మెయిన్ ఫీచర్

సినిమాలు.. సాహిత్యవేత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరీ శ్రావణ భాద్రపదాలు అని అడిగాట్ట ఒక సందర్భంలో గుడిపాటి వెంకటచలం, దాశరథి, సినారెలనుద్దేశించి. అప్పటికింకా దాశరథి, సినారెలు ఇప్పుడు మనం చెప్పుకునేంత ఎత్తుకు ఎదగలేదు. నిజానికి దాశరథి, సినారె విషయంలో భాద్రపదం, శ్రావణం తర్వాత ఆరేళ్ళకు కాని రాలేదు. దాశరథి 1925లో జన్మించారు. సినారె 1931లో జన్మించారు. కవిత్వం వ్రాసే ఆరంభ దశలోను, సినిమా రంగంలో పాటలు వ్రాయడం మొదలుపెట్టడంలోను దాశరథి సినారెకు పెద్దన్న లాగే ఉన్నారు. కవిత్వం విషయంలోనైతే సినారె ‘నా తరుణ కావ్య లతికలానాడు పైకి ప్రాకలేక దిక్కులు సూడ, నీ కరాలు సాచి లేత రేకులకు కెంజాయలద్ది మంచి పందిళ్ళపైకి ప్రాకించినావు’ అంటూ దాశరథికి తన కృతజ్ఞతా భావాన్ని వెళ్ళబుచ్చారు.
చాలామంది సినారె 1962లో వచ్చిన గులేబకావళి కథతో సినీరంగ ప్రవేశం చేశారని భావిస్తారు. నిజానికి 1959, 1960ల్లోనే సినారె సినీరంగ ప్రవేశం జరగాల్సింది. 1959లో ఎల్.వి.ప్రసాద్ నిర్మించదలచిన ‘కొడుకులూ, కోడళ్ళూ’చిత్రానికి సినారె ఒకటి రెండు పాటలు వ్రాశారు. కాని కారణాంతరాలవల్ల ఎల్.వి.ప్రసాద్ ఆ చిత్ర నిర్మాణం ఆపివేశారు. 1960లో విడుదలైన ‘పెళ్ళిసందడి’, ‘శభాష్ రాముడు’ చిత్రాల్లో ఒక్కొక్క పాట వ్రాయమని ఆహ్వానం వచ్చింది కానీ, ఆయన దానికి అంగీకరించలేదు. ‘గులేబకావళి’ చిత్రంలో అన్ని పాటలూ సినారేనే వ్రాయడానికి ఎన్.టి.ఆర్. ఒప్పుకోవడంతో సినారె సినీ రంగప్రవేశం సుగమమైంది. అనేక కవితలు, కావ్యాలు, వ్యాసాలు వ్రాసిన సినారె 1973లో ‘‘మంటలూ, మానవుడూ’’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 1977లో పద్మశ్రీ, 1988లో విశ్వంభర పుస్తకానికి జ్ఞానపీఠ్, 1992లో పద్మభూషణ్ పురస్కారాలనందుకున్నారు. 2001లో ‘‘ప్రేమించు’’ సినిమాకు వ్రాసిన ‘‘కంటేనే అమ్మా అని అంటే ఎలా?’’ పాటకు, 2003లో ‘‘సీతయ్య’’ సినిమాకు వ్రాసిన ‘‘ఇదిగో రాయలసీమ గడ్డ’’ పాటకు నంది పురస్కారాలనందుకున్నారు.
దాశరథి క్రిష్ణమాచార్యులు ప్రముఖ కవి. ‘‘అగ్నిధార’’, ‘‘రుద్రవీణ’’, ‘‘కవితా పుష్పకం’’వంటి ప్రముఖ రచనలు చేశారు. గాలిబ్ ఉర్దూ గీతాలను ‘‘గాలిబ్ గీతాలు’’ పేరుతో తెలుగులోకి అనువదించారు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద బహుమతి లభించింది. 1974లో ‘‘తిమిరంతో సమరం’’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆస్థాన కవిగా కొన్నాళ్ళు వ్యవహరించారు. 1961లో ‘‘వాగ్ధానం’’తో సినీ రంగప్రవేశం చేశారు. 2000కు పైగా సినిమా పాటలు వ్రాశారు. ‘‘ఇద్దరు మిత్రులు’’, ‘‘పూజ’’, ‘‘మూగ మనసులు’’వంటి సినిమాలకు దాశరథి వ్రాసిన పాటలు చాలా జనాదరణ పొందాయి.
విశ్వనాథ సత్యనారాయణ గొప్ప కవి, నవలా రచయిత, విమర్శకులు. కేంద్ర సాహిత్య అకాడమీ (1962, విశ్వనాథ మధ్యాక్కరలు), జ్ఞానపీఠ్ (1970), పద్మభూషణ్ (1970) పురస్కారాల గ్రహీత. కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఆస్థాన కవిగా నియమించింది. 2017లో భారత ప్రభుత్వం ఆయనపై స్టాంపును విడుదలచేసింది. 1941లో విడుదలైన ధర్మపత్ని సినిమాకు ఆయన సంభాషణలు వ్రాసి ఉండాల్సింది. అయితే అవి చాలా గ్రాంథికంగా ఉండటంతో అప్పటికే శరత్‌చంద్ర ఛటర్జీ రచించిన పలు బెంగాలీ నవలలను తెలుగులోకి అనువదించిన ఆలూరి వెంకట సుబ్బారావు (ఉరఫ్ చక్రపాణి)తో వ్రాయించారు. 1951లో విడుదలైన ‘‘ఆకాశరాజు’’ సినిమాకు గౌరీశంకరశాస్తి నిర్మాత. జ్యోతిసిన్హా దర్శకుడు. ‘‘పాటల రెక్కలమీద ఎగిరిపోయే స్వభావం ఉన్నవాన్ని, మాటల నేలమీద నిలబడగలనా’’అని సందేహిస్తునే ఆ సినిమాకు కథ, పాటలు వ్రాయడానికి ఒప్పుకున్నారు విశ్వనాథ. సినిమా నడవలేదు. మళ్ళీ ఆయన సినిమాల జోలికి వెళ్ళలేదు.
గుంటూరు శేషేంద్రశర్మ సంస్కృతాంధ్ర భాషల్లో దిట్ట, ‘‘ఋతుఘోష’’ ఆయనను ప్రతిభావంతుడైన తెలుగు కవిగా నిలబెడుతుంది. ‘నాదేశం, నా ప్రజలు’ పుస్తకంతోపాటు పలు కవితల ద్వారా ఆయన నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ కాబడ్డ రెండవ భారతీయునిగా గుర్తింపు పొందారు. శేషేంద్రశర్మ సంస్కృతంలో విశ్వనాథకంటే మెరుగైన పండితుడన్న శ్రీశ్రీ వ్యాఖ్యలతో ఉడికిపోయిన విశ్వనాథ ‘‘నాలాంటి కవి మరో వెయ్యేళ్ళకుగానీ పుట్టడు’’అని ఉరిమారు. ‘‘అసలు మీరు వెయ్యేండ్ల క్రిందే పుట్టాల్సింది. ఇప్పుడు పుట్టి మమ్మల్ని వేధిస్తున్నారు’’, అని ప్రతిధ్వనించారు శ్రీశ్రీ. 1994లో ‘‘కాలరేఖ’’ పుస్తకానికి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు శేషేంద్రశర్మ. ఆయన వ్రాసి సినిమాలకు వాడబడిన ఒకే ఒక్క పాట, ‘‘ముత్యాల ముగ్గు’’ సినిమాలోని ‘‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ...’’. ‘‘ముత్యాలముగ్గు’’ సినిమా షూటింగ్ 15నుండి నెల రోజులపాటు శేషేంద్రశర్మ భార్య ఇందిరా ధన్‌రాజ్‌గీర్‌కు చెందిన జ్ఞానబాగ్ ప్యాలెస్‌లో జరగడం, సినిమాలో ఈ పాట వాడటానికి దోహదం చేసింది.
త్రిపురనేని రామస్వామిచౌదరి కొడుకు త్రిపురనేని గోపీచంద్ ప్రముఖ రచయిత. ఎన్నో మంచి కథలు వ్రాశారు. అందులో ‘‘్ధర్మవడ్డీ’’ ప్రసిద్ధి చెందిన కథ. కె.బి.తిలక్ దర్శకత్వం వహించి, జగ్గయ్య, ప్రభ నటించిన ‘‘్ధర్మవడ్డీ’’ సినిమా ఈ కథ ఆధారంగానే తీయబడింది. 1981లో ఈ కథకు ఆయనకు posthumousగా నంది పురస్కారం కూడా లభించింది. ఆయన వ్రాసిన ‘‘అసమర్థుని జీవయాత్ర’’ ఒక కొత్త ఒరవడిని సృష్టించిన నవల Foma Gordayev (The Man Who was Afraid) ఛాయలు దీనిలోఉన్నాయని కొందరంటారు). ఈ నవలను ‘‘ఎందుకు?’’అనే ప్రశ్నను నేర్పినందుకు తన తండ్రికి అంకితమిచ్చారు. 1963లో ఆయన వ్రాసిన ‘‘పండిత పరమేశ్వరశాస్ర్తీ వీలునామా’’ నవలకు posthumousగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2011లో, ఆయన శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం
ఒక స్టాంపును విడుదలచేసింది. 1939లో ఆయన సినీరంగ ప్రవేశంచేసి, గుడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన ‘‘రైతుబిడ్డ’’ సినిమాకు సంభాషణలు వ్రాశారు. ‘‘లక్ష్మమ్మ’’, ‘‘పేరంటాలు’’, ‘‘ప్రియురాలు’’ సినిమాలకు దర్శకత్వం వహించారు.
రాచకొండ విశ్వనాథశాస్ర్తీ ‘‘ఆరు సారా కథలు’’, ‘‘ఆరు సారో కథలు’’, ‘‘బాకీ కథలు’’ మొదలైన ఎన్నో కథలు, నవలలతో తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రవేశారు. ఆయన వ్రాసిన ‘‘కార్నర్ సీట్’’ ప్రసిద్ధిచెందిన కథ. ఆయన వ్రాసి, పలుమార్లు ప్రదర్శింపబడ్డ ‘‘నిజం’’ నాటకంలోనూ, గురజాడగారి ‘‘కన్యాశుల్కం’’నాటకంలోనూ నటించారు. ప్రత్యగాత్మ తాను దర్శకత్వం వహిస్తున్న విప్లవాత్మక చిత్రం ‘‘స్ర్తి’’కి మాటలు వ్రాయమని ‘‘అల్పజీవి’’ రాచకొండ విశ్వనాథశాస్ర్తీని ఒప్పించారు. మార్పుచేర్పులతో రావిశాస్ర్తీ మాటల రచన పూర్తయ్యింది. రావిశాస్ర్తీ విశాఖకు తిరిగి వెళుతూ తన సహజ ధోరణిలో ఒక చెణుకును విసిరారు. ‘‘సినిమావాళ్ళు శాన మంచోళ్ళు. మన కాఫీ మనల్ని త్రాగనీయరు, మన తిండి మనల్ని తిన నీయరు. చివరకు మన డైలాగులు మనల్ని రాయనీయరు.’’ అయితే సినిమా రంగానికి కృతజ్ఞతలు తెలుపుకొన్న గొప్ప రచయితలూ లేకపోలేదు.
‘‘నా నివాసమ్ము తొలుత గంధర్వలోక మధుర సుధాగాన మంజువాణి... దిగిరాను దివినుండి భువికి’’అంటూ దివిలో కవితావిహారం చేస్తున్న దేవులపల్లి క్రిష్ణశాస్ర్తీని పట్టుబట్టి భువికిదించారు బి.యన్.రెడ్డిగారు 1951లో. ఆ తరువాత ఆయన ‘‘బి.యన్.రెడ్డిగారు నన్ను కవిగా రక్షించారు. లేకపోతే, నా కవిత్వం కూడా విశ్వనాథ సత్యనారాయణగారి కవిత్వంలా పుస్తకాలకే పరిమితమయ్యుండేది’’ అన్నారట డి.వి.నరసరాజుతో. ‘‘క్రిష్ణపక్షం’’, ‘‘ప్రవాసం’’, ‘‘ఊర్వశి’’వంటి ప్రముఖ రచనలుచేశారు దేవులపల్లి. గోదాదేవి వ్రాసిన తమిళ గ్రంథం ‘‘తిరుప్పావై’’ని తెలుగులోకి అనువదించారు. తెలుగు సినిమా రంగానికి పలు అద్భుతమైన గీతాలనందజేశారు. 1976లో పద్మభూషణ్ పురస్కారమందుకున్నారు. చనిపోవడానికి రెండేళ్ళకు ముందు, 1978లో ‘‘దేవులపల్లి క్రిష్ణశాస్ర్తీ సమగ్ర సాహిత్యం’’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారమందుకున్నారు. 1978లో ‘‘సీతామాలక్ష్మి’’ సినిమాలో పాటలకు, ఎప్పుడో వ్రాయబడి ఆ తరువాత 1982లో వచ్చిన ‘‘మేఘసందేశం’’ సినిమాలో వాడబడిన ‘‘ఆకులో ఆకునై’’పాటకు నంది పురస్కారాలనందుకున్నారు.
ఇక ‘‘రెండు శ్రీలు ధరించి, రెండు పెగ్స్ బిగించి, వరలు శబ్దవిరించి’’గా విలసిల్లిన శ్రీశ్రీ జీవితానికి సినీ రంగం వెనె్నముకగా లేకుంటే, ఆయన విశాఖపట్నంలో విప్లవ గీతాలు వ్రాసుకుంటూ విరసం సభల్లో వాటిని అడపాదడపా పాడుకుంటూ ఉండేవారేమో, ఒక సందర్భంలో ఆయన ‘‘అవకాశం దొరికితే వాసన్ (ఎస్.ఎస్.వాసన్ జెమినీ స్టూడియోస్ అధినేత, గొప్ప తెలుగు, తమిళ సినిమాల నిర్మాత), లేకపోతే ఉపవాసన్’’అని కూడా అన్నారు. ‘‘మహాప్రస్థానం’’, ‘‘ఖడ్గసృష్టి’’ ఆయన ప్రముఖ రచనలు. 1972లో ‘‘శ్రీశ్రీ సాహిత్యం’’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1950లో ‘‘ఆహుతి’’తో ఆయన సినీరంగ ప్రవేశంచేశారు. 1974లో వచ్చిన ‘‘అల్లూరి సీతారామరాజు’’ సినిమాకు ఆయన వ్రాసిన ‘‘తెలుగువీర లేవరా’’ గేయానికి జాతీయ పురస్కారం లభించింది. ఈ గేయంలో వ్యాకరణ దోషముందని ఆయన హానెస్ట్‌గా ఒప్పుకున్నారు. 1983లో చనిపోవడానికి కొన్నిరోజుల ముందు విడుదలయిన ‘‘నేటి భారతం’’ సినిమాకు వ్రాసిన ‘‘అర్థరాత్రి స్వాతంత్య్రం అంధకార బంధురం’’ పాటకు నంది పురస్కారం లభించింది. సినారె జ్ఞానపీఠం రాకముందు ఆ పురస్కారానికి స్వయంగా ప్రతిపాదించిన ఇద్దరు వ్యక్తుల్లో శ్రీశ్రీ ఒకరు.
ఆరుద్ర (్భగవతుల సదాశివ శంకరశాస్ర్తీ) ప్రముఖ కవి, పరిశోధకుడు, సాహిత్యవేత్త. ‘‘త్వమేవాహం’’, ‘‘సమగ్రాంధ్ర సాహ్యిం’’ (13 సంపుటాలు), ‘‘కూనలమ్మ పదాలు’’ ఆయన ప్రముఖ రచనలు. తమిళ గ్రంథం ‘‘తిరుక్కురాల్’’ను తెలుగులోకి అనువదించారు. 1987లో ‘‘గురజాడ గురుపీఠం’’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. సినారె తనకు జ్ఞానపీఠ్ పురస్కారం రాకముందు ఆ పురస్కారానికి స్వయంగా ప్రతిపాదించిన ఇద్దరు వ్యక్తుల్లో ఆరుద్ర కూడా ఒకరు. 1950లో ‘‘బీదలపాట్లు’’తో సినీ గేయ రచయితగా కెరియర్ ప్రారంభించారు. ‘‘కొండగాలి తిరిగిందీ, గుండె ఊసులాడిందీ’’తో సహా ఎన్నో ప్రసిద్ధిచెందిన సినీ గేయాలు వ్రాశారు.

(మరికొందరు వచ్చేవారం)

-వి.కె.ప్రేమ్‌చంద్, 9848052486