మెయిన్ ఫీచర్

గమ్యంలేని టాలీవుడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అజ్ఞాతవాసి’కి ఎదురేలేదు..అంటున్నారు పవన్‌కళ్యాణ్ వీరాభిమానులు. వారి మాటల్లో అర్థం లేకపోలేదు. ప్రస్తుతం ఆయన రెండు పడవల ప్రయాణం చేస్తూ అటు అభిమానులను, ఇటు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరో వైపు రాజకీయంగానూ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా అందాలతార క్రేజీ గర్ల్ కీర్తి సురేష్, మరో గ్లామర్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’తో ఎంతో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ మరో రెండు చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎ.ఎం రత్నం నిర్మించే ఓ చిత్రంలో పవన్ నటించనున్నారు. మైత్రీ మూవీస్‌లో తెరకెక్కించే చిత్రానికీ ఓకే చెప్పేశారు. ఈ ‘అజ్ఞాతవాసి’ తర్వాత ముందుగా రత్నం నిర్మించే చిత్రమే సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలిసింది. ‘వేదాళం’ రీమేక్ ఇది. నేసన్ దర్శకత్వం వహించనున్నారు. జనవరి నుంచి ఈ చిత్రం మొదలవుతుందని వార్తలు వినిపించాయి కానీ, ‘వేదాళం’ కంటే ముందే మైత్రీ మూవీస్ నిర్మించే చిత్రం పట్టాలెక్కనుందట. సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. సంతోష్ చెప్పిన కథ పవన్‌కు బాగా నచ్చిందని, ఈ దశలో రీమేక్ కంటే స్ట్రయిట్ చిత్రం తీయడం బెటరని పవన్ భావించినట్లు తెలిసింది. ఇక త్రివిక్రమ్-పవన్ కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల తర్వాత ముచ్చటగా మూడో చిత్రంతో వీరిద్దరూ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

గోరు చుట్టుపై రోకలి పోటులా, అట్టర్‌ఫ్లాప్ చిత్రాలతో సతమతమవుతున్న టాలీవుడ్, ఇటీవల ప్రకటించిన నంది అవార్డుల ప్రకటనవల్ల చీలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. హీరోల వర్గాలు అనడంకన్నా వారసత్వ నటవర్గం విడిపోయి చిత్రసీమను భ్రష్టుపట్టించాలని, తమదే పెత్తనం అన్నట్లు ముందుకు సాగుతున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. పనికిమాలిన రాజకీయ వక్రబుద్ధులు సినీరంగంలో కనిపించడం అశుభసూచకమనుకోవలసిందే. మొన్న ‘అర్జున్‌రెడ్డి’ సినిమా వాల్‌పోస్టర్ చిన్నపాటి కుదుపు వేసింది. మహిళాలోకం, రాజకీయవేత్తలు, సినీ వర్గం, ప్రేక్షకులు (ముద్దు వాల్‌పోస్టర్) నిరసనలు వ్యక్తం చేశారు. పదిరోజులకే తస్సుమని ఆ చిత్రం ఈ కుదుపువల్ల మరో పది రోజులు ప్రదర్శింపబడి, చిత్రరంగం దృష్టిలో ఇరవై రోజుల బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ చిత్రం యూనిట్ విజయం సాధించామని పొంగిపోయింది. ప్రేక్షకులకు ఆ చిత్రం తుస్‌బాణమని తెలిసిపోయింది. నేడు భన్సాలీ ‘పద్మావతి’ చిత్రం ఉత్తరాదిన మంటలు రేపుతున్నది. దర్శకుడిని, కథానాయకను చంపుతామని, దేశం విడిచిపోవాలని, చరిత్రకు కళంకమాపాదిస్తున్నారని, క్షత్రియ జాతిని కించపరస్తున్నారని, చిత్రాన్ని విడుదలకానివ్వమనే నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయ. ఏమవుతుందో గమనిద్దాం. ఎన్‌టిఆర్ చిత్రం నిర్మించకముందే, మాటవరుసకు ఎన్‌టిఆర్ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరిస్తామని వర్మ కంపెనీ, బాలకృష్ణ వర్గం అభిప్రాయాలు వెలిబుచ్చడం ఆలస్యం- ఎనె్నన్నో విమర్శలు, వాగ్వాదాలు, వాదనలు, ప్రతివాదనలు, జోకులు, అభిప్రాయాల వెల్లువలు కదిలాయి. ఆయనపై చిత్రం నిర్మించడమంటే గర్వకారణమనుకోవలసిందే. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన నిస్వార్థ నాయకుడాయన. మంచి మంచి పథకాలతో ప్రజల కోసం నడుం కట్టిన ముఖ్యమంత్రి ఆయన. తెలుగుదేశం పార్టీలో మాత్రం వణుకు పుడుతుందనుటలో అతిశయోక్తి లేదనుకుంటాను. ఎందుకంటే ఆ చిత్రం ఎవరు నిర్మించినా కొన్ని వివాదాస్పద అంశాలను ప్రస్తావించి తీరాల్సిందే...ఏదిఏమైనా చిత్ర రంగ యుగపురుషుడాయన. ఎవరు చిత్రం నిర్మించినా అఖండ విజయం మాత్రం సాధిస్తుంది, తప్పదు. నిన్నటిదినం ‘బాలల చలన చిత్రోత్సవం’ మన హైదరాబాద్‌లో జరిగింది. సంఖ్యాపరంగా పలు దేశాలు పాల్గొన్నాయి. ఎనె్నన్నో చిత్రాలను ప్రదర్శించారు. బాల బాలికలను బలవంతంగా థియేటర్లకు రప్పించి వారి ఓపికను పరీక్షించారు. వద్దురా బాబు అనుకునేలా కుర్చీలకు అతికించి ఇబ్బంది పెట్టారు. మన టాలీవుడ్ అగ్ర దర్శకులకు, అగ్ర నటీనటులకు మన బాలల చిత్రం ఒక్కటి ప్రదర్శనలో కనిపించలేదన్న విచారం వుందా? చిన్న బాలల చిత్రం నిర్మించలేకపోయామని వేదన వుందా? హీరోయిజం చిత్రాలు, బ్లాక్‌బస్టర్ చిత్రాలు, వంద కోట్ల క్లబ్‌ని గొప్పలు చెప్పుకోవడం కాదు, కనీసం యాభై లక్షల్లో మంచి సందేశాత్మక బాలల చిత్రం నిర్మించడం చేత కాదా? డబ్బులు రావని బాధా? ప్రపంచ చలనచిత్రరంగం ఉత్సాహంగా బాలల చిత్రాలు నిర్మిస్తూ, గౌరవ ప్రతిష్టలు సంపాదించుకుంటుంటే మన టాలీవుడ్ ఆతిథ్యం మాత్రం ఇవ్వటం అవమానమనిపించదా? ‘మీ చిత్రాలేమైనా ప్రదరిశంపబడ్డాయా?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే తల వంచుకోవలసిందేనా? కోట్ల పారితోషికం, పెట్టుడు బిరుదులు భారమనిపించవా? తల కొట్టేసిన బాధ కనిపించదా? ప్రేక్షకులుగా మనకే బాధ వుంటే సినీ రంగానికి చీమ కుట్టినట్లు లేకపోవడం సిగ్గుచేటు, అవమానకరం కాదా? దేశభక్తి గురించి, సమ సమాజ స్థాపన గురించి, మంచి మర్యాద గురించి, ఉమ్మడి కుటుంబ ప్రేమల గురించి, ధైర్యసాహసాల గురించి పెద్దల యెడల చూపించవలసిన గౌరవం గురించి, అవినీతి నిర్మూలన గురించి, నిజాయితీ గురించి నీచ రాజకీయాల గురించి బాలల చిత్రాల ద్వారా ‘అవగాహన’ కలిగించలేరా? నరకడాలు, అర్ధనగ్న దుస్తులు అవసరమా? అవి సమాజ మంచికా, చెడు పెంచడం కోసమా అని ఎవరికి ఆలోచన రాదా? సంవత్సరం పొడుగునా చెత్త చిత్రాలేనా? వృద్ధులైనా హీరోయిజం చూపించవలసిందేనా? వస్త్రాలు కరవైనట్లు అరకొర దుస్తుల శృంగారం చూడవలసిందేనా? గెడ్డం, మీసాలతో బూచాడు ముఖ హీరోలను భరించవలసిందేనా? లేని భూతాలను వున్నట్లు చూపించడం, మూఢ నమ్మకాలకు వత్తాసు పలకడం కాదా? అసలు టాలీవుడ్ గమ్యం ఎటు వెళ్తుందో ఎవరైనా గమనిస్తున్నారా? పాపం ‘ప్చ్’ టాలీవుడ్ చివరకేమవుతుందో? చివరగా ‘నంది అవార్డల’ గురించి విశే్లషించుకుందాం. దేశానికి రబ్బరు స్టాంపులా రాష్టప్రతి, నిరుద్యోగ రాజకీయ నాయకులకు ‘గవర్నర్’ పథవులు, సంస్థలకు, ట్రస్ట్‌లకు, బోర్డు మెంబర్లు, సంస్థల చైర్మన్‌లుగా తస్మదీయులను నియమించడం మన పాలకులకు అలవాటే. ఆ సభ్యులకు తలలూపడం, చెప్పిన చోట సంతకాలు చేయడం తప్ప స్వంత నిర్ణయాలు వుండవు. ఆ సభ్యులందరికీ చిత్రాల స్థాయిపై అవగాహన వుండదు. హీరో వర్గం గురించి, వంశం గురించి, కోట్ల క్లబ్‌ల గురించి మాత్రం తెలిసికొని, వంశానికొక అవార్డు (కుటుంబ అవార్డులు) ఇచ్చులాగున తీర్మానించి, అవార్డులు ప్రకటిస్తారన్నది పచ్చినిజం. ప్రస్తుతం నంది అవార్డుల గురించి నిరసనలు, చర్చలు వాడిగా వేడిగా జరగడం మీడియాలో చూస్తున్నాం. టాలీవుడ్‌లో పలువురు అవార్డుల ప్రకటన తీరును తప్పుపడుతున్నారు, విమర్శిస్తున్నారు. అవార్డు కమిటీ మెంబర్లపై (జ్యూరీ సభ్యులపై) దుమ్మెత్తిపోస్తున్నారు. చిత్రంలో ఎక్కువమందిని నరికితే అది ఉత్తమ చిత్రమని, నరికిన హీరో ఉత్తమ నటుడని, నరికించినవారు ఉత్తమ దర్శకుడని, ఎవరు తక్కువ దుస్తులు ధరించి తమ అందాలను ప్రదర్శిస్తారో వారే ఉత్తమ నటి అని, భయంకరంగా కేకలు, పెడబొబ్బలు పెడితే ఉత్తమ విలన్ అని, బూతు సంభాషణలతో వికారపు చేష్టలు చేసిన వారే ఉత్తమ హాస్యనటుడని, చెవులు చిల్లులు పడేలా భయంకర శబ్దాలు వినిపిస్తే ఉత్తమ సంగీత దర్శకుడని, కీచుగొంతుకతో అది తెలుగా, తమిళం పాటనా అని అర్థం పర్థం కాని కేకలు వేసేవారిని ఉత్తమ గాయకులుగా ఎంపిక చేయడం.. నేడు జరుగుతున్న తీరు అదే. నేడు టాలీవుడ్ ఈ విధంగా దిగజారిపోవడం వింతేమీ కాదు. అవార్డు కమిటీ మెంబర్ల నియామకం రాజకీయ నీడలో జరుగుతుంది కనుక అది లోపభూయిష్ట ప్రక్రియగా భావించవచ్చు. సినీ రంగంలో పాతుకుపోయిన వారసత్వ నటులకందరికీ పక్షపాతం లేకుండా నంది అవార్డులు ప్రకటిస్తున్నారన్నది వాస్తవం. సుబ్బిరామిరెడ్డి అవార్డులు ప్రకటించినా, బుల్లితెర ఛానల్స్ ప్రకటించినా, ఇతర ఏ సంస్థలు ప్రకటించినా, వారసత్వ కుటుంబాలకు సమానంగా పంచుతారన్నది జగమెరిగిన సత్యం. నటన అంటే ఏమిటి? నటనంటే మనసును తాకాలి, చలింపజేయాలి. జ్ఞాపకాలలో నిలిచిపోవాలి, అదీ నటనంటే. అలాంటి నటన అవార్డులకు ఎంపికైన నటులవద్ద వుందా? నంది అవార్డులకు ఎంపికైనవారు పదిశాతం సంతోషంగా వుంటే మిగిలిన తొంభై శాతం కళాకారులు ఈ అవార్డుల ఎంపికను తూర్పారబడుతున్నారు. మరోవర్గం వారు నంది అవార్డుల ప్రక్రియను రద్దుచేస్తే మంచిదని సెలవిస్తున్నారు. చిత్రస్థాయిని అర్థం చేసుకోజాలని కమిటీని ఏర్పాటుచేయడం ప్రభుత్వ మొదటి తప్పిదం. పైరవీలకు లొంగి అవార్డుల కమిటీ అవార్డులు ప్రకటించడం రెండవ తప్పు. కోట్ల పారితోకాలు తీసుకునే కళాకారులు ఇలా అవార్డుల కోసం వీధిన పడ్డం మూడవ తప్పు. బాకాలూదే అభిమానులుండగా, కావలసినన్ని పెట్టుడు బిరుదులుండగా ఈ నంది అవార్డులు అవసరమా? గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న చిత్రానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్న గ్యారంటీ లేదే? ఏదో చెత్త చానల్‌వారు అవార్డు ఇస్తే నంది అవార్డు తప్పక ఇచ్చితీరాలని రూలేమైనా వుందా? మరి ఈ కాకా అవార్డులు, పైరవీ అవార్డులెందుకు? మంచి చిత్రాలు నిర్మించి చక్కని నటన రాబట్టండి, అవార్డులు వెదుక్కుంటూ వస్తాయి. కళాకారులందరూ తమ తమ నటనా స్థాయిని పెంపొందించుకోవలసిన అవసరమెంతైనా వుందా? నటనే రాని, నటనకు పనికిరాని వారసుల ఎన్ని చిత్రాల నిర్మించినా బూడిదలో పోసిన పన్నీరే. హావభావాలు ప్రదర్శించడం మొదట నేర్చుకుంటే నటన దానంతట అదే వస్తుంది. కనుక అవార్డులను మరచిపోవడం మంచిది.
అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కేంద్రం తరఫున ‘ఊర్వశి’ (దేశ ఉత్తమ నటి) అవార్డు నటీనటులకు, భరత్ అవార్డు దేశ ఉత్తమ నటులకు ఇచ్చేవారు. కీ.శే. భారతరత్న ఎంజిఆర్ నటించిన ‘రిక్షాకరన్’ చిత్రానికి (తెలుగులో రిక్షారాముడుగా విడుదల చేశారు) భరత్ అవార్డు ప్రకటిస్తే- ‘నా అభిమానుల ఆదరణే నాకు ముఖ్యం, నాకు ఏ అవార్డు వద్దు’ అని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అదీ గొప్పతనమంటే. అవార్డు ఇస్తున్నామంటే ఆయన వద్దన్నారు. ప్రస్తుతం మాకు అవార్డు రాలేదని మన టాలీవుడ్ వారి ఏడుపు.. ఎంత గుణ వ్యత్యాసమో పాఠకులు, మీడియా, టాలీవుడ్ రంగం యోచించాలి.

-మురహరి ఆనందరావు