మెయిన్ ఫీచర్

తొలి డైలాగుకు తొంభైయేళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల సినిమాగా 1931 మార్చి 14న విడుదలైన ‘ఆలం ఆరా’
*
కదిలే బొమ్మలు -కమనీయంగా కబుర్లూ చెబితే ఎంతద్భుతం. అందుకు ‘జాజ్ సింగర్’ వేదికైంది. వార్నర్ బ్రదర్స్ తెరకెక్కించిన చిత్రమది. పాటలు, సంగీతంతోనే సినిమా చేయాలని షూటింగ్ మొదలెట్టారు. కాని -షూటింగ్ టైంలో ఆల్ జాల్సన్ అనే నటుడు మొదటి పాట పాడాక.. ‘హె వెయిట్ ఏ మినిట్, వెయిట్ ఏ మినిట్, యూ హేన్‌ట్, హెర్ట్ నటింగ్ యట్, వెయిట్ ఏ మినిట్, ఐ టెలియూ. యూ హేవెన్ట్ హెర్ద్ నథింగ్ డర్టీ ఫెస్’ అన్నారు. అర్థం లేకుండా హీరో ఇలా మాట్లాడటం ఏమిటని డైరెక్టర్ అలాస్ క్రాస్‌లాండ్ భావిస్తుంటే -చిత్ర సహ నిర్మాత డెర్రిక్ ఎఫ్ జాన్సూన్ మాత్రం అది చాలా బాగుందని పట్టుబట్టి చిత్రాన్ని అలాగే విడుదల చేశారు. ఈ చిత్రంలో వినిపించే మొదటి పాట ‘మై గాల్ సాల్’. చిన్నప్పటి హీరోగా నటించిన బాబీగార్డన్ పాడిన పాట. 1927 అక్టోబర్ 6న న్యూయార్క్‌లోని వార్నర్ ప్రదర్శనశాలలో విడుదలైంది. సినిమా చూసి జనం ఆనందానికి అంతే లేదు. ఇంతకీ ఆ సినిమాలో ఉన్నవి కేవలం 354 పదాలు. వాటిలో 340 పదాలను హీరోయే పలికాడు. 13 మాటలు హీరో తల్లి (పాత్రధారిణి యూజిన్ బెనరర్) పలికితే, హీరో తండ్రి పాత్రధారి వార్నర్ ఓలాండ్) పలికింది ఓకే పదం ‘స్టాప్’ అని.
మన దేశం విషయానికి వస్తే తొలి శబ్ద చిత్రాన్ని నిర్మించిన వ్యక్తి ఆర్దేషీర్ ఇరానీ. ఇంపీరియల్ ఫిలిం కంపెనీ బ్యానర్‌పై అంతకుముందు వీరాభిమన్యు (1927) అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు. భారతదేశంలో విడుదలైన టాకీ చిత్రం షోబోట్ (1930) చూసి మన దేశంలో టాకీ చిత్రాలు నిర్మించలేమా? అని ఒక వ్యక్తి మదనపడేలా చేసింది. బొంబాయిలోని ఎక్స్‌ల్షియర్ థియేటర్‌లో ‘షోబోట్’ చిత్రం చూసి దగ్గర్నుంచి ఎన్ని కష్టనష్టాలెదురైనా భరించి తొలి టాకీ నిర్మించాలనే కోరిక ఆయనలో బయల్దేరింది. ‘షోబోట్’ చిత్రం 40 శాతం టాకీ చిత్రమే. ఆ సినిమా చూసిన మనము శబ్ద చిత్రం ఎందుకు తీయకూడదన్న ఆలోచన వచ్చింది.
ఇరానీకి అనుభవం లేకపోయినా ఉత్సాహమే ఊతంగా చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహేబ్ ఫాల్కే సహకారం, సూచనలతో అప్పట్లో బొంబాయిలో విశేష ప్రజాదరణ పొందిన రంగస్థల నాటకం ‘ఆలం ఆరా’ను చిత్ర కథగా ఎన్నుకున్నారు. జోసఫ్ డేవిడ్ అనే నాటక రచయిత సహాయంతో దాన్ని సినిమాకు అనుకూలంగా మలిచారు. ‘ఆలం ఆరా’ చిత్ర నిర్మాణ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇరానీ.
షూటింగ్ జరిగిన స్టూడియో సౌండ్ ప్రూఫ్ కాకపోవడంతో ఇతర శబ్దాలేవీ వినబడకుండా రాత్రి సమయంలో షూటింగ్ చేసేవారు. అదీగాక ఆ స్టూడియో సమీపంలోనే రైల్వేట్రాక్ ఉండేది. రైలు శబ్దాలవల్ల పనికి అంతరాయం కలగకూడదని, రైళ్లురాని సమయాలు తెలుసుకుని షూటింగ్ చేసేవారు. అప్పట్లో పిక్చర్‌కి, సౌండ్‌కి విడివిడిగా నెగెటివ్‌ను ఉపయోగించేశారు. కెమెరా కన్ను పడని వివిధ ప్రదేశాల్లో మైక్రోఫోన్స్ అమర్చి నటీనటుల రికార్డు చేశారు. ఈ సినిమాలో పది పాటలున్నాయి. చిత్రానికి ప్రత్యేకించి సంగీత దర్శకుడంటూ ఎవరు లేరు. ఇరానీ పర్యవేక్షణంలోనే తబలా, హార్మోనియం, వాయొలిన్‌తో చిన్న వాద్య గోష్ఠిని ఏర్పర్చుకున్నారు. ఆలం ఆరా చిత్రానికి ముందు ఇరానీ, ఓ విదేశీయుడి దగ్గర శబ్ద గ్రహణానికి సంబంధించిన కొన్ని మూల సూత్రాలు నేర్చుకున్నారు. కొనుగోలు చేసిన రికార్డింగ్ యంత్రాలను అమర్చడానికి మన దేశానికి వచ్చిన డెమింగ్ -రికార్డింగ్‌కి సంబంధించిన ఎన్నో విషయాలను ఇరానీకి, అసిస్టెంట్ బరుచాకీ చెప్పారు. ‘ఆలం ఆరా’ నిర్మాణ సమయంలో ఆయన్ని ఇక్కడ ఉండమని ఇరానీ కోరారు. అయితే రోజు వంద రూపాయలు డెమింగ్ డిమాండ్ చేయడంతో, అంత డబ్బు చెల్లించలేక.. బరుచా సహాయంతో శబ్దగ్రహణాన్ని ఇరానీనే నిర్వహించారు. ఆ రోజులలో మూకీ చిత్రాలు తీయడానికి 30 నుండి 40 రోజుల వరకూ పట్టేది. కానీ ఆలం ఆరా సినిమా నిర్మాణానికి నాలుగు నెలల కాలంలో 40వేల రూపాయల వ్యయంతో నిర్మించబడిన 10,500 అడుగుల చిత్రం.

అయితే భారతదేశ మొదటి టాకీ చిత్రం నిర్మించడం విషయంలో పలువురు పోటీపడ్డారు. ముఖ్యంగా మదన్ పిక్చర్ అధినేత జమ్‌షట్టిఫ్రామ్‌జీ మదన్, వారికి ఆర్దేషిర్ ఇరానీకి మధ్య పోటీ విపరీతంగా కొనసాగింది. ఇరానీ కన్నాముందు మదన్ పిక్చర్స్ ‘జమాయ్‌హస్తి’ టాకీ నిర్మాణం ప్రారంభించారు. అయినా ఎలాగైనా తన చిత్రమే భారతదేశంలో తొలి టాకీ కావాలన్న కోరికతో ఆర్డేషీర్ ఇరానీ రేయింబవళ్లు కృషిచేశారు.
శబ్దసహిత చిత్రాల నిర్మాణంలో కూడా మదన్ పిక్చర్స్ ఊత్సాహం చూపారు. అయితే పూర్తి నిడివి కథా చిత్రం నిర్మించటానికి బదులుగా వాళ్లు చాలా లఘు చిత్రాల నిర్మాణాన్ని చేపట్టారు. 1931 మార్చి 13న మదన్ పిక్చర్స్‌వారు 31 లఘు చిత్రాలతో ఒక పూర్తి నిడివి టాకీని విడుదల చేశారు. కానీ ఇరానీ చేసిన గొప్పపనంతా ఒకే కథతో పూర్తి నిడివి కథాచిత్రం ‘ఆలం ఆరా’ తీసి 14 మార్చి 1931 విడుదల చేయటం. దాంతో ఇరానీకే భారతీయ శబ్ద చిత్రాల సృష్టికర్తగా చరిత్రలో సుస్థిర స్థానం లభించింది. భారతదేశంలో తొలి మూకీ చిత్రానికి (రాజాహరిశ్చంద్ర) భారతీయ ఇతిహాసమైన మహాభారతంలోని కథ ప్రాణం పోస్తే, తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ జానపద గాథ కథాంశమైంది. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు ఆర్దెషిర్ ఇరానీ. చిత్రాన్ని నిర్మించిన సంస్థ (బ్యానర్) పేరు ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ. (ఇంపీరియల్ మూవీటోన్). ఈ చిత్రంలో నటించిన వారిలో ప్రముఖులు మాస్టర్ విఠల్ (తొలి టాకీ హీరో), జుబేదా. (తొలి టాకీ హీరోయిన్), పృథ్వీరాజ్ కపూర్ (తొలి విలన్), డబ్ల్యు ఎమ్ ఖాన్ (్ఫకీరు), ఏవిజర్ జిల్లూబాయి జగదీశ్‌సేఠ్, సుశాలి, సఖు, మోడీ, ప్రీతి- విరాజ్, ఎల్‌వి ప్రసాద్ నటించారు.
ఈ చిత్రానికి ఆధారం ఓ పార్సీ నాటకం. జోసెఫ్ డేవిడ్ ఈ కథతోనే 1956లో ఒకసారి, 1975లో మరోసారి రెండు చిత్రాలను నానాభాయ్ వకీల్ నిర్మించటం కూడా విశేషమే. ఇరానీ నిర్మించిన ‘ఆలం ఆరా’ బొంబాయిలోని ఆయన సొంత టాకీస్ మెజిస్టిక్ థియేటర్‌లో విడుదలైంది. దేశమంతటా అద్భుత ప్రకంపనలు సృష్టించింది. మెజిస్టిక్ థియేటర్ అయితే జన ప్రవాహంతో నిండిపోయింది. పోలీసుల్ని పిలిపించి మరీ జనాన్ని అదుపులోకి తేవాల్సి వచ్చింది. నాలుగణాల (25 పైసలు) టిక్కెట్టును 4- 5 రూపాయిలకు కూడా బ్లాక్ మార్కెట్‌లో అమ్మారు. అద్భుత మని బొంబాయి ప్రేక్షకులు పొగుడుతున్న ఆ చిత్రాన్ని తమకు చూపించాల్సిందిగా ఎందరో ఇరానీకి ఉత్తరాలు రాశారు. దాంతో ఆయన సౌండ్ ప్రొజెక్షన్ ఎక్విప్‌మెంట్, సహా దేశవ్యాప్త పర్యటనలు చేపట్టారు. సౌండ్ ఆపరేటర్‌గా ఆ యూనిట్‌తో పర్యటించిన టి మహదేవ్ మాటల్లో అయితే ‘మద్రాసు సెంట్రల్ స్టేషన్‌లో మేం దిగేటప్పటికి అక్కడ అభిమానులంతా టాకీస్ టాకీస్ అంటూ నినాదాలు చేస్తూ మాకు స్వాగతం చెప్పారు. మద్రాసులోని సినిమా సెంట్రల్ టాకీస్ మేనేజరు అయితే, ప్లాట్‌ఫారమ్ మీద పరిగెత్తుకుంటూ వచ్చి పూలమాలలతో మమ్మల్ని ముంచెత్తారు.
తిరుచ్చిలో ఈ సినిమా వాళ్లకోసం రైలును ఆలస్యంగా బయలుదేరతీశారు. మైసూరు రాష్ట్రంలోని తుమ్‌కూర్‌లోనూ ఈ టీం పర్యటించింది. ఇందులో మాటలు, పాటలు, నృత్యాలే ప్రధానాంశాలు. సంభాషణలు సంస్కృత మిళితమైన హిందీలోనూ, పర్షియన్ మిళితమైన ఉర్దూలోనూ కొనసాగగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఏడు పాటలను చిత్రీకరించారు. మొట్టమొదట రికార్డు అయిన పాటను ఎం ఖాన్ పాడారు. రికార్డింగ్ యంత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి వచ్చి, ఇరానీ అనుమతితో ఫకీరు వేషం వేసి పుస్తు భాషలో పాట పాడటం గమనార్హం.
దేదే ఖు దా కె నామ్‌షే/ ప్యారే తాఖత్ హైగర్ దేనేకీ/ కుచ్ చాహే అగర్‌తో మాంగ్‌లే/ ముఝే హిమ్మత్ హైగర్ దేనేకీ. (నీవు ఇవ్వగలిగిన తాహతు వుంటే దేవుడి పేర ఇవ్వు. నీకు ఏదైనా అడగగలిగిన ధైర్యముంటే అప్పుడది కావాలని అడుగు) అని సారాంశం.
1931 మార్చి 14.
ఆరోజు బొంబాయిలోని మెజెస్టిక్ థియేటర్‌లో భారతదేశపు మొట్టమొదటి టాకీ చిత్రం ఆలం ఆరా విడుదలై ఎనిమిది వారాలపాటు ఏకబిగిన హౌజ్‌ఫుల్‌గా ప్రదర్శించబడింది. అంతకుముందు ఒక మూకీ చిత్ర ప్రదర్శనకు ఆ థియేటర్ బుక్కై ఉండటంవల్ల తొమ్మిదోవారంలో ఈ టాకీని తీసి వేయాల్సి వచ్చింది. బొంబాయితోపాటు ఏకకాలంలో విజయవాడ మారుతి టాకీస్‌లోనూ విడుదలైంది. 1931 జూన్ నెలలో మద్రాసు సినిమా సెంట్రల్‌లోనూ, తర్వాత నెల్లూరు వినాయక్ థియేటర్‌లో విడుదలైంది. మాట్లాడే ఈ కథలే బొమ్మని జనం విరగబడి చూశారు.
సెలక్టు టూరింగ్ టాకీస్ కంపెనీ నుంచి టిఎస్ మహదేవ్ (ఆపరేటర్) మేనేజరు, అసిస్టెంట్ కలిసి ప్రొజెక్టరు, ఆంప్లిఫియరు, స్పీకర్‌లతో దక్షిణాన టూర్ కొనసాగించారు. అప్పుడు వాళ్లు ఏ రైలు దిగినా జనంలోంచి ‘టాకీ వచ్చింది, టాకీ వచ్చింది’ అనే కేకలు, హడావుడి కన్పించేది. వీళ్లకోసం రైల్వే వాళ్లు కూడా ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు ఎక్కడికి వెళ్ళినా రాచ మర్యాదలు జరిగేవి. అలాగే వారు నెల్లూరు వెళ్లినప్పుడూ ఓ గమ్మత్తు జరిగింది. తెలుగులో మాట్లాడించండి
నెల్లూరు వినాయక్ థియేటర్‌లో ‘ఆలం ఆరా’ను ప్రదర్శిస్తున్న సమయం. ఆ థియేటర్ యజమాని బంధువు ఒకాయన మహదేవ్ దగ్గరికి వచ్చి -అసలు శబ్దం ఎలా వస్తుంది. ఎక్కడ్నుంచి వస్తుంది? వివరించి చెప్పమన్నారు. మహాదేవ్‌కు తెలుగురాదు. దాంతో ఇంగ్లీషుగానీ, హిందీలోగానీ అడగమన్నాడు. సదరు వ్యక్తి ఎమ్‌ఎ ఎల్‌ఎల్‌బి కావడంతో దర్జాగా ఇంగ్లీషులో గడగడా అడిగేశాడు. అందుకు మహదేవ్ బదులుగా సౌండ్ అనేది ఒక విధమైన పవర్ (శక్తి). ప్రొజెక్టర్లో ఫిల్మ్ నడుస్తున్నప్పుడు మాటలుగా పుడుతుంది. ఫిల్ముపై ఉండే ‘గీతల’ ద్వారా శబ్దాలు పుడుతాయని, అవి ‘ఆంప్లిఫియర్’ ద్వారా స్పీకర్‌లోకి వెళ్ళి మాటలుగా విన్పిస్తాయని చెప్పారు. వెంటనే -మానవ మేధస్సు ఇలా శబ్దాన్ని, మాటలను సృష్టించినప్పుడు ఆ మాటలు హిందూస్థానీ (హిందీ)లోనే ఎందుకుండాలి. తెలుగులో పాడేట్టూ మాట్లాడేట్టూ చెయ్యరూ అంటూ అయ్యగారు అనడంతో మహదేవ్‌కి చుక్కెదురైంది. కనీసం మా నెల్లూరు వరకైనా తెలుగు మాటలు మాట్లాడించండి అన్న అయ్యగారి హుషారుకు -బాబూ ఇది హిందీ సినిమా అన్నా ఫలితం లేకపోవడంతో మహదేవ్ జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితెదురయ్యింది.
తర్వాత మహదేవ్ గ్రూప్ ట్రిచి వెళ్లడం జరిగింది. అక్కడ ప్రదర్శన పూర్తవగానే ‘మధుర’, తర్వాత మద్రాసులోని సేలం, మద్రాసు సమీపంలోని కుంభకోణంలో పర్యటించారు.
*
ఆలం ఆరా కథ (ప్రపంచ సుందరి)
ఇద్దరు పెళ్లాలున్న వృద్ధుడైన రాజుకు పుత్ర సంతానమే లేకపోయింది. భార్యలిద్దరికీ తామే ముందుగా కొడుకును కని రాజుకు బహూకరించాలనే కోరిక ఉంటుంది. అయితే ఆ ఇద్దరు రాణులలో ఒకరికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుందని ఓ ఫకీర్ (సన్యాసి) చెబుతాడు. దాంతో రెండో రాణి -తనకులేని అదృష్టం ఇతరులకు మాత్రం ఎందుకనే అసూయతో ఏకంగా రాజు కుటుంబానే్న నాశనం చేయాలనుకుంటుంది. అందుకు సైన్యాధ్యక్షుడి మద్దతు కోరుతుంది. కానీ సైన్యాధ్యక్షుడు నిజాయితీపరుడు కావటంతో -ఆమె ప్రయత్నాలను అడ్డుకొంటాడు. దీంతో పగబట్టిన ఆ రాణి సైన్యాధ్యక్షుడి కుటుంబానే్న హత్య చేయిస్తుంది. ఆ సమయంలో అదృష్టవశాత్తూ సైన్యాధ్యక్షుడి కుమార్తె ప్రాణాలతో బయటపడుతుంది. ఆమె ఆలం ఆరా (‘ప్రపంచ సుందరి’ అని అర్థం). ఆమె గిరిజనులు మధ్య పెరిగి పెద్దదై వారి సాయంతో రాజభవనం మీదకు దండెత్తి కుటిలాత్మురాలైన రాణిని గురించి అసలు సంగతి బహిర్గతం చేస్తుంది. అప్పటికీ యుక్త వయసుకు చేరిన రాకుమారుడు ‘ఆలం ఆరా’ను పెళ్లాడటంతో కథ సుఖాంతమవుతుంది.

-కె శ్రీనివాసరావు