మెయిన్ ఫీచర్

ముమ్మాటికీ పోటీయే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు సీనియర్ హీరోలు. ఇద్దరికీ రికార్డు చిత్రాలు. ఎంచుకున్న కథలపై విపరీతమైన అంచనాలు. ఫస్ట్‌లుక్కులు.. టీజర్లు.. ట్రైలర్లకు లక్షల్లో పలికిన వ్యూస్ రేటింగులు.. ఆకాశం హద్దులుదాటిన ప్రచార పటాటోపాలు.. ఒకరిని మించి ఒకరన్నట్టు -ఆడియో రిలీజు ఫంక్షన్లు. అబ్బో ఆ లెక్కలు ఒక్క ముక్కలో చెప్పేవి కావు. ఇదంతా ఒక ఎత్తయితే -రెండోపక్క ఎవరికెవరికీ తీసిపోని ఫ్యాన్స్ విభాగాలు. అటు ఇండస్ట్రీలోనూ -తమదే పైచేయి అనిపించుకోడానికి బలమైన రెండు వర్గాల వ్యూహ ప్రతివ్యూహాలు. పైచేయి పట్టుకు ఆజ్యం పోస్తూ -సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు. అటు మీడియాలోను, ఇటు వౌత్‌టాక్‌లోను ఇన్ని అంశాలకు ప్రాధాన్యత చేకూరిన తరువాత -రెండు చిత్రాల మధ్య, ఇద్దరి హీరోల నడుమ పోటీ లేదని, ఉండబోదని ఎవరు మాత్రం అనగలరు?

నిజానికి నిన్న మొన్నటి వరకూ ‘పోటీ లేదు, ఉండదు’ అన్న వ్యాఖ్యలే వినిపించాయి. సమయం దగ్గర పడేసరికి ‘సీన్’ మారింది. -ఇప్పుడిక పాత డైలాగ్‌కు పదును పెట్టక తప్పని పరిస్థితి వచ్చేసింది. సినిమాల విడుదల సమయం దగ్గర పడటం, ఫ్యాన్స్‌లో ఆరాటం, వొత్తిడి పెరుగుతుండటం లాంటి అంశాల మధ్య హీరోల ‘స్ట్రాటజీ’ మారినట్టే కనిపిస్తోంది. అందుకే -పోటీ సహజమే అయినా శుభపరిణామంగా సాగాలన్న డైలాగులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన పోటీగా సాగిపోవాలన్న ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు 149 సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి.. అటు 99 చిత్రాలు పూర్తి చేసిన బాలకృష్ణ.. నటులుగా ఇద్దరిమధ్యా ఎలాంటి ద్వేషాలూ ఉండకపోవచ్చు. కానీ, అభిమానులను సంతృప్తిపర్చాలంటే -ఆ మాత్రం పోటీకి తెరలేపక తప్పని పరిస్థితిని ఇద్దరూ ఎదుర్కొంటున్నారన్నది నిజం. కళ్లతో కాదంటూనే -సంక్రాంతి బరిలో చేతులు కలిపేందుకు కసరత్తులతో సన్నద్ధమయ్యారు.
**
‘ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ ఉండేదే. సినిమాల మధ్య పోటీని సీరియస్‌గా తీసుకోకుంటేనే మంచిది. నన్నడిగితే సంక్రాంతి సీజన్‌లో చాలా సినిమాలు ఒకేసారి వచ్చినా ఆడతాయని అనేకసార్లు రుజువైంది. ఈ సంక్రాంతికీ నా సినిమాతోపాటు, గౌతమిపుత్ర శాతకర్ణి కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. హీరోల మధ్య పోటీతత్వాన్ని నేను పట్టించుకోను. నా వరకూ నా సినిమా వస్తుందన్నది వీటన్నిటికంటే ముఖ్యం. ఇకపోతే హీరోలూ.. మేమంతా ఒక్కటేనన్న మెసెజ్ ఇవ్వాలి’. ఖైదీ నెంబర్ -‘150’ చిత్రం విడుదలకు 24 గంటల ముందు మీడియా సమావేశంలో ఇదీ చిరంజీవి మాట.
అటు గౌతమిపుత్ర శాతకర్ణి టీంనుంచీ ఇదే తరహా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక అంచనాలతో రెండు పెద్ద సినిమాలు ఇంచుమించు ఒకేసారి విడుదలయ్యే పరిస్థితి వచ్చినపుడు -కంపారిజన్స్ సహజంగానే ఉన్నా ఆరోగ్యకరమైన వాతావరణంలోనే సాగాలన్నది శాతకర్ణి టీం మాట. కానీ, మనసుల్లో గుబులు, కళ్లలో తమ సినిమానే పైచేయి సాధించాలన్న ఆశ అటూ ఇటూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలాంటపుడు -పోటీ లేదన్న మాటకు స్థానం ఎక్కడుంటుంది? చిరు, బాలకృష్ణ చిత్రాల మధ్య పోటీ ముమ్మాటికీ ఉంటుందన్నది వాదనకు తావులేని వాస్తవం.
***
నిజానికి పెద్ద హీరోల చిత్రాలు ఒకే సమయంలో ఎప్పుడు విడుదలైనా -పరిశ్రమకు పండగే. అలాంటిది సంక్రాంతికొస్తే సందడే వేరుంటుంది. గతంలోనూ (సంక్రాంతి సీజన్లు సహా) ఈ హీరోలిద్దరూ ఒకేసారి వెండితెరపై సందడి చేసిన సందర్భాలున్నాయి. అవుటాఫ్ హండ్రెడ్‌లో చూసుకున్నా -పది పనె్నండు సినిమాలు ఒకేసారి, అందులో ఆరేడు చిత్రాలు సంక్రాంతికి విడుదలైన చరిత్ర ఉంది. కానీ, సంక్రాంతి సీజన్ అటు చిరుకి, ఇటు బాలయ్యకు గొప్ప విజయాలు అందించిన దాఖలాలు బహు తక్కువ. అందుకే -ఈసారి ఫలితం ఎలా ఉంటుందన్న అంశంపై ఉత్కంఠ పెరిగిపోతోంది.
***
నిజానికి సంక్రాంతి బరిలో -చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ అంటే ఓ క్లాసిక్ బిగినింగ్.
జనవరి 12న విడుదలయ్యే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో నందమూరి బాలకృష్ణకు వంద చిత్రాలు పూర్తవుతాయి. చారిత్రక పాత్రలకు అతికినట్టు సరిపోయే బాలకృష్ణ -‘శాతకర్ణి’ని ఎంచుకోవడంతోనే ఆసక్తిని పెంచేశాడు. క్రిష్ తెచ్చిన కధ -కెరీర్‌కు ప్రతిష్ఠాత్మకంగా నిలుస్తుందన్న ధీమాతో సినిమా పూర్తి చేశాడు. సంక్రాంతి సీజన్‌లో తెలుగు చక్రవర్తి కథతో వస్తుండటంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. బాహుబలి, రుద్రమదేవిలాంటి చిత్రాల తరువాత -అలాంటి తరహా చిత్ర కథతో వస్తుండటం కూడా ప్రాజెక్టుపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. అందుకు తగ్గట్టే ట్రైలర్ అంచనాలు పెంచేసేంది. యుద్ధ సన్నివేశాలు, బాలకృష్ణ డైలాగులు -వేడి పుట్టించాయ.
ఒకరోజు ముందుగా -జనవరి 11నే వస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’తో చిరంజీవికి 150 సినిమాలు పూర్తవుతాయి. తెలుగు కథలేవీ చిరుకు ‘్ఫల్‌మీల్స్’లా తోచకపోవడంతో -తమిళంలో హిట్టుకొట్టిన సేఫ్ కమర్షియల్ సోషల్ కానె్సప్ట్‌ను ఎంచుకున్నారు. మెగా ప్రతిష్టకు మంచి కథ అందించగల మురుగదాస్‌ను పదునుపెట్టిన తమిళ ‘కత్తి’కి తెలుగులో మరింత పదునుపెట్టారు. గతంలో తన కెరీర్‌కు ఊపునిచ్చిన వివి వినాయక్‌ని దర్శకుడిగా తీసుకున్నారు. పాతికేళ్ల క్రితంనాటి ఊపు ఉత్సాహంతో తొమ్మిదేళ్ల తరువాత చిరంజీవికి స్క్రీన్‌కు వస్తున్నాడు కనుక -కాంబినేషన్లను పెర్ఫెక్ట్‌గా ప్లాన్ చేశారు.
రెండు చిత్రాలకూ.. సాంకేతికంగా, సంగీతపరంగా.. ఇంకెలా చూసినా నిపుణులే పని చేశారు. సో.. ఈ సంక్రాంతి ఎపిక్ క్లాష్‌లో ఎవరికి పైచేయి అవుతుందన్న అంశంపై అటు పరిశ్రమలోనూ, ఇటు ఫ్యాన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది.
**
‘ఖైదీ..’, ‘శాతకర్ణి’.. రెండు చిత్రాలకు విపరీతమైన క్రేజ్ వచ్చేయడంతో బిజినెస్ జోరుగా సాగిపోయింది. సంక్రాంతి సీజన్లో వస్తున్న రెండు సినిమాలూ యువ హీరోల బ్లాక్‌బస్టర్ సినిమాలకు దీటుగా ఆడతాయన్న అతి నమ్మకంతో.. రిస్కును పక్కనపెట్టి బయ్యర్లు సినిమా హక్కులకు పెద్ద రేటే కట్టారు. ఫైనల్‌గా చిరు, బాలయ్యల ప్రాజెక్టులు థియేట్రికల్ బిజినెస్ బాగానే చేసేశాయి. ఇక్కడే చిన్న చిక్కుంది. రెండు చిత్రాలూ బలంగా నిలబడితే తప్ప, బయ్యర్లకు అవౌంట్ రికవరీ అయ్యే పరిస్థితి లేదు. ఒక్కో సినిమా దాదాపు వంద కోట్ల షేర్ వసూలు చేస్తే తప్ప ‘హిట్’ అనలేని ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ కొరత ఎదుర్కొంటున్న జనం.. పండగ సీజన్లోనైనా పరిగెత్తుకెళ్లి సినిమా చూస్తారా? అన్నదే డౌటు. పండగ నాలుగు రోజులూ ఎడెపెడా షోలు చూసేసినా -ఆ తరువాతి పరిస్థితి ఏమిటన్నది మరో భయం. ఇన్ని డౌట్లకు సమాధానం -సంక్రాంతి దాటేసిన తరువాతే వెతుక్కోవాలి. అప్పటి వరకూ పోటీ ఉత్కంఠ భరించక తప్పదు.
ఔనన్నా.. కాదన్నా.. ఇద్దరి మధ్యా పోటీ అనివార్యం. అలాంటిదేమీ లేదని రెండు వర్గాలూ వ్యాపార కోణంలో ప్రకటిస్తున్నా.. అభిమానులైతే పోటీ సినిమాలుగానే పరిగణిస్తున్నారు. సంక్రాంతి సినిమాలతో వస్తున్న చిరంజీవి, బాలకృష్ణల వినోదాత్మక యుద్ధంలో ఎవరిది పైచేయ అన్నది 48 గంటల్లో తేలిపోవడం ఖాయం. రెండు సినిమాలూ విజయం సాధించటం ఇద్దరు సీనియర్ హీరోలకే కాదు, పరిశ్రమకూ అవసరం అంటున్నారు
సినీ పరిశీలకులు.

**
వందో సినిమాగా ఏం చేయాలన్న సంశయం నన్ను చాలాకాలం వెంటాడింది. అభిమానులను నిరాశపర్చని వైవిధ్యమైన కథతో ముందుకు రావాలనుకున్నా. అదే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. 33మంది రాజులను జయించి భారత దేశాన్ని ఏకచత్రాధిపత్యంలోకి తీసుకురావాలని సంకల్పించిన మహా చక్రవర్తి శాతకర్ణి. అలాంటి మహాయోధుడి చరిత్రను తెలుగు ప్రజలందరికీ చూపించడం నా బాధ్యత. నా తండ్రి ఎన్టీ రామారావు ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకునే విధంగా శాతకర్ణి పాత్రలో నటించా. ఈ చిత్రంపై అభిమానులు, ప్రేక్షకులు ఇచ్చే తీర్పుని నా తండ్రి తీర్పుగా భావిస్తా. ఇకపై ఇలాంటి వైవిధ్యమైన పాత్రల్లోనే కనిపిస్తానని ప్రామిస్ చేస్తున్నా. ప్రజాహితానికై పోరాడిన ‘శాతకర్ణి’ని ఆశీర్వదించాలని కోరుతున్నా.
-బాలకృష్ణ

గౌతమీపుత్ర శాతకర్ణి
తారాగణం:
బాలకృష్ణ, హేమమాలిని, శ్రీయా శరణ్, కబీర్‌బేడి తదితరులు
సినిమాటోగ్రాఫర్:
జ్ఞానశేఖర్
మాటలు:
బుర్రా సాయిమాధవ్
సంగీతం:
చిరంతన్ భట్
నిర్మాతలు:
వై రాజీవ్‌రెడ్డి, జె సాయిబాబు
దర్శకుడు:
జాగర్లమూడి క్రిష్
**
ఈలలు, కేకలు, కేరింతలు, చప్పట్లు విని చాలా కాలమైంది. వాటి శక్తి ఏమిటన్నది అనుభవపూర్వకంగా తెలిసినవాడిని. కాబట్టి కేకలు, కేరింతల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తూ మళ్లీ ఇలా మీ ముందుకొస్తున్నా. ‘బాస్ కమ్ బ్యాక్’ అంటూ ఉత్సాహాన్ని ఉరకలేయిస్తుంటే -ఉండలేకపోతున్నా. నటుడిగా మీకు దూరమైన పదేళ్లూ పది క్షణాల్లా గడిచిపోయాయి. పదేళ్లూ నన్ను నడిపించిన శక్తి ఏమిటి? పాతికేళ్ల ముందునాటి ఊపు, ఉత్సాహం నాలో నింపుతున్నది ఎవరు? ఈ ప్రశ్నలు నా ముందుకొచ్చినపుడు కనిపించిన సమాధానం -్ఫ్యన్స్. అందుకే మళ్లీ మీ ముందుకొచ్చే ప్రయత్నాల్లో చాలా కథలే విన్నాను. ఏదీ ఫుల్‌మీల్స్ అనిపించలేదు. చివరకు కత్తిలాంటి ‘కత్తి’ చూశాక రీమేక్‌వైపు అడుగులేశా. అలా ‘ఖైదీ నెంబర్ 150’తో మీ ముందుకొస్తున్నా.
-చిరంజీవి
ఖైదీ నెంబర్ 150

తారాగణం:
చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా, రామ్‌చరణ్ (గెస్ట్ అప్పియరెన్స్)
సినిమాటోగ్రాఫర్:
ఆర్ రత్నవేలు
మాటలు:
పరుచూరి బ్రదర్స్
సంగీతం:
దేవి శ్రీ ప్రసాద్
నిర్మాతలు:
రామ్‌చరణ్
దర్శకుడు:
వివి వినాయక్

-రాణీప్రసాద్