మెదక్

మెతుకుసీమను ముంచిన వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 26: నాలుగు రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు మెదక్ జిల్లాను నిలువునా ముంచాయి. ఎండిన జలాశయాలకు జలకళ వచ్చిందన్న సంతృప్తి మినహా కురిసిన వర్షాలతో అన్ని వర్గాల వారు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియడంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలకు వరదపోటును ఎదుర్కొన్నాయి. పూర్తిగా ఎండిపోయి ఎడారులను తలపించిన సింగూర్ ప్రాజెక్టు, మంజీర బ్యారేజ్, ఘన్‌పూర్ ఆనకట్ట, నల్లవాగు ప్రాజెక్టులతో పాటు అన్నసాగర్, మేలిగిరిపేట, మల్కాపూర్ తదితర పెద్ద చెరువులన్ని పొంగి ప్రవహిస్తున్నాయి. వ్యవసాయం, రోడ్లు, జలాశయాలు, ప్రాణ నష్టం, పశువుల నష్టం, ఇండ్లు నేల మట్టం తదితర రకాలుగా మొత్తం 173.44 కోట్లపైచీలుకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా సేకరించిన అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా నష్టం మరో రెండు రెట్లు ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మెట్ట పంటల సాగుకు పెట్టింది పేరైన మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆరుతడి పంటలను అల్పపీడనం ఆగాధంలోకి నెట్టింది. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొని చేసిన అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పత్తి, మొక్కజొన్న, వరి రైతులు ఈ యేడాదైనా ఊరటలభిస్తుందని ఆశించినా తుపాన్ సంభవంతో నీరుగారిపోయింది. ప్రస్తుత మెదక్ జిల్లాలోని 46 మండలాల్లో భారీ వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 939 గ్రామాల ప్రజలు తుపాన్‌తో అవస్థలు పడ్డారు. 42 వేల మంది రైతుల కుటుంబాలను కుంభవృష్టి కుదేలు చేసింది. 53377 హెక్టార్లలో మొక్కజొన్న, పత్తి, వరి, సోయాబీన్, మినుము, కంది, ఉద్యాన పంటలైన కూరగాయల తోటలకు పెను నష్టం సంభవించింది. అధికారుల అంఛనా ప్రకారంగా 48.47 కోట్ల మేరకు పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొంటున్నా మరో రెండు మూడు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు. జిల్లాలోని వివిధ గ్రామాలు, పట్టణాల్లో మొత్తం 10895 నివాసపు ఇండ్లు వర్షానికి దెబ్బతిన్నాయి. ఇందులో 418 పక్కా ఇండ్లు నేలమట్టమైనట్లు అధికారులు దృవీకరిస్తున్నారు. 10477 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పూర్తిగా, పాక్షికంగా ఇండ్లకు 9.42 కోట్లపైచీలుకు నష్టం సంభవించిందని అధికారులు లెక్కలు కట్టారు. ఇండ్లు కూలి, జలాశయాల్లో మునిగి మొత్తం 14 మంది మరణించగా 12 మంది బలంగా గాయపడగా ఇద్దరు స్వల్పగాయాలకు గురయ్యారు. ఒక వ్యక్తి జాడ లేకుండాపోయింది. 6030 పశువులు ప్రాణాలు వదిలిపెట్టగా ఇందులో 30 మేలురకం పశువులుకాగా 6 వేల కోళ్లు మృత్యువాత పడినట్లు గుర్తించారు. పంచాయతీరాజ్ రోడ్లు 39.54 కోట్ల మేరకు నష్టాన్ని చవిచూడగా 67.50 కోట్ల మేరకు ఆర్ అండ్ బి రోడ్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో మొత్తం 7726 జలాశయాలు ఉండగా ఇందులో 6544 పూర్తిస్థాయిలో నిండుకున్నాయి. వరద తాకిడితో 43 చెరువులు, కుంటలకు గండ్లు పడగా 131 జలాశయాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. జలాశయాలకు మొత్తం 8.50 కోట్ల నష్టాన్ని చవిచూసాయి. అధికారులంతా క్షేత్రస్థాయికి చేరుకుని పంటల నష్టాన్ని అంఛనా వేస్తే మరింత పెరిగే అవకాశం లేకపోలేదని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రకృతిని నమ్ముకుని భూములను కౌలుకు తీసుకుని సాగు చేసిన వివిధ పంటలు వర్షార్పణం కావడంతో కౌలు రైతులు దిగులు చెందుతున్నారు. ప్రకృతి కనె్నర్ర జేసిన వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో నష్టాలను చవిచూస్తున్న అన్నదాతల్లో ఆశలు పెరుగుతున్నాయి. ప్రధానంగా కౌలు రైతులనే ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వం చెల్లించే పరిహారాన్ని భూ యజమానులకు కాకుండా తమకే చెల్లించాలనే వత్తిడి రాష్ట్ర ప్రభుత్వంపై పెరుగుతోంది. మొత్తంమీద మెతుకుసీమను అల్పపీడనం వానలు అతలాకుతలం చేసి తేరుకోవడానికి కూడా వీలులేకుండా బీభత్సం సృష్టించాయని చెప్పవచ్చు.