స్పాట్ లైట్

సూకీ మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైన్మార్‌లో రాజుకుంటున్న రోహింగ్యా శరణార్థుల వ్యవహారం సమస్య స్థాయిని దాటి మానవనీయ సంక్షోభంగా పరిణమిస్తోంది. దాడులకు తాళలేక, ఆదుకునే వారంటూ లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్న రోహింగ్యాలకు దిక్కూమొక్కూ ఏమీ కనిపించడం లేదు. ఈ విషయంలో మైన్మార్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఈ సమస్యపై దృష్టి పెట్టడానికి ప్రపంచ నాయకత్వం ముభావంగా ఉండడానికి కారణం ఏమిటి? ఇటీవలే పూర్తిస్థాయి స్వాతంత్య్రాన్ని సంతరించుకుని, సైనిక పాలననుంచి విముక్తమై ప్రజాస్వామ్య పథంలో అడుగుపెట్టిన మైన్మార్‌లో రాజుకున్న ఈ సమస్య పెనుమంటగా మారుతున్నా ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదన్నదని విస్మయాన్ని కలిగించేదే. ఇందుకు కారణం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ఆంగ్‌సాన్ సూకీని ఇరకాటంలో పెట్టినట్టే అవుతుందని ఈ దేశాలు భావించడంగానే కనిపిస్తోంది. పైగా ఇప్పటికే మైన్మార్ సైనిక పాలకులు ఆంగ్‌సాన్ సూకీ నాయకత్వాన్ని గౌరవించి తమ అధికార పరిధినీ తగ్గించుకున్నారు. ఏ మాత్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా అటు మైన్మార్ సైనిక పాలకులను సూకీ సారథ్యంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్టే అవుతుందన్నది ఈ దేశాల ఆలోచనగా కనిపిస్తోంది. పరిస్థితి అదుపు తప్పుతున్నా సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మరింత గట్టిగా చెబుతున్నా మైన్మార్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం తీవ్రస్థాయిలో దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇటు భద్రతా దళాలకు, అటు మిలిటెంట్లకు మధ్య జరుగుతున్న కాల్పుల్లో వందలాది మంది మరణించారు. వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగున ఉన్న బంగ్లాకు పరుగులు పెట్టారు. ఇప్పటికే ఈ సమస్య అదుపుతప్పి మానవ సంక్షోభంగా మారింది. పిల్లలు, మహిళలు అన్న తేడా లేకుండా ప్రత్యక్ష నరకానే్న అక్కడ పౌరులు చవిచూస్తున్నారు. మితిమీరిన స్థాయిలో ఉగ్రవాద నిరోధక చర్యలకు ప్రభుత్వ దళాలు పాల్పడడం వల్లే ఈ రకమైన పరిస్థితి తలెత్తింది. సమస్య స్థాయితో నిమిత్తం లేకుండా భారీ పరిమాణంలో సైనిక శక్తిని ఉపయోగించడంవల్ల అమాయక రోహింగ్యాలు అల్లాడిపోయారు. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంలో ఆంగ్‌సాన్ సూకీ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడం ఆమె నాయకత్వ పటిమకు శరణార్థుల విషయంలో వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రస్తుతం మైన్మార్ విదేశాంగ మంత్రిగా ఉన్న సూకీకి అంతర్జాతీయంగా విశేషమైన పలుకుబడి ఉంది. రోహింగ్యాలను ఆదుకునే విషయంలోనూ మానవీయ కోణంలో వారికి సాయం అందించడంలోనూ ఆమెకు గురుతర బాధ్యత ఉంది. తమ సైనికులు అరాచకాలకు, అకృత్యాలకు పాల్పడుతున్నా రోహింగ్యాలు వేల సంఖ్యలో తమ ప్రాంతాలను వదిలి పారిపోతున్నా సూకీ ఎందుకు పట్టించుకోవడం లేదన్నది దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పైగా ఈ రోహింగ్యా శరణార్థుల సమస్య తమ పాపం కాదంటూ మైన్మార్ చేతులు దులిపేసుకోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించే విషయంలో థాయ్‌లాండ్‌లో జరగనున్న సమావేశానికి హాజరయ్యే విషయంలోనూ స్పష్టమైన సంకేతాలు అందించలేదు. ఈ సంక్షోభానికి మూలం తామేనన్న ఆరోపణలను తిరస్కరిస్తున్నామని చెబుతున్న మైన్మార్ నేతలు పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారన్నది అర్థం కావడం లేదు.
గతంలో ఐరాస సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ సారథ్యంలో ఏర్పాటయిన కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయాల్సిన బాధ్యత మైన్మార్ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ముఖ్యంగా రోహింగ్యాలకు దేశంలో పౌరసత్వాన్ని కల్పించే విషయంలో అనేక సిఫార్సులను అన్నన్ కమిషన్ చేసింది. కేవలం తాము మెజార్టీ సంఖ్యలో ఉంటున్న రఖీనా రాష్ట్రానికే వీరి కదలికలు పరిమితం కావడంపైనా ఆ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వీరికి అన్ని రకాలుగానూ ప్రజాస్వామ్య హక్కుల్ని, పౌరులకు లభించే ప్రయోజనాలనూ కల్పించాలని కోరింది. వాటిని పెడచెవిన పెట్టడం వల్లే రోహింగ్యా సంక్షోభం తలెత్తింది. పౌరులకు కనీస హక్కులు లేకుండా ఓ వర్గాన్ని ఎవరికీ చెందనిదిగా దశాబ్దాలు భావించడం వల్ల ప్రజస్వామ్య విలువలు మరింత తరిగిపోతాయే తప్ప మెరుగుపడవు. సైనిక పాలకుల్ని ధిక్కరించి ప్రజాస్వామ్యమే పరమార్థంగా భావించిన సూకీ ఈ విషయంలో మార్గనిర్దేశన చేయాలి. కేవలం ఎన్నికలు జరిగినంత మాత్రాన దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా వచ్చేసినట్టు కాదు. ఈ ఉన్నత పాలనావ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలు అమలు అయితేనే సార్థకత. రోహింగ్యా తదితర మైనార్టీలు దిక్కూమొక్కూ లేకుండా దీనావస్థలో ఉన్నంత కాలం మైన్మార్ ప్రజాస్వామ్య లక్ష్యం నెరవేరినట్టు కాదు.

బి.రాజేశ్వర ప్రసాద్