మెయిన్ ఫీచర్

కళాబ్రహ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమాకు ఆత్మగౌరవం ఆయన. సిరిసిరిమువ్వల సిరివెనె్నలో స్వాతి ముత్యాల జల్లు విశ్వసాథ్ సినీ ముద్ర. సంగీత, సాహిత్య, నృత్యాభినయాలకు వెండితెర దివిటీలు ఆయన సినిమాలు. సిరిసిరిమువ్వతో తెలుగు సినిమా గతిని మార్చిన ఆయన శంకరాభరణంతో తనేమిటో రుజువు చేసుకున్నారు. మొత్తం సినిమానే తన వెంట తిప్పుకున్నారు. తీసింది తక్కువ సినిమాలే అయినా దేనికదేసాటి. మరో సినిమాతో పోల్చలేని నిరుపమానత విశ్వనాథుని సృజన. శారద వంటి సాంఘిక సినిమాను ఎంత హృద్యంగా తెరకెక్కించారో.. ఓ సీత కథంటూ ఓ కమనీయ కథాంశంతో సినిమాను కొత్త మలుపుతిప్పారు. మానవ సంబంధాల ప్రాధాన్యత, సంప్రదాయ విలువల పవిత్రతకు విశ్వనాథ్ సినిమాలు చిరునాలు. తెలుగు సినీ సాహిత్యాన్ని ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులూ తిప్పి తెలుగు వాడిని చాటిన వేటూరిని గుర్తించి ప్రోత్సహించినా.. భావుకతను భావోద్వేగ రీతిలో విరచించిన సిరివెనె్నలను అందించినా అది కళాబ్రహ్మ విశ్వనాథ్‌కే చెల్లింది. ఆయనకు ఫాల్కే రావడం తెలుగు నేలకు సంబరం. తెలుగు సినిమాకు దీర్ఘకాలం తర్వాత లభించిన గౌరవం.

కాశీనాథుని విశ్వనాథ్.. తెలుగుదనానికి, పల్లె పట్టు అందాలకు, ఆరణాల తెలుగు కథకు నిలువెత్తు నిదర్శనం. మానవ జీవితంలోని భిన్న కోణాల సమన్వయం ఆయన సినిమాలు. సన్నివేశాల చిత్రీకరణలో వైవిధ్యం, పాత్రధారుల ఎంపికలో నిబద్ధత వెరసి కె విశ్వనాథ్‌ను అద్వితీయ దర్శకుడ్ని చేశాయి. రాసి కంటే వాసి ముఖ్యమన్నది నానుడి. ఎన్ని సినిమాలు చేశామన్న దానికంటే ఎన్ని నాణ్యతాయుతమైన సినిమాలను తీశామన్నదే ఓ దర్శకుడి ప్రతిభకు గీటురాయి. అలాంటి గీటురాళ్లు విశ్వనాధ్ ఐదున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో కోకొల్లలు.

కాశీనాథుని విశ్వనాథ్. సౌండ్ ఇంజనీర్‌గా పరిశ్రమలో అడుగు పెట్టి అనతి కాలంలోనే నాటి మేటి దర్శకుల జాబితాలో చేరిన కళాతపస్వి. అక్కినేని ఆత్మగౌరవంతో దర్శకుడిగా మారిన విశ్వనాథ్‌కు ఆ సినిమా ఎనలేని గుర్తింపు తెచ్చింది. హీరోని బట్టి కథ అని కాకుండా కథను బట్టే హీరో అన్న వాస్తవికతకు విశ్వనాథ్ సినిమాలు అద్దంపడతాయి. సమకాలీన అంశాలను తెరకెక్కించడంలోనూ, ఒకే కుటుంబంలోని భిన్న మనస్తత్వాల కలయికగా సినిమాలు తీయడంలోనూ విశ్వనాథ్‌ది అందెవేసిన చెయ్యి. తెలుగు సినిమాను శ్వాసగా, ఊపిరిగా భావించి అందులోనే మమేకమై తమ కళాత్మకతను, సృజనాత్మక తృష్ణను రంగరించి అద్భుత కళాఖండాలను తెరకెక్కించిన అరుదైన వారి కోవకు ఇప్పుడు కె విశ్వనాథ్ చేరడం తెలుగువారందరికీ గర్వకారణం. దీర్ఘకాలం తర్వాత వెండితెరకు మకుటాయమానమైన దాదా ఫాల్కే పురస్కారం విశ్వనాథ్‌కు లభించడం ఆ అవార్డుకు మరింత వనె్న తేవడమే. సినిమాను సినిమాకోసం తీయడంలో గొప్పలేదు. సినిమాను చిరస్మరణీయ దృశ్య కావ్యంగా మలచడంలోనే దర్శకుడి ప్రతిభ నిగ్గుదేరుతుంది. అలాంటి సినిమాలు విశ్వనాథ్ సినీ ప్రయాణంలో కోకొల్లలు. తెలుగు సంప్రదాయానికి ఆయన తన సినిమాల ద్వారా ఎంత ప్రాచుర్యట కల్పించాలో, సంగీతానికీ అంతే ప్రాధాన్యతనిచ్చారు. ఓ శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సాగర సంగమం ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వనాథ్ కళాతృష్ణ ఎంత లోతైనదో, ఆయన ఎంపిక చేసుకున్న కథలు, వాటిని తెరకెక్కించిన తీరు ఎంత హృద్యమో కళ్లకు కడుతుంది. స్వాతి ముత్యం చిత్రం 1986లో ఆస్కార్‌కు భారత దేశం తరపున అధికారికంగా నామినేట్ అయిందంటే ఓ తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయి ఘనత దక్కడమే. కమల్ హసన్, రాధిక ముఖ్య భూమికలు పోషించిన స్వాతి ముత్యం వెండితెరపై వెలిసిన ఓ కమనీయ దృశ్య కావ్యం అనడం అతిశయోక్తి కాదు. దర్శకుడిగా విశ్వనాథ్ విజయానికి దోహదం చేసినవి ప్రధానంగా ఆయన ఎంచుకున్న కథలైతే.. వాటిని తెరకెక్కించిన తీరు దర్శకుడిగా ఆయన సృజనకు దివిటీ పట్టింది. మొక్కుబడిగా విశ్వనాథ్ ఏ సినిమా తీయలేదు. తన పేరుతో ఏ సినిమా అయినా ప్రేక్షకాదరణ పొందుతుందని భావించలేదు. దర్శకుడిగా ఎంత క్రమశిక్షణ పరిశ్రమలో ఒక ఒరవడిని సృష్టించింది. తాను దర్శకుడినైనా, తన సినిమాకు ఆద్యుడ్ని తనే అయినా ఓ కార్మికుడిలాగా దుస్తులు ధరించి విధులు నిర్వహించడం అన్నది ఆయనకే చెల్లింది. అదే క్రమశిక్షణ ఆయన సినిమాల్లోనూ, ఎంపిక చేసుకున్న కథల్లోనూ, కథనాన్ని నడిపించడంలోనూ అడుగడుగునా కనిపిస్తుంది. మిగతా చిత్రాల్లో ఫలానా పాత్ర ఎందుకన్న ప్రశ్న తలెత్తుతుందేమో కానీ విశ్వనాథ్ సినిమాలకు సంబంధించి అలాంటి విమర్శలు అతి తక్కువే. ఎందుకంటే ప్రతి పాత్ర కథలోనూ, కథనంలోనూ, అంతిమంగా ఆ సినిమాను సమన్వయ రీతిలో ముందుకు సాగించేందుకు దోహదం చేసేదే. అందుకే విశ్వనాథ్ సినిమాలకు తెలుగు నెలపై ఎనలేని ఆదరణ. సినిమాలు ఎన్నయినా రావచ్చు, పోవచ్చు కానీ విశ్వనాథ్ సినిమా తీస్తున్నారంటే అది రసరమ్యమేనన్న మధురానుభూతి తెలుగు ప్రేక్షకులకు కలిగేదేననడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన సినిమాల్లో సంగీతానికి ఆయన ఇచ్చినంత ప్రాధాన్యత మరే ఇతర చిత్రాల్లోనూ కనిపించదు. సన్నివేశానికి అనుగుణంగా పాటలు రాయించుకోవడంతో పాటు కమనీయమైన, రమ్యమైన బాణీలను రాబట్టుకోవడంలోనూ విశ్వనాథ్ దిట్ట. అందుకే ఆయన సినిమాలు కథాపరంగానే కాదు పాటల పరంగానూ జనరంజకమయ్యాయి. ఆకాశవాణిలో ఆయన సినిమా పాట రాని రోజు లేదంటే.. దాన్ని విని ఆ సన్నివేశాలను మరోసారి గుర్తుకు తెచ్చుకోని శ్రోత లేడనడమూ నిజం. సంగీతానికి, నాణ్యానికి ఎంతటి బంధముందో..విశ్వనాథ్ సినిమాకు తెలుగు సంప్రదాయానికీ అంతే బలమైన అనుబంధం ఉంది. అనునిత్యం కొత్తదనం కోసం పాకులాటే మనస్తత్వం ఉండటం వల్లే ఈ ఐదున్నర దశాబ్దాల కాలంలో విశ్వనాథ్ సినిమాలకు ఎనలేని గుర్తింపు లభించింది. ప్రేమ కథను తెరకెక్కించినా..శంకరాభరణం లాంటి సంగీతం, సంప్రదాయం మేళవించిన కథను వెండితెర దృశ్వకావ్యంగా మార్చినా..శారద వంటి ఓ సామాన్య కథను అద్భుతమైన కధా సంవిధానంతో మలిచినా అది విశ్వనాథ్ మార్కు. సినిమా ఎలాంటిదైనా అందులో ఆయన ముద్ర కనిపిస్తుంది. అడుగడుగునా తెలుగుదనం,దానితో ముడివటిన చమత్కారం, హాస్యం సమపాళ్లలో పండుతాయి. దాసరి, కె.రాఘవేంద్రరావువంటి దర్శకులు తెలుగుసినిమా రంగంలో ప్రభంజనాన్ని సృష్టిస్తున్న తరుణంలోనే వారికి భిన్నమైన మార్గాన్ని, గమ్యాన్ని ఎంచుకుని విశ్వనాథ్ తనదైన శైలిలో రాణించారు. తనదైన బాటను నిర్దేశించుకుని, అందులోనే మమేకమై తెలుగు సినీ నేలపై మకుటాయమానమైన ఎన్నో దృశ్య కావ్యాలను పండించారు. తెలుగువర్ణమాలలోని స, శ అక్షరాలతోనే ఆయన ఎక్కువగా సంగీత ప్రధాన సినిమాలు తీయడం కూడా వాటి ప్రాచుర్యానికి సంగీతంతో అవి ఎంతగా ముడివడి ఉన్నాయో చెప్పడానికి నిదర్శనమైంది. ఈ రెండు అక్షరాలతోనే ఆయన మెజార్టీ సినిమాలు ఉండటం కూడా ఓ ఘనతే. శంకరాభరణంతో మరుగున పడిపోతున్న కర్నాటక సంగీతానికి పూర్వవైభవాన్ని తెచ్చిన విశ్వనాథ్‌ను ట్రెండ్ సెట్టర్‌గా నిలిపిన సినిమా సిరిసిరిమువ్వ. అంతకు ముందు ఆయన ఎఎన్‌ఆర్, ఎన్‌టిఆర్, శోభన్‌బాబు, కృష్ణలతో ఎన్నో సినిమాలు తీసినా సంగీతాన్ని, నాణ్యాన్ని అత్యంత హృద్యంగా మలిచిన సినిమాగా, పాటల పరంగానూ సిరిసిరిమువ్వ తెలుగు సినిమా గమనంలో ఓ మైలురాయిగానే మారింది. అప్పటి నుంచే విశ్వనాథ్ శకం మొదలైంది. ఎరులా, సెలయేరులా మొదలై ఓ మహా సంగీత ప్రవాహమే అయింది. విశ్వనాథ్ మన తెలుగువాడు..మన తెలుగుదనాన్ని కమనీయంగా, రమణీయంగా, హృద్యంగా, హృదయారవిందంగా ఆవిష్కరించి తాను తరించి తెలుగు నేలను తరింపజేసిన దర్శకుడు అని చెప్పుకోవడానికి మనందరం గర్వపడాలి. ఆయనకు దాదాఫాల్కే పురస్కారం రావడం ఆలస్యమే అయినా..ప్రతిభకు గుర్తింపు రాకుండా పోదన్న నిజానికి నిదర్శనం.

చిత్రం.. కళాతపస్వి కె విశ్వనాథ్

- బి రాజేశ్వర ప్రసాద్