తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

చదువుల మర్మం చూద్దాం ఓసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజం అవసరాన్ని బట్టి విద్యావ్యవస్థ ఏర్పడుతుంది. వివిధ దశలలో సమాజం అవసరాలు సమకూరుతాయి. మారిన సామాజిక అవసరాలకు అనుగుణంగా సంస్కృ తి, విద్య ఉంటుంది. సమాజం అవసరాన్ని బట్టి సైన్సు ఆవిష్కరణలు జరగాలి. కాని ప్రస్తుతం సమాజం వేరు-శాస్త్ర ఆవిష్కరణ వేరు..వీటి మధ్య మార్కెట్‌లో చాలా అంతరం ఉంది. అంతర్జాతీయం అయినట్లే శాస్త్రావిష్కరణ దానికి అనుగుణంగా అనుబంధించి ఉంటున్నది.
ప్రస్తుతం సమాజంలో హెచ్చుతగ్గులు, పెరిగాయి. పైవర్గం అవసరాల మేరకే ఆవిష్కరణ జరుగుతున్న వేళ ఇది. కింది వర్గాల అవసరం ఏమాత్రం పట్టింపునకు నోచుకోవడం లేదు. పేదరికం, దారిద్య్రం ప్రబలుతున్న వేళ ప్రజలను సైతం మార్కెట్ వినియోగదారునిగా మార్చాలనే ప్రయత్నాలు ముమ్మరం కావడం గమనించాలి. అంతేకాని పేద ప్రజల జీవితాల్ని మెరుగు పరచడానికి శాస్త్ర సాంకేతికతలను వారి జీవన స్థాయికి తీసుకు రావాలని, అక్కడి నుండి వాటిని ఎదిగించాలన్న ఆశయం కానరావడం లేదు. వారి జీవితాలలో పెనవేసుకొని ఉన్న కొన్ని సాంకేతిక ఆంశాలు కూడ తరచూ విఫలం అవుతాయి. వారి జీవన స్థాయిని దెబ్బతీస్తుంటాయి. కరెంటు ఉత్పత్తి జరుగుతుంది. కాని పంటకాలంలో తరచు కోతలకు గురి చేస్తారు. కొత్త విత్తనాల కంపెనీలు వందలాదిగా మొలుచుకు వస్తాయి. ఎరువులు, రసాయానాలు పంటను చీడపీడలనుండి బయటపడేయలేవు.
వైద్యరంగంలో శాస్త్ర సాంకేతికతలు అభివృద్ధి చెందుతాయి, కాని వాటితో ప్రజలు మోసగించబడుతూనే ఉంటారు. నకిలీ విత్తనాల మాదిరే నకిలీ మందులు వారి బతుకుల్ని నిర్జీవం చేస్తుంటాయి. నకిలీ సృష్టి కోసం ఉపయోగపడేంతగా సైన్సు సాంకేతికతలు వారి జీవితాలను బాగు చేయడానికి సహకరించవు.
అసలు ఫెయిర్ అండ్ లవ్‌లీ వంటి క్రీముల తయారీలో ఉపయోగించే రసాయనాల వల్ల నష్టం జరుగుతుందని కొందరు నిరూపించారు. కాని నకిలీ ఫెయిర్ అండ్ లవ్‌లీ సరుకు గ్రామీణ, పట్టణ బస్తీ ప్రాంతాలలో విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతుంటాయి. ఈ రసాయనాల బారిన పడిన శరీరాలు అందం పెంచడం మాత్రమే గాని చర్మ వ్యాధులతో అందవిహీనం అవుతారు. అంతిమంగా చెప్పొచ్చేదేమంటే, మనిషికి ఉపయోగపడే జ్ఞానం మానవజాతి వినాశనానికి దారితీస్తుందంటే వ్యవస్థలు, మేధావులు చూస్తూ ప్రశ్నించలేక పోవడం విషాదం.
అసలు విషాదం ఏమంటే సామాజిక వాస్తవిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా విద్యావ్యవస్థ తనచుట్టూ ఉన్న ఇసుకలో తన తలని దూర్చి హాయిగా నిదురపోవడం.
ఏ విద్యావ్యవస్థ అయినా తమ దేశ ప్రజల అవసరం కోసం తపన పడాలి. కాని ఈ దేశం చేసుకున్న పాపం ఏమిటో గాని, చాలాకాలం చదువుకూ, సమాజానికి సంబంధం లేదు. మన చదువుల సారంలో శాస్త్ర జ్ఞానానికి తగిన చోటు కల్పించలేకపోవడం గుర్తించాలి.
విద్యవేరు.. సమాజం, ప్రజలు వేరు అనే అలోచనల వల్ల దూరం పెరిగింది. చదువుకు, ఫీజులకు, మాత్రం సమాజం నుండే డబ్బు కావాలి. కాని ఆ పెట్టిన డబ్బుకి జవాబుదారీతనం, విద్యావ్యవస్థ నుండి లభించదు. విద్య ఏనాడూ తన విధిని, పరమార్థాన్ని విప్పి చెప్పదు. విద్య అనే నిచ్చెన మెట్లు ఎక్కి నేలపై భాగంలో చేరడమే లక్ష్యం. అక్కడ త్రిశంకు స్వర్గం ఉంటుంది. మనిషిని దానిలోకి పంపడమే మన విద్యావిధానపు పరమోత్కృష్ట ధ్యేయం.
మనభాష, పాఠ్య ప్రణాళిక, మన ఉపాధ్యాయ వర్గం నేల మీద నడిచిన దాఖలాలు తక్కువ. ప్రాథమిక విద్య అక్షరాలతో ప్రారంభం అవుతుంది. ఆ అక్షరాలలోనే అసలు మతలబు దాగి ఉంది. ముప్పై ఆరుకి బదులు ఏబై ఆరుగా విస్తరిస్తాయి. అత్యధిక శాతం ఆ అక్షరాలు పిల్లలకి చెడ్డీలో మూత్రం పోయిస్తాయి.
ఆ తరువాత ఇరవై ఆరు అక్షరాలు విద్యార్థుల సంస్కృతికి, జీవితానికి, సామాజిక జీవన విధానానికి భిన్నమైన దృశ్యాన్ని అందిస్తాయ. అక్కడ అమ్మ ఉంటుంది. కాని ఆమె స్కర్ట్ ధరించి ఉంటుంది. పరాయి పండగల గురించి చెబుతారు. కాని అవి తనకు తెలియని పండుగలు. కొత్త ఏడాది ఉంటుంది. కాని అది యుగాది కాదు. ఈ కొత్త సంస్కృతి నేర్చుకోవడానికి ఎండలు మండే దశలో సాక్సులు, బూట్లు వేసుకోవాలి. గాలి ఆడకుండా టై కట్టుకోవాలి. బండెడు పుస్తకాలు మోయాలి. జీవితాంతం మోస్తుండాలి.
విద్య వినయం నేర్పాలి. కాని అది కసిని పెంచుతున్నది. విద్య వికాసానికి దారి తీయాలి. కాని ఆక్రోశానికి హేతువు అవుతోంది. విద్య జ్ఞాన సముపార్జనకు దారితీయాలి. కాని సమాచారం మొదటి గేటు వద్దనే ఆగిపోతున్నది. డబ్బున్న వర్గాల ప్రజలే అన్ని తరహాల విద్యావ్యవస్థలలో చేరే పరిస్థితి ఎలాంటి సమాజాన్ని నిర్మించగలదు?
ప్రపంచీకరణ అనంతర సమయంలో విద్య కొత్త మార్కెట్‌గా రూపొందుతోంది. తటస్త నవ్య సంస్కృతిని నిర్మిస్తోంది. దీన్ని పెప్సీకోలా చదువుల సంస్కృతిగా పేర్కొనవచ్చు. విద్యార్థి జ్ఞాన దృష్టితో కాకుండా, స్కిల్ ఓరియంట్ చదువుకోసం డబ్బును, కాలాన్ని, శక్తిని వినియోగిస్తున్నాడు.
ఈ దేశంలోకి ఆంగ్లేయులు వచ్చాక తమకు అనువైన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారని, అది వలసవాద విద్యావిధానమై భారతీయులను బానిసలుగా చేసిందని వాపోయే మేధావులు ప్రస్తుత విద్యావిధానం రాబోయే వందేళ్ల వరకు మానసిక బానిసలుగా ఉంచే ప్రయత్నాలను ఎందుకు వ్యతిరేకించలేదన్నది ప్రశ్న. ఎంతో కొంత ప్రగతి అభ్యుదయ శీలురే ఈ విధానాన్ని ఆచరణలో వ్యతిరేకిస్తున్నారు. కాని మరోవర్గం దీన్ని ప్రతిఘటించాలని అనుకోవడం లేదెందుకన్నది ఆలోచించాల్సిన సమయం. ఇక్కడే మనకు మన ప్రయాణం ఏదిశగా ఉండబోతున్నదో తెలుస్తుంది.
చదువులో నాణ్యత పెరిగిందనే వాదన ఒకటి ఉంది. కాని ఏది నాణ్యత? అధిక ఫీజు వసూలు చేసి నాసిరకం లేదా కృత్రిమ అవసరాల దృష్ట్యా నేర్చిన విద్యా? ఉద్యోగం ఖాయం చేసే విద్యా? తాను చదివిన విద్యని మార్కెట్ చేయగలిగే టెక్నిక్ చూపే విద్య నాణ్యమైనదా? ఆరోగ్యాన్ని దెబ్బతీసే నాణ్యమైన ఆహారం తినడం ఎవరి మెహర్భాని కోసం? మన పొట్ట నిరాకరించే అందమైన పొట్లాలలోని అహారం అవసరం లేదు. మన శరీర వ్యవస్థ నిరాకరించే విటమిన్ల ఆహారం మనకి అవసరమా?
పసితనానికి అపరిమిత తల్లిపాలు కాకుండా సుమోలను తయారు చేసే ద్రావకాలను తాగించాలని ఏ తల్లి అయినా కోరుకుంటుందా? విచిత్రం ఏమంటే మూడో తరగతి నుండే ఐఏఎస్ కోసం తర్ఫీదట! రెండో తరగతి నుంచే అమెరికాలో చదువుల క్యూలట!
విదేశాలలో తప్ప స్వదేశంలోనే ఉండి చదువుతాననే కోర్సులకు అవకాశం లేదు. ఇక్కడ ఉండి పోయే ఆర్థిక పరిస్థితులు కలిగిన విద్యార్థి లోకానికి కూడా పరాయి దేశాల సమాజాల ఉద్ధరణ కోసం మాత్రమే రూపొందించిన చదువులు చదవడం ఎందుకు? ఆ చదువుల రూపకల్పనే ధ్యేయంగా సమస్త ప్రభుత్వ యంత్రాంగాలు కలసికట్టుగా పనిచేస్తున్నాయి. ఈ బహిరంగ కుట్రలో భాగస్వాములను చరిత్ర బహిర్గత పరచగలదా అని సందేహం.
మీగడంతా ఒకరు తిని, పలచని పాలు మరొకరికి నీళ్లు చాలమందికి, ఇదీ మన విద్యా స్వరూపం. ఇదీ మన చదువుల సారం. దీనికి వత్తాసుగా ఇప్పుడు అమెరికాకు వెళ్లి చదువుకోవడం సరికాదు. ఈ దేశపు నల్లవాళ్లు, అభివృద్ధి చెందని మనలాంటి దేశాల విద్యార్థులతో తెల్ల దేశాలకు, తెల్లవారి దేహాలకు మురికి అంటుతున్నది. వారి పవిత్రత, వారి శుభ్రతలకు ముప్పు వాటిల్లుతున్నది. అందుకే మీ దేశాలలోనే మీ చేతులతోనే విశ్వవిద్యాలయాలను నడపండి. కేవలం సిలబస్‌ను మాత్రం మేం ఇస్తాం. వాటిల్లో మేం చెప్పినంత ఫీజులు కట్టి, మా నిబంధనల మేరకు నోరు మూసుకొని చదవండి అని అంటున్నారు. ఈ కొత్త దుకాణాలు మార్కెట్ తెరవడానికి రాజ్యాంగ బద్ధంగా సరే! అనండి. ఇప్పుడు అంతటా మన చదువుల తల్లి తెల్ల దేశాల పాఠాలలో బందీ అయ్యింది. వాళ్లకు ఎలాంటి సేవకులు కావాలో ఆ చదువే చదివించే, చదివే కాలంలో ఆ తరహా తర్ఫీదు, ఇప్పించి మా పౌరులుగా మిమ్మల్ని తయారు చేస్తాం మిమ్మల్ని అంటున్నారు. దేశం మీది. అక్కడ విశ్వవిద్యాలయాల పెత్తనం మాది అని అంటున్నారు.
మన పిల్లలు రూపాయలు సంపాదించారు. డాలర్లు పండిస్తారు. మహావృక్షాలు బోన్‌సాయి మొక్కలై మనముందే ఆ దేశాలకు, వాళ్ల జెండాలకు సలాములు చేస్తుంటారు. ఎవరు, ఏది ఎలా చదివినా మర్మం, జ్ఞానం, ఈ దేశ ప్రజలకి చెందాలి. కాని ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఎవరికి ‘లాయల్’గా ఉంటారు? ఎంత వద్దన్నా ఉద్యోగం ఇచ్చిన దేశాలకి, వారి జెండాలకి విశ్వాస పాత్రులవుతున్నాం.
ఇంతపెద్ద అవిశ్వాస తరాల్ని తయారు చేస్తున్నాం.
మొదటిసారిగా ఇప్పుడిప్పుడే భారతీయ విశ్వవిద్యాలయాలలోకి అడుగుపెట్టిన మన దేశ పుత్రులపై మనం కొన్ని అభాండాలు వేస్తున్నాం. చదువుకు అంతరాయం కలిగిస్తున్నాం. వారికి దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయడం ఏం ప్రయోజనం కోసం అని ఆలోచించాలి. నిజానికి ఇక్కడి ప్రజలకు సేవ చేసేది వారే.
పరదేశాలలో బానిసలుగా మారడానికి సిద్ధమైన వాళ్ళని వదలి ఈ దేశంలో, రేపు ఎలాంటి అననుకూల పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే సామర్ధ్యం గల వారిని దూరం చేసుకోవడం విద్యావంతులకి, విద్యా వ్యవస్థకి అంత మంచిది కాదు. ఆలోచనలు సంఘర్షించాలి. అని మన సమాజాన్ని ముందుకు తీసుకు పోవాలి. ఏక పక్ష ప్రవర్తన దేశానికి ప్రజలకు ఉపయోగపడదు, ఆలోచిద్దాం.

- జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242