కర్నూల్

అక్రమాల అడ్డా.. ఆదోని బంగారు బజారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, అక్టోబర్ 20:పట్టణంలోని బంగారు బజారు అక్రమాలకు అడ్డాగా మారిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక్కడ జీరో వ్యాపారంతోనే పెద్దఎత్తున బంగారు, వెండి నగల వ్యాపారం సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా తెలిసినా ఆదాయపు పన్ను అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే అని చెప్పవచ్చు. బంగారు బజారులోని వ్యాపారులంతా ఎలాంటి బిల్లులు లేకుండా చిన్న చిన్న చీటీల రూపంలోనే వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో ఏటా ప్రభుత్వ ఆదాయానికి రూ. కోట్లల్లో గండి పడుతోంది. ఇటీవల ఈ వ్యాపారం మరింత పెరిగింది. ఇలా జీరో వ్యాపారం చేస్తూ పట్టుబడిన రూ. లక్షల నగలను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు పెట్టినా జీరో వ్యాపారం మాత్రం ఆగడం లేదు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే బంగారు బజారు ఉంది. పోలీస్ స్టేషన్, పోలీసులు ఉన్నారన్న భయం, జంకులేకుండా పెద్దఎత్తున జీరో వ్యాపారం సాగిస్తున్నారు. పోలీసులు పట్టుకున్న బంగారు, వెండి నగలే ఆదోని బంగారు బజారులో జరిగే జీరో వ్యాపారానికి నిదర్శనం. ముఖ్యంగా ఎలాంటి బిల్లులు లేకుండా తమిళనాడు, ప్రొద్దుటూరు, ముంబయి, బళ్లారి నుంచి రూ. లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను అక్కడి వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా ఇక్కడి వ్యాపారులకు అందజేస్తున్న సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఈ వ్యాపారంలో ఎలాంటి బిల్లులు ఉండవు కేవలం పుస్తకాల్లో మాత్రమే రాసుకుంటారు. ఇక్కడి వ్యాపారులకు వెండి, బంగారు నగలు ఇచ్చి కొద్ది రోజుల తరువాత వచ్చి డబ్బు వసూలు చేసుకుంటారు. అంతేకాకుండా కొందరు ఏజెంట్లు వ్యాపారులతో కొంత సొమ్మును తీసుకుని హైదరాబాద్, ప్రొద్దుటూరు, ముంబయి, చెన్నై ప్రాంతాలకు వెళ్లి బంగారం తీసుకుని వ్యాపారులకు జీరో వ్యాపారం ద్వారా అందించడం కూడా జరుగుతోంది. తద్వారా బంగారు బజారులో పలువురు వ్యాపారులు డబ్బులు లేకుండా జీరో వ్యాపారం చేసి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యాపారాలను అరికట్టాల్సిన ఆదాయ పన్ను శాఖ అధికారులు నామమాత్రం దాడులు కూడా చేయని పరిస్థితి ఉంది. అందువల్ల బంగారుబజారులో జీరో వ్యాపారం పెద్దఎత్తున కొనసాగుతుంది. జీరో బిజినెస్‌కు తోడు బంగారు నగల కొనుగోలులో ప్రజలను కూడా వ్యాపారులు పెద్దఎత్తున మోసం చేస్తున్నారు. ఒక తులం బంగారు కొనుగోలు చేసి ప్రజలు బంగారు నగ చేయిస్తే అందులో 70 నుంచి 80శాతం మాత్రమే బంగారం ఉంటుంది. మిగిలిన అంతా తరుగు పేరుతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు మాత్రం తరుగుకు డబ్బులు తీసుకోకుండా 85శాతం నుంచి 90శాతం వరకూ కూడా బంగారు నగలు అందజేస్తున్నారు. ఇదిలా ఉండగా తనకు సైతం 80శాతం కూడా బంగారం లేని నగలు ఇచ్చారని డీఎస్పీ శ్రీనివాసరావు విలేఖరుల సమావేశంలో పేర్కొనడం గమనార్హం. ఇక సామాన్య ప్రజల పట్ల వ్యాపారుల దోపిడీ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. చివరకు వెండి గొడుగుల్లో సైతం సిల్వర్ కల్తీచేసి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఆదోని బంగారు బజారులో వ్యాపారుల అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాకి లెక్కలు చెప్పి మోసం చేస్తారా..
* ప్రభుత్వంపై కోట్ల ఆగ్రహం

కర్నూలు, అక్టోబర్ 20:వర్షాభావ పరిస్థితుల్లో సాగునీటి కోసం అర్రులు చాచిన పంటలను రెయిన్‌గన్ల ద్వారా కాపాడామని ప్రభుత్వం వాస్తవాలను దాచి ప్రచారం చేసుకుంటోందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని డిసిసి కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక తడి సాగునీరు ఇవ్వాలంటే ఎంత నీరు అవసరమో పూర్తిస్థాయి లెక్కలు వివరించకుండా కాకి లెక్కలు చెప్పి అమాయక రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. సాగునీటి లెక్కల ప్రకారం ఒక టిఎంసి నీరు 6 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు, 5 వేల ఎకరాల్లో వరి పంట సాగుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఒక క్యూసెక్కు నీరు అంటే ఒక క్షణంలో 28 లీటర్ల ప్రవాహమని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన 11,500క్యూసెక్కుల నీరు 24గంటల పాటు నిరంతరాయంగా ప్రవహించి ఒక చోట చేరితే అక్కడ ఒక టిఎంసి నీరు నిల్వ ఉంటుందని కోట్ల వివరించారు. ఈ నీటిని తరలించాలంటే 5 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న 3.74 లక్షల ట్యాంకర్లు అవసరమవుతాయర్కొన్నారు. సాధారణంగా ఆరు తడి పంటలకు మూడు, నాలుగు దఫాలు సాగునీరు అందిస్తారన్నారు. ప్రభుత్వం ఒక్కసారి సాగునీరు అందించినా 6 వేల ఎకరాలకు 0.34 టిఎంసిల నీరు అందిచాల్సి ఉంటుందని లెక్కగట్టారు. ఈ లెక్కల ప్రకారం ప్రభుత్వం 5 వేల ఎకరాల్లో రెయిన్‌గన్ల ద్వారా సాగునీరు అందించాలంటే 1.25 లక్షల ట్యాంకర్ల నీరు అవసరమని తేల్చారు. అయితే ప్రభుత్వం రాయలసీమలో 7.5 లక్షల ఎకరాల్లో పంటలకు రెయిన్‌గన్ల ద్వారా సాగునీరు అందించామని చెబుతోందని ఈ విస్తీర్ణంలో ఒక తడి నీరివ్వాలంటే సుమారు 42టిఎంసిల నీరు అవసరమని లెక్క తేల్చారు. ఇంత నీరు ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిందా అని ఆయన ప్రశ్నించారు. రెయిన్‌గన్ల ద్వారా సాగునీరందించిన వివరాలపై ప్రభుత్వం వాస్తవాలను రైతులకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తాను కూడా ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నానని రెయిన్‌గన్ల ద్వారా టిడిపి కార్యకర్తల్లో కొందరికి మాత్రమే సాగునీరు అందించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇతర రైతులు అధికారులు వెంటపడితే కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఒక వైపు రైతులకు సహకరించకుండా మరో వైపు పెద్దఎత్తున పంటలకు సాగునీరిచ్చి కాపాడామని గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవార చేశారు. అన్నదాతలను మోసం చేస్తే పుట్టగతులుండవని కోట్ల హెచ్చరించారు. సమావేశంలో డిసిసి అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు.
పోలీసుల సేవలు చిరస్మరణీయం
* అమరవీరులను స్మరించుకుంటూ మెగా సైకిల్ ర్యాలీ
* పాల్గొన్న ఎంపిలు టిజి, రేణుక
కర్నూలు, అక్టోబర్ 20:పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం ఎస్పీ ఆకే రవికృష్ణ జిల్లా పోలీసు యంత్రాంగం, యువతీ, యువకులతో కలిసి 20 కిలోమీటర్ల మెగా సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథులుగా రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్, ఎంపి బుట్టా రేణుక, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రూంభూపాల్‌రెడ్డి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి టిజి వెంకటేష్ మాట్లాడుతూ ప్రజా నాయకులు, పోలీసులు కలిసి మెగా సైకిల్ ర్యాలీ చేపట్టడం అభినందనీయమన్నారు. పోలీసులు దేశ రక్షణలో, అంతర్గత శాంతి భద్రతలు కాపాడటంలో రెండు విధాలుగా విధులు నిర్వర్తిస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారన్నారు. జిల్లా ఎస్పీగా ఆకే రవిష్ణ బాధ్యతలు చేపట్నిన తర్వాత ప్రజలు, పోలీసులకు సత్సంబంధాలు ఏర్పరచి సమాజానికి దగ్గర చేసి నూతన పద్ధతికి శ్రీకారం చుట్టారన్నారు. ఫ్యాక్షన్ గ్రామంలో ప్రభుత్వ నిధులతో హైస్కూల్ ఏర్పాటు చేశారన్నారు. నగరంలో మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు మంచి పనితీరు కనబరిచే పోలీసులను కేటాయించాలని ఎస్పీకి సూచించారు. ఎంపి రేణుక మాట్లాడుతూ మెగా సైకిల్ ర్యాలీకి శ్రీకారం చేపట్టిన ఎస్పీని అభినందించారు. అక్టోబర్ 21వ తేదీ పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తామన్నారు. వారి త్యాగాలను గుర్తిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి మెగా సైకిల్ ర్యాలీ చేపట్టిన ఎస్పీ, జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడేందుకు దేశ సరిహద్దుల్లో, దేశంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. రక్త, నేత్రదానంలో కర్నూ లు జిల్లా పోలీసులు విస్తృతంగా ప్రచా రం చేసి ప్రజలను చైతన్యపరచడం అభినందనీయమన్నారు. ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. చైనా ఇండియా సరిహద్దులో భారత భూగాగాన్ని కాపాడుతూ చైనీయులతో వీరోచితంగా పోరాడి 11మంది సిఆర్‌పిఎఫ్ పోలీసులు లేహ్ అనే ప్రాంతంలో వీరమరణం పొందారన్నారు. ఆ అక్టోబర్ 21వ తేదీన ఆ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడి 4డీగ్రీల చలిలో ఆ అమరవీరుల మృతదేహాలను ఇంటికి తీసుకురాలేని పరిస్థితుల్లో అక్కడే ఖననం చేసి వారి చితాభస్మాన్ని బాక్సుల్లో వారి ఇళ్లకు పంపించారన్నారు. వారు చేసిన త్యాగాన్ని స్మరించుకోవడం కోసం ప్రతి ఏడాది అక్టోబర్ 21వ తేదీని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తున్నామన్నారు. ర్యాలీలో ఏఆర్ ఏఎస్పీ వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, రామచంద్ర, వెంకటాద్రి, మురళీధర్, సిఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బం ది, యువతీ, యువకులు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.
కప్పట్రాళ్ల నుంచి ఐఎఎస్, ఐపిఎస్‌లను
తయారు చేయడమే ధ్యేయం:ఎస్పీ
దేవనకొండ, అక్టోబర్ 20:మండల పరిధిలోని కప్పట్రాళ్ల గ్రామం నుంచి కనీసం ఒక ఐఎఎస్, ఒక ఐపిఎస్ అధికారులను తయారు చేసి గ్రామ రచ్చబండ దగ్గర వారికి సన్మానం చేయడమే తమ ధ్యేయమని ఎస్పీ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. తన దత్తత గ్రామమైన కప్పట్రాళ్లలో దాత పారా విశ్వనాథం నిర్మించిన సీతారాముల, వాల్మీకి మహర్షి ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో గురువారం ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను ఉద్యోగరీత్యా ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లినప్పటికీ కప్పట్రాళ్ల గ్రామాభివృద్ధిని మాత్రం మరువనన్నారు. గ్రామంలోని విద్యార్థులు బాగా చదివి జిల్లాస్థాయి అధికారులు కావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగ గ్రామస్థులు మద్యం తాగడం మానాలన్నారు. ఎవరైనా మద్యం తాగి వస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆలయ దాత పారా విశ్వనాథం మాట్లాడుతూ ప్రజలందరూ సత్యం, ధర్మం, అంహిస మార్గంలో నడవాలన్నారు. కప్పట్రాళ్ల ప్రజల మార్పుకోసం తన వంతు సహకారం అందిస్తామన్నారు. విఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుబాస్‌చంద్రబోస్ మాట్లాడుతూ కప్పట్రాళ్లలోనే గాక జిల్లాలో వాల్మీకులు అధికంగా ఉన్నారని వారిలో మార్పు కోసం ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. కప్పట్రాళ్లలో వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఎస్పీ తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. గ్రామంలో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ. 4.5లక్షలు, అదనపు గదుల నిర్మాణానికి రూ. 4 లక్షను నంద్యాల ఎంపి ఎస్‌వివై రెడ్డి మంజూరు చేశారన్నారు. ఎస్పీతో పాటు ఎంపిపి రామచంద్రనాయుడు, అధికారులు భూమిపూజ చేశారు. అలాగే సీతారాముల, లక్ష్మణుల, వాల్మీకి మహర్షి విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠలో గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆస్పరి జడ్పీటిసి బొజ్జమ్మ, వాల్మీకి సంఘం నాయకులు, పత్తికొండ సిఐ విక్రమసింహ, కోడుమూరు ఏఓ అక్బర్‌బాషా, పిఆర్ ఏఇ మహ్మద్‌బాషా, విశ్రాంత హెచ్‌ఎం రామరాజు, ఎస్‌ఐ గంగయ్యయాదవ్ పాల్గొన్నారు.
రైతు కూలీల వలస బాట!
కోసిగి, అక్టోబర్ 20:మండల వ్యాప్తంగా గ్రామాల్లో ఎలాంటి ఉపాధి పనులు లేక ప్రజలు వలసబాట పట్టారు. కోసిగిలోని కడపాళ్యం, చింతకుంట, పల్లెపాడు గ్రామాల్లో గురువారం దాదాపు 400మందికి పైగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఖరీఫ్‌లో పంటలు సాగు చేయగా వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని, దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు మారెన్న, ఈరప్ప, వీరేష్, తదితరులు వాపోయారు. గ్రామంలో ఎలాంటి ఉపాధి పనులు లేకపోవడం, పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చడానికి వలసబాట పట్టినట్లు వారు స్పష్టం చేశారు. ఉపాధి కోసం గుంటూరు, బెంగళూరు, ముంబయి, వంటి నగరాలకు వెళ్తున్నట్లు వలస కూలీలు తెలిపారు.
ప్రభుత్వాసుపత్రిలో
సౌకర్యాల కల్పనకు కృషి
* ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, అక్టోబర్ 20:పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అఖిల గురువారం ప్రభుత్వ వైద్యశాలలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆళ్లగడ్డ వైద్యశాలకు వంద పడకల కోసం ఇదివరకే ప్రతిపాదనలు పంపామని, అవి ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయన్నారు. ఈ వైద్యశాలలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు కృషి చేయాలన్నారు. వైద్యశాలకు ఏవైనా పరికరాలు, మందులు అవసరమైతే తన దృష్టికి తీసుకువస్తే వాటిని సమకూరుస్తామన్నారు. అలాగే మూలనపడ్డ అంబులెన్స్‌కు మరమ్మతులు చేయిస్తామని లేదా శోభానాగిరెడ్డి ట్రస్టు నుంచి అంబులెన్సు ఇప్పిస్తామన్నారు. అనంతరం ఆమె బాలింతలకు బేబీ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో వైద్యురాలు సుజాత, దస్తగిరిరెడ్డి, నాయకులు బివి రామిరెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా టాటా కంపెనీ వైస్ చైర్మన్ కృష్ణకుమార్ గురువారం ఎమ్మెల్యే అఖిలప్రియను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపినట్లు తెలిసింది.
ఉత్సవమూర్తులకు పీఠాధిపతి పూజలు
ఆళ్లగడ్డ, అక్టోబర్ 20:ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో 46వ పీఠాధిపతి శ్రీవన్‌శఠగోపరంగనాథయతీంద్ర మహాదేశికన్ స్వామి ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా పవిత్రాలతో అలంకరించారు. 46వ జియర్ స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. నిత్యపూజ అనంతరం స్వామి సన్నిధిలో ప్రధాన అర్చకులు, అర్చక బృందం హోమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రంథాలయ భవన నిర్మాణాలకు
నిధులు మంజూరు
* జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి
ఓర్వకల్లు, అక్టోబర్ 20:జిల్లా వ్యాప్తంగా 14 గ్రంథాలయ భవన నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 3కోట్లు మంజూరు చేసిందని గ్రంథాలయశాఖ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీనివాసరెడ్డి గురువారం మండల పరిధిలోని నన్నూరు గ్రామం శాఖ గ్రంథాలయాన్ని తనిఖీ చేసి పాఠకుల రిజిస్టర్‌ను పరిశీలించారు. అలాగే లైబ్రేరియన్ కృష్ణారెడ్డిని అడిగి గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. పనివేళలు తప్పక పాటించాలని, నిర్ధేశించిన వార్తా పత్రికలను ఖచ్చితంగా గ్రంథాలయంలో వుంచాలన్నారు. ప్రభుత్వం మొదటి విడతగా గ్రంథాలయాల భవన నిర్మాణాలకు రూ. 1.4 కోట్లు విడుదల చేసిందని, ఈ నిధులతో 14 గ్రంథాలయ భవన నిర్మాణాలకు టెండర్లు కూడా నిర్వహించామన్నారు. త్వరలో భవన నిర్మాణాలు ప్రారంభిస్తామని తెలిపారు. మరో 7 భవనాల నిర్మాణాల నిధుల విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. 2017-18లో కొత్తగా 4 భవనాల నిర్మాణానికి నంద్యాల, డోన్, బేతంచెర్ల, ఆదోని పట్టణాలల్లో స్థలం సేకరించామన్నారు. జిల్లాలో 58 శాఖా గ్రంథాలయాలు, 1 కేంద్రీయ గ్రంథాలయం, 3 గ్రామీణ ప్రాంత గ్రంథాలయాలు, 120 పుస్తక పంపిణీ కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రంథాలయాల్లో జిల్లా వ్యాప్తంగా రూ. 10 లక్షల ఖర్చుతో ఫర్నిచర్, రూ. 5లక్షల ఖర్చుతో కంప్యూటర్లు, రూ. 3 లక్షలతో స్టేషనరీ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పాఠకుల సంఖ్యను తెలుసుకోవడానికి 20 శాఖలలో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు. అలాగే పాఠకుల డిమాండ్‌పై రూ. 6లక్షల ఖర్చుతో ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక పుస్తకాలు తెప్పిస్తామన్నారు.
మహిళ హత్యకేసులో
నిందితుల అరెస్టు
* ప్రియుడే హంతకుడు..
* ఎస్పీ సమక్షంలో మృతదేహం వెలికితీత
కర్నూలు, అక్టోబర్ 20:మహిళ హత్య కేసులో నిందితులను గురువారం కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. నూర్‌అహ్మద్ కర్నూలు మండలం పంచలింగాల శివారులోని తన ఫామ్‌హౌస్ పక్కన సంధ్యారాణి(35)ని హత్య చేసి చెత్త దిబ్బలో పూడ్చి పెట్టాడు. దీంతో సంధ్యారాణి కనిపించకపోవడంతో సోదరి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కర్నూలు 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పోలీసులు నూర్‌అహ్మద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సర్వశిక్షా అభియాన్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తూ ఆళ్లగడ్డ పట్టంలో ఒక స్కూల్ కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆక్రమంలో ఆళ్లగడ్డకు చెందిన సంధ్యారాణితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న నూర్ భార్య పర్వేజ్ వ్యతిరేకిస్తూ నిత్తం భర్తతో గొడవపడేది. ఈ నెల 7వ తేదీ సంధ్యారాణి నూర్ కోసం కర్నూలుకు వచ్చింది, ఈ విషయం తెలుసుక్ను నూర్ భార్యతో పాటు బావమరుదులు, కుటుంబ సభ్యులు కర్నూలుకు చేరుకుని పంచలింగాల దగ్గర ఉన్న నూర్ ఫామ్‌హౌస్‌లో సంధ్యారాణిని హత్య చేసి చెత్తదిబ్బలో పూడ్చిపెట్టినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో గురువారం ఉదయం ఎస్పీ రవికృష్ణతో పాటు కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, 3వ పట్టణ సిఐ మధుసూదనరావు, సంధ్యారాణి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకోగా వారి సమక్షంలోనే సంధ్యారాణి మృతదేహాన్ని బయటికు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించారు. ప్రియురాలిని అడ్డుతొలగించుకునేందుకే కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేసినట్లు నిందితుడు నూర్‌అహ్మద్ పోలీసుల సమక్షంలో అంగీకరించాడు. దీంతో నూర్‌అహ్మద్‌తో పాటు బావమరుదులను కర్నూలు 3వ పట్టణ సిఐతో పాటు ఎస్‌ఐ జయన్న, ఏఎస్‌ఐ సురేంద్ర అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు. అలాగే నేరానికి ఉపయోగించిన విస్టా కారు, మరొక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్టు
బేతంచెర్ల, అక్టోబర్ 20:బాలికను కిడ్నాప్ చేసిన కేసులో మహేష్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు. వివరాలు.. పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన సుమలత(14)ను ఈ నెల 18వ తేదీ ఎద్దుల మహేష్ బలవంతంగా ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అయితే సుమలతకు ఆమె తల్లి ఫోన్ చేయగా బాలిక లద్దగిరిలో ఉన్నట్లు తెలియడంతో తల్లిదండ్రులు వెళ్లి తీసుకెళ్లారు. మహేష్ బేతంచెర్లలోని డోన్ రహదారి కూడలో సంచరిస్తుండగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి
* సి.బెళగల్‌లో పోలీసు పికెట్
సి.బెళగల్, అక్టోబర్ 20:సి.బెళగల్ గ్రామంలో సాగునీటి విషయమై ఈ నెల 14వ తేదీ ఇరు వర్గాలకు చెందిన రైతులు ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో గాయపడిన రైతు బోయ నల్లన్న(35) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఘర్షణలో తీవ్రంగా గాయపడిన గత వారం రోజుల నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నల్లన్న గురువారం ఉదయం పరిస్థితి విషమించి మృతిచెందాడు. సి.బెళగల్ గ్రామంలో బోయ బాయికాటి మద్దిలేటి, బోయ చిన్న మునెప్ప వర్గీయులు సాగునీటి విషయంలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన నల్లన్న చికిత్స పొందుతూ మృతి చెందడంతో గ్రామంలో మళ్లీ కక్షలు చెలరేగే ప్రమాదం ఉందని గ్రామస్థులు భయందోళనకు లోనవుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పోలీసుల సమక్షంలో నల్లన్న అంతక్రియలు
మృతిచెందిన బోయ నల్లన్న అంతక్రియలు గురువారం సాయంత్రం భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా కర్నూలు డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో కోడుమూరు సిఐలు శ్రీనివాసులు, డేగల ప్రభాకర్, ఎస్‌ఐలు కృష్ణమూర్తి, శ్రీనివాసులు, పీరయ్య, మహేష్‌కుమార్ బందోబస్తు చేపట్టారు. అలాగే గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.