మెయిన్ ఫీచర్

జూనియర్.. సీ’నియర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ రంగంలోనైనా..
-ఏళ్ల తరబడి పని చేస్తే, వాళ్లను ‘సీనియర్’ అంటారు.
ఒక్క చిత్ర పరిశ్రమలోనే..
-కాటికి కాళ్లుచాపిన వాళ్లను సైతం ‘జూనియర్’ అంటారు.
జూనియర్ల కష్టాల కథను చెప్పడానికి ఇంతకంటే సింపుల్ ఎక్స్‌ప్రెషన్ ఉండదేమో. చిత్రమేమంటే -ఈ జూనియర్లలో ఆర్నెల్ల పసికందులుంటారు. అరవైయేళ్ల వృద్ధులుంటారు. ఆడా మగా తేడా చూడకుండా.. వయోభేదాన్ని పట్టించుకోకుండా -ఎవ్వరికైనా పనివ్వగల ఒకే ఒక్క సినిమా విభాగం -‘జూనియర్’.
***
ఏ సినిమాకైనా ‘జూనియర్’ -జీవం. సన్నివేశానికి వెన్నులా, సినిమాకు దన్నులా.. -ప్రేక్షకుడికి వాస్తవిక భ్రమ కల్పించేది జూనియర్లే. సినిమాలో వాళ్లే -‘ప్రపంచం’. సినిమాయే -వాళ్ల ప్రపంచం. ‘జూనియర్’ జీవితాల్లోకి తొంగిచూస్తే మాత్రం -మరో ప్రపంచంలో వాళ్లొక ‘అంటరాని ఆకాశం’గా కనిపిస్తారు.

35ఏళ్ల క్రితం చెన్నైనుంచి హైదరాబాద్‌కు సినిమా తరలి వచ్చినపుడే -అదే బాటలో నడిచొచ్చేశారు జూనియర్లు. సినిమా ఫెడరేషన్‌లో భాగమైన
24 విభాగాల్లో వీళ్లూ ఓ భాగమయ్యారు. ఏ శుభముహూర్తాన వీళ్లు జూనియర్ అనిపించుకున్నారోగానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్
కడపటి స్థానంలో జూనియర్లుగానే ఉండిపోయారు. తెరపై కనిపించాలన్న
ఒకే ఒక్క ఆశతో -ఇల్లొదిలి.. ఊరొదిలి.. కన్నోళ్లను
బంధువర్గాలను వదిలి వచ్చినోళ్లే వీళ్లంతా.

బ్యాగ్‌లో నాలుగు దుస్తులు సర్దుకుని ‘మాయా ప్రపంచానికి’ బయల్దేరినపుడు అందరి టార్గెట్ ఒక్కటే -తెరపై మెరిసిపోవాలని. హీరోనో, హీరోయినో అయిపోవాలని. ఆహార్యం సహకరించకుంటే -కనీసం ‘సపోర్టింగ్’ క్యారెక్టరైనా చేసేయాలని. ఆ తలంపుతో పరిశ్రమలోకి అడుగుపెట్టి.. అవకాశాలు దక్కని పరిస్థితిలో ‘జూనియర్లు’గా సినిమా వ్యవస్థకు ‘సపోర్టింగ్’గా మిగిలిపోతున్నారు. వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నా ‘సపోర్టింగ్’ అన్న పదానికి వాళ్లు నోచుకోరు. ఇదీ -వాళ్ల ఐడెంటిటీ క్రైసిస్.
***
నేను చెప్తున్న కథ -పాతికేళ్ల క్రితంనాటిది.
సినిమాపై ఆశతో గుంటూరునుంచి హైదరాబాద్ బస్సెక్కేశా. ఇక్కడ దిగాక ఎక్కడికెళ్లాలో తెలీదు. ఫూట్‌పాత్‌పై టిఫిన్ చేయడం అదే మొదటిసారి. ఛాయ్ తాగి లోకల్ బస్సెక్కా. షూటింగ్‌లు ఎక్కడున్నాయో ఆరా తీయడమే దినచర్య. గంటలు కాదు రోజులపాటు ఎదురు చూడటం అలవాటైంది అక్కడినుంచే. ఆఫీసుల చుట్టూ, స్టూడియోల చుట్టూ తిరుగుతూ -మైళ్ల దూరం నడవగల సత్తా వచ్చేసింది. కాకపోతే -తెచ్చుకున్న పైకం పాతిక రోజుల్లో కర్పూరమైపోయింది. అదీ ఒక్క పూట భోజనం.. చిన్న లాడ్జిలో మకాంతో. విశాలమైన ఊరునుంచి ఇరుకు గదిలోకి బతుకొచ్చేసింది. నేను కోరుకున్న వేషం దక్కలేదు. జూనియర్ వేషం మాత్రం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. బతకాలిగా, తప్పక ఒప్పుకున్నా.
నాలుగ్గంటలకు నిద్రలేవాలి. డెయిలీ రొటీన్స్ పూర్తి చేసుకుని.. ఉన్న బట్టల్లో కాస్త శుభ్రంగా ఉన్నవి వేసుకుని.. సినిమా పని కోసం రోడ్డెక్కాలి. అడ్డా కూలీలా నిలబడటం అలవాటైపోయింది. ఇదీ జీవితంలో నిజమైన నా వేషం. చెప్పుకోడానికి వీల్లేనంత దుర్బర పరిస్థితి నుంచి -పని అందిపుచ్చుకునే అనుభవానికి వచ్చాను. అప్పటికి అందం, ఆరోగ్యం పోయి భయం, నైరాశ్యం వచ్చేశాయి. బతకాలి కనుక -జూనియర్‌గానే సెటిలైపోయా. జూనియర్‌గా -నా జర్నీ ఇప్పటికి పాతికేళ్లు. ఇంకో పాతికేళ్లున్నా -జూనియర్‌నే. ఇక్కడికొచ్చాకే ఇదే వ్యవస్థనుంచి భర్తను సంపాదించుకున్నా. కొడుకును కన్నా. నమ్ముకున్న ఇద్దరూ అన్యాయం చేసి -కన్నుమూశారు. మొదటినుంచీ నమ్ముకున్న ‘జూనియర్’ వ్యవస్థే మిగిలింది. పని దొరికితే చేస్తున్నా. లేదంటే పస్తులుంటున్నా. అందరికీ ఇలాంటి పరిస్థితే ఉండకపోవచ్చు. కానీ చాలామంది నాలాగే ఉంటారు. ఆ దౌర్భాగ్య పరిస్థితినే కథగా చెప్పా’ అంటోంది జూనియర్ ఆర్టిస్ట్ బ్రమరాంబ.
నిజానికి ఇంత చెప్పిన తరువాత మళ్లీ -‘జూనియర్’ అన్న పదం రాయాలంటేనే కాస్త ఇబ్బందిగా ఉంది. ఎందుకుంటే ఆ ఒక్క పదమే చాలామంది జీవితాలను నాశనం చేసిందన్న భావన వాళ్లలో గూడుకట్టుకుంది. అందుకే -జూనియర్ అన్న పదాన్ని తొలగించి మరో ఐడెంటిటీ ఇమ్మని కోరుతున్నారు ఆ విభాగంలోని ఆర్టిస్టులు.
**
ఏ సినిమాకైనా -జూనియర్లు అడ్డా కూలీల్లా బుక్కవుతారు. ఒకప్పుడు డీసీఎంలలో... ఇప్పుడు బస్సుల్లో షూటింగ్ స్పాట్లకు తోలబడతారు. అక్కడే -నిజమైన సినిమా కష్టాలు మొదలవుతాయి. అంతా వేర్పాటువాదం. కెమెరా రన్నవుతున్నంత సేపూ సన్నివేశంలోని ప్రపంచంగా కనిపించే వీరు, షూట్ లేనపుడు మాత్రం చెట్టుపుట్టల పంచన పడుండాలి. పలిస్తే పరుగులెత్తాలి. నేచర్ కాల్స్ తీర్చుకునే ప్లేస్ ఉండదు. ఊరికి దూరంగా.. అన్నట్టు ఓ మూలకు టెంట్ వేసి అక్కడే భోజనాలు. తెరవెనుక వాళ్లంతా దాదాపుగా అన్‌టచబుల్స్.
జూనియర్ ఆర్టిస్టులది ముఖ్యస్థానమే. వందలకోట్లు పెట్టి తీసిన సినిమాలకు వీళ్లే ప్రాణం. కాకపోతే -గుర్తింపుండదు. సీన్‌లో ఒకరిగా కనిపించటమే తప్ప, డైలాగులుండవు. ఒకే టేకులో సీన్ పండించేంత సత్తావున్నా అవకాశాలురావు. వీళ్లలోనూ -గొప్ప ఆర్టిస్టులు, పాటలు, మాటలు రాసేవాళ్లు, జోకులతో కామెడీ చేసేవాళ్లూ ఉంటారు. కానీ వీరిపై ఎవ్వరికీ నమ్మకం ఉండదు. ఇదో క్రైసిస్.
**
అన్ని క్రాఫ్ట్‌ల మాదిరిగానే వీళ్లకూ ఓ యూనియన్ ఉంది. చిత్రమేమంటే అన్ని క్రాఫ్ట్‌లకూ ఒక్కో యూనియన్ ఉంటే -వీళ్లకు మాత్రం రెండు యూనియన్లు. ఒకటి -జూనియర్ ఆర్టిస్టుల యూనియన్. రెండోది -జూనియర్ ఆర్టిస్టుల ఏజెంట్ల యూనియన్. ఓకే వ్యవస్థనుంచి పుట్టుకొచ్చిన రెండు పార్శ్వాలు. జూనియర్ ఆర్టిస్ట్ కావాలంటే -ముందు సభ్యత్వం తీసుకోవాలి. ఇప్పటి రేటు పదిహేను వేలు. సభ్యత్వం తీసుకున్నా పనికి గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే అన్నిరకాల పాత్రలకు అంతా సరిపోయేలా ఉండరు. బిచ్చగాళ్లు.. ప్రయాణికులు.. అమ్ముకునేవాళ్లు.. కొనుక్కునే వాళ్లు.. సైనికులు.. పోలీసులు.. ఇలా బయట కనిపించే ప్రపంచమంతా స్క్రీన్‌పై వీళ్లే ఆవిష్కరించాలి. సో, సినిమా షూటింగ్‌ను బట్టి, అందులో వాళ్లకు కావాల్సిన ‘జూనియర్ల’ను బట్టి ఇక్కడి జూనియర్లకు పని దొరుకుతుంది. ఇక్కడ పని కూడా క్యాటగిరీ బట్టి దొరకడం మరో విచిత్రం. ఉదాహరణకు -గొప్పింటి మనుషులు కావాలంటే ఆ తరహాలో కనిపించే జూనియర్లను ఎంపిక చేస్తారు. వాళ్లకో రేటుంటుంది. తరువాత ‘బి’ గ్రేడ్ ఆర్టిస్టులుంటారు. వాళ్లకో రేటు. ‘సి’ గ్రేడ్ ఆర్టిస్టులూ ఉంటారు. వాళ్లకో రేటు. ఈ రేట్లన్నీ ఒక దినసరి కూలీకిచ్చే రేటుకు అటూ ఇటూ ఉంటుందే తప్ప -అంతకుమించి కాదు. సో, జూనియర్ల లైఫ్‌లో గొప్ప సినిమా. పేద బతుకు. ‘ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నా -కడుపుకొట్టే మరో వ్యవస్థ మాతో నీడలా ప్రయాణం చేస్తూంటుంది’ అంటోంది మరో జూనియర్ ఆర్టిస్ట్ మల్లిక.
జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసే ఏజెంట్ల వ్యవస్థ ఉంటుంది. వీళ్లకూ యూనియన్ ఉంటుంది. నిర్మాతలతో అనుక్షణం టచ్‌లో ఉంటూ సినిమాలను అందిపుచ్చుకునే ఈ వ్యవస్థ వల్ల సభ్యత్వాలు పొందిన జూనియర్లకు అన్యాయం జరుగుతోందన్నది జూనియర్ల యూనియన్ నుంచి వినిపిస్తోన్న మాట. కానీ, వీళ్లులేకుంటే పని కష్టం. ‘జూనియర్’ వ్యవస్థలో సభ్యులు కాని వాళ్లకు పని అవకాశాలూ ఇప్పిస్తూ -పొట్ట కొడుతున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అందుకు లోపాయికారీ వ్యవహారాలు ఒక కారణమైతే, సంఘటితంగాలేని జూనియర్ల వ్యవస్థ మరో కారణం.
**
యూనియన్ మేనేజ్‌మెంట్ లెక్కల ప్రకారం -జూనియర్ ఆర్టిస్టుల బలం 2.5 వేల పైచిలుకు. కానీ ఎక్కువ శాతం వ్యవస్థకు దూరంగానే ఉంటున్నారు. మొదట్లో షూటింగుల పనికోసం ఎదురుచూపులు చూసి అలసిపోయి.. కడుపు నింపుకోడానికి కొత్త పనులు వెతుక్కోవడం మొదలెట్టారు. కుటుంబాన్ని పోషించాలి కనుక -బట్టల షాపుల్లో, షాపింగ్ మాల్స్‌లో, మార్కెట్లలో, కూలీపనుల్లో కుదురుతున్నారు. ఇలా ‘జూనియర్’ వ్యవస్థనుంచి ఎంతమంది దూరమవుతుంటే -రోజూ వచ్చేవాళ్లతో ఆ వ్యవస్థ అంతేస్థాయిలో సాగుతోంది. అది వేరే విషయం.
అయితే, ఈ కోణంలో వినిపించే మరో క్రైసిస్ -జూనియర్ వేషాలు వేసిన తరువాత పనులు చేసుకోలేని పరిస్థితి. ‘నువ్వా? సినిమాల్లో వేషాలు వేసేదానివా. అది వదులుకుని ఇక్కడికొచ్చావ్. అసలు పని చేస్తావా. తిప్పుకుని తిరుగుతావా? నీతో కష్టంగానీ, వెళ్లు మరో ఆమెను చూసుకుంటాం’ ఇదీ 40 యేళ్ల జూనియర్ ఆర్టిస్ట్ అనుపమ (పేరు మార్చాం)కు ఎదురైన అనేక అనుభవాల సారాంశం. సినిమా వాళ్లంటేనే బయట ఏవగించుకునే పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది అనుపమ. షూటింగులు లేక బయటి పనులకు వెళ్దామన్నా, ఇంతకుముందు ఏంచేశారని చెప్తే ఏంచెప్పుకోవాలో కూడా అర్థంకాని పరిస్థితి ఎదుర్కొంటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
జూనియర్ ఆర్టిస్టులకు పండుగలు, వేడుకలు, శుభకార్యాలు దాదాపుగా ఉండవు. వాటికోసం వెళ్తే -ఉన్న షూటింగ్‌లు పోతాయనే భయం వాళ్లలో ఎక్కువ. షూటింగులు ఎప్పుడు జరుగుతాయో, పని అవసరం ఎప్పుడుంటుందో తెలీదు కనుక -అన్నీ వదులుకుని అంటిపెట్టుకుని ఇక్కడే ఉండాలంటారు జూనియర్ ఆర్టిస్టులు.
**
యూనియన్‌లో సభ్యత్వం తీసుకున్న జూనియర్ ఆర్టిస్టుల్లో చాలామంది వృద్ధులైపోతున్నవాళ్లే. ఏళ్ల తరబడి ఈ రంగంలో కొనసాగినా -బతుకు అంత్యదశ మాత్రం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది వీళ్లకు. దారుణమైన పరిస్థితుల్లో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న జూనియర్ ఆర్టిస్టులు ఎందరో. బతికినన్ని రోజులూ అవకాశాల కోసం ఎదురు చూపు. పనిచేయలేని పరిస్థితి వచ్చాక -సాయం కోసం ఎదరు చూపు. బతుకంతా దయనీయమైన చూపుల మధ్యే సాగిపోయిందన్న వేదన వాళ్ల గొంతులో వినిపిస్తోంది.

మార్పు
సాధిస్తాం
కాలమెప్పుడూ ఒక్కలా ఉండదు. సినిమా ప్రపంచంలో ‘జూనియర్’ వ్యవస్థ ఇలానే ఉండిపోతుందని అనుకోను. మా ప్రయత్నాలు ఫలిస్తే అనూహ్యమైన మార్పునే చూస్తారు అంటున్నారు -యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్. చెన్నైనుంచి పరిశ్రమతోపాటే 35ఏళ్ల క్రితం జూనియర్ వ్యవస్థ వచ్చినప్పటికీ, దీని ప్రగతికి జరగాల్సిన కృషి జరగలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది ఆయన మాటల్లోనే...
ఇంతకుముందు జరిగిన వైఫల్యాలను తవ్వుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. గతం తాలూకు యూనియన్లను నిందించటమూ నా అభిమతం కాదు. ‘జూనియర్’ వ్యవస్థనుంచే పుట్టి, అదే యూనియన్‌లో ప్రధాన కార్యదర్శి హోదాకు ఎదిగిన వాడిగా నాపై చాలా బాధ్యతలే ఉన్నాయి. ఇప్పటి వరకూ అటు యూనియన్, ఇటు జూనియర్లు సంఘటితంగా లేని పరిస్థితుల్లో అన్యాయం జరిగిన మాట వాస్తవమే. దాన్ని చక్కదిద్దే సంస్కరణలు కొత్త కమిటీ మొదలెట్టింది. అధ్యక్షుడు స్వామిగౌడ్, కోశాధికారి రవి.. ఇలా అందరి సహకారంతో కొత్త ప్యానెల్‌గా అధికారంలోకి వచ్చాక -‘జూనియర్’ వ్యవస్థ బలోపేతానికి ఎన్నో సంస్కరణల మొదలెట్టాం. ఇప్పుడు మా ముందున్న లక్ష్యం ఒక్కటే -వ్యవస్థను చక్కదిద్దడం. ఈ వ్యవస్థకు ఒక హోదా కల్పించే ప్రయత్నాలు చేయడం. అందులో ముందుగా -సభ్యుల క్రమశిక్షణపై దృష్టి పెట్టా. పనిలో, జీవితంలో క్రమశిక్షణ అలవడిన రోజున ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకడం ఖాయం. ఇక రెండోది ఫిల్మ్ చాంబర్ సమక్షంలో ఏజెంట్లతో చేసుకున్న అగ్రిమెంట్లు అమలయ్యే పరిస్థితిపై దృష్టి పెడుతున్నా. అలాగే జూనియర్ల పేమెంట్ల విషయంపై దృష్టి పెట్టాం. గతంలో పేమెంట్లు ఒక్కోసారి ఆర్నెల్లకూ రాని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి మారింది. కనీసం పదిరోజులకైనా పేమెంట్లు అందలే చర్యలు తీసుకుంటున్నాం. అలాగే షూటింగ్ షెడ్యూల్స్ ముందే చెప్పమని అడుగుతున్నాం. దీనివల్ల ఉన్న అవకాశాలు సభ్యులు వినియోగించుకునేలా సాంకేతికత సాయంతో చర్యలు తీసుకుంటున్నా. ఇక నిర్మాతలతో నాకున్న విస్తృతమైన పరిచయాలు వినియోగించుకుని -కనీసం ఏజెంట్ల వ్యవస్థ ద్వారానే యూనియన్‌కు బాధ్యతలు అప్పగించేలా చర్యలు మొదలుపెట్టా. మేం చేపట్టిన చర్యలు ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తున్నాయి. షూటింగులు లేకుండా ఖాళీగా ఉంటున్న జూనియర్ ఆర్టిస్టుల సంఖ్య తగ్గుతోంది.

సంస్కరణలు-1

ఇక షూటింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తున్నాం కూడా. నాన్ నెంబర్ అన్న వాళ్లను షూటింగ్‌లో ఐడెంటిఫై చేస్తే -అదే తరహా వ్యక్తి జూనియర్ వ్యవస్థలో ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటున్నాం. అలాంటి సంఘటనల్లో పేమెంట్‌తో పాటు ఫైన్ చెల్లించక తప్పదు. లేదంటే జూనియర్లను సప్లై చేయడం నిలిపివేస్తున్నాం. ఇక ‘జూనియర్’ అన్న గుర్తింపునకు చెడ్డపేరు తెస్తున్న వాళ్లపైనా దృష్టిపెట్టాం. ఏదైనా అసాంఘిక, అనైతిక కార్యకలాపాల్లో దొరికితే -జూనియర్ వ్యవస్థను బదనాం చేస్తున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించి సభ్యుల్లో ధైర్యం నింపేందుకు.. ఇప్పటికే పోలీస్ కమిషనర్ నుంచి, స్టేషన్లలోని ఎస్సైల వరకూ ప్రత్యేక రిప్రజెంటేషన్ అందించాం. వివిధ అనైతిక కేసుల్లో దొరికిన వాళ్లు జూనియర్ అని చెబితే, ముందుగా వాళ్ల గుర్తింపు కార్డు, నెంబర్ పరిశీలించి మాకు సమాచారం అందించాలన్న విజ్ఞప్తి చేశాం. ఒక్కరోజుల్లో అద్భుతాలు జరిగిపోతాయని నేననుకోవడం లేదు. సంస్కరణలకు మానసికంగా ముందు సభ్యులన్న సన్నద్ధం చేస్తే, వాళ్ల సంక్షేమానికి యూనియన్ చేయాల్సిన బాధ్యతలు నెరవేరుస్తాం.

సంస్కరణలు-2

నేను పదవిలోకి వచ్చేవరకూ యూనియన్ అప్పుల్లోనే ఉంది. నేను వచ్చాక రూ. 70 లక్షల రిజర్వుడుకు తీసుకొచ్చా. వెనుకబడిన క్రాఫ్ట్‌గా మాకు కావాల్సిన దాన్ని అడుక్కోవాలని అనుకోవడం లేదు. కృషి, పోరాటాలతోనే సాధించాలన్న తలంపు ఉంది. ముందుగా యూనియన్‌కు ఓ భవంతి కావాలి. మరో మూడు నెలల్లో యూనియన్ సొమ్ముతోనే స్థలాన్ని కొనబోతున్నాం. ఏడాదిలో భవంతి నిర్మించుకోవాలన్నది మా కల. సినిమాకు సంబంధించి 24 క్రాఫ్ట్స్‌లో ‘ది బెస్ట్’ అనిపించుకోవాలన్న తలంపుతో పని చేస్తున్నాం.
జీవితాంతం ‘జూనియర్ల’మేనా? అన్న ఐడెంటికీ క్రైసిస్ ఆర్టిస్టుల్లో ఉన్న మాట వాస్తవం. అది మాకూ నచ్చడం లేదు. ఉన్నంతలో మా పనిని గౌరవప్రదంగా తెలియజెప్పే పదం కోసం చూస్తున్నాం. ఆ విషయాన్ని ఫిల్మ్ చాంబర్, ఫెడరేషన్‌ల దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నా. ప్రస్తుతం యూనియన్ లక్ష్యం ఒక్కటే -జూనియర్ ఆర్టిస్టులు బావుండాలి. తలెత్తుకుని బతకాలి. ‘మా’ అన్న ఆఫీస్ భవనం ఒకటుండాలి. హెల్త్ ఇన్స్యూరెన్స్, ఇళ్ల స్తలాలు అవకాశాలు అందుకోవాలి.
జూనియర్ ఆర్టిస్టులుగా వస్తున్న వాళ్లలో ఎక్కువమంది భర్తలేనివాళ్లే వస్తున్నారు. వాళ్ల కష్టం చిన్నది కాదు. అందుకే -అలాంటివాళ్లకు కచ్చితంగా పని దొరికే చర్యలు తీసుకుంటున్నా.

సంస్కరణలు-3

ఇక యూనియన్, అందులోని సభ్యులను స్ట్రీమ్‌లైన్ చేసే సంస్థాగత చర్యలూ మొదలయ్యాయి. అందరినుంచీ ఆధార్‌లాంటి గుర్తింపు తీసుకుని సభ్యత్వాలిస్తున్నాం, గుర్తింపు కార్డులు సిద్ధం చేస్తున్నాం, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో జూనియర్ ఆర్టిస్టుల డేటాను సిద్ధం చేస్తున్నాం. ఈ చర్యల ఫలితాలు ఇప్పుడే అందకపోవచ్చు. కాకపోతే -ఈ సంస్కరణల కారణంగా భవిష్యత్‌లో ఎన్నో ఉత్తమ ఫలితాలు అందుతాయన్న ఆశ అయితే ఉంది. నాన్ నెంబర్ల వ్యవస్థను అరికట్టి అసలైన సభ్యులకు న్యాయం జరిగడానికి ఇవన్నీ దోహదపడతాయి. ‘జూనియర్’ వ్యవస్థకు కార్పొరేట్ హోదా
కల్పించాలన్నంత ప్రణాళికలు చేస్తున్నాం.

శుభ్రతే.. సంస్కరణ

సంస్కరణ అనేది ప్రస్తుతం ఉన్న ఆఫీస్ నుంచే మొదలైంది. ఒకప్పుడు మరుగుదొడ్డిలా అనిపించే ఆఫీస్‌ను ఉన్నంతలో శుభ్రంగా తీర్చిదిద్దుకున్నాం. ఇదే మేం సాధించిన మొదటి ఫలితం. అలాగే, జూనియర్ ఆర్టిస్టులు డిఫరెంట్ ఆటిట్యూడ్‌తో ఉంటారు. వీళ్లందరినీ క్రమశిక్షణ కలిగిన వ్యవస్థగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి జనరల్ బాడీ సమావేశంలో ఈమేరకు కౌన్సిలింగ్ చేస్తున్నాం. బస్సులు ఎక్కేటప్పుడు, భోజనాలు తినే సమయంలో క్యూలు పాటిస్తే -అదే పెద్ద ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని పదే పదే చెబుతున్నాం. క్రమశిక్షణకు మేం రూపొందించిన విధానాలు అమలైతే, మూడేళ్లలో ది బెస్ట్ క్రాఫ్ట్‌గా ఎదగగలం.
పి రవి, కోశాధికారి

చిత్రం... ప్రతిరోజూ జూనియర్లకు తెల్లారేది ఇలాగే.. పని కోసం కార్యాలయం వద్ద తెల్లవారుఝామునే పడిగాపులు పడే దృశ్యాలు నిత్యకృత్యం

విజయప్రసాద్