలం కుడి ప్రధాన కాలువ వెడల్పు పనులు, హంద్రీ-నీవా పెండింగ్ పనులు, శ్రీశైలం కుడి శాఖ కాలువ కింద గోరకల్లు జలాశయం, అవుకు సొరంగ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు సంబంధించిన పలు ఎత్తిపోతల పథకాలు, వెలుగోడు నుంచి ఆత్మకూరు వరకూ ఎత్తిపోతల పైపులైన్ పనులతో పాటు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను అధికారులు చేయిస్తున్నారు. ఇక గుండ్రేవుల జలాశయ నిర్మాణం, వేదవతి ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన సర్వే పనులు పూర్తి కాగా పూర్తిస్థాయి నివేదిక(డిపిఆర్) సిద్ధం చేయాల్సి ఉంది. ఎస్‌ఆర్‌ఎంసి పనులు 98శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన పనులు పూర్తిచేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపుతామని స్పష్టం చేశారు. అయితే శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఈ ఏడాది 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఈ ఏడాది ఖరీఫ్‌లో 60వేల ఎకరాలకు నీరివ్వాల్సి ఉన్నా ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఈ పనులు వేగంగా సాగుతున్నాయని త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొంటున్నారు. శ్రీశైలం కుడి శాఖ కాలువ ద్వారా గోరకల్లు రిజర్వాయర్‌లో ఈ ఏడాది 4 టిఎంసిల నీరు నిల్వ చేయాలని భావించినా 1.5 టిఎంసిల నీరు జలాశయంలోకి చేరగానే ఊటల ద్వారా నీరు బయటకు రావడంతో నీటి చేరికను నిలుపుదల చేశారు. జల వనరుల శాఖ నుంచి నిపుణులు వచ్చి పరిశీలించి వెళ్లారని వారు సూచించిన మేరకు పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది నీటి నిల్వను 4 టిఎంసిలకు పెంచుతామని పేర్కొంటున్నారు. ఇదే కాలువ పరిధిలోని అవుకు జలాశయంలో 3.5 టిఎంసిల నీరు నిల్వ చేయాలని భావించినా అటవీశాఖ అనుమతులు ఆలస్యం కావడంతో ఈ ఏడాది 1.5 టిఎంసిలకే పరిమితం చేశారు. అటవీ శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని అనుమతులు రాగానే మరో 2 టిఎంసిల నీరు నిల్వ చేస్తామంటున్నారు. తుంగభద్ర నదిపై రాజోలి బండ వద్ద కుడి కాలువ ద్వారా 5 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు ట్రిబ్యునల్ మంజూరు చేసింది. ఈ కాలువ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ ఉన్నతాధికారులకు పంపామని ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారుల ద్వారా తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమస్యలపై సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటూ పనులు పూర్తి చేయడంతో పాటు కాంట్రాక్టర్లు సమయం వృథా చేయడాన్ని నిరోధించేందుకు సమీక్ష ఉపయోగపడుతుందని వారంటున్నారు. కాగా ముఖ్యమంత్రి వారం వారం నిర్వహించే సమీక్షలో కేవలం సాగునీటి ప్రాజెక్టులకు పరిమితం కాదని జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తాను ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా వివరాలు కోరే అవకాశం ఉందని ఉన్నతాధికారులు కలెక్టరేట్‌కు పంపిన సమాచారంలో తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ విజయమోహన్ ముఖ్యమంత్రి హామీలపై పలుమార్లు సమీక్షించారు. ఇకపై మరింత దృష్టి సారించి హామీల అమలును వేగవంతం చేస్తారని వెల్లడిస్తున్నారు. ఓర్వకల్లు వద్ద పరిశ్రమలకు భూమి మంజూరు ప్రక్రియ పూర్తయినా నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారని అయితే నీటి వసతి లేకపోవడంతో ఇబ్బందికరంగా మారిందని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి రెండు మోటార్ల ద్వారా ఓర్వకల్లు పారిశ్రామికవాడకు నీటిని తరలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆ పనులు పూర్తయితే పరిశ్రమల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. తంగెడంచ ఫారం భూముల్లో రెండు పరిశ్రమలకు సంబంధించి నిర్మాణ పనులు ప్రారంభించాయని మరో 6 నెలల్లో ఉత్పత్తి కూడా ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తారన్న సమాచారంతో జిల్లా అధికారులు పూర్తి స్థాయి నివేదికలతో సిద్ధమవుతున్నారు. అంతేగాకుండా జరుగుతున్న పనుల్లో వేగం పెంచేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.