తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఆమె ఒక్కర్తే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా. దామెర రాములు కొడుకు పెళ్ళికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. మొన్నటి 14వ తేదీ రాత్రి 9 గంటలకు ఒక మిత్రుని నుండి ఫోను, ఓ ఎస్సెమ్సెస్ వచ్చింది. ఓ టీవీ చానల్‌లో స్క్రోలింగ్- ‘వకుళాభరణం లలిత ఇక లేరు’ అని. ఒకవైపు కొత్త జీవితాలు ఒక్కటై అంకురిస్తున్న శుభతరుణం. మరోవైపు ఎనభై ఏళ్ళ క్రితం కళ్ళు తెరిచి ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొన్న ఒక వ్యక్తి మరణం. విచికిత్స మానవ నైజం. జీవన యానంలో ఎదురయ్యే ఇలాంటి సందర్భాల్లో మనుషుల ఆలోచనలు ఎందుకోగాని వాస్తవికం గా నమోదు కాలేదు. కాల్పనిక సాహిత్యంలో ము ఖ్యంగా కథ, నవల వంటి ప్రక్రియల్లో మాత్రమే చొరబడే అవకాశం ఉంటుంది. మనిషిలో చెలరేగే ఆలోచనలను ఉన్నదున్నట్టుగా తెలుగు రచయిత పట్టుకోలేదు. తనని తాను గొప్పగా ఊహించుకునే తత్వం వంటబట్టిన సంప్రదాయం కన్నా భిన్నంగా ఆలోచించలేని దౌ ర్బల్యం. వాస్తవానికి ఇలాంటి సందర్భాల్లోనే అసలు మనిషి బయటపడాలి. అందులో తప్పు లేదు. పరీక్షాకాలంలోనైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోగల శక్తి పుంజుకోవాలి. స్వీయ సెన్సారింగ్‌లో భాగంగా రచయిత చాలా విషయాలను గుర్తించనట్టు నటిస్తాడు. పాఠకులను విస్మృతికి గురిచేస్తాడు. ఇలాంటి విషయాలకు కనీస ప్రాధాన్యత ఇవ్వడు. ఇలాంటి కాలంలో, సందర్భంలో ఎవరైనా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. అది మామూలే. తీసుకున్న నిర్ణయం వెనుక గల మనోభావాల ఘర్షణ, ఆలోచనలను చెప్పడానికి జంకుతాడు. తెగింపు అనే మాట వాడను. కాని అలాంటి ఒక వాస్తవభావ ప్రకటన రచయిత, కళాకారుడు వ్యక్తం చేయడం అవసరం.
రెండువందల కిలోమీటర్లు ప్రయాణించిపొయేది పెళ్ళికే. పనిలో పనిగా నా లుగు కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాను. పదిమందితో కలిసిపోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇంతలో ఈ వార్త! లలితని ‘అమ్మ’ అనే అంటాం. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో ఉంది. ఆమెను వార్ధక్యం కన్నా జబ్బులు ఎక్కువ బాధించాయి. వీటన్నిటినీ గెలుస్తూ తన రచనా వ్యాసాంగంతో, ఆలోచనలతో వాటి మీద పైచేయి సాధిస్తున్నది. కొంతకాలంగా ఆమె అనారోగ్యంపై పోరాటం కొనసాగిస్తున్న ది. ఆరోగ్యం చేకూరి ఆ స్పత్రి నుండి ఇంటికి వచ్చి రాయబోయే పుస్తకాల గురించి అత్యవసర వైద్య విభాగంలోని ఆక్సిజన్ గొట్టాల మధ్య ప్రణాళికలు రచించింది. జీవి అన్నది పంచభూతాలలో కలవక మానదు. అలా కలసి తాను ఇంకా శక్తిమంతం అవుతానన్న విశ్వాసం లోలోన కలిగి ఉన్నది. పోరాడి గెలిచిన జీవితం ఆమెది. ఆమె జీవితాన్ని చాలెంజ్‌గా తీసుకున్నది. ప్రసిద్ధ చరిత్రకారుడు, ఆచార్య వకుళాభరణం రామకృష్ణతో ప్రేమ వివాహం చేసుకున్నప్పటి నుండి ఒక గట్టి పిండంగా ఎదిగింది. ప్రకాశం జిల్లాలో పుట్టి నెల్లూరు జిల్లాలో మెట్టి హైదరాబాదులో జీవించింది. కావలిలోని జవహర్ భారతి కళాశాలలో హిస్టరీ కాంగ్రెస్ సభలకి వెళ్ళిన నలభై ఏళ్ళ క్రితం నుండి వారిద్దరి పరిచయం.
ముందు రామకృష్ణ హైదరాబాదు విశ్వవిద్యాలయానికి వచ్చాక, ఆ తరువాత లలిత తెలుగు అకాడమికి డెప్యుటేషన్‌పై వచ్చింది. నేను ‘జానపద’ సంస్థ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్ని క్షేత్ర పర్యటనలకి ఆమె వచ్చింది. ఊరికే రావడం కాదు. ఆ కళాకారులతో, గ్రామ ప్రజలతో కలగలిసి పోయింది. మేం మళ్ళీ అటువైపు వెళ్ళినా, ఆ కళాకారులు హైదరాబాదు వచ్చినా లలిత గురించే అడిగేవారు. ఒక పరిశోధకురాలికి అంతకన్నా ఏం కావాలి? మేం గ్రామాల్లో ఏర్పాటుచేసిన సదస్సుల్లో ఆవిడ పత్రం సమర్పించేది. ఏ కళాకారులు, ప్రదర్శకులపై పత్రం రాశామో వారి మధ్య, వారి గురించి చదవడం కష్టం. ఎన్నో ప్రత్యక్ష అగ్నిపరీక్షలుంటాయి. అవన్నీ అవలీలగా దాటిపోయేది. పైగా వారి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి ఆమే. అలాంటి లలిత గారు మరణించారు. ‘మరణం చివరి చరణం’ (అలిసెట్టి) కాకపోయినా ఆమెని చివరిసారిగా చూడ్డానికే నిర్ణయించుకున్నాను. వధూవరులను తర్వాత ఎప్పుడైనా కలసి శుభాకాంక్షలు తెలపవచ్చు. అలా నిర్ణయించుకున్న క్షణం నుండి లలితగారి ఆలోచనలు ముసురుకున్నాయి.
1994లో వరంగల్ జిల్లా నష్కల్ గ్రామంలో చరిత్రలో మొదటిసారి ‘దళిత కళారూపాల వారోత్సవం’ ఏర్పాటుచేశాం. అన్ని రోజులూ ఆమె అక్కడే ఉంది. ఆమె ఏం తిన్నదో, ఎలా ఉన్నదో మేం ఆలోచించలేదు. ప్రతి ఉదయం చిరునవ్వుతో తయారై ఎప్పుడెప్పుడు పని ప్రారంభిద్దామా? అని చూసేది. ప్రతిసారీ క్షేత్ర పర్యటనలో మేం కొన్ని అననుకూల పరిస్థితులను ఎదుర్కొనే వాళ్ళం. వాటిని పసిగట్టి పరిష్కారాలలో పాలుపంచుకునేవారు. అక్కడి ప్రజలతో నెమ్మదిగా చర్చించి సమస్యలను పరిష్కరించేవా రు. ఆమె ఉంటే పెద్దమ్మ ఆసరాగా ఉండేది. ఆమెది చివరివరకూ వయసును మించిన ఉత్సాహమే. నిజానికి ఎ.పి. హిస్టరీ కాంగ్రెస్‌కి రామకృష్ణ, లలిత వ్యవస్థాపక సభ్యులు. రామకృష్ణది చరిత్ర శాఖ. లలితది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. చరిత్రకి ప్రధాన స్రవంతి అధ్యయనంతోపాటుగా సమాంతర స్రవంతి అధ్యయనం అవసరం అని భా వించే తాను ఒక భిన్నమైన పాయని ఎన్నుకున్నది. డక్కల వారి గురించి, దొమ్మరల వంటి ఎన్నో సమూహాల గురించి ఎన్నో పరిశోధనా వ్యాసాలు రాసింది, చదివింది. గుర్తింపునకు నోచుకోని ఆదివాసీలు, నేరస్థ జాతులు, మహిళలు, దేవదాసీలు, జోగినులు, సెక్స్‌వర్కర్లు వంటి సమూహాలు, వ్యక్తుల పైనే ఆమె దృష్టి. బాధితులు, తాడితుల బతుకులు, వారి చరిత్రని లిఖించడానికే ఆమె కలం అంకితం. సుప్రసిద్ధ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణపై మిత్రులతో కలసి పుస్తకం రాసినా ఆమెకి ప్రేరణ అయిన ఆయన కూడా ఇలాంటి దృక్పథం కలిగి ఉండడమే అనిపిస్తుంది. ఇతరులతో కలిసి జోగినులు, దేవదాసీలపై రాసిన పుస్తకాలు ఆమె పూనిక వల్లే వెలుగుచూశాయి. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు చేసేవారు ఎవరైనా ఉన్నారా? అని ఆలోచిస్తే సమాధానంగా చీకటే కానవస్తుంది.
చివరి చూపులో నేను ఆమెను మన్నించమని కోరుకున్నాను. ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. నా భుజం మీద చేయి వేసి- ‘దేనికైనా సమయం రావాలి. జానపద కళలు బతకాలయ్యా’ అంది లలితమ్మ. నాలుగేళ్ళ క్రితం రావలసిన ‘తెలుగు జానపద కళారూపాలు’ పుస్తకం సి.ఆంజనేయరెడ్డి గారు తమ ప్రచురణ సంస్థ ద్వారా అచ్చువేయడానికి అంగీకరించారు. కాని ఆ సంస్థ ఉద్యోగి శంకర్ పెట్టిన తిరకాసులు ఇన్నీ అన్నీ కావు. పదిసార్లకు ఒకసారి ఎత్తి ‘పనుల్లో ఉన్నామండీ’ అనేవాడు. లలితగారితో ఒకసారి మాట్లాడమని ఎన్నోసార్లు చెప్పా ను. పుస్తకం వాపస్ ఇవ్వడు, అచ్చు వేయం అనేవాడు కాదు. ఆ పుస్తకం అచ్చయితే తేలిక పడతాను. ఆ ప్రచురణ నన్ను సలిపినంతగా ఏ పుస్తకం ఇంత బాధ పెట్టలేదు. ఈ విషయం చివరిసారి చెప్పడానికైనా వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆ గిల్టీ జీవితాంతం వేధించేదే. ఆమెది తల్లి వంటి మనసు. కాబట్టి నన్ను అర్థం చేసుకుందని నా ధీమా. ఆమె పరిపూర్ణ మహిళ. ఇంటికి వచ్చిన వారికి ప్రీతితో అన్నం పెట్టేది. తాను అనారోగ్యంతో ఉన్న సమయాల్లోనూ ఆమె అన్నపూర్ణే. ఇప్పుడు అనిపిస్తుంది ఆమెలాంటి వారు వందలో ఒకరు. కాదు... ఆమె ఒక్కర్తే. *

-జయధీర్ తిరుమలరావు jayadhirtr@gmail.com సెల్ : 9951942242