మెయిన్ ఫీచర్

‘మెరుపు’ తీగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానాయకులతో పోలిస్తే మా పాత్రలకు ప్రాధాన్యమే దక్కడం లేదంటూ నిరుత్సాహాన్ని వ్యక్తం చేసేవారు ఇది వరకు కథానాయికలు. కానీ ఇటీవల వాళ్ల స్వరం మారుతోంది. మాకూ మంచి రోజులొచ్చాయని చెబుతున్న మెరుపుతీగలు ఇప్పుడు చాలా మందే కనిపిస్తున్నారు. తెలుగు సినిమాలో కథానాయిక పాత్రల గురించి తొలినాళ్లలో విన్నది ఒక రకం. ఇప్పుడు చూస్తున్నది మరో రకం. వారి పాత్రలకి ప్రాధాన్యం పెరుగుతుంది. ఇదో మంచి మార్పు. ఇది వరకు కథానాయిక అంటే గ్లామర్ కోణంలో చూసేవారు. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని దాటి ఆలోచిస్తూ పాత్రల్ని తీర్చిదిద్దుతున్నారు. టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో నాయికా ప్రాధాన్య చిత్రాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. బాలీవుడ్‌లోనూ ‘అకిరా’, ‘మేరీ కోమ్’లాంటి సినిమాలు మంచి వసూళ్లు, పేరు సంపాదించుకున్నాయి. దక్షిణాదిలోనూ ఈ తరహా సినిమాలు
రూపొందుతున్నాయి. కాలం మారుతోంది అనడానికి ఇదే నిదర్శనం.

నిమా ఓ గ్లామర్ ప్రపంచం. ఎప్పుడూ అందం, ధగధగలు, రంగుల గురించే మాట్లాడుతుంటారు ప్రేక్షకులు. అయితే ఏ సినిమా చూడాలి? ఏది చూడకూడదనే విషయంపై వారికి కొన్ని లెక్కలుంటాయి. అదే తరహాలోనే ఏ సినిమా చేయాలో, ఏది చేయకూడదో అనే విషయంపై కూడా కథానాయికల పాత్రలు పోషించే ‘మెరుపు’ తీగలూ కొన్ని లెక్కలేసుకొని నిర్ణయాలు తీసుకొంటుంటారు. ఏది ఎప్పుడు చేయాలో కూడా వాళ్ల దగ్గర కొన్ని ప్రణాళికలుంటాయి. తొలి అడుగులో కాదు కానీ.. ఒక్కసారి స్టార్‌గా గుర్తింపు తెచ్చుకొన్నాక కథానాయికల ప్రణాళికలు పూర్తిగా మారిపోతుంటాయి. కథ ఇలా ఉంటేనే ఒప్పుకోవాలని, చేసే క్యారెక్టర్‌కు ఇంత ప్రాధాన్యం ఉండాల్సిందే అనీ, పారితోషికం విషయంలోనూ అస్సలు తగ్గకూడదనీ.. ఇలా బోలెడన్ని లెక్కలు వేసుకొని అందుకు తగినట్టుగా తమ కెరీర్‌లో ప్రయాణం సాగిస్తుంటారు. ప్రతీసారీ తమలోని నటిని సంతృప్తిపరిచే పాత్రని చేయలేరు. చేసేందుకు సిద్ధంగానే వున్నా, ఆ తరహా పాత్రలు వారి దగ్గరికి రాకపోవచ్చు. అలాగే ప్రతీసారీ ప్రేక్షకుల్ని తమ నటనతో ఆకట్టుకొని, వారిని మెప్పించే పాత్రలూ వారి నుంచి రాలేవు. చేసేటప్పుడే ఏ క్యారెక్టర్ ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపుతుందో ముందే తెలిసిపోతుంటుంది. కొన్ని సార్లు పాత్రలకంటే కథలు ఎక్కువగా ప్రేక్షకులపై ప్రభావం చూపుతుంటాయి. అందుకే పాత్రతో సంబంధం లేకుండా అన్ని సినిమాల్నీ చిత్తశుద్ధితో చేయాలి. ఒక మంచి కథ ప్రేక్షకులకు చేరువైందంటే అందులో చిన్న పాత్ర చేసినా సరే, గొప్ప గుర్తింపు వస్తుంది. ఆ ఆశతోనే మొత్తం కథని పరిగణనలోకి తీసుకొని సినిమాల్ని ఎంపిక చేసుకుంటుంటారు కథానాయికలు.
నటనకి ప్రాధాన్యమున్న పాత్రలతో వారికి లభించే గుర్తింపే వేరు. అందులో మారోమాటకి తావులేదు. అయితే ప్రతీసారీ కథానాయికకి అలాంటి పాత్రలు దొరకడం కష్టం. భారతీయ సినిమాల్లో కథానాయిక పాత్రలే కీలకం కాబట్టి నాయికకి తెరపై లభించే ప్రాధాన్యం తక్కువే. అలాగని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆ కాసింత పరిధిలోనే ప్రేక్షకుల్ని రక్తికట్టించొచ్చు. నటనకి ప్రాధాన్యమున్న పాత్రలతో ఎంత పేరు తెచ్చుకోవచ్చో, ఫక్తు వాణిజ్య చిత్రాలలోని పాత్రలతోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు. బలమైన పాత్ర దొరికినప్పుడు ఎవరైనా కష్టపడతారు. కానీ వాణిజ్య చిత్రాల్లోని పాత్రలతో ప్రేక్షకులపై ముద్ర వేయడమే ఓ సవాల్. ఆ కిటుకు పట్టేశారంటే ఎలాంటి పాత్రతోనైనా ప్రేక్షకుల్ని ప్రభావితం చేయొచ్చు. కథానాయికలకు యువతరంలో ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. అబ్బాయిలైతే గదుల్లో పోస్టర్లేకాదు, గుండె ల్లో గుడులూ కట్టేస్తుంటారు. తెరపైకి రాకముందు కూడా కొంతమంది కథానాయికలకు ఈ తరహా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండేది. కథానాయకుల్లేని చిత్రాలున్నాయేమో గానీ, నాయికలులేని సినిమాల్లేవు. కథకు అవసరం ఉన్నా, లేకపోయినా.. పాటలకే పరిమితం చేసినా, కథానాయికను పెట్టుకోవాల్సిందే. ఆ క్యారెక్టర్ ద్వారా గ్లామర్ చిలికించాల్సిందే. సినిమాకు హీరో ఒక్కరే కావొచ్చు. హీరోయిన్లు మాత్రం ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చు. అందుకే కథానాయికలకు అంత డిమాండ్. కథానాయికల చూపు నటనకి ప్రాధాన్యమున్న పాత్రలపైనే ఉంటుంది. మంచి నటి అనిపించుకొనే ఆస్కారం అలాంటి పాత్రలతోనే లభిస్తుందనేది వాళ్ల నమ్మకం. అందుకే సాహసాలు చేయడంలోనూ ఈ భామలు వెనకడుగు వేయడంలేదు. ముఖ్యంగా నవతరం కథానాయికలు ఈ విషయంలో మరింత ముందుంటున్నారు. నలుగురు నడిచిన దారిలో అని కాకుండా, మనమే ఒక దారిని సృష్టిద్దాం అంటూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. విభిన్నమైన పాత్రలొస్తే ఏం చేయడానికైనా సిద్ధమే అంటున్నారు. సాహసాలతోనే అద్భుతా లు సాధ్యమవుతాయని వారి నమ్మకం.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమ నటనతో అందర్నీ మెప్పిస్తూ, కెరీర్‌లో ఎదురులేకుండా అడుగులు వేస్తూ ప్రేక్షకుల్ని మురిపిస్తున్న కథానాయికలు కొందరున్నారు. వారిలో అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా, సమంతాతో పాటు నవతరం బ్యూటీలైన రకుల్ ప్రీత్‌సింగ్, రాశీఖన్నా, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్, అను ఇమ్మాన్యుయల్, సాయి పల్లవి లాంటి మురిపిస్తున్న ‘మెరుపు’తీగల గురించి ఒక్కసారి విశే్లషిస్తే...
అనుష్క: ఈ బ్యూటీ ఇప్పటికీ అగ్ర కథానాయికే. దక్షిణాదిలో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం అనగానే అందరికీ అనుష్కనే గుర్తుకొస్తుంది. ఆమెపై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. కథానాయిక నేపథ్యంలో ఓ కథ తయారయి తే మొదటి ఎంపిక కచ్చితంగా అనుష్కనే. కథానాయకులకు దీటైన పాత్రలతో ఆమె తెరపై సందడి చేస్తోంది. ఆట పాటలతో పూర్తయ్యే పాత్రలకంటే చెమటోడ్చి చేయాల్సిన పాత్రలవైపే అనుష్క మొగ్గు చూపుతోంది. ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రాలతో భారీ విజయాల్ని సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు కొత్త చిత్రాలతో బిజీగానే వుంది. 2005లో ‘సూపర్’తో ప్రయాణమైన టాలీవుడ్ జైత్రయాత్ర విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, ఒక్కమగాడు, అరుంధతి, రుద్రమదేవి, బిల్లా, వేదం, పంచాక్షరి, ఖలేజా, చంద్రముఖి, రగడ, కేడి, తకిట తకిట, ఢమరుకం, మిర్చి, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి (స్పెషల్ అప్పీయరెన్స్) లాంటి చిత్రాల్లో నటించిన అను ష్క తాజాగా నాగార్జునతో ‘నమో వేంకటేశాయ’లో చేస్తోంది. ‘ఎప్పటికైనా కథే హీరో. నేను సినిమాను సినిమాగానే చూస్తాను తప్ప ఒక పాత్ర కోణంలో చూడను. కథ బాగుందనిపిస్తే అందు లో చిన్న పాత్రలోనైనా నటించాలనిపిస్తుంది. పాత్ర ప్రాధాన్యాన్ని తూకమేసుకొని చేసిన సినిమా నా కెరీర్‌లో ఒక్కటీ లేదు. కథలతో కదిలించిన చిత్రాల్నే చేశా’నని చెబుతోంది అనుష్క.
కాజల్ అగర్వాల్: రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ‘మగధీర’తో తెలుగు సినిమాల్లో యువరాణి అంటే కాజల్ అని పేరుతెచ్చుకుంది. తరగని అందంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ పరిశ్రమకొచ్చి పదేళ్లు దాటిపోయాయి. ఇంకా ‘చందమామ’గానే పిలిపించుకుంటోంది. దక్షిణాదిలో అనుభవమున్న ఓ కీలక కథానాయికగా గుర్తింపు పొందిన ఈమె ఎప్పుడూ సినిమా ఫలితాల్ని అంచనా వేయదు. తేజ లక్ష్మీ కళ్యాణం, చందమామ, మగధీర, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్‌ఫెక్ట్, బిజినెస్‌మ్యాన్, నాయక్, బాద్‌షా, గోవిందుడు అందరివాడే, టెంపర్, ఖైదీ నెం.150 లాంటి చిత్రాల్లో నటించిన కాజల్ తాజాగా కళ్యాణ్‌రామ్‌తో ఓ చిత్రంతో పాటు రానా హీరోగా ‘నేనే రాజు నేనే మంత్రి’లో చేస్తోంది.
తమన్నా: ‘హ్యాపీడేస్’ నుంచి ఈ బ్యూటీ కెరీర్ ఆగకుండా పరుగులు పెడుతూనే వచ్చింది. గత పదేళ్లుగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ఓ అగ్ర కథానాయిక ఈమె. తనదైన నటనతో ఎన్నో పాత్రలకి ప్రాణం పోసింది. చిత్రసీమలో ప్రణాళికలేవీ పనిచేయవని చెబుతూనే, ఒక పద్ధతి ప్రకారం తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అదృష్టం కొద్దీ ఆమెకు ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం లభిస్తూనే వుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటోంది. ఈ అమ్మడి కెరీర్ కాస్త విచిత్రంగానే కనిపిస్తుంది. ఇక్కడి అమ్మాయి కాదు, కానీ తెలుగు కథానాయికగా చలామణీ అవుతోంది. పనిలోపనిగా తమిళంలోనూ విజయాల్ని సొంతం చేసుకొంది. సొంతభాషలో చేసిన ఏ ప్రయత్నమూ సఫలం కాలేదు. బాలీవుడ్‌లో చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ‘నా దగ్గరకొచ్చిన పాత్రల్ని ఉత్తమంగా చేయడానికి ప్రయత్నిస్తాను తప్ప..నాకు నచ్చిన పాత్రలు రాలేదే అంటూ నిందిస్తూ కూర్చోలేను’ అం టోంది ఈ బ్యూటీ. ‘హ్యాపీడేస్’ తర్వాత 100% లవ్, రచ్చ, తడాఖా, బాహుబలి, బెంగాల్ టైగర్, ఊపిరి, బాహుబలి-2 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసిన తమన్నా ఇప్పటికీ తన కెరీర్‌ను బిజీగానే కొనసాగిస్తుండటం విశేషం.
సమంత: నటనలోనే కాదు.. అందంతోనూ మాయ చేస్తుంది సమంత. తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే నాగచైతన్యతో కలిసి పెళ్లి పీటలెక్కింది. త్వరలో ఈమె ‘రాజుగారి గది-2’లో సందడి చేయబోతోంది. ఇందులో ఆత్మగా కనిపించబోతోంది. రామ్‌చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’ లోనూ నటిస్తోంది. పెళ్లి తర్వాత కూడా తాను నటిస్తానని ఇది వరకే స్పష్టం చేసింది. 2010లో వచ్చిన ‘ఏ మాయ చేసావే’తో టాలీవుడ్‌లో మెరిసిన ఈ అమ్మడు అటు తర్వా త బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, అత్తారింటికి దారేది?, రామయ్యా వస్తావయ్యా, అల్లుడు శీను, రభస, సన్నాఫ్ సత్యమూర్తి, బ్రహ్మోత్సవం, అ ఆ, జనతాగ్యారేజ్ తదితర చిత్రాల్లో మెరిసింది. తాజాగా నటిస్తున్న ‘రాజుగారి గది-2’, ‘రంగుస్థలం-1985’, ‘మహంతి’ చిత్రాలతో పాటు మరికొన్ని నిర్మాణంలో వున్నాయి. ‘నా సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నాలోని నటిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఆవిష్కరించారు. నేను చేసే ప్రతి పాత్ర నాకు ఉత్తమంగానే అనిపిస్తుంది. పెళ్లి తర్వాత పెనుమార్పులు చేసుకుంటాయని అనుకోవడం లేదు. పెళ్లి తర్వాత కూడా నేను నాలాగే వుంటా. కెరీర్ పరంగా చైతూ మొదలుకొని కుటుంబ సభ్యుల వరకూ అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. అంతకంటే ఏం కావాలి? కెరీర్ పరంగా నేను చాలా అదృష్టవంతురాలిని. కథానాయికలకు ఎప్పుడోకానీ మంచి పాత్రలు లభించవు. అలాంటి పరిస్థితుల్లో నాకు పలు చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు చేసే అవకాశం లభించింది. నాకంటే ప్రతిభావంతులు, నాకంటే అందమైన అమ్మాయిలు ఉన్నప్పటికీ ఆ తరహా పాత్రలు చేసే అవకాశం నాకు లభించడం అదృష్టం కాక మరేవౌతుంది?’’అని చెబుతోంది. సో..మరికొన్నాళ్లపాటు ఆమె సందడిని తెరపై ఆస్వాదించొచ్చన్నమాట.
రకుల్ ప్రీత్‌సింగ్: రకుల్ ప్రీత్‌సింగ్ సినిమా సినిమాకీ తన గ్లామర్ పెంచుకుంటూనే ఉంది. కొత్త కొత్తగా ముస్తాబవుతూ ఆకట్టుకుంటోంది. సినిమా లు, గ్లామర్, క్రేజ్.. ఏదో ఒక రోజు కనుమరుగవుతాయన్న నిజాన్ని గుర్తించినట్టే ఉంది. కాబట్టి వచ్చిన ఆఫర్లను వరుసగా చేజిక్కించుకుంటూ యమబిజీగానే వుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో గ్లామర్‌ని చిందిస్తున్న ఈ బ్యూటీ మోడలింగ్ నుంచి వెండితెరపై వికసించిన ఢిల్లీభామ. 2009లో వచ్చిన ‘గిల్లీ’ రకుల్ నటించిన తొలి కన్నడ చిత్రం. 2011లో తెలుగునాట ‘కెరటం’లో సంగీతగా పరిచయమైంది. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో ప్రార్ధన పాత్రను పోషించింది. 2014లో ‘రఫ్’లో నందుగా, అదే సంవత్సరం ‘లౌక్యం’లో చంద్రకళగా, ‘కరెంట్‌తీగ’లో కవితగా ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ 2015లో ‘పండగ చేస్కో’లో దివ్యగా, ‘కిక్-2’లో చైత్రగా, ‘బ్రూస్‌లీ’లో రియగా కనువిందు చేసింది. 2016లో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో..’లో దివ్యాంకగా నటించి ఫిలింఫేర్ అవార్డును కూడా చేజిక్కించుకుంది. అదే ఏడాది వచ్చిన ‘సరైనోడు’లో మహాలక్ష్మీగా, ‘్ధృవ’లో లషికగా, ‘విన్నర్’లో సితారగా ఓ వెలుగు వెలిగింది. ‘జయ జానకి నాయక’లో జానకిగా, తాజాగా వచ్చిన మహేష్‌బాబు ‘స్పైడర్’లో ప్రియగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. తను నటించిన సినిమా హిట్టయితే అదంతా తన ఘనతే అనుకునే మనస్తత్వం కాదట ఆమెది. ఏ సినిమా విజయంలో ఎంత వాటా తీసుకోవాలో తనకు తెలుసునంటోంది. ప్రస్తుతం తెలుగునాట ఊపిరి సలపనంత బిజీగా ఉన్న కథానాయిక రకుల్.
రాశీఖన్నా: టాలీవుడ్‌లో నాలుగేళ్ల క్రితం తన ప్రయాణాన్ని ప్రారంభించింది రాశీఖన్నా. చూస్తుండగానే క్రేజీ కథానాయిక అయింది. ముద్దుగా, అందంగా, అల్లరిగా ఎలా కావాలంటే అలా పాత్ర స్వభావానికి తగ్గట్టు మారిపోతుంటుంది ఈ బ్యూటీ. దానికితోడు మంచి గాయని కూడా. అందుకే మంచి అవకాశాలొస్తున్నాయి. వాటిని చక్కగా ఒడిసి పట్టుకుంటోంది. 2013లో బాలీవుడ్‌లో వచ్చిన ‘మద్రాస్ కేఫ్’ ద్వారా వెండితెర ప్రయాణాన్ని మొదలు పెట్టిం ది. 2014లో తెలుగులో వచ్చిన ‘మనం’లో ప్రేమగా (స్పెషల్ అప్పీయరెన్స్), అదే సంవత్సరం ‘జోరు’లో అన్నపూర్ణగా, ‘ఊహలు గుసగుసలాడే’లో ప్రభావతిగా నటించింది. 2015లో ‘జిల్’లో సావిత్రిగా, ‘శివం’లో తనుగా, ‘బెంగాల్ టైగర్’లో శ్రద్ధగా నటించి తనేంటో నిరూపించుకుంది. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సుప్రీమ్’లో బెల్లం శ్రీదేవిగా, ‘హైపర్’లో భానుమతిగా నటించిన ఈ అమ్మడు తాజాగా ‘జై లవకుశ’లో ప్రియగా వికసించింది. తాజాగా ఆమె నటించిన ‘రాజా ది గ్రేట్’, ‘ఆక్సిజన్’, ‘టచ్‌చేసి చూడు’, ‘తొలిప్రేమ’ నిర్మాణంలో వున్నాయి. రాశీఖన్నా దూకుడుకు ఏ మాత్రం తిరుగులేదు. వరుసగా అవకాశాల్ని సొంతం చేసుకుంటూనే వుంది. తమిళ, మలయాళ చిత్రసీమలోనూ పాగా వేస్తోంది.
కీర్తి సురేష్: తమిళ, మలయాళంతో పాటు తెలుగు చిత్రాల్లో మెరిసిపోతున్న బ్యూటీ కీర్తి సురేష్‌కు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. గత ఏడాది 2016లో ‘నేను శైలజ’లో శైలజగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ 2017లో ‘నేను లోకల్’లో కీర్తిగా దర్శనమిచ్చింది. మలయాళంలో బాలనటిగా ప్రవేశించిన కీర్తి 2013 వరకు అక్కడ పలు చిత్రాలు చేసింది. ‘గీతాంజలి’ చిత్రం ద్వారా మలయాళంలో హీరోయిన్‌గా ప్రవేశించింది. ఇప్పు డు ఆమె డైరీ పలు చిత్రాలతో బిజీగా మారింది. ‘పిఎస్‌పికె 25’లో ప్రియగా, ‘మహంతి’లో సావిత్రిగా నటిస్తున్న ఈ భామ తమిళ, మలయాళంలో కూడా బిజీగానే గడుపుతోంది.
అనుపమ పరమేశ్వరన్: మలయాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులపై తనదైన ముద్రవేసింది. ఇప్పుడామెని అచ్చమైన తెలుగు అమ్మాయిలాగే చూస్తున్నారంతా. ‘అ ఆ’తోనే మొదలైన ఈ బ్యూటీ నట జీవితంలో తొలి సినిమాలోనే మన భాష నేర్చుకుంది. గొంతూ సవరించుకుంది. కట్టూ బొట్టూతోనే కనికట్టు చేసి తన కంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. 2015లో మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’లో మేరీ జార్జ్‌గా చిత్రసీమకు పరిచయమైన ఈ బ్యూటీ 2016లో ‘అ ఆ’లో నాగవల్లిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. ఆ తర్వాత ‘ప్రేమమ్’లో సుమగా, 2017లో ‘శతమానం భవతి’ లో నిత్యగా నటించి మంచి మార్కుల్ని కొట్టేసింది. మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ కేరళకుట్టి నటిస్తున్న తాజా చిత్రాలు రామ్ హీరోగా ‘ఉన్నది ఒక్కటే జిందగీ..’తో పాటు, నానికి జోడీగా ‘కృష్ణార్జున యుద్ధం’, ‘సవ్యసాచి’, తెలుగు, కన్నడంలో తెరకెక్కుతున్న ‘వేటగాడు’ నిర్మాణంలో వున్నా యి. ప్రస్తుతం అనుపమ చేతిలో వున్న చిత్రాలన్నీ కీలకమైనవే. ఈ చిత్రాలు కూడా విజయవంత మయ్యాయంటే ఈ భామ కెరీర్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం.
నివేదా థామస్: మోడలింగ్ నుంచి వెండితెరకు పరిచయమైన ఈ కేరళకుట్టి ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తోంది. 2008లో బాలనటిగా మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. 2016లో వచ్చిన ‘జెంటిల్‌మెన్’లో కేథరిన్‌గా నటించిన ఈ బ్యూటీ ఈ ఏడు ‘నిన్నుకోరి..’లో పల్లవిగా, ‘జై లవకుశ’లో సిమ్రాన్‌గా కనువిందు చేసింది. నవీన్ చంద్రకు జోడీగా నటిస్తున్న ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇండియట్’ నిర్మాణంలో వుంది.
అను ఇమ్మాన్యుయల్: తెలుగు, తమిళ, మాలయాళ భాషల్లో నటిస్తున్న అను 2011లో వచ్చిన ‘స్వప్నా సంచారీ’ మలయాళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. నాని సరసన 2016లో వచ్చిన ‘మజ్ను’లో కిరణ్మయిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. అందానికి అందం, మంచి టాలెంట్ వున్న ఈ భామ రెండో సినిమాకే పవన్‌కళ్యాణ్ సరసన అవకాశాన్ని పట్టేసింది. 2017లో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’లో జానకిగా అలరించింది. ‘ఆక్సిజన్’, ‘పిఎస్‌పికె 25’, ‘నా పేరు సూర్య’, ‘వేటగాడు’ (తెలుగు- కన్నడ), ‘కలియుగ పాండవులు’ చిత్రాలు నిర్మాణంలో వున్నాయి. ఇవేగాక, ఎన్‌టిఆర్, చరణ్, మహేష్‌బాబుల చిత్రాల్లో నటించే అవకాశాన్ని కూడా చేజిక్కించుకుందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ భామగా మారిన అనుకు అవకాశాలు క్యూకడుతున్నాయి.
సాయి పల్లవి: మలయాళంలో తెరకెక్కిన ‘ప్రేమమ్’ లో మలార్‌గా మురిపించి.. కుర్రాళ్ల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది సాయి పల్లవి. భాషతో సంబంధం లేకుండా ఆ పాత్రని, అందులో ఆమె నటనని ఆస్వాదించారు. ఇటీవల ‘్ఫదా’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘‘మనసుపెట్టి చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందని తెలుసు. కానీ ‘్ఫదా’కి వచ్చిన స్పందన నా సంతోషాన్ని రెట్టింపు చేసింది’’ అని చెబుతోంది సాయి పల్లవి. జార్జియాలో ఎంబిబిఎస్ చేసింది. కార్డియాలజీ చదువాలనుకుంది. కానీ ఇలా నటిగా మారాల్సి వచ్చింది. ప్రస్తుతం నానికి జోడీగా ‘ఎం.సి.ఎ’లో నటిస్తోంది. తమిళంలోనూ బిజీగానే మారింది. 2008లో తమిళంలో వచ్చిన ‘్ధమ్ ధూమ్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయింది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. 2015లో ‘ప్రేమమ్’ (మలయాళం), 2016లో ‘కాళి (మలయాళం) చిత్రాల్లో నటించింది. తెలుగులో భానుమతిగా ‘్ఫదా’లో విజృంభించింది. మిడిల్ క్లాస్ అమ్మాయి శ్రావణిగా ‘ఎంసిఏ’లో కనిపించబోతోంది. ఇలా సాయి పల్లవి బిజీగానే మారబోతోంది.
టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో నాయికా ప్రాధాన్య చిత్రాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. బాలీవుడ్‌లో నూ ‘అకిరా’, ‘మేరీ కోమ్’లాంటి సినిమాలు మంచి వసూళ్లు, పేరు సంపాదించుకున్నాయి. దక్షిణాదిలోనూ ఈ తరహా సినిమాలు రూపొందుతున్నాయి. కాలం మారుతోంది అనడానికి ఇదే నిదర్శనం. హాలీవుడ్‌లో పేరున్న కథానాయకులు, నాయికలు అప్పుడప్పుడూ చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తారు. ఇలాంటి సినిమాలే చేయాలి.. ఇలాంటి పాత్రల్లోనే కనిపించాలి అనే గీతల్ని వాళ్లెప్పుడో చెరిపేశారు. మన దగ్గర ఇలాంటి వాతావరణం రావాలి. ఎవరు ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే కొత్త తరహా కథలు పుట్టుకవస్తాయి. బాలీవుడ్‌లో విద్యాబాలన్, దీపికా పదుకొనే, ఆలియాభట్‌ని చూడండి. ప్రతీసారీ ఓ కొత్త పాత్రతో షాక్ ఇస్తారు. స్టార్ హీరోల పక్కనే నటించాలి.. పెద్ద సినిమాలే చేయాలి అనే షరతులేం పెట్టుకోరు. వాళ్లెప్పుడు ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారో ఎవరూ ఊహించలేరు. అలాంటి ప్రయత్నాలు తెలుగులోనూ జరగాలి. చిన్నా, పెద్దా అనే సరిహద్దులు చేరిపేయాలి. కథానాయకులతో పోలిస్తే మా పాత్రలకు ప్రాధాన్యమే దక్కడం లేదంటూ నిరుత్సాహాన్ని వ్యక్తం చేసేవారు ఇదివరకు కథానాయికలు. కానీ ఇటీవల వాళ్ల స్వరం మారుతోంది. మాకూ మంచి రోజులొచ్చాయని చెబుతున్న మెరుపుతీగలు ఇప్పుడు చాలా మందే కనిపిస్తున్నారు. తెలుగు సినిమాలో కథానాయిక పాత్రల గురించి తొలినాళ్లలో విన్నది ఒక రకం. ఇప్పుడు చూస్తున్నది మరో రకం. వారి పాత్రలకి ప్రాధాన్యం పెరుగుతుంది. ఇదో మంచి మార్పు. ఇది వరకు కథానాయిక అంటే గ్లామర్ కోణంలో చూసేవారు. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని దాటి ఆలోచిస్తూ పాత్రల్ని తీర్చిదిద్దుతున్నారు. ఎంత ఎదిగినా మూలాల్ని, ఎంత ఎత్తుకు చేరుకున్నా నడిచొచ్చిన దారిని మర్చిపోకూడదు. ఆ అనుభవాలే వెలకట్టలేని పాఠాల్ని భవిష్యత్తుకు కావాల్సినంత భరోసాని అందిస్తుంటాయి. ఈ విషయాన్ని కథానాయికలు గుర్తించినప్పుడే వారి కెరీర్ ఆశాజనకంగా పరుగులు పెడుతుంది.

-ఎం.డి అబ్దుల్