మెయిన్ ఫీచర్

అభిమానానికీ హద్దులుంటాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిమాన హీరో చిత్రం షో ప్రారంభమైందంటే
చాలు.. థియేటర్లలో ఒకటే గోల, ఈలలు, కేకలు.
విడుదల రోజు ప్రదర్శనలు, ర్యాలీలు, ఊరేగింపులు.
ఇవి చాలవన్నట్లు థియేటర్ వద్ద జోరుగా.. హుషారుగా హంగామా. అభిమానం అన్నది ఉండాల్సిందే.. ఎవరూ
కాదనలేరు. అయితే ఆ అభిమానం కాస్త హద్దులు
దాటకుండా ఉంటే మంచిది అని గ్రహించినప్పుడే
వారి అభిమానానికి ఓ విలువ. వారి అల్లరికి ఓ అర్థం.

‘‘తమ్ముడూ.. నేను ‘జంగిల్ బుక్’ సినిమా చూడలే. కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి’’ ‘పైసా వసూల్’ చిత్రంలో బాలయ్య చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌కి థియేటర్‌లో అభిమానుల గోల అంతా ఇంతా కాదు. ఒక దశలో వారి అభిమానం హద్దులుదాటి పోయింది. తమ హీరో చెప్పే డైలాగ్‌కి అభిమానుల కేకలు.. ఈలలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. ఆ సమయంలో వాళ్ల జోరు..హుషారు వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ ఉత్సాహం వారిలో మరింత రెట్టింపయ్యేలా తమ అభిమానులను ఆనంద పరచడానికి హీరోలు సైతం ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను అనే్వషిస్తూ వాళ్లని ఆకట్టుకుంటున్నారు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూ.ఎన్‌టిఆర్, ప్రభాస్ ఇలా ఒకరేమిటి? ఎందరో కథానాయకులు తమ అభిమానుల్లో ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు మార్గాల్ని అనే్వషిస్తూనే వున్నారు. అంతేకాదు, బాక్సాఫీస్‌కి కొత్త ఉత్సాహం తెప్పించే స్టార్ హీరోలూ వీళ్లే. ఈ పేర్లు రికార్డులకి పని పెట్టే ఓ వ్యాపార సూత్రం. ఈ హీరోలు సినిమా పరిశ్రమపై తిరుగులేని ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎలాంటి పాత్రల్లోనయినా ఇట్టే ఒదిగిపోయే కథానాయకులు వీళ్లు. తమ చిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు ఓ కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తారు. వీరి వేగం ఆపడం ఎవరితరం కాదు.
వరుసగా సినిమాలు చేస్తూ తమ అభిమానుల్ని విశేషంగా అలరిస్తూనే వున్నారు. హీరోలు. కొత్త కథలు.. కొత్త పాత్రలే కాదు, అప్పుడప్పుడు అభిమానుల కోసం కూడా చిత్రాలు చేస్తూ వారిలో నూతనోత్తేజాన్ని కలిగి స్తున్నారు. హీరోలు ఇది వరకటిలాగా కథల గురించి ఎదురుచూడటం లేదు. ఒక చిత్రం చేస్తుండగానే మరో రెండు, మూడు సినిమాలకి సరిపడా స్క్రిప్టులు సిద్ధంగా వుంటున్నాయి. అలాగే అభిమానులు కూడా ఆసక్తిగా రాబోయే చిత్రాల కోసం ఎంతగానో ఎదురుచూసేలా చేస్తున్నారు. దీంతో వారిలో అభిమానం హద్దులు దాటిపోతోంది. ఒక దశలో అభిమానులు చిత్రం విడుదల సమయంలో థియేటర్ల వద్ద ఎన్నో ఇబ్బందులకు కూడా గురవుతున్న దాఖలాలు మనం చూస్తూనే వున్నాం. అంతే కాదు.. కొందరు అభిమానులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులూ వున్నాయి. అభిమానం ఉండాలే..కానీ అది హద్దులు దాటకుండా వుంటే మంచిది అనేది అందరూ గుర్తించాలి. అలా అభిమానులు గుర్తించే విధంగా హీరోలూ వారిలో చైతన్యం కలిగించాలి. సినిమాలు చూసి ఈలలు..గోలలు చేయడమేకాదు, మంచి సేవా కార్యక్రమాలు కూడా చేసేలా వారిని ప్రోత్సహించాలి.
‘తెలుగు రాష్ట్రాల్లో లెక్కలేనంత అభిమానుల్ని ఇచ్చాడు దేవుడు. ఈ జన్మకు ఇది చాలు. ఇంతకంటే ఏం కోరుకోవడం లేదు’ అంటాడు మహేష్‌బాబు.
‘జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. వాళ్ల కోసం మరో జన్మఎత్తాలి. ఈ జన్మ మాత్రం అభిమానులతో ఉండిపోతా. అభిమానుల రూపంలో ఓ మంచి కుటుంబం దక్కింది. ఓ మంచి భర్తగా, ఓ తండ్రికి మంచి కొడుకుగా, ఓ మంచి తమ్ముడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే వున్నా. కానీ అభిమానుల దగ్గర మాత్రం ప్రయత్నించడం వుండదు. ఎమోషన్ మాత్రమే ఉంటుంది. అభిమానులు గర్వంగా తలెత్తుకుని తిరిగే వరకూ ఇలా పోరాడుతూనే ఉంటాను’ అంటాడు జూ.ఎన్‌టిఆర్. ఇలా ఏ హీరో వారికి ఇష్టమొచ్చిన రీతిలో అభిమానులపై ప్రేమ ను వ్యక్తం చేస్తూనే వున్నా రు. వారి అభిమానం అ లాంటిది మరి! సినిమా వినోదమే.. కాదనలేం. శారీరక మానసిక వేదనలు కాసేపు మరచిపోయి, రిలాక్స్ కోసం సగటు ప్రేక్షకులు థియేటర్ల వైపు గతంలో వచ్చేవారు. అయితే రాను రాను చిత్రాల స్థాయి తగ్గడంతో ప్రేక్షకులు సినిమాలు చూడడంలో కాస్త వెనుకడుగు వేస్తూనే వున్నారు. ప్రస్తుతం వస్తున్న చిత్రాల్లో మనసును కదిలించే ప్రాతలు, హృదయాన్ని తాకే నటన కొరవడింది. దానికితోడు టికెట్ల ధరలు పెరిగిపోవడం.. థియేటర్లలో అభిమానుల గోలలు, అల్లరి- కేకలు, పెడబొబ్బలు భరించలేక సామాన్య ప్రేక్షకులు సైతం సినిమాలకు దూరమవుతున్నారన్నది వాస్తవం. ఇప్పుడు సినిమాల వైపు ఎక్కువగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది విద్యార్థులు, యువతరం అభిమానులే నేటి సినిమాలకు ప్రేక్షకులనుకోవలసిందే. ఏదైనా చిత్రం విడుదలయినప్పుడు అభిమానులు చేసే హడావిడిని తీవ్ర స్థాయిలో చూపించే మీడియా కూడా ఈ విషయంలో హంగామానే సృష్టిస్తోంది. గోరంతను కొండంతలుగా చూపడం.. చెప్పడం వల్ల ప్రేక్షకుల ఊహాస్థాయిని పెంచడంలో ముందుంటున్నాయి. అయితే తీరా చిత్రం చూశాక, ప్రేక్షకులు ఊహించిన స్థాయి అందులో లేకపోవడంతో విస్తుపోతున్నారు. ఇక అభిమానుల విషయానికొస్తే ప్రదర్శనలు.. ర్యాలీలు, ఊరేగింపులు, అల్లరి, ఉత్సాహం చూడాల్సిందే. ‘మా అభిమాన హీరో చిత్రం సూపర్ డూపర్, అదుర్స్, బ్లాక్ బస్టర్.. సరికొత్త రికార్డు..’ ఇలా ఎవ్వరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు సొంత డబ్బాలు కొట్టుకోవడం పరిపాటి అయింది. మా హీరో గొప్పవాడు. ఆయన నటించిన చిత్రం బహుగొప్పదన్న భావం వారిలో కనిపిస్తుంది. అభిమానం అన్నది ఉండాల్సిందే. ఎవరూ కాదనలేరు. అయితే అభిమానానికి హద్దులుంటాయి అన్నది గ్రహించాలి. అభిమాన నటుడు నటించిన చిత్రం బ్లాక్ బస్టరే అయ్యిందనుకో ఆ అభిమానికి చిత్రం జీతమిస్తుందా? జీవితం ఇస్తుందా? అని యువతరం ఎందుకు ఆలోచించడం లేదు. అభిమాన హీరో చిత్రం కోసం హంగామా చేసేముందు ఒక్కసారి ఆలోచించాలి. భావి భారత పౌరులుగా మనమేం చేస్తున్నాం.. సినిమాలు చూస్తే చాలా? అభిమాన హీరో కోసం హంగామా సృష్టిస్తే ఏం లాభం? అన్నది అభిమానుల మనస్సులో మెదలాలి. అభిమానంతో విర్రవీగడం కాదు.. అదే అభిమానంతో యువత అడుగులు మంచి వైపునకు పరుగులు తీయాలి. తమ అభిమాన హీరోలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో భాగస్వాములు కావాలి. అప్పుడే వారి అభిమానానికంటూ ఓ విలువ, ఓ సార్థకత ఏర్పడుతుంది. ఆ దిశగా హీరోలూ తమ అభిమానుల్ని చైతన్య పరచాలి. ఆ దిశగా అభిమానులు అడుగులు వేస్తారని ఆశిద్దాం.

-ఎం.డి అబ్దుల్