కర్నూల్

ఆక్రమణలతోనే వరద ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 23:‘ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదు, అక్రమ కట్టడాలు కూల్చేస్తాం, వరద బారి నుంచి ప్రజలను రక్షిస్తాం’ వరదల సమయాల్లో జిల్లా కలెక్టర్ నుంచి గ్రామ తలారి వరకూ ఇవే మాటలు వల్లె వేస్తున్నారు. వరద సమయంలో ప్రజలను పరామర్శించి వారికి అంతో ఇంతో నష్టపరిహారం చెల్లించి ఆ తరువాత అన్నీ మరచిపోతున్నారు. మళ్లీ ఏడాది తరువాత అదే వరద, అవే మాటలు ఇలాగే ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ ఒక ఆక్రమణలు తొలగించలేదు, వరద ఆగలేదు.. ఇదీ నంద్యాల, ఆత్మకూరు పట్టణాల్లోని ప్రజల మనోగతం. వర్షాకాలంలో ఓ మోస్తరు వర్షం కురిస్తే చాలు ఈ రెండు పట్టణాల్లోని కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరుతోంది. దాంతో పేదల బాధలు వర్ణనాతీతం. ఈ ఏడాది నంద్యాల, ఆత్మకూరులలో రెండోసారి వరద బాధలు చోటు చేసుకోగా అధికారులు మరోమారు అవే మాటలు వల్లె వేసి వెళ్లిపోయారు. నంద్యాల పట్టణానికి చామ కాలువ, ఆత్మకూరు పట్టణానికి గుండ్ల వాగు ప్రమాదకారిగా మారాయి. ఈ కాలువలు ఆక్రమణకు గురి కావడంతో భారీ వర్షం ద్వారా వచ్చే నీరు ఎటూ పోలేని స్థితిలో ఇళ్లలోకి చేరుతున్నాయి. నంద్యాల పట్టణానికి ప్రమాదకారిగా మారిన చామ కాలువ నల్లమల అడవి నుంచి పాలేరు వాగు ద్వారా వచ్చే నీరు చామ కాలువలో ప్రవహించి చివరకు కుందూ నదిలో కలుస్తుంది. నంద్యాల శివారులోని పొన్నాపురం కాలనీ నుంచి కుందూ నది చివరి వరకూ కాలువ ఆక్రమణకు గురైంది. అందులో పేదల గుడిసెలు మొదలు భారీ భవంతులు వెలిసాయి. ఈ నిర్మాణ సమయాల్లో అధికారులు వౌనం వహించి ఆ తరువాత ఆక్రమణలకు గురయ్యాయని ప్రభుత్వానికి నివేదికలు పంపడంతో సరిపెడుతున్నారు. చామ కాలువలో ప్రవహించే నీరు ఏ మాత్రం ప్రమాదం కాదని అయితే ఆక్రమణలతో నీరు ప్రవహించే దారి మూసుకుపోవడంతో నీరు కాలనీల్లోకి చేరుతోందని సాగునీటి శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వారి అంచనా ప్రకారం నల్లమల అరణ్యంలో ఒకే సారి 14 సెం.మీ వర్షం కురిసినా పాలేరు, చామ కాలువల ద్వారా నీరు సాఫీగా కుందూ నదిలో కలుస్తుందని పేర్కొంటున్నారు. అయితే ఆక్రమణల కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి ప్రజలకు ప్రమాదకారిగా మారిందని వారంటున్నారు. నీటి పారుదల శాఖ లెక్కల ప్రకారం చామ కాలువకు ఇరువైపులా 10మీటర్ల చొపున ఖాళీ స్థలం ఉండాల్సి ఉందన్నారు. అయితే ఆ స్థలమే కాకుండా కాలువను కూడా పూడ్చి నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రమాదం ప్రతి ఏటా నంద్యాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఇక ఆత్మకూరు పట్టణ నడిబొడ్డున ప్రవహించే గుండ్ల వాగు నల్లమల అరణ్యం నుంచి దిగువకు ప్రవహించి చిన్న కాలువ వాగుగా మారి ఆత్మకూరు పట్టణం మీదుగా శివారులోని భవనాశి నదిలో కలుస్తుంది. ఈ కాలువ సైతం దాదాపు పూర్తిగా ఆక్రమణకు గురైంది. పట్టణంలోని ఏకలవ్యనగర్ నుంచి గరీబ్‌నగర్ వరకూ పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు. దీంతో వాగు పరివాహకంలోని కాలనీల్లో వరద నీరు చేరి సామాన్యులను ప్రతి ఏటా తీవ్ర నష్టానికి గురిచేస్తోంది. వరద వచ్చిన ప్రతి ఏటా ఆక్రమణలను తొలగిస్తామని అధికారులు చెబుతున్నా ఆ పని ఇంత వరకూ చేయకపోవడంతో వారి మాటలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. తాజా వరదల నేపథ్యంలో కలెక్టర్ విజయమోహన్ నంద్యాల పట్టణంలో చామ కాలువ ఆక్రమణలపై నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, ఆత్మకూరులోని గుండ్లవాగుపై ఆక్రమణల తొలగింపునకు కర్నూలు ఆర్డీఓ రఘుబాబులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న ఒకటి, రెండు వారాల్లో ఆక్రమణలు తొలగిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడైనా కలెక్టర్ ఆదేశాలతో ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తారో లేక గతంలో మాదిరిగా వౌనం వహిస్తారో వేచిచూడాలి.