తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

‘పాలెం’ గ్రామంలో అక్షరాల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాసయోగ్యం కాని ఊరు పర దేశం వంటిది. దాని మీద ఎలాంటి మమకారం ఉండదు. గ్రామీణ భారతం వదిలి నగర భారతంవైపు ప్రజలు కదిలి పోవడం కలచివేస్తున్నది. అది వెనుదిరగని కదలిక కావడం మరీ బాధాకరం. మంచి బతుకుకోసం కాదు. బతకలేక గ్రామసీమలను నిరాకరిస్తూ తరలిపోవడం మంచి సూచన కాదు.
నగరానికి వచ్చినవారు అక్కడా బతకలేక పర దేశాల బాట పట్టడం ఒక కొనసాగింపు. పేదలు ముస్లిం దేశాలకు, ధనికులు యూరప్ దేశాలకు వలస.
ఊరునుండి ఓసారి కాలు జారినవాడు ఏ స్థాయి దేశానికైనా దిగజారగలడు. డబ్బు వ్యామోహం కాదిక్కడ. కన్నతల్లి లాంటి ఊరిని గౌరవించలేని వాడికి ఏదో ఓ స్థాయిలో పరదేశమే తన ప్రస్థాన కేంద్రం. ఊరు విడిచి రావడం అనే పాప భీతి వెన్నాడుతుంటే దత్తతల ప్రాయశ్చిత్తం వైపు చూపు మరలిందిప్పుడు. నలభై ఐదేళ్ళ క్రితం ప్రారంభమై, ఇరవై ఐదేళ్ళ నుండి ముమ్మరమైన నగరానికి తరలిపోవడం, ప్రమాదకర పరిస్థితి ఒకటి దేశవ్యాప్తంగా ద్విగుణీకృతమైంది. నగరం గాజుబుడ్డి ఫెళ్ళున పగలకముందే, మురికివాడలు నగరాలను ఢీకొట్టకముందే తిరిగి గ్రామాలవైపు దృష్టిమళ్ళించాలనే ఆలోచన మొదలైంది. కాని అది సినిమా స్టంట్‌తో మొదలైంది. కేవలం పరిశుభ్రత కాదు. స్వతస్సిద్ధమైన పల్లె వాతావరణం వెల్లివిరియాలి. స్వావలంబన పెరగాలి. పల్లెనుండి తరలినవాడు పల్లెలో ఉండి పల్లెను దత్తత తీసుకోవాలి. అది నిజమైన దత్తత. పల్లెని ఇతరుల పెంపకానికి వదిలి, తాను దత్తత తీసుకున్నాననే వాడు కపటి. పల్లెల జీవ వాతావరణాన్ని కాపాడడమే శుభ్రత. అలాంటి శుభ్రతని తిరిగి తేవడమే దత్తత లక్ష్యం. మడులలో పత్తి, పొగాకు పంటల రసాయన విధ్వంసం. బడులలో పరభాషా నుడుల దురాక్రమణ. వాటిని ఆపలేనివారు పల్లెలకు ఏం చేస్తారు? పల్లెలలోని ప్రజల ఉమ్మడి చెరువుల్ని, అదరువుల్ని, బహిర్భూముల్ని, ఆట స్థలాలను, పండగ మైదానాలను ఆక్రమించిన వర్గాలు ఇవ్వాళ దత్తత వేలంవెర్రితో, కొలావెరి పాట అందుకున్నారు. ఆ గాలి ఇన్‌స్టంట్ స్టంట్ వంటిది. రావలసిన కావరేజి వచ్చాక ఇక దత్తత గురించి ఇంత లోతు ఆలోచన ఏమిటి?
ఓవైపు రైతులు, నిరుద్యోగులు, వివిధ వృత్తులవారు చచ్చిపోతుంటే దత్తు పెత్తందారులు పల్లెకి దిద్దే మెరుగులు ఏవై ఉంటాయి?
గ్రామాలకి తరలండి అన్నవాళ్ళు ఇవ్వాళ నగరాలలో హాయిగా పల్లెల్ని మరిచి బతుకుతున్నారు. గ్రామాల రక్తకణాలలో, ఆత్మలో, బుద్ధిలో కలిగే మార్పుల్ని అంచనావేయకుండా వీరి కళ్ళముందు కీర్తికండూతి, స్వీయ మానసికానందమే కదలాడుతున్నది. దీనివల్ల వాళ్ళకి పల్లెల్లో అసలు ఏం జరుగుతుందో కూడా అర్ధంకావడం లేదు. మార్పు నిరంతరం అన్న సూత్రానికి అర్ధం తెలిసి వక్రభాష్యం చెప్పే ప్రగతివాదులకి ఎవరేమి చెప్పగలరు.
అందుకే ఇలాంటి శక్తులు నగరాలు, పట్టణాల బాటపట్టగా పల్లెసీమల్లో ఎన్నికల పార్టీలు ఇళ్ళల్లో, వాడల్లో, వార్డుల్లో, పంచాయతీల్లో తిష్టవేసుక్కూర్చున్నాయి. ఈ విష చక్రబంధనాల్లోంచి ప్రజలను రక్షించేవారు కరువయ్యారు. పర్యావరణ జీవధాతువులు ఇంకిపోగా మొండి బతుకులు బండబారిపోతున్నాయి. నగరాల పట్ల ఆకర్షణ వలయాలు నిరంతరం విసరబడుతున్నాయి. దానినుండి తప్పించుకోవడం ఏ రంగానికీ అంత సులభంగా సాధ్యం కాదేమో.
కాని ఇందుకు భిన్నంగా-
సెప్టెంబర్ 17 తేదీన జరిగిన ఒక సాహిత్య సంఘటన ఒక ఆశ్వాసన ఇస్తున్నది. దాని గురించే ఈ వారం తొవ్వముచ్చట్లు.
గత కొద్దికాలంగా అప్రతిహత నగరం సాహిత్య కేంద్రమైంది. పల్లెల్లో, మండలాల్లో, జిల్లాల్లో ఉన్న రచయితలు తమ పుస్తకాలను నగరాల్లో, రాజధానుల్లో ఆవిష్కరించుకుంటున్నారు. ఎందుకు అలా జరుగుతుందో స్పష్టంగా చెప్పలేం. కాని అదే జరుగుతోంది. తమకు నచ్చే సాహిత్య పెద్దలు దూరంగా ఉండే ఊళ్ళకు రాలేకపోవడం కావచ్చు. కొంతమంది ప్రగతివాద కవులు, నేతలు ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి కావచ్చు. అన్ని రంగాలలో కానవచ్చే నగర ఆకర్షణ కావచ్చు. లేదా మీడియా కవరేజికోసం కావచ్చు. పల్లెనుండి కలాలు కూడా నగరం వైపే దారి తీస్తున్నాయి.
అలా కాకుండా నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ పిజి కళాశాలలో తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్న డా.బెల్లి యాదయ్య మాత్రం తన అతి కొత్త పుస్తకాలను తన స్వగ్రామమైన నకిరేకల్లు మండలంలోని 3పాలెం గ్రామంలో ఆవిష్కరించుకున్నాడు. ఐదు కవితా సంకలనాలతో విలక్షణ కవితా ధోరణితో తనదైన పేరుతోపాటే శైలిని కూడా సంపాదించుకున్న యాదయ్య స్వతహాగా పల్లె ప్రేమికుడు. మొన్న ఆవిష్కరించుకున్న పుస్తకం పేరు ‘‘మా ఊరు అట్లా లేదు’’. తన పాత స్నేహితులు, ఊరి పెద్దలు, తన విద్యార్థులు, తమ తండ్రి సంస్మరణ కోసం వచ్చిన బంధువుల మధ్య పుస్తకావిష్కరణ జరుపుకొన్నాడు. కవిత్వానికి పాఠకులు తగ్గుతున్నవేళ, ఆ వేళ వందలాది మందికి కొందరు వక్తలు చదివి వినిపించిన కవితలు చక్కగా చెవికెక్కాయి. సాహిత్య విమర్శకులకు తట్టని అంశాలు కొందరు వెలిబుచ్చడం ఒక వింత.
యాదయ్య తన ఊరిని సహజంగా ప్రేమించడానికి కారణం- ఊరితో అనుబంధాన్ని కోల్పోకపోవడమే. కుటుంబం కావచ్చు. గత జీవన మాధుర్యం కావచ్చు. చిన్నతనపు స్నేహాలు కావచ్చు. వాటిని ఏ కోశాన విస్మరించలేదు. ఊరిలో దూరాలు ఉన్నాయి. కాదనలేం. కొన్ని వర్గాల కవుల లాగా ఊరి బతుకులో చేదు అనుభవాలు కొన్ని ఉండవచ్చు. దూరాలే కాదు, వాటికి మించిన అంటరాని తనపు అనుభవాలూ ఉండవచ్చు. అంతమాత్రంచేత నగరాల్లో కూచుని ఊరిని పూర్తిగా తలవకపోవడం సరైనదేనా అని ఆలోచించాలి.
కుటుంబం, కులం, బంధువులు... తన మూలాలు పుష్కలంగా ఉన్న కన్న ఊరిని తృణీకరించడం పునరాలోచించాల్సిన విషయం. తన విద్యవల్ల, వివేకంవల్ల, చేతన వల్ల, రాజకీయాలవల్ల, ఆర్థిక తదితర హోదావల్ల వాటిని తగ్గించే ప్రయత్నం చేయలేకపోవడం ఒక లోపం. ఇవ్వాళ ఆనాటి ఊరి నమూనాలోనే నగరం రూపుదిద్దుకుంటున్నదనే వాస్తవం గుర్తించిననాడు ఊరిని మరింత ప్రేమిస్తాం. ఆ చిన్న బతుకు కేంద్రాన్ని వాసయోగ్యం చేయలేకపోవడం జీవితంలో ఎప్పుడో ఓసారి గుచ్చుకోకపోదు.
3పాలెం2 ఊళ్ళో పుస్తకం విడుదల సభ చూశాక రచయితలు ఇకముందు పల్లెల్లోని రైతులతోనో, మరణించిన అమరవీరుల కుటుంబ సభ్యులతోనో ఆవిష్కరింపజేయడం గురించి ఆలోచించాలి. వారి తరఫున మనం ఉన్నామనే భరోసా ఎలా ఇవ్వగలం. రైతూ రైతూ అని పదే పదే రాస్తే వారి తరఫున నిలిచినట్లు కాదు. వాళ్ళ చేతుల్లోకి భౌతికంగా మన అక్షరాలు పడాలి. కలాలు వారి చేతుల్ని ముద్దాడాలి. ఈ మిషపై ఊరిలోని సకల శ్రమజీవుల చేతి ఊపులతో వారి మనసు నిండాలి. సాహిత్య సభలు ఊళ్ళల్లో, దళిత వాడల్లో, మహిళా బీడీ కార్మికుల వాకిళ్ళల్లో జరిగిననాడు ఒక కొత్త శక్తి సాహిత్యానికి వస్తుంది.
ఇవ్వాళ సాహిత్యం, కళాసృజన నగరం కౌగిట్లోబంధి. దానికి విముక్తి, స్వేచ్ఛ ప్రకటించాలి. పాలకులకు కవులు, రచయితలు అడ్డా కూలీల్లా కనుపించేవేళ సాహిత్యానికి 3అంటిన ఈ మకిలి నుండి విముక్తి2గీతం పాడబడాలి. కలలుగన్న తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నవ నిర్మాణం మానవీయం కావాలని చాటిచెప్పడం పాడి కాదా. నగరాన్ని విస్తరించి గ్రామీణ సరిహద్దుల్ని మలిపేసి ఒక ఐక్యభావన నవగీతమై ప్రతిధ్వనించగలగాలి.
నగరాలు అల్ట్రా మాడరన్‌గా, స్మార్ట్‌గా తయారుకావడం, మనుషుల మధ్య ఉన్న దూరాలు మరింత పెరగడంకోసం దారితీయరాదు. పల్లె ఓపక్క, నగరం మరోపక్క సమతౌల్యంతో సాగిన్నాడే దేశం ముందుకు పోగలదు. ఏ ఒకవైపు భారం అధికమైనా ఆ కాడి కుంగుతుంది. ఆ మేడి కర్ర బద్దలవుతుంది. మోసే భుజం, నడుం విరుగుతుంది.
బెల్లి యాదయ్య వ్యసనాలు చాలా ఉన్నాయి. విద్యార్థినీ విద్యార్థులకోసం సభలు పెడతాడు. చెంచులకోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తాడు. నేనంటానూ ఆయనతో మీ పాలెం గ్రామానికి వారందరినీ ఓసారి తీసుకెళ్ళాలని. తరగతి బోధనతోపాటు దాని ముంగిట్లోనే. పల్లెపాఠం అర్ధతాత్పర్యాలు విప్పి చెప్పమని. అప్పుడు కాదా ఒక కొత్త సెలబస్ తయారు? అదేకదా కవి తయారుచేయవలసింది.
ఇప్పుడు కవులే కాదు. కవిత్వ బోధకులూ తయారవ్వాలి. పద్దెనిమిదో శతాబ్దపు తత్వ కవుల్లా భౌతికవాద భావ పునాదిని సమాజానికి అందించగలగాలి. సైన్సుకి, అభివృద్ధికి, రాబోయే దేశప్రగతికి ప్రామాణిక నిర్మాణంగా నిలవాలి. కవిత్వం విస్తరించడమే కాదు. అది పాఠకులకే కాదు, అక్షరాల్లో ఇతివృత్తమైన వారికి చేరాలి. ఈ విషయంలో కవి విస్తరణాకాంక్షతో పనిచేయాలి. అలా పనిచేయని కవులు, సాహిత్య సంస్థలు ప్రజలకు దూరం. ఒక అక్షరమే పల్లెని, పట్టణాన్ని కలిపి ఉంచే ఆధునిక శక్తి.
బెల్లి యాదయ్య ఆలోచన సమాజంలో మరింత విస్తరించాలి. ఆ కోణంలో యాదయ్య మరిన్ని పల్లె కార్యక్రమాలకు రూపకల్పన చేయడమే కాదు ఆలోచన రేకెత్తించే రచనలు కూడా చేయడం అవసరం.
**

జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242 jayadhirtr@gmail.com