మెయిన్ ఫీచర్

కాలాతీత కీలుగుర్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త అనుభవం కంటే -పాత జ్ఞాపకం మిన్న. వర్తమాన సినిమాపై ఓ సినీ విశే్లషకుడి సెటైర్ ఇది. తెలుగు సినిమా చరిత్రను ఘనంగా చెప్పుకోవాలంటే -పాత సినిమాల్ని మననం చేసుకోవడం తప్ప, కొత్త సినిమాలు సృష్టించే చరిత్రను చదువుకోలేం.. అన్నది ఆయన సెటైర్‌లో దాగివున్న పంచ్. కరెక్టే అనడానికి కంటెంట్ లెక్కలేనంత. ఎందుకంటే -ఏ పాత సినిమాను టచ్ చేసినా, అందులోని ఓ పాట విన్నా మనసుకు హాయనిపిస్తుంది. వర్తమాన చిత్రాలన్నీ ‘ఇన్‌స్టంట్ ఎంటర్‌టైనర్స్’ అంటాడాయన. పట్టుమని పదిరోజులు కూడా ప్రేక్షకుడి మనసులో ఉండటం లేదన్నది అందులో భావన. స్వర్ణయుగంనాటి ఏ చిత్రం పేరు తలచుకున్నా -రీళ్లురీళ్లుగా సినిమా గుర్తుకొచ్చి మనసుకు హాయినిస్తుందన్నది సినీ ప్రేమికులు అనే మాటే. ఇది -ఇప్పటి సినిమాని తక్కువ చేసి మాట్లాడటం కాదు. సాంకేతికంగా ఎంతో ఎదిగినా -కావ్యాల్లాంటి ఆనాటి సినిమాల స్థాయిని అందుకోలేకపోతున్నాయన్న గుండెల్లోతుల్లోని బాధ.
వర్తమానంపై విమర్శలు పక్కనపెట్టి -కొన్ని నిమిషాలపాటు కొనే్నళ్ల గతంలోకి తొంగిచూద్దాం. 70యేళ్ల క్రితం -1949లో తెలుగులో వచ్చిన ఓ అద్భుత జానపదం -కీలుగుర్రం. 70యేళ్లు అన్నది కాలాన్ని లెక్కించడానికేగాని, ప్రింట్ బావుంటే ఇంకో వందేళ్లయినా అది ఫ్రెష్ సినిమానే. ఎందుకంటే
అది -కాలాతీత కీలుగుర్రం.
జానపదాలంటే మక్కువచూపే మీర్జాపురం రాజా దర్శకుడు కావాలనుకున్నాడు. తొలి చిత్రంగా జానపదానే్న ఎంచుకున్నారు. కాశీమజిలీ కథల ప్రేరణతో తాపీ ధర్మారావునాయుడు అప్పట్లో ఓ కథ తయారు చేశాడు. సంభాషణలూ ఆయనవే. ఘంటసాల వెంకటేశ్వర రావు తొలిసారి పూర్తి నేపథ్య సంగీతం సమకూర్చిన సినిమా అది. మధుర సంగీత బాణీలతో హీరో అక్కినేనికి సూపర్‌హిట్ పాటలిచ్చారు.
సినిమాకు హీరోగా అక్కినేనిని తీసుకున్నారు. ఎందుకంటే -అప్పటికే బాలరాజు చిత్రంతో ఆయనకు జానపద హీరోగా విశేష గుర్తింపు వచ్చివుంది. కీలుగుర్రంలో కీలకమైన పాత్ర భువన సుందరి అనే రాక్షసిది. ఈ పాత్రను అంజలీదేవితో చేయించాలనుకున్నారు. అప్పటికే ఆమె చేసిన గొల్లభామ, బాలరాజు, మదాలస చిత్రాల తరహాలో ఇదీ నాట్య పాత్రే. దాంతో అలాంటి తరహా పాత్రలకే పరిమితమైపోతానన్న భయంతో అంజలీదేవి ఆ పాత్రకు ఒప్పుకోలేదు. గొప్ప సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు చెప్పినా ఆమె మొండికేసింది. చివరకు గాయని కృష్ణవేణి తనకు నేపథ్యగానం చేస్తే పాత్ర చేస్తానని పట్టుబట్టింది. కృష్ణవేణి, అంజలీదేవి ఇద్దరూ మంచి స్నేహితులు. గాయని కృష్ణవేణి ఎవరో కాదు, చిత్ర దర్శకుడు మీర్జాపురం రాజావారి ఇల్లాలు. అంజలీదేవి షరతుకు కృష్ణవేణి ఒప్పుకుని ‘తెలియవశమా’ ‘్భగ్యము నాదేనోరుూ’ ‘మోహనమహో’ ‘చూసి తీరవలదా’లాంటి అద్భుతమైన పాటలు అందించారు. అలా ఈ సినిమా కోసం అంజలీదేవి భువనసుందరి అయ్యింది. వక్కలంక సరళ, ఘంటసాల మాస్టారుతో కలిసి ‘కాదు సుమా కల కాదు’ అనే సూపర్ హిట్ సాంగ్ పాడారు. ఆ పాట ఆ రోజల్లోనే కాదు, ఈనాటికీ హిట్టే. కీలుగుర్రంపై హీరో అక్కినేని హీరోయిన్ లక్ష్మీరాజ్యంతో ఆకాశమార్గాన వెళ్తూ పాడే పాట. అప్పుడే కాదు, ఇప్పటికీ ప్రతి ప్రేక్షకుడినీ ఆనంద డోలికల్లో ఉయ్యాలలూగిస్తోంది. అప్పట్లో ప్రతి యువకుడూ ఆ సన్నివేశంలో తమనే ఊహించుకుని ఆనందపడ్డాడు. బీజీయమ్‌లు, హవాయిస్ గిటారు అనే వాయిద్యాన్ని ఉపయోగించి ఘంటసాల మధురాతి మధురంగా రూపొందించారు.
***
నూజివీడుకు చెందిన వెలమదొర మీర్జాపురం రాజా. సినిమా రంగంపై ఆసక్తితో 1938లో మద్రాసు చేరుకుని ‘జయా ఫిలింస్’ పేరిట చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కృష్ణ జరాసంధ (1938), మహానంద (1939), భోజకాళిదాసు (1940), జీవన జ్యోతి (1940) సినిమాలు తీశారు. భోజకాళిదాసు తీస్తున్న సమయంలోనే అందులో నటించిన సి కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నారు. 1940లో జయా ఫిలింస్‌ను శోభనాజల స్టూడియోస్‌గా పేరుమార్చారు. మొట్టమొదటిసారిగా దక్షయజ్ఞం (1941), భక్తప్రహ్లాద (1942), భీష్మ (1944), గొల్లభామ (1947) చిత్రాలను నిర్మించారు. దర్శకత్వం అంటే మొదటినుంచీ మీర్జాపురం రాజాకి మక్కువ ఎక్కువ. అందుకే స్టూడియోలో జరిగే షూటింగుల్ని దగ్గరుండి పర్యవేక్షించేవారు. ఎప్పటికైనా దర్శకత్వం వహించాలన్న తలంపుతో ఉండేవారు. అలా ‘కీలుగుర్రం’ చిత్రంతో దర్శకుడయ్యారు.
కథ:
మహారాజు (ఏవీ సుబ్బారావు) అడవికి వేటకెళ్లి, అక్కడ భువనసుందరి (అంజలీదేవి) అనే యువతిని మోహిస్తాడు. నిజానికి ఆమె రాక్షసి. అది తెలియని రాజు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మొదట బెట్టుచేసి, తర్వాత రాజువెంట అంతఃపురానికి వెళ్తుంది భువనసుందరి. మహారాణి ప్రభావతి (బాలామణి)కి పుత్రోదయం కానున్నదన్న సంగతి తెలిసి అసూయ పడుతుంది సుందరి. రాక్షసబుద్ధి వదుల్చుకోలేని సుందరి, ఆమె తల్లి కేకిని (టి కనం) రహస్యంగా ఏనుగులు, గుర్రాలను భక్షిస్తుంటారు. ఆ నేరాన్ని మహారాణి మీద వేస్తారు. దాంతో ఆమెను చంపమని
ఆజ్ఞాపిస్తాడు మహారాజు. విశ్వాసపాత్రులైన సేవకులు గర్భిణిని చంపడం ఇష్టంలేక, ఆమె కనుగుడ్డు మాత్రమే పెరికివేస్తారు. తరువాత -మహారాణికి పండంటి మగ బిడ్డ విక్రమసింహుడు (అక్కినేని నాగేశ్వర రావు) పుడతాడు. రాజ్యంలోని అడవిజాతి వీళ్లకు ఆశ్రయమిస్తుంది. తల్లిద్వారా విక్రమసింహుడికి తాను యువరాజునన్న నిజం తెలుస్తుంది. దాంతో నగరానికి బయలుదేరతాడు. ప్రతాప శిల్పి (పి కోటేశ్వర రావు) తయారు చేసిన కీలుగుర్రాన్ని అధిరోహించగల సాహసి కోసం ఎదురు చూస్తుంటే, విక్రమసింహుడు ఆ కార్యాన్ని నెరవేర్చి రాజుస్థానంలో సేనాధిపతిగా చేరతాడు. రాక్షసి పన్నాగాలను కీలుగుర్రం సాయంతో తిప్పికొట్టి, తల్లిదండ్రులను కలిసి తన వీరత్వాన్ని చాటుకుంటాడు విక్రమసింహుడు.
గోవిందుడిగా రేలంగి, జ్యోతిషుడిగా పుచ్చా విశ్వనాథ శాస్ర్తీ, శిష్యుడిగా కెవి మాణిక్యాలరావు, దొంగల నాయకుడిగా లింగం సుబ్బారావు, దొంగలుగా ఆదిశేషయ్య, రాజారెడ్డి రామమూర్తి, జింటాన్, నారాయణరావు, లంకా శర్మ, శాంతో, పూజారులుగా కంచి నరసింహారావు, రామ్మూర్తి, విద్యావతిగా సూర్యశ్రీ, సుగుణగా జూ.లక్ష్మీరాజ్యం, అప్సరసగా అనసూయ, యక్షిణులుగా సురభి కమలాబాయి, గంగారత్నం, విద్యావతి తండ్రిగా రామనాథ శాస్ర్తీ నటించారు.
***
ఆ రోజుల్లో హీరోగా అక్కినేనికి ప్రేక్షకుల్లో ఎంత ప్రభావముందో తెలిపే ఇంకో ముఖ్య సంఘటన ఉంది. అదేమిటంటే ‘కీలుగుర్రం’ చిత్రం షూటిగ్ జరుగుతోంది. ఆ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందనందున చేతులతో చేసిన కీలుగుర్రంపై వైరు వర్కులతో పైకిలేపి ఆకాశంలో విహరిస్తున్నట్టుగా చూపేవారు. అయితే ఒకరోజున కీలుగుర్రంపై (్భమికి పది అడుగుల ఎత్తున) అక్కినేని విహరిస్తుండగా, అకస్మాత్తుగా కరెంట్ పోయింది. నాగేశ్వరరావు దబీమని కిందపడిపోయారు. బాగా దెబ్బలు తగిలాయి. అంతే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, మరణించారని వదంతులు ఆంధ్రదేశమంతటా వ్యాపించాయి. ప్రతిభా ఆఫీసుకు ఎన్నో సంతాప సందేశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ఘంటసాల బలరామయ్య తట్టుకోలేక ఆ వార్త నిజంకాదంటూ, నాగేశ్వరరావు క్షేమంగా ఉన్నాడని పేపర్ ప్రకటన ఇచ్చారు. అప్పటికిగాని జనం శాంతించలేదు. ఈ చిత్రంలో 15 పాటలు, ఒక పద్యం ఉన్నాయి. చిత్రం టైటిల్స్ వస్తుండగా ‘శోభనాగిరినిలయా దయామయా’ పాట గుర్రంపై చిత్రీకరించగా, ఆ పాటను నటి, గాయని, మీర్జాపురం రాజా సతీమణి కృష్ణవేణి ఆలపించారు. అక్కినేని, సూర్యశ్రీలపై చిత్రీకరించిన గీతం -ఎంత కృపామతివే భవానీ. శిల్ప శిష్యులపై చిత్రీకరించిన గీతం -ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎవరికైనా తప్పదన్నా. అంజలీదేవి, కనకంలపై చిత్రీకరించిన గీతం -చూచి తీరవలదా నా చదరంగం వేసి చూడవలదా ఆడుతూ. రేలంగి, కనకంలపై చిత్రీకరించిన గీతం చెంపకేసి నాకింపు చేసితివి చెడ్డదానివే చినదాన. కీలుగుర్రం చిత్రంలోని ఘంటసాల పాడిన మధురమైన, చిరస్మరణీయమైన గీతం -కాదు సుమా కల కాదు సుమా/ అమృత పానమును గగనయానమును. ఈ పాటను ఘంటసాలతోపాటు వక్కలంక సరళ పాడారు.
చెప్పుకోదగ్గ విషయాలు:
అద్భుతరసమే ఈ సినిమాకు ఆయువుపట్టు. రాక్షసులు మానవులతో కాపురం చేయడం, కొయ్యగుర్రం ఆకాశగమనం చేయడం, కీటకంలో రాక్షసి ప్రాణాలుండటం.. దాన్ని చిదిమితే అది ప్రాణాలు వదలడం లాంటి అభూత కల్పనలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి. కీలుగుర్రంమీద వెడుతూ అక్కినేని ‘కాదు సుమా కలకాదు సుమా’ పాట బహుళ ప్రజాదరణ పొందింది. గగనవిహారం అనే అందమైన ఊహకు 70 ఏళ్ల క్రితమే రూపకల్పన చేసిన రచయితకు, దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అక్కినేనికి పూర్తిస్థాయి జానపద హీరోగా ఇమేజ్‌ని, ఫాన్ ఫాలోయింగ్‌ని తెచ్చిన చిత్రం కీలుగుర్రం. ఈ సినిమాతో అక్కినేని యువత హృదయాల్లో సరికొత్త డ్రీమ్‌బాయ్‌గా అవతరించాడు. ఈ చిత్రానికి అక్కినేని 23 వేలు పారితోషికం అందుకున్నారు. ఈ సినిమా తర్వాత అక్కినేని దాదాపు మూడేళ్లపాటు ఎక్కవ జానపదాలే చేశారు. ఈ చిత్రం చమ్రియా రిలీజ్ ద్వారా ఫిబ్రవరి 11న విడుదల చేయడానికి సిద్ధమై పేపర్లో ప్రకటన ఇచ్చారు. అయితే తొలి కాపీ సిద్ధం కాకపోవడంతో 19న విడుదల చేశారు. ఇందులో అక్కినేని వీరరసాన్ని అద్భుతంగా పోషించి హీరో అనిపించుకొని ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. పైగా అక్కినేని మేకప్ అందంగా అమరింది. అప్పట్లో జానపద చిత్రాల్లో హీరో హెయిర్ స్టైల్ వెనక్కి ఉండేది. కానీ ఇందులో అందుకు విరుద్ధంగా అక్కినేనితో పక్కపాపిట తీయించారు. అప్పట్లో యువతరానికి ఆ క్రాఫింగే ఫ్యాషన్‌గా మారింది.
శోభనాచల పిక్చర్స్ కీలుగుర్రం జానపద చిత్రం అక్కినేని పెళ్లైన మరుసటిరోజున 19-2-1949న విడుదలైంది. ఆయన వివాహం 18-2-1949న దెందులూరు (పశ్చిమ గోదావరిజిల్లా)లో జరిగింది. ఆ మరుసటి రోజే కీలుగుర్రం విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కొత్తకోడలు వచ్చిన వేళా విశేషం అని చాలామంది నాగేశ్వరరావు అర్థాంగి అన్నపూర్ణను కొనియాడారు. జానపద చిత్రాల్లో నేటికీ ఈ సినిమాకు ప్రత్యేక స్థానముంది.
*
కీలుగుర్రం సినిమా షూటింగ్ జరుగుతున్నపుడే లంక సత్యం వచ్చి తమిళంలో ఎజీఆర్, జానకిలతో తీసుకుంటానని అడిగితే మీర్జాపురం రాజా స్క్రిప్టు ఇచ్చారు. అలా మోహిని తీశారు లంక సత్యం దర్శకత్వంలో. మోడరన్ థియేటర్ సుందరం తీశారు. కీలుగుర్రం కంటే ముందు వాళ్ల సినిమా తయారైపోయింది. మోహిని (1948) తమిళ వర్షన్ ఫెయిలైంది. అనంతరం కీలుగుర్రం విడుదలై ఘనవిజయం సాధించింది. కర్నాటకలోనూ వందరోజులు ఆడింది.
ఈ చిత్రాన్ని తమిళంలో ‘మాయాకుదిలై’ పేరిట అనువదించారు. అక్కడా ఘనవిజయం సాధించింది. 1949 ఆగస్టు4న సినిమా విడదలైంది. తమిళ భాషలో డబ్ కాబడిన మొదటి తెలుగు చిత్రమిదే. ఆదినారాయణరావు అనే తమిళ నటుడు అక్కినేనికి డబ్బింగ్ చెప్పారు. శ్రీలంకలోని జాఫ్నాలో తమిళ సినిమాలు ఎక్కువగా ఆడుతుండేవి. ఈ చిత్రం అక్కడ పెద్ద హిట్.
*
ఎన్టీఆర్‌తో ఈ సినిమాని కలర్‌లో మళ్లీ చేద్దామనుకుని అడిగితే, ఆయన సంతోషంగా అంగీకరించారు. నేను ఆయన దగ్గరకు వెళ్లినపుడు అక్కడ ఓ జర్నలిస్టు ఉన్నారు. ఆయనతో ఎన్టీఆర్ ‘నేను త్వరలో కీలుగుర్రం చేస్తున్నాను’ అని ప్రకటించారు. ఆ వార్త పత్రికల్లోనూ వచ్చింది. కీలుగుర్రం డిస్ట్రిబ్యూషన్‌కు చెందిన లక్ష్మీనారాయణ, ఎన్టీఆర్ వద్దకెళ్లి మీరు ఆ సినిమా చేస్తే నా డిస్ట్రిబ్యూషన్ దెబ్బతింటుంది అని వాపోయారు. దాంతో ఎన్టీఆర్ నాకు ఫోన్ చేసి విషయం వివరించి ఎవరికీ ఇబ్బంది లేకుండా కొంత గ్యాప్ తరువాత చేద్దాం అన్నారు.
ఆ గ్యాప్ అలాగే అయిపోయింది.
*
కీలుగుర్రం అంటే ఒకప్పటి ప్రముఖ కథానాయిక జమునకు చాలా ఇష్టం. ‘మా అమ్మా నాన్నల కంటబడకుండా వెనె్నల్లో మా దొడ్లోని బంతిపూల మొక్కదగ్గర నిలబడి -కీలుగుర్రంలో నాగేశ్వరరావు గుర్రంపై వెళ్తూ పాడే ‘కాదు సుమా కల కాదు సుమా’ పాట పాడేదాన్ని. ఎడమ చేతితో బంతి మొక్కను పట్టుకుని గుర్రాన్ని తోలుతున్నట్టు ఊపుతూ ప్రాక్టీసు చేసేదాన్ని’ అని చెబుతారు.
*
కీలుగుర్రం చిత్రం తెలుగు, తమిళ భాషలలో 10 లక్షలకుపైగా వసూలు చేసింది. ఆంధ్ర, తమిళంలో 300 థియేటర్లలో ప్రదర్శింపబడి సౌత్ ఇండియా రికార్డుగా నిలిచింది.

-కందేపు శ్రీనివాసరావు