కర్నూల్

కాంగ్రెస్, వైకాపా కలిస్తే మేయర్ పీఠం కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 23:కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలు డిసెంబర్ చివర, జనవరి 15వ తేదీ లోపు నిర్వహించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఓటరు సవరణ కార్యక్రమం చేపట్టిన అధికారులు ఆ పని పూర్తయిన వెంటనే ఎన్నికల నిర్వహణకు సిద్ధపడాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనప్రాయంగా ఆదేశాలు సైతం అందాయి. దీంతో ఎన్నికలకు అధికార పార్టీ టిడిపితో పాటు వైకాపా, కాంగ్రెస్ సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయంపై టిడిపి చేయించిన సర్వే వారిలో గుబులు రేకెత్తిస్తోంది. నగర పాలిక ఎన్నికల్లో వైకాపా, కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపితే మేయర్ పీఠం దక్కించుకోవడం కష్టమేనని సర్వే నివేదిక స్పష్టం చేస్తోందని తెలుస్తోంది. నగరంలోని 51వార్డుల్లో 20 వార్డుల్లో వైకాపా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా మరో 8 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు సర్వేలో పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈ రెండు కలిస్తే సుమారు 30 నుంచి 32వార్డుల్లో టిడిపికి ఎదురు గాలి తప్పదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. వైకాపాకు అనుకూలంగా ఉన్న 20 వార్డుల్లో 11 వార్డులు అధికార పార్టీ నేతల నిరాదరణకు గురైన పాణ్యం నియోకవర్గంలోని కాలనీలకు చెందినవి కాగా 9 వార్డులు టిడిపి, బిజెపి దోస్తీ కారణంగా ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని లెక్కలు వెల్లడించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పాత నగరంతో పాటు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని రెండు, మూడు వార్డుల్లో ప్రజలు సానూకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దాంతో ఈ రెండు కలిస్తే అధికార పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవడం కష్టమేనని వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వైకాపాకు నాయకత్వ లేమి, కాంగ్రెస్ పార్టీకి విభజన కారణంగా ఉన్న వ్యతిరేకత టిడిపికి అనుకూలిస్తుందని సర్వే నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో వసతులు మెరుగుపరిచేందుకు తక్షణం చర్యలు తీసుకుంటే ఆయా వార్డుల్లోని ప్రజల్లో మార్పు వస్తుందని కూడా నివేదికలో సూచించినట్లు స్పష్టమవుతోంది. దీంతో రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. అంతేగాకుండా పార్టీకి చెందిన ముస్లిం మైనారిటీ నేతలను పాత నగరంలో బిజెపి దోస్తీ కారణంగా ఎలాంటి ఇబ్బంది లేదని అది కేవలం రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమని ప్రచారం చేయించడంతో పాటు పార్టీ పెద్దలు కూడా సభల ద్వారా ప్రజలకు వివరించి వారి మద్దతును కూడగట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కర్నూలు నగర పాలక సంస్థలో పాగా వేసే బాధ్యత ఎంపి టిజి వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డిలకు అప్పగించిన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.