మెయిన్ ఫీచర్

వెలుగు తెరపై తెలుగు చీకటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర పరిశ్రమలో తెలుగు చచ్చిపోతుందన్న ఆవేదన వ్యక్తం చేశాడు పవన్ కల్యాణ్. ఔననేవాళ్లూ ఉన్నారు. అదేంమాట అని నిలదీసే వాళ్లూ ఉన్నారు. పవన్ వ్యాఖ్యలను ఎవరెలా తీసుకున్నా -పరిశ్రమలో మన తెలుగు పరిస్థితిని మాత్రం సమీక్షించుకోవాల్సిన అవసరమైతే లేదని అనలేం..
తేనెకన్నా తీయనిది -తెలుగు భాష. ఈ భాషలో కవిత రాసినా.. పద్యం చెప్పినా.. సామెత పలికినా.. -అపురూపమే. తెలుగు సినీ దర్శక నిర్మాతలు వారికున్న అమోఘమైన పాండిత్యంతో అద్భుతమైన కథలను వైవిధ్యంగా తెరపై పండించారు. తెలుగు మాటల, పాటల రచయితలు తమ మేథో సంపత్తితో అద్భుతమైన విన్యాసాలు, సరళమైన పదాలతో గంభీరమైన అర్థాలను విపులీకరించి ప్రేక్షకులను సమ్మోహనపరిచారు. అలా సృజించిన మాటల, పాటల గొప్పదనాన్ని తెలుగు నటులు తెరపై ఆవిష్కరించి ‘ఇదీ తెలుగు సినిమా’ అనే స్థాయికి తీసుకెళ్లారు. అలా -తెలుగు సినిమా షడ్ర సోపేత విందు భోజనమైంది.
చల్లని వెనె్నల, సందెలోని గోధూళి, మట్టిపరిమళం, గోరింటాకు ఎర్రదనం.. వీటికి మించిన తెలుగుదనాన్ని -సినిమా నుంచీ ప్రేక్షకుడు అందుకున్నాడు. తెలుగు పాట పాడుకుంటే ఆనందం. చక్కని డైలాగు చెప్పుకుంటే ఉత్సాహం. ఇలా తెలుగుదీపిని ప్రతి ప్రేక్షకుడికీ పంచిన చిత్రాలు -ఏమయ్యాయి. ఎక్కడికిపోయాయి?
**
ఇంకో కోణంలో చూస్తే-
తెలుగు సినిమా భాషాగంధం సౌరభం కోల్పోతోంది. భాషపై పట్టులేని, ఉన్నా పట్టించుకోని సినీజనం కారణంగా -తెలుగు తీపి చేదవుతుంది. తెలుగు శబ్ధం, నుడికారంలోని తీయదనం కోట్ల పెట్టుబడుల కింద హత్యకు గురవుతుంది. తెరవెనుక ఉన్నవాళ్లు, తెరపై కనిపిస్తున్న వాళ్లూ -తెలుగుకు తూట్లు పొడుస్తున్నారన్న నిందలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. సగటు తెలుగును సైతం ‘స్టయిల్’గా పలకడమే సినిమా శైలి అన్న ధోరణే కనిపిస్తోంది. చక్కనైన తెలుగులో మాట్లాడితే అదేదో నేరమన్న భావనే సినిమా పరిశ్రమలో కనిపిస్తోంది. పామర జనాన్ని ప్రభావితం చేసే కథానాయకులు, నాయికలు, ముఖ్య పాత్రధారులు సైతం తెలుగు భాష పలికే విధానంపై ఎటువంటి శ్రద్ధా పెట్టడం లేదన్నది కాదనలేని నిజం. పొరబాటున ఏ దర్శకుడైనా ఉచ్ఛారణను సరిదిద్దితే -నీకు తెలీదులే అన్న ధోరణే కనిపిస్తుండటం విచారించతగ్గ విషయం. ‘ట్రెండు’ పేరిట -తెలుగు భాషకు పాడుతోన్న మంగళం చిన్నదేం కాదు. ఇదే విషయంపై -హీరో పవన్‌కళ్యాణ్ తనదైన శైలిలో ప్రస్తావించటం కూడా తప్పుగా కనిపిస్తోంది. ‘ఇతర భాషల నుంచి వచ్చిన నటీనటుల సంగతి సరే, తెలుగులో పుట్టిపెరిగిన చాలామంది నటీనటులకూ తెలుగు ఉచ్ఛారణ సరిగా ఉండటం లేదు. మాట్లాడటం రాదు. తెలుగులో రాయడం అస్సలు తెలీదు’ అన్నది పవన్ చేసిన వ్యాఖ్య. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. ఎవరైనా తెలుగులో డైలాగులు చెబుతానన్నా -చెప్పించుకునే స్థితిలో దర్శక నిర్మాతలు లేరు. ఇంకోచోట దర్శక నిర్మాతలు తెలుగుకు ప్రాధాన్యమిచ్చినా -స్పష్టమైన ఉచ్ఛారణకు నటులూ సిద్ధంగా లేరు. రోజురోజుకీ తెలుగు పరిశ్రమలో భాష దిగజారుతోందని.. పాటలు, మాటల్లో ఎలాంటి సాహిత్య పాండిత్యం ప్రస్ఫుటం కావటం లేదన్నది పవన్ వ్యాఖ్యలోని సారాంశం. ఉద్దేశాలు ఏమైనా, ఆ విమర్శల సందర్భం, లక్ష్యం ఏదైనా -విషయం మాత్రం పెద్దగా ఆలోచించాల్సిందే. -పాటలంటే అన్నీ ఒక్కొక్క పదాలతో రూపొందిస్తున్న పాటలు. అవన్నీ ముందుగానే బాణీ బిగించి ఇచ్చిన సంగీత దర్శకుడి ఆలోచనకు అనుగుణంగా కూరుస్తున్న పదాలు మాత్రమే. ఏదోక పదం ఆ బాణీలో కుదిరితే చాలు అనుకుంటున్నారు. తద్వారా పాటలో ఉండాల్సిన ఆత్మ ఉండటం లేదు. దానికితోడు పాటనిండా రణగొణధ్వని ఉండటంతో ఎవరు సాహిత్యాన్ని పట్టించుకునే పరిస్థితిలో కనిపించటం లేదు. ఏదో పాటలాగా రాగం తీయాలి, హీరో హీరోయిన్లు నలుగురు డ్యాన్సర్లను వెనకేసుకుని ఎగరాలి. అదే నేటి పాట. ‘ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి/ తీవెలపై ఊగుతూ.. పూవులపై తూగుతూ/ ప్రకృతినెల్ల హాయిగా’ అంటూ పాడిన పాటలో ఎంతో మనోజ్ఞమైన భావముంది. మలయసమీరం అన్న మాట తెలుగు పాటల్లో ఎన్నిసార్లు వినిపించిందో? ఎన్నిసార్లు వినిపించినా ఆ పద సోయగాన్ని మనసులో ఆవిష్కరించుకుని ఆనందపడ్డాడు తెలుగు ప్రేక్షకుడు. అప్పట్లోనూ చిన్న చిన్న పదాల పాటలుండేవి. అవి ప్రేక్షకుడి నోటిలో నిరంతరం పలికేవి. ‘్భలే ఛాన్సులే లక్కీ ఛాన్సులే లల్లల్లాం లల్లల్లాం లక్కీ ఛాన్సులే’, ‘మైడియర్ తులసమ్మక్క లక్కీ ఛాన్స్ కొట్టేశా/ ఇవాళో రేపో మాపో జ్యోతికి తాళి కట్టేస్తా’ అన్న పాటలో ఛాన్స్, లక్కీ, మైడియర్ ఇంగ్లీష్ పదాలే అయినా.. ఆ రచయితలు తెలుగు పదాల్లాగే ప్రయోగించి ప్రేక్షకుల పెదాలపై పాడించారు. ఇప్పుడు అలాంటి పాటలు ఎన్నో వస్తున్నా ఒక్కటీ సినిమా విడుదలైన తెల్లారి ఇక వినిపించదు. ఆయా హీరోలు ప్రతి పదాన్నీ పలకలేకపోతున్నారు. ముఖ్యంగా ‘పెళ్లి’ అనే పదాన్ని ‘పెల్లి’ అని, ‘రాధ’ను ‘రాదా, రాదా’ అంటూ తమ తెలుగును ప్రయోగించి, తెలుగు సేవలో తరిస్తున్నారు. ఒత్తులు పలకడం ఏనాడో మర్చిపోయారు చాలామంది తెలుగు నటులు. ఖర్మగాలి పలికితే -వాడొక చాదస్తపు నటుడు అన్న ముద్రపడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. తెలుగు సినిమా నటులకు శాస్త్రాలు, పురాణాలు తెలిసే పరిస్థితే లేదు. ఎందుకంటే, అంతా ఇంగ్లీష్ మీడియం చదివి, విదేశాలకెళ్లి వస్తున్నవాళ్లే ఎక్కువ కావడం కారణం. మాతృభాషను మర్చిపోయి కేవలం వీధిరౌడీల్లా బూతులు, తిట్లు తిట్టుకుంటూ అవే ఇపుడు గొప్ప డైలాగులని కొత్తగా నిర్వచనం చెబుతున్న పరిస్థితిని చూస్తున్నాం. చెడును బూతులతో కలిపి చెండాడితే అదే ప్రేక్షకులకిచ్చే వైవిథ్యం. మాతృభాషకు తెరపై పట్టిన దుస్థితి ఇదీ. గతకాల వైభవాలను, అప్పటి సాహితీమూర్తులను దర్శక నిర్మాత, రచయిత గొప్పతనాలను మర్చిపోతే మన భాషను మనం మర్చిపోయినట్టే. వారు అప్పట్లో సాహితీసేవ చేసినట్టు కాదుగానీ, సాహిత్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు. వైవిధ్యమైన పాటలను అందించి పామరుడు కూడా పాడుకునేలా భాషా సేవ చేశారు. తెలుగు హీరోలు కోట్ల బడ్జెట్ల సినిమాల్లో చేస్తున్నా, భాషకు గౌరవాన్నిచ్చే స్థాయిని చూపించకపోవడం దారుణం. మాతృభాషను కథావస్తువు చేసుకుని సినిమాలు చేయొచ్చన్న ఆలోచనా రావడం లేదు. భాషా సంస్కృతిని కాపాడుకోవడం -పాత సినీతరానికి సవాల్‌గా మారుతోంది. ‘ఎవరో మాటలు రాస్తారు. ఇంకెవరో డబ్బింగ్ చెబుతారు. మధ్యలో వన్ టు త్రీ ఫోర్ అంటూ పెదాలు కదిపే మాకెందుకు ఈ బాధ? మా ప్రమేయం ఏముంది?’ అని హీరోలు అనుకోవచ్చు. కానీ మీనుంచి వెళ్తోన్న ప్రతి అక్షరం ప్రేక్షకుడిని ప్రభావితం చేస్తుందన్న నిజాన్ని మర్చిపోవద్దు. తెలుగు భాషను తెలుగు చిత్రాల్లో అధోగతిపాలు చేయొద్దు. తెలుగు భాషా ప్రియుల మనసులను గాయపర్చొద్దు. చక్కటి చిత్రాల్లో నటించాలి. భాషను స్వచ్ఛంగా పలకాలి. భవిష్యత్ తరాలకు స్వర్ణయుగం నాటి చిత్రాల స్థాయిలో మంచి సినిమాలు అందించాలి. అప్పుడే నాలుగు కాలాలపాటు తెలుగు నిలబడుతుంది. లేకపోతే తెలుగు సినిమాయే చరిత్రహీనమవుతుంది. ఇది సత్యం.
*

-జి రాజేశ్వరరావు