మెయిన్ ఫీచర్

సినిమాలూ.. సాహితీవేత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరంతో ఆలోచన రేకెత్తించేవాళ్లు కొందరు. అక్షరంతో ఆనందాన్ని పంచేవాళ్లు ఇంకొందరు. అక్షరానికి శబ్దాన్ని జోడిస్తే -అద్భుతం అనిపించిన వాళ్లు మరికొందరు. పాటగానో పద్యంలానో, మాటగానో మహా గేయంగానో.. ముందుతరం ఉద్దండులు సినిమాకూ ఒకింత సంపదను సమకూర్చివెళ్లిపోయారు. వాళ్లకు ఆనవాళ్లుగా ఉన్నవాళ్లు ఇంకా సినీ సాహితీ సంపదను సమకూరుస్తూనే ఉన్నారు. తెలుగు సినిమా రంగానికి గేయ సంపద సౌరభాలు అందించిన కొద్దిమంది సాహితీవేత్తల గురించి గతవారం తెలుసుకున్నాం. సాహితీ సృజనతో అద్భుతాలు ఆవిష్కరించిన, ఆవిష్కరిస్తోన్న మరికొందరు సాహితీ వేత్తల గురించి ఈవారం పాఠకుల కోసం..
*
సాహిత్యం నాకు బ్రెడ్‌నిచ్చింది. సినిమా నాకు బటర్‌నిచ్చింది -అన్నారు తాపీ ధర్మారావు. ఆయన గిడుగు రామ్మూర్తిపంతులు ప్రియశిష్యుడు, హేతువాది. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?’, ‘పెళ్ళి, దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘పాతపాళీ, కొత్తపాళీ’, ‘సాహిత్య మొర్మరాలు’, ‘ఆలిండియా అడుక్కుతినేవాళ్ల మహాసభ’ లాంటి ప్రసిద్ధి చెందిన పుస్తకాలు వ్రాశారు. టాల్‌స్టాయ్ వ్రాసిన ‘అన్నాకెరినీనా’ నవలను తెలుగులోకి అనువదించారు. చేమకూర వేంకటకవి వ్రాసిన ‘విజయ విలాసం’పై ధర్మారావు రాసిన ‘విజయ విలాసం, హృదయోల్లాస వ్యాఖ్య’కు 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1937లో ‘మోహినీ రుక్మాంగద’తో సినీరంగ ప్రవేశంచేసి, పలు సినిమాలకు మాటలు, పాటలు వ్రాశారు.
పాలగుమ్మి పద్మరాజు ప్రఖ్యాత కథానికా రచయిత. 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన అంతర్జాతీయ కథానికా పోటీల్లో ఆయన వ్రాసిన ‘గాలివాన’ కథ ప్రథమ బహుమతినందుకుంది. 23 దేశాలనుంచి వచ్చిన 59 కథల్లోనుంచి ‘గాలివాన’ ఎన్నుకోబడింది. 1985లో ‘గాలివాన’ కథాసంపుటికి ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ‘బంగారుపాప’, ‘్భగ్యరేఖ’, ‘్భక్తశబరి’, ‘శాంతి నివాసం’, ‘బికారి రాముడు’ వంటి పలు ప్రఖ్యాత సినిమాలకు కథ, సంభాషణలు సమకూర్చారు.
ప్రముఖ సినీ గేయ రచయిత ఆత్రేయ (కిళాంబి వెంకట నరసింహాచార్యులు) పలు నాటకాలూ, నాటికలూ వ్రాశారు. ప్రజానాట్య మండలితో సంబంధం ఏర్పరచుకున్నారు. 1948లో ఆయన వ్రాసిన ‘ఎన్‌జిఓ’ -నాటక రంగాన్ని చాలా ప్రభావితంచేసింది. ఆయన కొన్ని సాంప్రదాయబద్ధమైన పద్యాలూ, కొన్ని గేయాలూ వ్రాశారు. రాత్రుళ్లు ఎక్కువగా వ్రాస్తారు కనుక రాత్రేయ అని, బూతు పాటలూ వ్రాసారు కాబట్టి బూత్రేయ అని ఆయన గురించి చమత్కరించినవాళ్ళు కొంతమంది లేకపోలేదు. ‘ముందడుగు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘గుప్పెడు మనసు’, ‘ఆకలిరాజ్యం’, ‘అభినందన’ లాంటి సినిమాలకు ఆత్రేయ వ్రాసిన పాటలు అమిత జనాదరణ పొందాయి. 1951లో ‘దీక్ష’తో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన తెలుగు సినిమాపై తనదైన ముద్రవేశారు. 1981లో ‘తొలికోడి కూసింది’ సినిమాకు వ్రాసిన ‘అందమైన లోకమనీ’ పాటకు నంది పురస్కారం అందుకున్నారు.
మల్లాది రామక్రిష్ణశాస్ర్తీ ప్రముఖ సాహిత్యవేత్త, కథానికా రచయిత. అప్పటి ప్రముఖ వారపత్రికల్లో ఆయన కథలు పండగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రచురితమవుతుండేవి. ఆయన 1952లో విడుదలైన ‘చిన్న కోడలు’తో సినీరంగ ప్రవేశం చేశారు. ‘చివరకు మిగిలేది’, ‘చిరంజీవులు’, ‘జయసింహ’, ‘రేచుక్క’ లాంటి పలు సినిమాలకు అద్భుతమైన పాటలు అందించారు.
పింగళి నాగేంద్రరావు వృత్తిరీత్యా మెకానికల్ ఇంజినీర్. ద్విజేంద్రలాల్ రే వ్రాసిన ‘మేబార్ పతన్’ను బెంగాలీనుంచి తెలుగులోనికి ‘మేవాడు రాజ్యపతనం’ పేరిట అనువదించారు. అదే రచయిత వ్రాసిన ‘పాషాణి’ని కూడా బెంగాలీనుంచి తెలుగులోకి అనువదించారు. స్వయంగా ‘జెబున్నీసా’ అనే నాటకం వ్రాశారు. ఈ మూడూ అప్పటి క్రిష్ణాపత్రికలో ప్రచురితమయ్యాయి. ఆస్కార్ వైల్డ్ వ్రాసిన ‘జఇ్యజఒ యచి -్ఘజూఖ్ఘ’’ను తెలుగులోకి ‘వింధ్యారాణి’ పేరిట స్వేచ్ఛానువాదం చేశారు. 1935లో విడుదలైన ‘శ్రీక్రిష్ణలీలలు’తో సినీరంగ ప్రవేశం చేశారు. ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’లాంటి పలు గొప్ప సినిమాలకు పాటలు, మాటలు వ్రాశారు.
చక్రపాణి ప్రముఖ నిర్మాత, పత్రికా సంచాలకులు. 1934లో టీబీ వ్యాధి సంక్రమించి మదనపల్లి సానిటోరియంలో ఉండవలసి వచ్చినప్పుడు, తనతోపాటు ఉన్న మరో రోగి దగ్గర బెంగాలీ నేర్చుకొని.. శరత్‌చంద్ర ఛటర్జీ నవలలను బెంగాలీ నుంచి తెలుగులోకి అనువదించి లక్షలాది తెలుగువారికి ఎనలేని ఆనందం పంచారు. బి నాగిరెడ్డితో కలిసి దేశమంతటా ఆదరణ పొందిన ‘చందమామ’ను 14 భారతీయ భాషల్లో ప్రచురించారు. 1941లో ‘్ధర్మపత్ని’కి సంభాషణలు వ్రాసి సినీరంగ ప్రవేశం చేశారు. నాగిరెడ్డితో కలిసి ‘మాజాబజార్’, ‘మిస్సమ్మ’, ‘గుండమ్మకథ’ వంటి అద్భుతమైన చిత్రాలు నిర్మించారు.
పలు పాత సినిమాలకు మంచి పాటలు అందించిన సముద్రాల రాఘవాచార్యకు అవధాన కళలో ఎక్కువ ఆసక్తి ఉండేది. ప్రభావితం చేయగలిగిన సాహిత్య రచనలు చేసిన దాఖలాలు లేవు. 1937 నుండి సుమారు ముప్పై ఏళ్లు అనేక చిత్రాలకు గేయాలు అందించారు. సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని 2009 జూలై 19న హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ప్రతిష్ఠించారు.
బాలాంత్రపు రజనీకాంతరావు ఎన్నో ఏళ్లు ఆకాశవాణిలో పనిచేశారు. ‘శతపత్ర సుందరి’, ‘ఏటికి ఎదురీత’, ‘త్యాగరాజు’, ‘ఏకాంతసేవ’ మొదలైన పుస్తకాలు వ్రాశారు. 1961లో ఆయన వ్రాసిన ‘ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘స్వర్గసీమ’ (ఓ హోహో పావురమా), ‘గృహప్రవేశం’, ‘రాజమకుటం’,
‘బంగారుపాప’ మొదలైన చిత్రాలకు పాటలు వ్రాశారు.
కళా వాచస్పతి జగ్గయ్య దాదాపు 80 సినిమాల్లో నటించారు. 1952లో త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ‘ప్రియురాలు’తో సినీరంగ ప్రవేశం చేశారు. రవీంద్రనాథ్ టాగూర్ వ్రాసిన ‘గీతాంజలి’లోని కొన్ని పాటల్ని, మరి కొన్నింటినీ అనువదించి ‘రవీంద్ర గీత’ పేరిట పుస్తకాన్ని ప్రచురించారు. ‘శాక్రిఫైస్’ నాటకాన్ని ‘బలిదానం’ పేరుతో అనువదించారు. సుమారు 100 సినిమాలు ఆయన గొంతును డబ్బింగ్‌కు వాడుకున్నాయి. ‘మా భూమి’ సినిమాలో వ్యాఖ్యాతగా వినిపించే గొంతు ఆయనదే. స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించిన ‘జురాసిక్ పార్క్’ తెలుగు వర్షన్‌లో లార్డ్ అటెన్‌బరోకు డబ్బింగ్ వాయిస్ నిచ్చారు. ‘పదండి ముందుకు’ సినిమాను స్వయంగా నిర్మించారు (ఈ సినిమాలో ఒక చిన్న పాత్రతో ఘట్టమనేని కృష్ణ తన నట జీవితం ఆరంభించారు). 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
తెలుగు సినిమాలలో జానపద గేయాల విషయానికొస్తే, కొసరాజు రాఘవయ్య చౌదరి దరిదాపుల్లోకి ఏ సినీ రచయిత రారు. ‘రైతుబిడ్డ’లో హీరోగా నటించిన ఆయన -తరువాత సినీ గేయాలపైనే దృష్టి కేంద్రీకరించారు. 350 తెలుగు సినిమాలకు 3000లకు పైగా పాటలు వ్రాశారు. 1984లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే’, ‘ఏరువాకా సాగారోరన్నో’, ‘నందామయా గురుడ’ వంటి అద్భుతమైన పాటలు తెలుగు వారికి ప్రసాదించారు.
వేటూరి సుందరరామమూర్తి జర్నలిస్టుగా, రిపోర్టర్‌గా కెరియర్ ఆరంభించారు. 1974లో ‘ఓ సీత కథ’ సినిమాతో సినీ గేయ రచయితగా మారారు. ఎన్నో గొప్ప సినిమా పాటలు అందించారు. కొన్ని దశాబ్దాలు సినీ గేయ రంగాన్ని ప్రాభావితం చేశారు. 1993లో ‘మాతృదేవోభవ’ చిత్రానికి వ్రాసిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాటకు జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆరుసార్లు ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కాం అందుకున్నారు.
ప్రత్యక్షంగా సాహిత్య రచనలు పెద్దగా చేయని సిరివెనె్నల సీతారామశాస్ర్తీ అసలు పేరు చెంబోలు సీతారామశాస్ర్తీ. 1984లో వచ్చిన ‘జననీ జన్మభూమి’తో సినీ రంగ ప్రవేశం చేసి, 1986లో వచ్చిన ‘సిరివెనె్నల’ సినిమాకు వ్రాసిన గొప్ప పాటలతో సిరివెనె్నల సీతారామశాస్ర్తీగా మారిపోయారు. ఎన్నో అద్భుతమైన సినీ గేయాలు వ్రాశారు. వాటిలో అమోఘమైన సాహిత్యాన్ని పూయించారు. కొంతమంది సాహిత్యవేత్తలుగా చెలామణి అయి సినీ రచయితగా గుర్తింపు తెచ్చుకుంటే, ఆయన సినీ గేయ రచయితగా చెలామణి అయి సాహిత్యవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 11నంది అవార్డులతో రికార్డు సృష్టించారు. ప్రస్తుతం తెలుగు సినీ గేయ ప్రపంచానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. 2019లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి వ్రాసిన ‘అత్తగారి కథలు’ పుస్తకానికి 1966లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1993లో ఆమె వ్రాసిన ‘నాలో నేను’ ఆత్మకథ పుస్తకానికి జాతీయ సినిమా రచనా పురస్కారం లభించింది (ఈ పుస్తకంలో ఆమె తన స్టిల్ ఫొటో ఒకటి ప్రచురించి, దాని క్రింద ‘మిస్ అయిన మిస్సమ్మ’ అని క్యాప్షెన్ పెట్టారు). 1939లో ‘వరవిక్రయం’తో మొదలైంది సినిమా రంగంలో భానుమతి సుదీర్ఘ ప్రయాణం. తన నటనకు మూడుసార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 1966లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. 2013లో భారత ప్రభుత్వం ఆమె పేరుపై ఒక స్టాంపు విడుదల చేసింది. ప్రఖ్యాత సినీ విమర్శకులు నందగోపాల్ ఆమె గురించి ఇలా అన్నారు. ‘్భనుమతి నటి, నర్తకి, గాయకి, సంగీత దర్శకురాలు, సంగీత విద్వాంసురాలు, ప్రిన్సిపల్, స్క్రీన్‌ప్లే రచయిత, డైరెక్టర్, నిర్మాత, స్టూడియో అధినేత, కథా రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, చిత్రకారిణి, విద్యావేత్త. ఇన్ని సృజనాత్మక గుణాలు ఇమిడిన ప్రతిభాశాలిని ప్రపంచ సినిమాలో కానలేం’.

-వి.కె.ప్రేమ్‌చంద్, 9848052486