మెయిన్ ఫీచర్

రెండోవైపు చూడకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యన్‌టీఆర్ -బయోపిక్.
తెలుగు చిత్రసీమకు చరిత్ర పాఠం.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు. సింపుల్‌గా
ఎన్టీవోడు. ఒకప్పటి రెండు తరాలకు సుపరిచితమైనవే ఈ రెండూ. సింపుల్ మేకప్‌తో మొదలైన నట ప్రయాణంలో మేరునగవు స్థాయికి ఎదిగినపుడూ -ఆయన్ని ఓన్ చేసుకున్నాం. దైవాంశ సంభూతుడినన్న ఆలోచనలు పక్కనపెట్టి.. మేకప్‌కు పేకప్ చెప్పేసి -మనలో కలిసిపోడానికి వచ్చినపుడూ మనోడేననుకున్నాం. పరిచయం లేని పరిచయస్తుడు.. దూరంగావున్న సన్నిహితుడు.. ఇలా ఎన్ని చెప్పుకున్నా అవన్నీ ఎన్టీవోడికి వర్తిస్తాయి. మరి మనోడి కథ -మళ్లీ మన కళ్లముందుకొచ్చినపుడు తెలీని విషయాలు తెలుసుకోడానికి.. తెలిసిన విషయాల్లోని లోటుపాట్లు గుర్తు చేసుకోడానికి ఆసక్తి చూపించడం అత్యంత సహజం.
*
ఒకవైపే చూడు. రెండో వైపు చూడకు. మాడిపోతావ్ -అన్నది బాలకృష్ణ పాపులర్ డైలాగ్. మహానటుడి కడుపున పుట్టినందుకు ‘నాన్నకు కృతజ్ఞతగా’ ఆయనే యన్‌టిఆర్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఆలోచన చేయడం దగ్గర్నుంచే ఆసక్తి మొదలైంది. అయితే, పైన చెప్పిన డైలాగ్ ప్రస్తావన ఎందుకంటే -ఎన్టీవోడి జీవిత కథను తెరకెక్కించడానికి సిద్ధమైనపుడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి బాలయ్య గుర్తు చేసిన డైలాగ్ ఇదేనట. అయితే, రీల్ డైలాగ్ సీరియస్ సందర్భంలో చెప్పింది. కానీ, రియల్ లైఫ్‌ను తెరకెక్కించే ముందు బాలయ్య క్రిష్‌తో చెప్పిన డైలాగ్ మాత్రం ప్రశాంతంగా చెప్పిందట. ‘ఒక గొప్ప వ్యక్తి జీవితంలో చాలా కోణాలు ఉండొచ్చు. ఉంటాయి కూడా. కానీ, మహానుభావుడి గురించి మాట్లాడుకునే అవకాశాన్ని పాజిటివ్‌గానే చూద్దాం. చూప్పిద్దాం. సో, ఒకవైపే చూడు. రెండోవైపు చూడొద్దు’ అన్నాడట. ఈ ప్రస్తావన అంతా ఎందుకుంటే -తెరమీద తొలి షో పడగానే చాలా మాటలు వినిపించాయి. చాలా గుసగుసలు మొదలయ్యాయి. అరే.. అది లేదే? అరెరే.. ఇది కూడా లేదే? అన్న సంగతులు చాలానే వినిపించాయి. ఇంతున్న వ్యక్తి ఇంతై ఇంతింతై వటుడింతై ఎదిగిన ఏళ్ల జీవితాన్ని -రెండు గంటల రీళ్ల అడుగుల్లోకి కుదించాలంటే అంత ఆషా మాషీ కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సారాన్ని సంగ్రహించి కథగా చెబుదామనే ప్రయత్నం నుంచే సినీబయోపిక్‌లు మొదలవుతాయి. కానీ, చూపించినంతవరకైనా స్పష్టత కోల్పోకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత చిత్రబృందంపై లేదని అనలేం. అలా అనేసి ఎక్స్‌క్యూజ్ కూడా చేసేయలేం. ఎందుకంటే -ఇది మనోడు అనుకునే ఎన్టీవోడి కథ. తరువాతి తరాలకు కొంతే తెలిసినా -స్పష్టత లేకుంటే మాత్రం చరిత్ర వక్రీకరణకు గురయ్యే ప్రమాదం ఉండదని అనలేం.
*
జీవితమే ఒక నాటకమనుకుంటే -సన్నివేశాలు వస్తూ పోతూవుంటాయి. వాటిల్లో ప్రేక్షకుడు తనకు నచ్చిన సీన్లను ఓన్ చేసుకుంటాడు. నచ్చని వాటినుంచి కళ్లు తిప్పేస్తాడు. ఒక జీవితంలోని పూర్వాపరాలన్నీ స్థాలీపులాక న్యాయంగా స్పృశించాలంటే, అన్ని సన్నివేశాలనూ గుదిగుచ్చి దండగా వేయడం ఆషామాషీ సన్నివేశం కాదు. అటువంటి ఇబ్బందికర కత్తిసాము పనితనాలు ఇపుడు బయోపిక్స్ రూపంలో కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి తెలుగు తెరపైకి వచ్చిన బయోపిక్స్ ఇపుడు తెలుగువారికే ఎక్కువ కనువిందు. ఇటీవల వచ్చిన మహానటి చిత్రం సావిత్రి జీవితంలోని ఉత్థాన పతనాలను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. చాలావరకూ ఆమె కథ తెలిసినదే అయినా సన్నివేశాలలోని గాఢత, ఆర్ధ్రత, మానసిక క్షోభలాంటి అంశాలను స్పృశించడంతో ప్రేక్షకులకు సరికొత్తగా కనిపించింది. తాజాగా వచ్చిన యన్‌న్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ చిత్రంలో ఇటువంటి అంశాలు లేకుండా కేవలం ‘హీరోయిజమ్’ మాత్రమే ఎలివేట్ చేయడం కనిపించింది. ప్రేక్షకుడు చూసి ఆనందిస్తున్నాడే కానీ, చిత్రంతో మమేకమైన భావనను అనుభవించలేకపోతున్నాడు. దానికితోడు చిత్రంలో కొన్ని సన్నివేశాలు కల్పనగా ఉన్నాయని -ఆ తరంలో ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్లు, అప్పటి సినిమా పరిశ్రమ తరంవాళ్లూ అంటుంటే -మనసు కొంచెంగా మూగవోతోంది. భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నపుడు -అభినందించేందుకు అక్కడకు వచ్చిన ఎన్టీఆర్, అక్కడేవున్న నాదెండ్ల భాస్కరరావుల పరిచయం జరిగినట్టు చిత్రంలో చూపించారు. కానీ, ఆ సమయంలో తాను వెళ్లలేదని, అక్కడకు ఎన్టీఆర్ కూడా రాలేదని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన వీడియోల యూట్యూబ్ చానెల్‌లో దర్శనమిస్తున్నాయ. అప్పటికింకా రాజకీయంగా ఎన్టీఆర్ ఎటువంటి ఓనమాలు దిద్దలేదన్న భావం ఆయన మాటల్లో వినిపించటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇక ఎన్టీఆర్ మొదటి కుమారుడు రామకృష్ణ మరణం ఆయనను కుంగదీసిన మాట నిజమే. ఆ సంఘటనకు ముందు ఎన్టీఆర్ 1962లో దక్షయజ్ఞం చిత్రంలో నటించారు. అప్పటిదాకా కృష్ణుడిగా, రాముడిగా నటించిన ఆయన, తొలిసారిగా శివుడిగా నటించారు. ఆ శివుని పాత్ర ఆయనకు అచ్చిరాలేదని అందరూ అన్నారు. సినిమా విడుదలయ్యాక ‘ఇరుగు-పొరుగు’ షూటింగ్‌లో ఉన్నపుడు కుమారుని మరణవార్త తెలిసింది. అయినాకానీ కాల్షీట్లు అడ్జెస్టు అవ్వటం కోసం మరణవార్తను పంటి బిగువన దాచి ఆయన నటించారు. దీనిపై ప్రేక్షకులు, సినిమా ఇండస్ట్రీలో కొందరు ఇకనుంచి శివుని పాత్ర వేయొద్దని, అందువల్ల నష్టం జరిగిందని ఆయనకు చెప్పారని, ఆ తరువాత ఆయన శివుని పాత్ర ఏ చిత్రంలోనూ వేయలేదని అప్పట్లో కథనాలు వినిపించాయి. ఇది ఒక కథనం అయితే, మరొకటి షూటింగ్‌లో వుండగా విద్యుత్ తీగలు కాలికి తగిలి రామకృష్ణ మరణించారన్న ప్రచారం కూడా 1970 ప్రాంతాల్లో తెలుగు నాట షికారు చేసింది. ఎన్టీఆర్ తొలిసారి హీరోగా ఎంపికైన చిత్రం 1950 ఏప్రిల్ 27న విడుదలైన ‘పల్లెటూరి పిల్ల’. అయితే అదే ఏడాది ఏప్రిల్ 7న ‘షావుకారు’ చిత్రం విడుదలైంది. షావుకారు చిత్రానికన్నా ముందే 1949 నవంబర్ 24న ‘మనదేశం’ విడుదలైంది. అంటే తొలి చిత్రం ‘మనదేశం’ అయింది. కానీ హీరోగా తొలిసారిగా బుక్ అయిన చిత్రం మాత్రం పల్లెటూరి పిల్ల అని అప్పటి నటీనటులు ఇప్పటికీ చెబుతున్నారు. అయితే షావుకారు చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకోవడంవల్ల ముందు విడుదలైంది. 20 రోజుల తరువాతే పల్లెటూరు పిల్ల విడుదలైంది. ఇక్కడొక చిత్రమైన అంశాన్ని గుర్తు చేసుకోవాలి. పల్లెటూరి పిల్ల చిత్రానికి హీరోగా ఎన్టీఆర్ ఎంపికైనపుడు -పది రోజుల పాటు ఆడిషన్స్ చేశారట. ఆ చిత్ర నిర్మాత బిఏ సుబ్బారావు రోజూ ఎన్టీఆర్‌ను ఆఫీసుకు రమ్మనేవారట. అలా పది రోజుల పాటు వచ్చిన ఎన్టీఆర్‌ను -ఆ టైంలోనే ఆయన నడక, వాచకం, హావభావాలు.. ఇలా గమనించి అదే ఆడిషన్స్‌గా భావించి తీసుకున్నారన్నది అప్పటి తరం నటీనటులు చెప్తోన్న మాట. ఇక -1951లో వచ్చిన ‘పాతాళభైరవి’ చిత్రంలో నేపాళ మాంత్రికుడు బొడ్డుదేవరను గదతో మోదమని చెప్పే సన్నివేశంలో డమీ గద పెట్టారు. ఆ గదను చాలా బరువుగలది అన్నట్టుగా కెవి రెడ్డి నటించమని చెప్పారు. అందుకు తగినవిధంగా ఎన్టీఆర్ నటించలేక పోవడంతో నిజమైన బరువైన గదను మరుసటి రోజుకు తెప్పించారు. ఆ గదతోనే షూటింగ్ నిరాఘాటంగా సాగింది. ఇదే అనుభవాన్ని గుర్తుంచుకున్న బందిపోటు షూటింగ్ సమయంలో దర్శక నిర్మాతలు నిజమైన ఇనుప సంకెళ్లను ఆయనకు తగిలించారు. పెళ్లిచేసి చూడు చిత్రం 1952లో విడుదలైంది. ఈ చిత్రంలో ‘పెళ్లిచేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్’ అన్న పాటలో ఎన్టీఆర్ సతీమణి ఆయనకు హార్మోనియం వాయించడాన్ని నేర్పినట్టుగా చిత్రంలో చూపారు. కానీ తెలిసినవాళ్లు మాత్రం ఎన్టీఆర్ సతీమణి ఏనాడూ ఇల్లుదాటి బయటికి రావడం జరగలేదని, ఆమె సెట్స్‌కు వచ్చి హార్మోనియం వాయించడం ఎన్టీఆర్‌కు నేర్పారని చెప్పడం వింతేనని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే చంద్రహారం 1954లో కమలాకర కామేశ్వరరావు తొలి దర్శకత్వంలో విజయవారు రూపొందించిన చిత్రం. ఈ చిత్రం కాల్షీట్ల కోసం ఎన్టీఆర్ ఇంటికి చక్రపాణి వచ్చారని ఓ సన్నివేశం వుంది. చక్రపాణి గురించి తెలిసినవాళ్లెవరూ ఈ సన్నివేశాన్ని ఒప్పుకోవడంలేదు. చక్రపాణి ఏనాడూ విజయా స్టూడియోదాటి బయటికి రాలేదని, ఎవరి ఇళ్లకూ వెళ్లలేదని, కనీసం ఏవైనా పండుగలు, పబ్బాలకు కూడా ఆయన హాజరు ఉండేది కాదని చెబుతున్నారు. ఇందులో నిజం ఎంతవరకు అనేది దర్శక నిర్మాతలకు తెలియాలి. చక్రపాణి, నాగిరెడ్డి అంటే ఎన్టీఆర్‌కు గురుతుల్యులు అన్నభావం వుండేదని, అందుకే విజయవారి గుండమ్మకథ చిత్రంనాటికి ఏ కాల్షీట్లూ లేకుండా షూటింగ్ చేశారని చెబుతున్నారు. కేవలం గుండమ్మకథ షూటింగ్ వుంది, వచ్చెయ్యవయ్యా అంటే, ఎన్టీఆర్ గురువు అన్న గౌరవంతో తాను ఏ షూటింగ్‌లోవున్నా ముగించుకొని హాజరయ్యేవారట. అలాంటి వ్యక్తి ఇంటికివచ్చి అడ్వాన్స్ తీసుకోమని అడగటం సమంజసంగా లేదని చెబుతున్నారు. హెచ్‌ఎం రెడ్డి తొలిసారిగా ఎన్టీఆర్‌తో రూపొందించడానికి సిద్ధమైన చిత్రం పెట్టుబడి లేకపోవడంతో ఆగిపోయింది. ఈ విషయాన్ని చిత్రంలో కూడా చూపించారు. అయితే అదే చిత్రం ఆచేయి ఈచేయి మారి ఎర్రకోట వీరుడిగా రూపొంది 1973లో విడుదలవ్వడం విశేషం. సొంతవూరు చిత్రంలో ఓ నిమిషంపాటు కృష్ణుడి గెటప్‌లో కనిపించిన ఎన్టీఆర్‌ను మాయాబజార్ చిత్రంలో పూర్తి నిడివి పాత్రలో నటింపజేయడం కెవి రెడ్డి గట్సేనని చెప్పక తప్పదు. అయితే ఆ కృష్ణ పాత్ర పరిచయం సన్నివేశం చాలా హృద్యంగా, మనసుకు ఆనందం కలిగేలా చిత్రీకరించివుంటే బాగుండేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. తొలి ద్విపాత్రాభినయం ‘రాముడు- భీముడు’ చిత్రంతో ప్రారంభమై, అసలు ద్విపాత్రాభినయం అంటే ఎన్టీఆర్‌దే అన్న స్థాయికి వెళ్లారాయన. అటువంటి మాటను ఎక్కడా ఉటంకించకపోవడం కూడా అప్పటితరం నటీనటులు, ఎన్టీఆర్ అభిమానులను నిరాశ కలిగిస్తోంది.
బయోపిక్ అంటే జీవితాన్ని ఆవిష్కరించాలి తప్ప అతిశయం ఉండకూడదన్న నిబంధనతో మరికొన్ని విజయాలను కాకుండా అపజయాలనూ స్పృశించినట్టయితే డ్రామా పండేది. మనసుకి కేవలం ఆనందమే కాకుండా విషాదంలోవున్న రుచిచీ చూపితే ఈ బయోపిక్ మరింత వనె్నకెక్కేది. ప్రజల్లోవున్న అసంతృప్తి చూసి తన రాజకీయ ప్రస్థానాన్ని రూపొందించుకున్న ప్రజా నాయకుని జీవితంలో కుమారుని మరణం అనే విషాదం తప్ప మరేదీ లేకపోవడం, క్లైమాక్స్‌లో కూడా సరైన పంచ్‌లు పడకపోవడంతో చప్పచప్పగా ముగిసింది. ఎన్టీఆర్ బయోపిక్ అంటే మరికొంత ఊపు చివరిలో ఊపినట్లయితే ప్రేక్షకుడికి మరింత ఆనందం దక్కేది. ఆయనతో నటించిన అంజలి, జమున, వాణిశ్రీలాంటివారి సన్నివేశాలూ జత చేస్తే బావుండేది. రెండోభాగం కోసం ఆతృతగా ఎదురచూసేవారు.

-సరయు శేఖర్