మెయిన్ ఫీచర్

నిరభ్యంతరంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభ్యంతరాలన్నీ -నిరభ్యంతరంగా తెరకెక్కేస్తున్నాయ్.
అడ్డుచెప్పాల్సిన సెన్సారు -అలాంటి కోణంలో
‘అలాంటలాంటి’ శబ్ద దృశ్య సన్నివేశాల్ని పట్టించుకోవడం
మానేసిందా? అన్న సందేహాలూ ముసురుతున్నాయి.
సెన్సారు కంచెదాటి సినిమా బయటికొచ్చే ప్రసక్తే లేదు.
కాకపోతే -సెన్సారు సర్టిఫై చేసిన కాపీయే థియేటర్లలో
ప్రదర్శితమవుతుందా? అన్న అనుమానాలు మాత్రం కొన్ని
సినిమాలు చూస్తుంటే రాకమానదు. సెన్సారు
-నైతికత మధ్య సయోధ్య కరవై, కత్తెర పడాల్సిన
అభ్యంతరాలు తెరమీద నిరభ్యంతరంగా కనిపిస్తున్నాయి.
శబ్దానికి ‘బీప్’.. దృశ్యానికి ‘బ్లర్’ అనే సరిపెట్టుడు విధానం
కనిపెట్టిన తరువాత -అభ్యంతరాల పోకడ శృతిమించటం
సులువైంది. ఏడాదిలో ఎన్ని సినిమాలు సెన్సార్ నుంచి ‘ఏ’టాగ్ లేకుండా బయటికొస్తున్నాయని లెక్కలు తీస్తే -సంఖ్య చూపించటానికి చేతివేళ్లు ఎక్కువనే పరిస్థితి దాపురించింది. సామాన్య జీవితంపై సినిమా ప్రభావం? అన్న చర్చ నలిగి నలిగి ఎప్పుడో ‘జీర్ణ’మైపోయింది కనుక -మంచి చెడ్డల గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. కాకపోతే -కాలగర్భంలో కలిసిపోతున్న నైతిక ప్రమాణాలు, తెరపై కనిపిస్తోన్న విచ్చలవిడి దృశ్యాలు ఒక్కోసారి ఉలికిపాటుకు గురిచేయడం సహజం. అదీ ఒకింత ఇమేజ్ కలిగిన ఆర్టిస్టులు చేస్తున్న సినిమాల్లో ‘అలాంటివి’ కనిపిస్తే -్భయమేయక మానదు. ఓ కథను వినోదాత్మకంగా చెప్పడానికి ‘పచ్చి’తనం అవసరమా? అనిపిస్తుంది. వెంటనే.. -సినిమాల్లో ఇవన్నీ కామనేనని సరిపెట్టేసుకోవడమూ జరుగుతుంది. కారణం -నైతిక ప్రమాణాల నియంత్రణ రేఖ చెరిగిపోయింది కనుక.

సెన్సారు ప్రమాణాల విషయంలో తెలుగు సినిమా ఎంత ఉన్నతంగా ఉండేదో తెలియజెప్పే సంఘటన గుర్తు చేసుకుందాం.
ఏయన్నార్ హీరోగా జయభేరి సినిమా నిర్మితమైంది. వాసిరెడ్డి నారాయణ రావు నిర్మాత. పి పుల్లయ్య దర్శకుడు. ‘నీదాన నన్నదిరా..’ అంటూ సాగే ఓ యుగళ గీతాన్ని సంగీతనిధి పెండ్యాల అద్భుతంగా స్వరపర్చారు. సెన్సార్ టైంలో పాటకు అభ్యంతరం వచ్చింది. ఆ పాటలో మూడు నాలుగుసార్లు ‘చుక్క’ అన్న పదం రిపీటైంది. అది ఏ ఉద్దేశంలో రాసినా ‘సారా’ అర్థం ప్రతిధ్వనిస్తోందంటూ సెన్సార్ అభ్యంతరం పెట్టిందట. దర్శక, నిర్మాతలు గట్టిగా ప్రయత్నించినా -అప్పటి సెన్సార్ అధిపతి కపిల కాశీపతి ‘నో’ అనేశాడు. ఆడియన్స్ కోణంలో ఒకటికి రెండుసార్లు పాట విన్న దర్శక నిర్మాతలూ -నైతిక బాధ్యతనే ప్రమాణంగా స్వీకరించి సినిమా నుంచి పాటనే తీసేశారు. పాటను పక్కన పెట్టడానికి హీరో అక్కినేని సైతం ఓటేశారట. అదీ మన తెలుగు సినిమాలో సెన్సార్ ప్రమాణాల స్థాయి.
**
ప్రస్తుతం థియేటర్లలో -మన్మథుడు 2 చిత్రం ఆడుతోంది. ఈ సినిమాలో లిప్తకాలంలో మాయమయ్యే ప్రత్యేక దృశ్యాన్ని ప్రస్తావించుకుందాం. ఓ సన్నివేశంలో -ఇంటి కోడలిగా రాబోయే అవంతిక (రకుల్‌ప్రీత్ సింగ్) -ఆ ఇంటి పెద్ద ఆడపడుచు (ఝాన్సీ)తో లిప్‌లాక్ చేస్తుంది. అదీ శృంగారభరిత సందర్భ సన్నివేశంలో. ఈ దృశ్యాన్ని అలాగే ఉంచేసిన సెన్సార్ మాత్రం -పెదాలు కలిసే చోట ‘బ్లర్’ చేసింది. ‘అక్కడ సీన్ అదీ’ అన్న విషయం ఆడియన్స్‌కి అర్థమైన తరువాత -పెదాలను బ్లర్ చేసినంత మాత్రాన ఆలోచనలు మారతాయా? అన్నదే అసలు చర్చ. పైగా ఈ దృశ్యానికి మరింత బలం చేకూరేలా సన్నివేశం కంటిన్యూ అవుతుంది. ఇంటి కోడలిచ్చిన లిప్‌లాక్ తరువాత -ఆమె శృంగార ప్రేరేపణకు గురికావడం, పదే పదే భర్తను గదిలోకి తీసుకెళ్లడం, దానిపై మిగతా పాత్రలు సెటైర్లు వేసుకోవడం లాంటి సన్నివేశాలు ‘కామెడీ’ కోసమే పెట్టి ఉండొచ్చు. కానీ -ఆ కామెడీనుంచి పుట్టే శృంగార భావార్థం ఆడియన్స్‌పై మరోలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని పట్టించుకోలేదు. ఈ దృశ్యాన్ని సెన్సారు ‘బ్లర్’తో సరిపెట్టేసింది కనుక -దాదాపుగా అలాంటి దృశ్యాలు చట్టబద్ధమైనట్టే. ఇదే ప్రమాణంగా -తరువాతి చిత్రాల్లో మగాడికి మగాడితో, అమ్మాయికి అమ్మాయితో అభ్యంతరకర దృశ్యాలు చిత్రీకరించి నిరభ్యంతరంగా స్క్రీన్‌కి వదిలితే కాదనేదెవరు? నిజానికి ఆ సన్నివేశంలో ఆ దృశ్యానికి అంత బలముందా? చెప్పాల్సిన విషయాన్ని మరికాస్త సరళంగా, సున్నితంగా మరోలా చెప్పే అవకాశం లేదా? ఈ ప్రశ్నలకు జవాబిచ్చేవాళ్లు దొరకరు. అది వేరే విషయం.
ఇదే సినిమాలో మరో భంగిమను తీసుకుందాం. ‘తనకు కాబోయే భార్య కాస్త వెయిట్ ఉండాలి’ అంటాడు హీరో ఓ సన్నివేశంలో. నిజానికి హీరో చెప్పిన సందర్భం సరిగ్గానే ఉంది. కానీ సీన్ కంటిన్యూ చేస్తూ ‘నేను వెయిట్ లేనా?’ అని హీరోయిన్ అనడం, ‘ఏమో నాకేం తెలుసు’ అన్నట్టుగా హీరో చెప్పడం.. ఈ సంభాషణ ఉద్దేశమే ఆడియన్స్‌కి వేరుగా రీచైంది. పైగా ఇదే విషయంపై మరో సన్నివేశంలో హీరోని హీరోయిన్ దెప్పిపొడుస్తూ ‘నీకు వెయిట్ ఉన్నవాళ్లు కావాలిగా’ అంటూ ఓ రకమైన భంగిమ పెట్టడం -ఎలాంటి ఉద్దేశాన్ని ఆడియన్స్‌కి పంపుతున్నట్టు? అన్న

సందేహాలు తలెత్తకమానవు. ఒక్క ఈ సినిమాలోనే కాదు, ఇటీవలి కాలంలో వచ్చిన అనేక సినిమాల్లో ఇలాంటి సందర్భాలు అనేకం. ఏ సినిమానీ ఎంచక్కర్లేని పరిస్థితే ఉంది.
పైన చెప్పుకున్నట్టు -ఏది మంచి? ఏది చెడు? అన్న నీతి సూత్రాలు తెచ్చే ఉద్దేశం కాదు. నైతిక ప్రమాణాల స్థాయి ఎలా దిగజారిపోతోందన్న మార్పును చర్చించటానికే. సామాజిక బాధ్యతను కొత్తరక్తం ఏకోణంలో తీసుకుంటోందన్న విషయాన్ని ప్రస్తావించడానికే.
ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినపుడు సినిమా పెద్దల నుంచి మరో సమర్థన ఈమధ్య వినిపిస్తోంది. వాస్తవ సమాజంలో ఇలాంటి అంశాలు అనేకంగా కనిపిస్తున్నాయి కనుకే -సినిమాల్లో చోటు చేసుకుంటున్నాయన్నది వారి వాదన. అక్కడెక్కడో ఏదో చూశామని, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని మనసుకు అనిపించినా, చూశాం కనుక ప్రతిబింబింప చేస్తామనడం ఎంతవరకు సబబు?
మార్పు అనివార్యం. దానికి ఎవ్వరం అతీతం కాదు. అప్పుడు హీరోలు పంచెలు కట్టారు కదాని ఇప్పుడు పంచెలు కట్టి చూపించమని ఎవ్వరూ అడగరు. కాకపోతే -మన సంస్కృతి గొప్పదని చెప్పుకుంటూ.. స్వయం నియంత్రణను గాలికొదిలి విష ప్రభావం చూపే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకూ సమర్థనీయమన్నదే ప్రశ్న. ‘ఏ చర్చకు ఆ సమర్థన’ అన్న ధోరణిలో ‘మిమింతే’ అనుకుంటే ఎవ్వరూ కాదనేదీ ఉండదు.
***
నిజానికి ఇలాంటి వాదనలు చాలాకాలంగా వినిపించి, చిత్రంగా మాయమయ్యాయి. ఎందుకంటే? -మార్పునకు గురైన సినిమా మారినట్టే వస్తోంది. భరించలేని ముందుతరం సినిమాల చూడ్డం మానేశారు. ఆసక్తి చూపించే ఆడియన్స్ -అలవాటుపడిపోయారు. పైగా గతంలో -నాయికా నాయకుల మధ్య శృంగారం మోతాదు ఎక్కువైందని వేలెత్తి చూపడానికి ఏదో ఒక్క సినిమాను ఉదహరించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు -సెన్సారు, కచ్చితమైన నైతిక ప్రమాణాలతో సినిమాలు వస్తున్నాయని గొంతువిప్పి గట్టిగా చెప్పడానికి ఏ ఒక్క సినిమానో వెతుక్కోవాల్సి వస్తుంది. పాటల్లో పల్లవిగా, సన్నివేశంలో సంభాషణగా -నర్మగర్భంగా మొదలైన ‘అభ్యంతరం’ ఇప్పుడు ‘నగ్నత్వాన్ని’ సంతరించుకుంటోందన్నది నిజం. మెల్లమెల్లగా మొదలైన అలవాటే అనుసరణలో సంప్రదాయమై కూర్చుంటుందన్న నానుడిని -తెలుగు సినిమా నిజం చేస్తోందేమో.
**
ఒకప్పుడు-
వినోదానికి ముడిసరుకైన నవరసాల్లో -ఏ సారం శృతిమించినా ఒప్పుకునేవారుకారని సినీ పూర్వీకుల గురించి గొప్పగా చెబుతాం. తీవ్ర విషాదం.. వెకిలి హాస్యం.. మితిమీరిన శృంగారం.. ఇబ్బందికర వస్తధ్రారణం... ఇలా ప్రేక్షకుడిపై ప్రభావాన్ని చూపే ఏ రసాన్నీ మోతాదుకు మించనిచ్చేవారు కాదన్న విషయానికి ఆనవాళ్లుగా ఒకప్పటి సినిమాలున్నాయి. ఎందుకంటే -ఒక సామాన్యుడి జీవితంలో ఆవిష్కృతమయ్యే నవరసాలకు సినిమా అద్దం. ప్రేక్షకుడిని -ఆ ప్రతిబింబంతో మమేకం చేస్తుంది. ఏడిపిస్తుంది. నవ్విస్తుంది. ఉద్రేకం తెప్పిస్తుంది. క్రోధాన్ని జనింపజేస్తుంది. శాంతమూర్తిని చేస్తుంది. భయపెడుంది. అలా అన్ని రసాల్ని అలవోకగా ప్రేరేపిస్తుంది. ఈ విషయాన్ని అప్పటి పెద్దలు గుర్తెరిగారు కనుకే -తమవంతు జాగ్రత్తపడ్డారు. పైగా ‘శృంగార రసాన్ని’ మరింత దూరం పెట్టారు. వాళ్లకు తెలుసు, తెరపై కనిపించే శృంగార రస ప్రభావం వాస్తవ జీవితంలో ఎంత ప్రభావం చూపుతుందో. అందుకే స్వర్ణయుగంనాటి సినిమాతరం ఆ ఛాయలకు పోలేదు. కనీసం హీరో హీరోయిన్లను ఒకరికొకరు తాకించే సాహసం చేయలేదు.
ఎప్పుడైతే -గ్లామర్ అన్న అందమైన పదానికి సినిమా అలవాటుపడిందో... అప్పటినుంచీ అభ్యంతరం అదుపు తప్పింది. అలాంటి వేషాలు వేయడానికి మాకేమీ ‘అభ్యంతరం’ లేదంటూ తెరవేల్పులు స్టేట్‌మెంట్లు ఇవ్వడం మొదలెట్టారో పరిస్థితి మరింత హీనమైంది. సెన్సార్ సైతం.. స్క్రీన్‌పై ఇదంతా సర్వసాధారణం అన్న ధోరణికి వచ్చేయడం, అదే వినోదంగా ప్రేక్షకుడూ ఆదరించటం.. సినిమా దారితప్పేసింది. స్క్రీన్‌పై హీరో హీరోయిన్లు రెచ్చిపోతూ ఆడియెన్స్‌ను సంతృప్తిపర్చడమే వ్యాపారసూత్రంగా స్థిరపడిపోయింది. గత దశాబ్దకాలంలో తెలుగు తెరపై -ముద్దులు, ఆలింగనాలు, పీలిక వస్త్రాలు, విపరీత భంగిమలు కామనైపోయి ఆడియన్స్‌కు ఆవిర్లు పుట్టిస్తున్నాయి. కొంగుజార్చిన హీరోయిన్ అందాలు తెరపై ఆవిష్కతమయ్యే పరిస్థితి నుంచి అసలు హీరోయిన్‌కు కొంగే లేకుండా చేసే పరిస్థితికి వచ్చేశాం. చుంబనాలు, ఆలింగనాలు, దొర్లడుడే తెరనిండా పర్చుకునే కథ అన్నట్టు సినిమాలూ వచ్చేస్తున్నాయి.
కాలానుగుణంగా మార్పు తప్పదు కనుక, ఈ కాలంలో తీయాల్సిన సినిమాను తీస్తే అభ్యంతరం చెప్పేవాళ్లుండరు. అది వదిలేసి, సమాజంపై తీవ్ర ప్రభావం చూపే ‘పైశాచికత్వాన్ని’ ఆధునిక భవిష్యత్ కోణంలో -ట్వెంటీఫోర్ ఫ్రేమ్స్‌లో ఇరికించటం ఎప్పటికైనా ప్రమాదమే. విలువలు, స్వీయనియంత్రణ, సామాజిక బాధ్యత అన్న పదాలను సినిమా డిక్షనరీ నుంచి తుడిచేసే ప్రయత్నం చేయడం దారుణం, క్షమించరాని నేరం.

యూత్ అలాగే ఉంటారా?
యూత్ సినిమా అంటే బూతు సినిమా అని, వలువలకు విలువ లేదని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాయి హిప్పీలాంటి సినిమాలు. ఈ ధోరణిలో వస్తోన్న ప్రతి సినిమా తలా తోకా లేకుండా ఉంటున్నాయి. అసలు కథని గాలికొదిలేసి, ముద్దులు, బూతు డైలాగులు, వళ్లు చూపించటానికే ప్రధాన్యత ఇస్తున్నారు. అలా తీస్తేనే -సినిమా కమర్షియల్‌గా పాసై పోతుందన్న ధీమా చిత్రబృందాల్లో కనిపిస్తోంది. ఉదాహరణకు హిప్పీనే తీసుకుందాం. ఆ సినిమా ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకున్నాడో దర్శకుడికే తెలియాలి. ఆర్‌ఎక్స్ 100 హిట్టయ్యిందన్న హ్యాంగోవర్‌లో కార్తికేయతో కళాఖండాన్ని తీసేస్తే.. యూత్ కనెక్టైపోతారని అనుకుంటే ఎలా? కుర్రాళ్లంటే హిప్పీలాగే ఉండాలి, అలాగే ప్రవర్తించాలని చెప్పే ప్రయత్నం చేయడం దారుణం. ఏమాత్రం విలువల్లేని సినిమాలను ఆపేదెవరు?
వీఎన్సీ నాయుడు, శ్రీకాకుళం

జవాబు కష్టమే

విలువలు అనేవి ఏ రంగానికైనా ముఖ్యమే. అయితే ఆధునిక కాలంలో వాటి ప్రమాణాలు దిగజారుతున్నాయని అనేకంటే విపరీత ధోరణకులకు గురవుతున్నాయి. దీనికి సినిమారంగం కూడా అతీతం కాదు. మీరు నమ్మరుకానీ, తెలుగులో పేరు పెట్టడం మానేసిన దగ్గర్నుంచే సినిమా ఓ కదుపునకు గురైందంటే నమ్ముతారా? తెలుగేతర పేర్లు పెట్టడం, తెలుగేతర కథలను వెతుక్కోవడం మొదలైన దగ్గర్నుంచే -బలీయమైన మార్పును గమనించొచ్చు. రక్తపాతం, క్రూరత్వం, మితిమీరిన శృంగారం ఉండకూడదన్న నైతిక ప్రమాణాల స్థానే.. మా వర్గం, మా ప్రాంతం అంటూ కొట్లాటలకు దిగుతున్నారు. ఒకప్పుడూ -తెరమీద అందాలను మాట్లాడినా, చూపించినా కవితాత్మకంగా ఉండే పరిస్థితి ఉండేది. తెలుగు సినిమా ఉదాత్తం అనే పరిస్థితి నుంచి నగ్నత్వంవైపు ప్రయాణిస్తుందేమోనన్న భయం కలుగుతుంది కూడా. ఒకప్పుడు బిఎన్ రెడ్డి, కెవి రెడ్డిలాంటి దర్శక నిర్మాతలు -సెన్సార్ కట్ పడకుండా సినిమాను చిత్రీకరించే జాగ్రత్తలు తీసుకునేవారు. ఇప్పుడు -సెన్సార్‌ను మ్యానేజ్ చేయవచ్చనే ధోరణిలో సినిమాలు తయారవుతున్నాయి. నైతిక ప్రమాణాల కొలమానంలో చూస్తే -ఏ సినిమాలోనైనా అడుగులకు అడుగులు, రీళ్లకు రీళ్లు లేచిపోక తప్పదు. ప్రపంచ సంప్రదాయ ప్రభావం తీవ్రంగావున్న ఈ కాలంలో -తెలుగు సంప్రదాయం గురించి మాట్లాడాల్సి వస్తే వౌనమే సమాధానమవుతుంది. ఈ ధోరణిలో మార్పు ఎప్పుడు? అన్నది జవాబు దొరకని ప్రశ్న.
ఎస్వీ రామారావు, సినీ రచయత, విమర్శకుడు

-విజయప్రసాద్