కర్నూల్

రోడ్డు ప్రమాదాలపై దండయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 25:రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ చేపట్టామని ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని వ్యాస్ ఆడిటోరియంలో ‘రోడ్డు ప్రమాదాలపై దండయాత్ర’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకూ దాదాపు 5 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎస్పీతో పాటు డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 2013లో 1,661, 2014లో 1,786, 2015లో 1,845, 2016లో 1,301 ఇలా రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్నాయన్నారు. ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీంతో ప్రమాదాలను తగ్గించేందుకు ఈ సైకిల్ యాత్ర చేపట్టామన్నారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలను హాస్టల్స్‌లో చేర్చించే కార్యక్రమం చేపడతామన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్‌ఐ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులు తక్షణమే స్పందించి, అవసరమైతే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మద్యం అనుమతించే డాబాలపై దాడులు చేపట్టాలన్నారు. హైవేల్లో ఎక్కడిపడితే అక్కడ వాహనా చోదకులు వాహనం నిలపకూడదన్నారు. డ్రైవర్లు రాత్రివేళ విశ్రాంతి తీసుకుంటే చాలా వరకూ ప్రమాదాలను నివారించవచ్చు అన్నారు. వాహనాల వెనుక, ముందు రేడియం స్టిక్కర్ అతికించుకోవాలన్నారు. అతివేగం, మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వాహనం నడపటం, అతివేగం తదితర కారణాలతోనే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఎస్‌ఐ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్‌డి రవిప్రకాష్, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, సిఐలు, ములకన్న, క్రిష్ణయ్య, నాగరాజారావు, మధుసూదనరావు, ఆర్‌ఐ రంగముని, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

డ్రోన్ కెమెరాతో వరద నష్టం అంచనా
* ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి
నంద్యాల, సెప్టెంబర్ 25:రాష్ట్ర ప్రభు త్వం నంద్యాల ప్రాంతంలో వరద బాధిత ప్రాంతాలను పరిశీలించి, డ్రోన్ కెమెరాలతో వరద నష్టాలను అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాలను నంద్యాలకు పంపినట్లు ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం చామకాల్వ చిన్నవంతెన వద్ద శ్యామ్‌నగర్‌లో అధికారులు డ్రోన్ కెమెరాల ద్వారా నివాస గృహాలలో వరదనీరు చేరడం వల్ల జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు ప్రయోగాత్మకంగా కెమెరాలను ఉపయోగించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ హరినాథరెడ్డి, తహశీల్దార్ శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ వరదనీటిలో మునిగిన ప్రాంతాలను, వరదలో దెబ్బతిన్న రోడ్లను, దెబ్బతిన్న గృహాలను డ్రోన్ కెమెరాల ద్వారా సులభంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తద్వారా వెంటనే నిధులు మంజూరవుతాయని ఆయన తెలిపారు. రానున్న 48గంటల్లో కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిందని, కావున నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలతో పాటు సబ్ డివిజన్‌లోని ప్రజలు రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు ఏవైనా ప్రమాదాల సమాచారాన్ని వెంటనే హెల్ప్‌లైన్ సెంటర్‌కు సమాచారం ఇవ్వాలని ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

జలదిగ్బంధంలో సిసిఎస్ పోలీస్‌స్టేషన్!
కర్నూలు, సెప్టెంబర్ 25:నగరంలోని జిల్లా సెంట్రల్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ జలదిగ్బంధమై నీటికుంటను తలపిస్తోంది. నగరంలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల కర్నూలు సిసిఎస్ పోలీస్‌స్టేషన్ నీటిలో మునిగిపోయింది. స్టేషన్‌లోకి వెళ్లాలంటే డీఎస్పీతో సహా సిబ్బంది మోకాలు లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనాలను సైతం నీటిలో పార్కింగ్ చేయాల్సిందే. జిల్లా ఎస్పీ నివాసం ఉండే బంగ్లా పక్కనే సిసిఎస్ పోలీస్‌స్టేషన్ ఉండటం గమనార్హం. పోలీస్‌స్టేషన్‌ను చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే కర్నూలు సిసిఎస్ పోలీస్‌స్టేషన్ నీటిలో మునిగిన విషయాన్ని ఉన్నతాధికారులు మరచిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిసరాలు-పరిశుభ్రత అన్న ప్రభుత్వ కార్యక్రమం కర్నూలు సిసిఎస్ పోలీస్‌స్టేషన్‌కు వర్తించదా అనే విమర్శలు లేకపోలేదు.

జానపదాలు
పల్లె సంప్రదాయానికి ప్రతీకలు
* ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 25:జానపదాలు పల్లె సంప్రదాయానికి ప్రతీకలు అని ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు పేర్కొన్నారు. నగరంలోని శ్రీలక్ష్మీ ఫం క్షన్ హాలులో ఆదివారం ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి సాంస్కృతిక మేళాలో భాగం గా జానపద నృత్య, పాటల పోటీలు నిర్వహించారు. ఇందులో చిన్నారులు ప్రదర్శించిన జానపద నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నేటి యువత పల్లె సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకూడదన్నారు. జానపదాలు గ్రామీణ ప్రాంతాల జీవన విధానాన్ని తెలియజేసే విధంగా ఉండటమే కాకుండా ప్రాచీన సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు పాడుకునే జానపదాలు నేటికీ ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయన్నారు. పంట పొలాల నుంచి ఇంటికి వచ్చాక ఇంటి ముందు అరుగు మీద కూర్చొని రాగాలు తీయటం, పాటలు పాడకోవటం ఒక సంప్రదాయంగా వస్తుందన్నారు. పూర్వం రాజులు కళలను ప్రోత్సహించే వారని, అయితే నేడు వాటికి ఆదరణ తగ్గిపోయిందన్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయటానికి గత కొనే్నళ్లుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రెండవ పటాలం కమాండెంట్ విజయ్‌కుమార్, మెప్మా పిడి రామాంజనేయులు, ఎస్వీ ఫౌండేషన్ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

జేబు దొంగల అరెస్టు
* రూ. 6.18 లక్షల నగదు స్వాధీనం:ఎస్పీ రవికృష్ణ
కర్నూలు, సెప్టెంబర్ 25:అంతర్ జిల్లా జేబు దొంగలను అరెస్టు చేసి వారి నుంచి రూ. 6.18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. దానికి సంబంధించి ఆదివారం ఎస్పీ నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఉన్న కెఎస్ వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అరెస్టు చేసిన జేబుదొంగలను నగరంలోని ముజఫర్‌నగర్‌కు చెందిన జగన్ కుమారుడు నీలి షికారి షారుఖ్‌ఖాన్, షేక్షావలి కుమారుడు శాలిమియ్య, అశోక్ కుమారుడు మాదిగ గంగాధర్, గూ డూరు గ్రామానికి చెందిన బషీర్ కుమారుడు షేక్ సుబాన్‌గా గుర్తించినట్లు తెలిపారు. ఆ నలుగురు దొంగ లు శనివారం రాత్రి కర్నూలు రైల్వేష్టేన్ సమీపంలో ఉండగా అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిపై కర్నూలు 2,4వ పట్టణ పోలీస్‌స్టేషన్లతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరు కర్నూలు ఆర్టీసీ బస్టాండ్, బళ్లారి చౌరస్తా, వెల్దుర్తి టోల్‌గేట్, అలంపూర్ చౌరస్తాలోని టోల్‌ప్లాజా ప్రాంతాల్లో బ్యాగులు, వ్యక్తుల జేబులను కత్తిరించి చోరీలకు పాల్పడేవారన్నారు. అలా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకుంటూ దుర అలవాట్లకు బానిసలైనట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇక వీరు కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద జేబులు కత్తిరించడం, ఏపిఎస్పీ క్యాంపు వద్ద ఇద్దరు మహిళలను ఆటోలో ఎక్కించుకుని వారి బ్యాగులు దొంగలించిన కేసులో, 15 రోజుల క్రితం అలంపూర్ చౌరస్తా వద్ద కారులో నిద్రిస్తున్న వారి డబ్బు దొంగలించిన కేసుల్లో దాదాపు రూ. 6.18 లక్షల నగదు, ఒక సెల్‌ఫోన్, ఒక గ్రా ము బంగారు తాళిబొట్టు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ దొంగలను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన కర్నూలు సిసిఎస్ డీఎస్పీ హుసేన్‌పీరా, సిఐ పవన్‌కిషోర్, ఎస్‌ఐలు రసూ ల్, శ్రీనివాసులు, హెచ్‌సి మస్తాన్, పిసిలు సుదర్శనం, నాగరాజు, రవి, షమీర్, కిశోర్‌లను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్‌డి రవిప్రకాష్, ట్రాఫిక్, సిసిఎస్ డీఎస్పీలు రామచంద్ర, హుసేన్‌పీరా, సిఐ పవన్‌కిషోర్, లక్ష్మయ్య, పట్టణ సిఐలు క్రిష్ణయ్య, ములకన్న, మధుసూదనరావు, నాజరాజారావు పాల్గొన్నారు.

సిద్దాపురం ఎత్తిపోతల పథకం
డిసెంబర్‌లోపు పూర్తి
* ఎమ్మెల్సీ శిల్పా
ఆత్మకూరు, సెప్టెంబర్ 25:ఈ ఏడాది డిసెంబర్ లోపు సిద్దాపురం ఎత్తిపోతల పథకం పూర్తవుతుందని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం పూర్తయితే ఆత్మకూరు మండలంలో దాదాపు 25 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఎమ్మెల్సీ శిల్పా ఆదివారం సిద్దాపురం చెరువును పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలోనే పెద్దదైన సిద్దాపురం చెరువు రెండేళ్ల తర్వా నిండుతుండడం చాలా సంతోషకరం అన్నారు. చెరువులో 10 అడుగుల నీరు చేరడం వల్ల రైతులు వరి సాగు చేసుకోవడానికి వీలుంటుందన్నారు. అయితే చెరువుకు గండి పడడం ఆందోళన కలిగించే విషయమని, అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువు మరమ్మతులకు కావాల్సిన నిధులను సిఎం చంద్రబాబు మంజురు చేస్తారన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సిద్దాపురం చెరువు ఎత్తిపోతల పథకం ఆలస్యం అవుతుందని, డిసెంబర్‌లోపు పూర్తవుతుందన్నారు. సిఎం చంద్రబాబు రైతుల అభివృద్ధి కోసం అనేక సంక్షే మ పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని ఉపయోగించుకోవాలన్నారు. పంటలు ఎండిపోకుండా ట్యాంకుల ద్వారా నీరు అందించాలన్నారు. అనంతరం శిల్పా ఆత్మకూరు పట్టణంలో వరదలకు మునిగిపోయిన కాలనీల్లో పర్యటించారు. గుండ్లకమ్మ వాగును కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడం వల్ల కాలనీల్లోకి నీరు వచ్చి చేరుతుందన్నారు. కావున అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తే మంచిదని, అందరూ తొలిగింపు కార్యక్రమానికి సహకరించాలన్నారు. ఎమ్మెల్సీ శిల్పా వెంట నగర పంచాయతీ చైర్మన్ నూర్‌అహమ్మద్, శిల్పా భవనేశ్వరరెడ్డి, గౌస్, కృష్ణగౌడ్, రాజగోపాల్, వెంకటరాముడు, తదితరులు ఉన్నారు.

నాణ్యమైన విద్యను బోధించాలి
* ‘ఆదర్శ’ ప్రిన్సిపాళ్ల సమావేశంలో కలెక్టర్
కర్నూలు, సెప్టెంబర్ 25:ఆదర్శ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శంగా నిలిచేలా సంబంధిత ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆదివారం మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రిన్సిపాళ్లు ప్రత్యేక శ్రద్ధ చూపి అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రహరీ వున్న పాఠశాలల్లో పండ్ల మొక్కలు, కూరగాయాలు పెంచాలన్నారు. ప్రహరీ లేని చోట ట్రీగార్డులతో మొక్కలను సంరక్షించాలన్నారు. పండ్ల మొక్కలను ఎన్‌ఆర్‌ఇజిఎస్ నుంచి తెప్పించుకోవడంతో పాటు చౌడునేల వుంటే చెరువు మట్టిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. గురుకుల పాఠశాలల తరహాలో ఆదర్శ పాఠశాలల కూడా గ్రీనరీగా కనపడాలన్నారు. ప్రధానంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మంచి ఆహార పదార్థాలలో భోజనం అందించాలన్నారు. పాఠశాలల్లో ఏదైనా సంఘటన జరిగితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. అవసరం మేరకు గ్రాంథాలయాలకు పుస్తకాలు, స్పోర్ట్స్ పరికరాలు అందిస్తామన్నారు. విద్యాబోధనలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు అవలంభించాలన్నారు. ఏవైనా అవసరం ఉంటే ప్రతిపాదనలు సమర్పిస్తే అనుమతి మంజూరు చేస్తానన్నారు. తాను చెప్పిన పనులన్నీ తూచ తప్పకుండా ఏర్పాటు చేసి సంబంధిత నివేదికలను డిప్యూటీ డిఇఓలకు అందజేయాలన్నారు. దోమల నిర్మూలనపై 8,9,10 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రజల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. సమావేశంలో డిఇఓ రవీంద్రారెడ్డి, ఇఇ ప్రతాపరెడ్డి, డిప్యూటీ డిఇఓలు, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రయాణంలో
జాగ్రత్తలు పాటించాలి:ఎస్పీ
ఓర్వకల్లు, సెప్టెంబర్ 25:రోడ్డు ప్రయాణంలో తగిన జాగ్రత్తలు పాటించడంతో పాటు వేగం తగ్గించి జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలపై దండయాత్రలో భాగంగా ఆదివారం మండల పరిధిలోని నన్నూరు గ్రామంలో తాలూకా సిఐ నాగరాజుయాదవ్ ఆధ్వర్యంలో నన్నూరు-ఓర్వకల్లు వరకూ చేపట్టిన సైకిల్ ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ఎస్‌ఐ నుంచి డీఎస్పీ స్థాయి వరకూ అధికారులు స్పందించి బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదం జరిగే స్థలాలను గుర్తించి వేగ నిరోధక గుర్తులు వేయించాలన్నారు. క్యాక్రమంలో ఓర్వకల్లు, ఉల్లిందగొండ ఎస్‌ఐలు చంద్రబాబునాయుడు, వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది, ఆయా గ్రామాల యువత పాల్గొన్నారు.

కన్నీరు మిగిల్చిన ఖరీఫ్!
* పంట వాడిన తర్వాత వర్షాలు
* నష్టపోయిన మొక్కజొన్న, పత్తి, మిరప రైతులు
ఓర్వకల్లు, సెప్టెంబర్ 25 : వ్యవసా యం ఆశల జూదంగా మారిన నేపథ్యంలో మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఈ ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల మరోసారి నష్టపోయారు. జూన్ ఆరంభంలో కురిసిన వర్షంతో ముమ్ముందు కూడా వర్షాలు బాగా కురుస్తాయన్న ఆశతో మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు 4వేల ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి, మిరప, ఆముదం, కొర్ర పంటలు సాగు చేశారు. అయితే జూన్ తర్వాత ఇతర మండలాల్లో వర్షాలు కురిసినా ఓర్వకల్లు మండలంలో చినుకు జాడే కనిపించలేదు. దీనికి తోడు ఎండలు వేసవిని తలపించాయి. ఈ పరిస్థితుల్లో విత్తనం వేసిన తర్వాత వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వాడిపోయి ఎదుగుదలకు నోచుకోలేదు. 10 రోజుల క్రితం మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. కానీ అప్పడికే సమయం మించిపోయింది. మొక్కజొన్న పంట విత్తనాలు లేని కంకులు కాసాయి. అలాగే పత్తి, మిరప కూడా పూత దశ దాటిన తర్వాత వర్షం కురిసింది. దీంతో ఆయా పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదిలా వుండగా ఆ సమయంలో కురిసిన వర్షం వల్ల కంది, కొర్ర, ఆముదం పంటలు కొద్దిగా కోలుకుని అంతోఇంతో దిగుబడి పొందే అవకాశం వున్నట్లు రైతులు భావిస్తున్నారు. మొక్కజొన్న సాగుచేసిన రైతులు ఆ పంటను తొలగించి ఇతర పంటల సాగుకు సమాయత్తం అవుతున్నారు. ప్రస్తుతం జిల్లా అంతా భారీగా వర్షాలు కురుస్తున్నా ఓర్వకల్లు మండలంలో అరకొర వర్షాలే కురుస్తున్నాయి. రబీ సీజన్‌లో శెనగ పంట సాగు చేయడానికి రైతులు తమ పొలాలను తయారు చేసుకుని, ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. కావున ప్రభుత్వం స్పందించి ఖరీఫ్‌లో పంటలు సాగు చేసిన దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. రబీ సీజన్‌లోనైనా శెనగ, మినుము పంటలకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందించి చేయుత ఇవ్వాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరి మృతి
బేతంచెర్ల, సెప్టెంబర్ 25:మండల పరిధిలోని గోరుమానుకొండ బస్టాప్ సమీపంలో ఆదివారం రాత్రి ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో బేతంచెర్లకు సత్యనారాయణ(38) మృతి చెందాడు. వివరాలు.. బేతంచెర్ల పట్టణంలోని సిమెంట్‌నగర్‌కు చెందిన సత్యనారాయణ గత నాలుగేళ్లుగా బేతంచెర్లలో నాపరాయి పరిశ్రమ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏదో పనిపై కర్నూలు వెళ్లి ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తుండగా గోరుమానుకొండ కనుమ వద్ద ఎదురుగా వస్తున్న పేరుసోములకు చెందిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ సంఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తిరుపాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం గురించి ఆరా తీశారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.