తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

పటం కథల గుడారంలో కలుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపు పనె్నండు పటం కథల ప్రదర్శన. కథాగాన కార్యక్రమం. 3 గజాలనుండి 12 గజాల పొడవు వెడల్పుగల పటాలను హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని సిడాస్ట్ ఒక్క చోటుకు తెప్పిస్తున్నది. ఇలాంటి కార్యక్రమం మునుపెన్నడూ జరుగలేదు. పటాలు పుట్టిన వేలేండ్ల నుండి కూడా ఇలాంటి ఆలోచన ఎవరికీ రాలేదా? వచ్చికూడా ఒక చోట చేర్చి చూడాలని అనిపించలేదు.
ఎందువల్ల సాధ్యం కాలేదో?
కారణాలు బలీయంగానే ఉండి ఉంటాయి.
అలాంటి ఆ పటాల గురించి ఈ వారం మీతో..
సౌరంభం కేవలం చూపువరకే అయితే అది నిష్ఫలం. అర్థపర్థంలేని గొడవని సౌరంభంగా చూసేవాళ్లున్నారు. కాని ప్రతి సౌరంభం కొత్త ద్వారాలు తెరవాలి. కొత్త జ్ఞానానికి, కనీసం కొత్త సమాచారం అయినా అందివ్వగలగాలి. సౌరంభం ఆత్మతృప్తి కలిగించాలి. అట్టహాసం కారాదు.
చిత్ర పటాల సంప్రదాయం మనదేశంలోని ఆరేడు రాష్ట్రాలలో ఉంది. కాని తెలుగునేల మీద ముఖ్యంగా తెలంగాణలో ఈ వ్యవస్థ బలీయంగా ఉంది. సమాంతర పురాణాలు పటాలలో చిత్రించి ఉంటాయి. వీటిలో పోషిత కులం, ఉపకులం పుట్టుపూర్వోత్తరాలు ఉంటాయి. దేవతలు, దైవాలు ఈ కథలలో ఉన్నా వీరు చాలా భిన్నంగా కనుపిస్తారు. మార్కండేయుడు వీరభద్రుడు, కంఠమ మహేశ్వరుడు వంటివారు కొన్ని కులాల పుట్టుకకు కారకులు. బ్రహ్మ సృష్టికన్నా భిన్నంగా సృష్టి జరుగుతుంది. ఇందులో కులాలు, వృత్తులు, పరికరాలు ఎలా ఆవిర్భవించాయో పురాణ దృక్కోణం లోంచి కథలు ఉంటాయి. ఈ సమాంతర పటం కథలలో భౌతిక జీవితానికి సంబంధించిన కొన్ని కోణాలు ప్రతిబింబిస్తాయి. సామాజిక సంబంధాలను తెలియజేస్తాయి. ఐతే ప్రధాన స్రవంతి పౌరాణిక ఆధిపత్యాన్ని నిరసిస్తూ సమాంతర పౌరాణిక సృష్టి జరిగింది.
ఈ పటాలను ప్రదర్శిస్తూ కథాగానం చేసే పద్థతి ఆదివాసీలలో, దళితులలో, ఓబీసీ, వెనుకబడిన కులాలలో, ప్రస్తుతం సంపన్న శూద్రకులాలలో కూడ ఉంది. బ్రాహ్మణులకు విప్రవినోదులవారు అనే ఉపకులం ఉంది. కాని వీరిని బ్రాహ్మలు బతికించుకోలేకపోయారు. వీరు కనికట్టు, మాయాజాలంలో నిష్ణాతులు. ఇప్పుడు వారు గత దశాబ్దంలో చూస్తుండగానే అంతరించిపోయారు. బ్రాహ్మణేతర కులాలవారు పటం కథల సంప్రదాయాన్ని కొంతమేరకు కాపాడుకున్నారు. కాని ఈ మధ్య ఒక కొత్తతరం చిత్రకారులు కొందరు వచ్చారు. ఈ కళాకారులను గౌరవించి కాపాడుకోలేకపోవడం గమనించాలి. ఆవిధంగా సంప్రదాయం తరిగిపోతున్నది. కళాకారులు తగ్గిపోయారు. పటాలు వేసే చిత్రకళాకారులు ఇతర వృత్తులకు మారిపోతున్నారు. బందరు కలంకారీ చిత్రకారులు కొమ్ములవారి పటం వేసి ఇచ్చేవారు. కాని ఇప్పుడు బందరులో ఇలాంటి కళాకారులు ఎవరూ లేరు. వారు చీరెలకు ప్రింట్స్ వేసే పనిలో కూరుకుపోయారు. వారి తండ్రి తాతలు ఇలాంటి పటాలు వేసేవారని, ఆ సంప్రదాయం ఒకటి ఉండేదని ఇప్పటి వారికి అసలే తెలియదు. వరంగల్ జిల్లా చేర్యాలలో పటాలు వేసే నకాషీ చిత్రకారుల కుటుంబాలు ఉండేవి. వారు గత దశాబ్దకాలం వరకు పటాలు వేసి ఇచ్చేవారు. కాని ప్రస్తుతం వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఉన్నవారు లేపాక్షి విక్రయశాలకు చిన్నచిన్న బొమ్మలు గీస్తూ నగరాలకు వలస వెళ్లిపోయారు. అక్కడొకరు, ఇక్కడొకరు కొత్తవారు, చిత్రకళా కుటుంబాలకు చెందనివారు పటాలు వేయడానికి ముందుకు వచ్చారు. కాని వారికి ప్రోత్సాహం లేదు. పది గజాల పటం వేసినందుకు దక్కిన పారితోషికం చాలా తక్కువ. ఈ పటాలు వేయాలంటే పౌరాణిక భావన, ప్రతీకలు, పౌరాణిక వేషధారణ, తెలిసి ఉండాలి. పైగా ఎంతో సహనం కావాలి. సమయం వెచ్చించాలి. ఇంత చేసి ఒకపటం పూర్తి చేస్తే వీటిని చెప్పే కథకులు సరైన డబ్బులు చెల్లించలేకపోతున్నారు. అందుకే పాత పటాలతో ఫ్లెక్సీలు తయారు చేయించుకునే పరిస్థితి దాపురించింది. కథలలో కూడా చాలా మార్పు వచ్చింది. మూడు రోజుల కథ మూడు గంటలకు, ఐదు రోజుల కథ, ఏడు రోజుల కథ కొన్ని గంటలకే సరిపుచ్చుకునే పరిస్థితి వచ్చింది. కథ చెప్పాలంటే పటం తప్పనిసరి. అది వారి హక్కు. పటం లేకుండా కథ చెబితే అంగీకరించరు.
పద్మశాలీలకు కూనపులిపటం, గొల్లవారికి కొమ్ములవారి పటం, మాదిగవారికి డక్కలివారి పటం, పద్మనాయక ఆదివాసీ తెగకు పాండవుల వారి పటం లేదా కొర్రాజుల పటం ఉంటుంది.
ఇంకా ముదిరాజులకు కాకిపడగల పటం, మంగళ్లకు, అద్దంవారి పటం ఉంటుంది. చాకళ్లకు పటంవారు లేదా మూసయ్యల పటం, గంజికూటి వారికి బొమ్మల పలక ఉంటుంది. గౌడులకు రెండు పటాలు ఉంటాయి. గౌడ జెట్టీపటం, ఏనూటి పటం చూపుతూ దాదాపు ఒకే తీరుగా కథలని చెబుతుంటారు. వివిధ రూపాలలో వాటిని ప్రదర్శిస్తారు.
యాదవులకు మూడు కథలున్నాయి. తెరచీరల పటం, మందహెచ్చుపటం కొమ్ములవారి పటం, విడివడిగా ఉన్నాయి. వారు కాటమరాజు కథ చెబుతారు. ఈ మూలకథ ఒకటే అయినప్పటికీ కథాకథన రూపం, ప్రదర్శన విధానం కథాగాన శైలులు, ప్రదర్శించే పద్ధతులు మాత్రం వేరుగా ఉంటాయి.
వివిధ కులాలకి పటం కథలు చెప్పేవారిని ఉపకులాలని, అర్థకులాలని, ఆశ్రీత కులాలని పేర్కొంటారు. పేరు ఏదైనా అందరి బాధ్యత ఒకటే. వివిధ కులాల వారికి పురాణం, కులపురుషుని వృత్తాతం, ఉపకులం పుట్టుక గురించిన ప్రస్తావన తప్పక చెప్పాలి. అంతేకాకుండా కులం చరిత్ర, కులంవారి దత్తతలు, మరణాలు భూమి, సాంస్కృతిక హక్కుల వివరాలు వంటి వాటిని రాసి ఉంచుతారు. వారికి సంబంధించిన కుల, శాఖ, గోత్ర, కుటుంబ వివరాలను లిఖితపూర్వకంగా వీరు రాసిపెడతారు. వారిని తమ శిష్యులుగా, తాము వారి గురువులుగా పేర్కొంటారు. ఈ సంప్రదాయం ఇంకా సజీవంగా ఉంది.
ఐతే ఇప్పటివరకు ఈ వ్యవస్థలపై సమగ్రమైన పరిశోధన జరుగలేదు. ఒక్కో ఉపకులంపై కొంత అధ్యయనం, జరిగింది. దీన్ని ఒక బలీయమైన వ్యవస్థగా, అజ్ఞాత అంశంగా పరిగణించి పరిశోధన జరుపవలసి ఉంది. పాలకురికి సోమనాధుడి వంటివారు తమ రచనలలో ఒకటీ అర పేర్లను పేర్కొన్నారు. కాని ఇతర ప్రసిద్ధ కవులు, మార్గ రచయితల రచనలలో వీరి ప్రసక్తి శూన్యం. చూడబోతే వీరి చరిత్ర చాలా ప్రాచీనం. ఈ ఉపకులాల వద్ద పటాలు కాదు, రాగి శాసనాలు న్నాయి. కుల కథలకి సంబంధించిన తాళ పత్రాల గ్రంథాలు ఉన్నాయి. పాత కాగితాలు పుస్తకాలలో ఆయా గ్రామలోని తమ శిష్యుల వివరాలు రాసి ఉన్నాయి. వారు ఎప్పుడెప్పుడు ఎంత డబ్బు ఇచ్చారో కూడా తెలిపే దస్తావేజులు ఉన్నాయి. పైగా కాకపడగలవారి వద్ద, గర్రపు మల్లయ్యలవద్ద వెలుగుచూడని ప్రాచీన కుల చిహ్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయని ఉపకులాలవారందరికీ తెలుసు. కానీ చదువుకున్నవారికి, రెండు దశాబ్దాల క్రితం వరకు తెలియకపోవడం, తెలిసినా ఎక్కడా వాటి ప్రసక్తి చేయలేదు. నిజానికి వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి? నిరక్షరాస్యులకు, అంటరాని వారికి చదువు వచ్చు. చక్కటి దేశీ తెలుగులో కథలు చెప్పడం వచ్చు. దేశీ విలక్షణకళా ప్రదర్శన వీరి సొంతం. మార్గనాటక, సాంస్కృతిక సంప్రదాయాలకన్నా భిన్నమైన సజీవ కళా ప్రదర్శకులు వీరే.
ఉపకుల వ్యవస్థ, కుల వ్యవస్థలో ఒక విడదీయరాని భాగం. కుల నిర్మూలన ఏరీతిలో, ఏకోణంలో, ఏదో ఒక పద్ధతిలో జరగాలి. అలా జరగాలన్నా వీరి వివరాలను లోతుగా అధ్యయనం చేయవలసిందే. ప్రజల సాంస్కృతిక రూపాల మూలాల అధ్యయనానికైనా ఇవి ముఖ్యమే. వస్తువును పరిహరించి కళారూపం స్వీకరించి తిరిగి ప్రజల పరం చేయవలసిందే.
జానపద చిత్ర కళా వైశిష్ట్యత ప్రతిబింబించే ప్రదర్శన ఒక కొత్త అధ్యాయం. వారందరిని ఒకచోట కలవడం, చూడడం, ఒక గొప్ప అనుభూతి. భూస్వామ్య, మత, కుల వ్యవస్థల కళా సాంస్కృతిక పునాది నిర్మాణాన్ని అర్థం చేసుకుంటే, దాని పునాదిపై ప్రజా, ప్రగతిశీల రంగస్థల నిర్మాణాన్ని నిర్మించుకోగలం. కేవలం తిరస్కరించడం ప్రజలను అవమానించడమే. వారిని చైతన్య పరచకుండా వాటి గురించి చులకనాగా మాట్లాడడం ప్రజలను అవమానించడమే.
కొందరు విప్లవకరణీకులు మాత్రమే నాలుగు దశాబ్దాలుగా వాటిని తిరస్కరిస్తూ, ఆయా ప్రజావర్గాలకు దూరమయ్యారు. వీటిపై దృష్టి సారించిన పరిశోధకులని, పరిశోధనలని సైతం పక్కన పెట్టి వారు సాధించింది ఏమీ లేదు. అందుకే వారి సాంస్కృతిక రంగం యాంత్రికతకి లోనైంది. వారు తీవ్రమైన ఐసోలేషన్‌కు గురయ్యారు.
ప్రగతి ప్రజాస్వామ్య ఆలోచనా పరులు వాటిని చూసి, వస్తు రూపాలలోని సారాన్ని గ్రహించి, సమస్త ప్రజల సాంస్కృతిక రంగ నిర్మాణాన్ని పునర్ నిర్మించాల్సిన తరుణం. అందుకే పట్రపదర్శనల సౌరంభంలో పాల్గొనమని కోరుతున్నాను.

-జయధీర్ తిరుమలరావు jayadhirtr@gmail.com సెల్ : 9951942242