మెయిన్ ఫీచర్

మనం మారలేమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా ప్రేక్షకుడి స్థాయిని ప్రశ్నించే ప్రశ్నలు ఇటీవలి కాలంలో మళ్లీ వినిపిస్తున్నాయి. మాస్ మసాలాలు తప్ప, మంచి సినిమాను తెలుగు పరిశ్రమ ఎప్పుడో మర్చిపోయిందన్నది ఒకటి. వినోద వ్యాపారం సంపన్న వర్గాల చేతుల్లోకి వెళ్లిపోయి -చిన్న సినిమా ఊపిరాడక చస్తోందన్నది మరొకటి. సందర్భం ఏదైనా -పరిశ్రమతో ప్రయాణిస్తూ, పరిశ్రమను ఏళ్ల తరబడి పరిశీలిస్తున్న వ్యక్తుల వేదన నుంచి పుట్టిన ప్రశ్నలు కనుక -వాటిని చర్చించుకోక తప్పదు.

**

పై ప్రశ్నలకు సమాధానంగా -గతంలో వచ్చినవన్నీ మంచి సినిమాలేనా? అన్న ఉప ప్రశ్న మరొకటి. అప్పటి సినిమాల స్థాయిని అప్పటి ప్రేక్షకులు అప్పుడే నిర్ణయించి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. వాటిలోవే -ఎన్నో సినిమాలు క్లాసిక్స్‌గా ఇప్పటికీ అలరిస్తున్నాయి. మరిప్పుడు విడుదలవుతున్న చిత్రాలు ఎప్పటిదాకా వాటిస్థాయిని నిలుపుకుంటాయని ప్రశ్నిస్తే జవాబు దొరకదు. ఎందుకంటే సినిమా చూసి బయటికొచ్చిన వెంటనే కథను మర్చిపోయేంత గొప్పగా ఉంటున్నాయి అన్నది కొందరి వాదన. ఫలానా సినిమాలో ఫలానా సందర్భంలో వచ్చిన ఫలానా పాటేంటి? అని అడిగితే -మొబైల్‌లోని అంతర్జాలాన్ని శోధించి వినిపించడమే తప్ప, కనీసం పాట భావాన్ని నోటితో చెప్పగలిగే గుర్తు ఉండటం లేదన్నది ఆరోపణ. ఇక్కడ ప్రేక్షకుడికి జ్ఞాపకశక్తి తగ్గిందా? సినిమాలో క్వాలిటీ తగ్గిందా? అంటే లబ్దప్రతిష్ఠులైన కళాకారులు ‘క్వాలిటీయే దిగజారింది’ అంటున్నారు. ఒకప్పుడు -కేవలం శృంగారాత్మక చిత్రాలకు కొన్ని థియేటర్లు పరిమితమయ్యేవి. ఆ థియేటర్ల వైపు పోవడానికే సంప్రదాయ సినిమా అభిమానులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఎవరికీ లేదు. అన్ని థియేటర్లు చక్కగా ముస్తాబై అలాంటి సినిమాలనే ప్రదర్శిస్తున్నాయి. మరి మంచి సినిమా అభిమానులు ఏం చేస్తున్నారు? థియేటర్ల వైపునకు పోవడం మానుకున్నారు. ఎందుకంటే? సినిమా అనేది ఒకప్పుడు కళను, ఆర్థిక సూత్రాన్ని సగం సగం చూపేది. ఇప్పుడు సినిమా వంద శాతం ఆర్థిక సూత్రాల పిడికిలిలో బిగుసుకుంది. మంచి చిత్రాలను ఆదరించడం లేదని ప్రముఖులు అంటున్నారు. మంచి చిత్రాలకు థియేటర్లను ఇవ్వడం లేదని మరికొందరు వాపోతున్నారు. అంటే ఇక్కడ మంచి చిత్రం అంటే కేవలం హృదయానికి ఆనందం కలిగించేదా? లేక ఉత్ప్రేరణ కలిగించేదా? అని ప్రశ్నించుకోవాలి. నిర్మాతలంతా లాభాపేక్షతో సినిమాలు తీస్తున్నారు గనుక ఉత్ప్రేరకాలుగానే రూపొందిస్తున్నారని చెబుతున్నారు కొందరు. సినిమాకు థియేటర్ దొరకకపోవడం, మాస్ మసాలా ఎంటర్‌టైనె్మంట్‌తో తీసిన చిత్రాలు ఎన్ని థియేటర్లుంటే అన్ని థియేటర్లలో ప్రదర్శించబడటం ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. ఈ చరిత్రను చరిత్ర కాదని, కేవలం లాభాలకోసం సాగే వేటగా అనేకమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కళకోసమే జీవితాన్ని ధారపోసే ‘దేవదేవీలు’ ఎవరూ లేరిక్కడ. నిర్మాత అనేవాడు లాభం ఉంటేనే కదా మరో సినిమా తీయడానికి అని వాదిస్తున్న విషయంలో కూడా వాస్తవం ఉంది. అవార్డు సినిమాలను తీసినప్పుడు కలక్షన్లు లేక పెట్టిన పెట్టుబడి రాక, కేవలం అవార్డు చూసుకొని మురిసిపోవాలా? మరో సినిమా రూపొందించడానికి అవసరమైన పెట్టుబడి అవసరం లేదా? అని అడుగుతున్న మాటలోనూ నిజమే ఉంది. ఇక్కడ సినిమా తీసేవాళ్లలో కమర్షియల్ సినిమాలు నిర్మించే వాళ్లు, అవార్డు సినిమాలు చిత్రీకరించేవాళ్లు ఉన్నారు. కానీ ప్రేక్షకులు రెండు రకాల సినిమాలను ఆదరించేవాళ్లు లేరు. కేవలం మాస్ మసాలా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకే పట్టంగట్టే పట్టాదారులే ఉన్నారు. అవార్డు సినిమాలు ప్రదర్శించే థియేటర్ల వైపునకు వెళ్లలేని అశక్తులు ఉన్నారు. మరి నిజమైన అవార్డు సినిమాలను చూసేవాళ్లు ఏమయ్యారు. అంటే సినిమాలు చూసే వ్యసనాన్ని ఒదిలేశారని చెప్పాలి. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కేవలం యువతను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నవే కనుక అలాంటి సినిమాలను చూడాల్సిన అవసరం లేదని, ఇంట్లో టీవీలకే అంకితమైపోయారు. ఇక ప్రేక్షకుడు అనేవాడు ఎవడు? అంటే కాలేజీకి వెళ్లే యువత అనే సమాధానం వస్తోంది. అందుకని వ్యాపారస్తుడనే నిర్మాత యువతకు ఎలాంటి డ్రగ్స్ కావాలో అలాంటివే ఆలోచించి సినిమాలలో పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి తగిన విధంగా దర్శకులు కూడా అలాంటి కథలనే వండడానికి
ఇష్టపడుతున్నారు. ఇక ఇక్కడ మంచి సినిమా, చిన్న సినిమా అన్న ప్రస్తావన ఎక్కడుంది? ప్రస్తావనే లేనప్పుడు సినిమా ఎలా రూపొందుతుంది? ఎక్కడో ఎడారిలో ఒయాసిస్‌లా ఓ దర్శకుడు మంచి చిత్రాన్ని తీయాలన్న బలమైన కోరికను చంపుకోలేక, ఎవరు వద్దన్నా వినక, తన కథ మీద నమ్మకంతో తీస్తున్నాడు. కానీ అతని సినిమా ప్రదర్శించడానికి ఒక్క థియేటర్ కూడా దొరకని పరిస్థితి ప్రస్తుతం వుంది. దీనికి తగ్గట్లు చిన్న చితక, ఎటువంటి విలువలు లేని నిర్మాతలు, ప్రతిభలేని దర్శకులు రూపొందిస్తున్న డీ గ్రేడ్ సినిమాల వెల్లువతో మంచి సినిమాలు కూడా అదే గాటన కట్టివేయబడుతున్నాయి. దీంతో ఈ సినిమాలు ఎవరు చూస్తారు? అని థియేటర్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అప్పుడప్పుడు యువతతో తీసిన కొన్ని మంచి సినిమాలకు థియేటర్లు లేకపోయినా, సినిమా స్టామినాతో ఆడుతూ కలక్షన్లు వసూలుచేస్తుంటే థియేటర్లు పెంచిన పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. ఏతావాతా ఇక్కడ ఏంటంటే ప్రేక్షకులు వస్తేనే ఏదైనా సినిమా. రెండు మూడు టిక్కెట్లు తెగితేనే అది థియేటర్లలో ప్రదర్శించదగిన సినిమా. ఒక్క ప్రేక్షకుణ్ణి కూడా ఆకర్షించలేకపోయిన సినిమాలు ప్రదర్శించినా ఏం లాభం? కనీసం ప్రొజెక్టర్‌కు ఖర్చయిన కరెంటు ఛార్జీలైనా రావాలి కదా? అందుకే ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అలాంటి సినిమాలే ఇస్తోంది పరిశ్రమ. మేం మంచి సినిమాలు తీశాం. థియేటర్లు ఇవ్వండి అని అడుగుతున్న దర్శక, నిర్మాతలకు ఈ కలక్షనే్ల ఉదాహరణగా చూపించి, మొండి చేయి చూపిస్తున్నారు ఎగ్జిబిటర్లు. ఈ సమస్యకు పరిష్కారాన్ని కొన్ని రాష్ట్రాలు కనుగొన్నాయి. చిన్న సినిమాల విడుదల సమయంలో కొన్ని సూత్రాలు రూపొందించారు. పెద్ద సినిమాలు ఎప్పుడు విడుదలైనా ఓపెనింగ్స్ గ్యారంటీ. అందుకనే పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాలు విడుదల కాకుండా, ఓ టైమ్‌ను నిర్ణయిస్తున్నారు. పెద్ద సినిమాలు ఏవీ విడుదలకాని సందర్భాలలో చిన్న సినిమాలు విడుదలైతే, ఆ చిత్రాలు కూడా బాగానే ప్రదర్శింపబడతాయి. బాక్సాఫీసు కళకళలాడుతుంది. నిర్మాత సేఫ్ జోన్‌లోకి వెళతాడు. అందుకే ఆర్ నారాయణమూర్తి చెప్పినట్టుగా రెండు రాష్ట్రాల సారథులు ఒకచోట కూర్చుని ఈ విషయంపై చర్చలు జరిపి, సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే అటు మంచి సినిమాకి, ఇటు చిన్న సినిమాకి, మరోవైపు కమర్షియల్‌గా రూపొందించిన పెద్ద హీరోల సినిమాలకు లాభదాయకంగా ఉంటుంది. ప్రేక్షకుడు అనే వనరును పరిశ్రమ ఎలా ఉపయోగించుకోవాలో అన్న ఆలోచనతో విధానాలు రూపొందించుకోవాల్సిన చారిత్రాత్మక సందర్భం ఎదురవుతోంది. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే అందరికీ ఆనందమే.
***

నేను హీరోగా నటించిన సినిమా విడుదలై టాక్ బాగానే ఉన్నా -్థయేటర్లలో నీ సినిమా లేకపోవడం వల్ల చూడలేకపోయాం అని చాలామంది చెప్పినపుడు చాలాచాలా బాధపడ్డాను. చిన్న సినిమాని బతికించేందుకు రెండు రాష్ట్రాల సిఎంలు ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే చిన్న సినిమాలు నిర్మాణం అవుతాయి. కొన్ని సినిమాలకే థియేటర్లు కేటాయించడం కాకుండా అన్ని సినిమాలకూ థియేటర్లు ఇచ్చే న్యాయం అమలవ్వాలి. నా సినిమా తెలంగాణలో 23 థియేటర్లలో విడుదలైతే, ఆంధ్రలో ఒక్క థియేటర్‌లో కూడా విడుదల కాకపోవడం విచారించదగ్గ విషయం. ఈ విషయంపై నిర్మాతల కౌన్సిల్‌గానీ, ఛాంబర్‌గానీ ఏ అభివృద్ధి సాధించలేకపోయాయి. మానవతా విలువల్ని ఆర్థిక విలువలు అధిగమిస్తున్నాయి. దళారీలు సినిమా విడుదల విషయాల్లో విపరీతంగా పెరిగిపోయారు. చిన్న సినిమాకు థియేటర్లు దొరకనివ్వడం లేదు. అయితే అలాంటి వాళ్లంతా దళారీ వ్యవస్థ నాశనం కావాలనే కథాంశంతోనే సినిమాలు తీస్తుండడం విచిత్రం, విచారించదగ్గ విషయం.
-ఆర్ నారాయణమూర్తి,
హీరో, నిర్మాత, దర్శకుడు
***

మొదలుపెట్టినపుడు ప్రతీదీ -మంచి సినిమానే. హీరోలతో గొప్ప సినిమాలు తీయమని అభిమానులు కోరుకున్నంత సులువుగా -సినిమా తయారైపోదు. ఓ మంచి సినిమా రావడానికి -పెట్టుబడి పెట్టే అభిరుచి కలిగిన నిర్మాత ఉండాలి. మంచి కథ దొరకాలి. అనుభవజ్ఞుడైన దర్శకుడు కుదరాలి. ఈ మూడూ సమపాళ్లలో అమరడం -అరుదైన సందర్భమే అవుతుంది. ఇన్ని జరిగినా క్రియాశీలకంలోకి వచ్చేసరికి తలెత్తే ఇబ్బందులూ ఉంటాయి. చిరంజీవికి ‘ఖైదీ..150’, బాలకృష్ణకు ‘శాతకర్ణి’ కుదిరాయి కనుక సినిమాలు ఆడుతున్నాయి. మంచి సినిమాను ‘అవార్డు’లతోనే పోల్చలేం. నష్టాలు పెట్టుకుని అలాంటి సినిమాలు చేయాలని ఎవరూ అనుకోరు. లాభాలొచ్చి, అవార్డులు దక్కితే సంతోషిస్తారంతే. అవార్డుల సినిమాలే మంచి సినిమాలు అనుకుంటే -దర్శకుడు కెరీర్‌ను ఫణంగా పెట్టాలి. నిర్మాత అటో ఇటో తేల్చుకోవడానికి సిద్ధపడాలి. అవార్డులొచ్చి, లాభాలు తెచ్చే సినిమాలు తీయగలగడం ఓ అదృష్టం. అలాంటి చారిత్రక ప్రతిఫలం అప్పుడప్పుడే దక్కుతుంది. ఉదాహరణకు శంకరాభరణం. దర్శకుడు విశ్వనాథ్‌పై ఉన్న నమ్మకంతో ఎన్నో కష్టాలు పడి నిర్మాత ఆ సినిమా తీశారు. ఆడుతుందో లేదోనని భయపడ్డారు. అదృష్టవశాత్తు ఆడింది. అవార్డులొచ్చాయి. నిర్మాత సంతృప్తి చెందాడు. అలాంటి అరుదైన సందర్భాలు అప్పుడప్పుడు మాత్రమే సాధ్యం.
-కాశీ విశ్వనాథ్, దర్శకుడు, నటుడు
***

ఒకప్పుడు మంచి కళాభినివేశం, సినిమాపై విజన్‌వున్న కళాకారుల నేతృత్వంలో పరిశ్రమ దేదీప్యమానంగా వెలిగింది. ఇప్పుడు సినిమాలో కుల, వర్గ, జాతి వివక్షలు పాతుకుపోయాయి. ఇప్పుడొస్తున్న చిత్రాల్లో ఒక్కటీ జాతి, భాష గర్వించేలా రావడం లేదు. పురస్కారాలు, బిరుదులు వస్తాయనే ఆలోచనతో కాకుండా సమాజం ఆదరించేలా సందేశాత్మక చిత్రాలు రూపొందించాలి. మంచి సినిమాలకు ఆదరణ కరువవుతోంది. లబ్దప్రతిష్టులైన తెలుగు హీరోలు జాతి, భాష గర్వపడేలా ఒక్క సినిమానూ తీయలేరా? సినీ హీరోల అభిమానులు, ప్రేక్షకులు కేరళ, కర్ణాటకవాళ్లు అవార్డులు తన్నుకుపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారేగానీ, ఎంతమంది తమ అభిమాన హీరోలకు దేశం గర్వించే సినిమాలు తీయమని చెప్పగలుగుతున్నారు. సినీ ప్రేక్షకులు సంకెళ్లు వేసుకు సినిమాలు చూస్తేస్తున్నారు. ఆ సంకెళ్లు తీస్తే వాళ్ల సత్తా ఏమిటో తెలుస్తుంది. సినిమాల్లో నచ్చని అంశాలపై నోరెత్తితే ఏ అభిమాన సంఘాల వాళ్లు ఇళ్లపై రాళ్లవర్షం కురిపిస్తారోనని -మంచి సినిమాను కోరే ప్రతివారూ భయపడాల్సి వస్తోంది. సోకాల్డ్ అభిమానులు హీరోలను ప్రశ్నించినప్పుడే మంచి సినిమాలు వస్తాయి. పెద్ద సినిమాల నిర్మాతలు రాష్ట్రంలో వేల థియేటర్లను బుక్ చేసుకుంటున్నారు. మరి చిన్న సినిమాలు ఎక్కడ ఆడించాలి? ఓ సినిమా స్థాయిని ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కానీ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, దళారీలు కాదు.
-ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, గాయకుడు, నటుడు
***

సక్సెస్ రేటే కీలకం

సినిమా -వినోదాత్మక వ్యాపారం. తీసేవాడి నుంచి పంపిణీదారుడు, థియేటర్ యజమాని సహా క్యాంటీన్ నడిపేవాడు, వెహికల్ స్టాండ్ నిర్వహించేవాడూ అందరిదీ సినిమా వ్యాపారమే. అమ్ముడుపోయే సరుకునే వ్యాపారస్తుడు అమ్మాలనుకుంటాడు. ఈ సూత్రం సినిమాకూ వర్తిస్తుంది. ఆడియన్స్ ఆశించేది తీస్తున్నామని నిర్మాతలంటారు. వాళ్లు తీస్తున్నదే చూస్తున్నామని ఆడియన్స్ అంటారు. ఇక్కడ మంచి చెడులు, అవార్డులు రివార్డుల ఆలోచనలు పక్కనపెడితే -తీసిన సినిమా పేరు తెచ్చుకుని లాభాలతో కూడిన ప్రశంసలు సంపాదిస్తే అదో అదృష్టమనే చెప్పాలి. పడిగట్టు సినిమాలన్నీ గొప్పవనీ, అవార్డు సినిమాలనీ అనలేం. అలా తీసినవాళ్లు ఎంతమంది నిలబడ్డారన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉద్భవిస్తుంది. సంప్రదాయబద్ధమైన సినిమాకు సక్సెస్ రేటు లేకపోవడం వల్లే -పరిస్థితిలో మార్పు వచ్చిందన్న విషయాన్ని గమనించాలి. ఒకప్పుడు మరణిరత్నం గీతాంజలి -తెలుగులో విడుదలై వారంవరకూ ఫ్లాపు టాక్ మోసింది. క్రమంగా హిట్ టాక్ తెచ్చుకుంది. అదే సినిమాని తమిళంలోకి అనువదిస్తే -మార్నింగ్ షోనుంచే హిట్‌టాక్ అందుకుంది. ఒకచోట ఒకలా, మరోచోట మరోలా ఫలితాలు వచ్చాయంటే -ఆయా ప్రాంతాల ఆడియన్స్ అభిరుచుల్లో తేడాలుండటాన్ని గమనించాలి. ఎంత కాదన్నా -సినిమా 90 శాతం వ్యాపారం, పది శాతం కళ. మంచివైన చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్కపోవడం బాధాకరమే. కాకపోతే -ఇక్కడా వ్యాపార సూత్రమే తెరపైకి వస్తుంది. ఏది బాగా అమ్ముడుపోతే -దానే్న తీసుకుంటారు. ఒక ఊళ్లోవున్న ఎనిమిది థియేటర్లలో ఒకే సినిమా ఆడుతుందంటే అర్థమేంటి? అమ్ముకునేవాడు త్వరగా డబ్బులు చేసుకుని, లాభాలకోసం ఒకే సినిమా వేస్తున్నాడని అర్ధం. వ్యాపారంలో ఎవరినీ నువ్వు నష్టపో అని చెప్పలేం. అయితే పెద్ద సినిమాకన్నా చిన్న సినిమాలవల్లే చాలామంది బ్రతుకుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించే తమిళనాడులో చిన్న సినిమాల విడుదలకు కొన్ని సందర్భాలను వాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా విడుదల మధ్య ఎలాంటి ఇబ్బందీ ఉండదు. నిజానికి -పెద్ద సినిమా ఎప్పుడు విడుదలైనా ఓపెనింగ్స్ బావుంటాయి. పండుగ సందర్భాల్లో మంచివనుకున్న చిన్న సినిమాలకు చాన్స్ ఇవ్వడమే ఉత్తమం. కానీ అభిమానుల, పోటీదారు మనస్తత్వంతో పెద్ద హీరోలూ పండుగ సమయాల్లోనే తమ సినిమాలు విడుదల చేస్తున్నారు. తమిళనాడు తరహా కండిషన్స్ ఇక్కడా పాటిస్తే కొంత మార్పు రావొచ్చేమో. వ్యాపారంలో అంతస్సూత్రంగా మానవత్వ కోణమూ ఒకటుంటుంది. కానీ -ఇక్కడ ప్రేక్షకుడు తప్ప అందరూ వ్యాపారమే చేస్తున్నారన్నది నిజం.
- దేవీప్రసాద్, దర్శకుడు

-శేఖర్