తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

భయపడేవాడు రచయిత కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనెల 3న ‘నల్లవలస’- పెద్ద కవిత పుస్తకం- విడుదల చేస్తున్నానని, మీరు పాల్గొనాలని కె.శివకుమార్ అనే కవి అడిగాడు. అందుకు ఒప్పుకున్నాను. పుస్తకం ప్రెస్‌లో ఉందని, తదుపరి అందిస్తానని చెప్పాడు. కానీ, ఆ పుస్తకం సుంకిరెడ్డి నారాయణరెడ్డి, గుడిహళం రఘునాథం, కె. శివకుమార్ సామూహికంగా రూపొందించిన కవిత అని, 1998లోనే అది అచ్చయ్యిందని తెలిసింది. ఇప్పుడు శివకుమార్ తన ఒక్కడి పేర అచ్చేసుకుంటున్నాడని తెలిసింది. ఐనా వస్తానని మాట ఇచ్చాను. కాబట్టి వాస్తవాలు మాట్లాడడానికైనా వెళ్ళక తప్పదు. ఈలోగా సామాజిక మాధ్యమాలలో సుంకిరెడ్డి, స్కైబాబా, సంగిశెట్టి శ్రీనివాస్ బృందం కొన్ని పోస్టులు పెట్టారు. దానిలో ఒకవైపు- అసలు రచయితలు ఎవరు? అనే విషయంపై స్పష్టమైన కొన్ని అభిప్రాయాలను ఉంచారు. రెండో కోణంలో పుస్తకావిష్కరణ సభలో పాల్గొనకూడదు అని వక్తలకు సూచన చేశారు. సంగిశెట్టిగారైతే దీని వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అనుమానం కూడా వక్తలను సభకి హాజరుకారాదనే సూచనలో భాగమే. శివకుమార్ పక్షంలో ఎవరూ మాట్లాడక పోవడంవల్లనో లేదా వాటిని చూడకపోవడం వల్లనో, చూసి కూడా పట్టించుకోక పోవడంవల్లనో సామాజిక మాధ్యమాలలో చర్చ పక్కనపడింది. అట్లని వివాదం ముగిసినట్లు కాదు. ఎప్పటికైనా ఏదో ఒకటి తేలిపోవాలి. అదే మంచిది.
నిజానికి ‘నల్లవలస’ రచయితలు వారంరోజుల క్రితం వరకు అత్యంత సన్నిహితులు. రెండుమూడు దశాబ్దాలు కలసిమెలసి, ఒకే మంచం, ఒకే కం చంలాగ జీవించారు. వారి ‘రచన’కాలమందు వేరెవరికీ స్థానం లేదు. వారిది ఒక కవిత్వ బృందం. సామూహిక రచన, కవితా రచనలో చేర్పులు మార్పులు, ఎడిటింగ్, చరణాల చేర్పులు అంతా ఒక విలక్షణ వాతావరణం. ఓరోజు ఉన్నట్టుండి వారిమధ్య ఒక విభజన రేఖ! అది వారు కలిసి మాట్లాడుకుని నిర్ణయించుకోదగిన విషయం. అప్పటికీ తేలకపోతే ఎవరిష్టం వారిది. పుస్తకావిష్కరణ చేయమని అడిగితే ఒప్పుకొన్న సంస్థని తప్పుపట్టడం, అదే పనిగా ఫోనులు చేసి స్ర్తి, పురుష బేధం లేకుండా సతాయించడం సరికాదు. వక్తలను సభకు వెళ్ళకూడదని ఆంక్షించడం సైతం మంచి విషయం కాదు. వక్తల మీద ఒత్తిడి తెచ్చేకన్నా ఇరువురూ కూర్చుని తేల్చుకోవాల్సింది. ఇరువర్గాల రచయితలు పట్టుదలకు పోవడం అనవసరం. ఆ సభకి అధ్యక్షునిగా రావడానికి అంగీకరించాక, వివాదాస్పదం అయ్యిందని వెళ్ళకపోవడం సరైందేనా? ఎవరికో భయపడి వెళ్ళకపోవడం పిరికి చర్య అవుతుంది . మరి లోకం కళ్ళముందు రచయి త ధైర్యశాలి కదా! పాల్గొన వలసిన ముగ్గురు వక్తలు- మేం సభకు హాజరుకావడం లేదని సందేశాలు పెట్టారు. ఇక మిగిలింది నేనే. సుంకిరెడ్డి ఫోనుచేస్తే నేను వెళ్తాను. వాస్తవాలను సాహిత్య శ్రో తల ముందు ఉంచుతాను. ఒ క విషయం వివాదం అ యినప్పుడు దానిని తే ల్చడానికే ముందుకు రా వాలి. ఆ సభకి మీరూ రండి అన్నాను. వివాదాన్ని మరింత కాలం మురగబెట్టడం మంచిది కాదు. కేవలం మేం రాం అని చెప్పిన వక్తలు ఈ విషయం పట్ల తమ అభిప్రాయం వ్యక్తంచేసి ఉంటే బాగుండేది. లేదా శివకుమార్‌నే అడిగి తెలుసుకుని ఉంటే మరింత హుందాగా ఉండేది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తదుపరి మూడు సాహిత్య వివాదాలు తలెత్తాయి. సాహిత్య రంగంలో ఈ వివాదాలు ఎందుకు ఏర్పడ్డాయి? కర్తృత్వ వివాదాలు ఆదికవి నుండి ఇటీవలి ఆధునిక కాలం వరకు ఎగిసిపడుతున్నాయి. ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. మసిబూసి మారేడుకాయ చేస్తానంటే సాధ్యం కాదు. వివిధ స్థల కాలాలలో, దశలలో వివాదాలు తిరిగి తలెత్తుతాయి. వివాదం తలెత్తి వెంటనే సమసిపోవడం కూడా చూస్తాం. నిజానికి తెలుగు సాహిత్యంలో ఆర్థిక లాభాల కోసం, పాఠ్యం సొంతం చేసుకోవడం కోసమని జరగలేదు. ఆయా ప్రాచీన కవులు వారి కలంలో కర్తృత్వ వివాదం చెలరేగలేదు. ఆ తరువాతి కాలాలలో మాత్రమే వివాదమైందని గుర్తుంచుకోవాలి. తెలుగు సాహిత్యంలో ఎనభై శాతం ఉన్న సామూహిక జానపద/ ప్రజాసాహిత్యం వివాదగ్రస్తం కాలేదు. స్వాతంత్య్ర సమర కాలంలో ఎన్నో రచనలకు ‘అసలు’ రచయితలు ఎవరు? అనేది ఇంకా తేలలేదు. అలా విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఒక నాటకం మొదలుకొని ‘చిచ్చరపిడుగు’ అనే నిషేధిత నాటకం పైన, నిషేధాలకి గురైన ‘స్వప్న ప్రయాణం’ రచయతపైనా వివాదాలు ఉన్నాయ.
రచన వ్యక్తిగతం. ఒక రచయిత పేరు తప్పనిసరి. ఐతే చాలావరకు లిఖిత సాహిత్యంలో సామూహికంగా కూడా కొన్ని రచనలు వచ్చాయి. సింగరేణి, గోదావరిఖని ప్రాంతాలలో ఉద్యమం ఎగిసిపడినప్పుడు అక్కడి సాహిత్యంలో సామూహికత లక్షణం హెచ్చింది. ‘కైతికాల పోశెట్టి’అనే శీర్షిక వచ్చేది. వివిధ రచయితలు ఎవరు రాసినా అదే పేరుతో అచ్చయ్యేది. ఆ శీర్షికన ప్రస్తుతం తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచనలు చేస్తూనే ఉన్నాడు. ఆనాడు అది వివాదాస్పదం కాలేదు. అలాగే ‘కార్మిక’అనే కలం పేరుతో వివిధ రచయితలు రచనలు చేశారు. అలాగే ‘అడవిలో వెనె్నల’ శీర్షిక కూడా. ఐతే తదనంతరం ఎవరి రచనలనువారు తమ పేరుతో అ చ్చేసుకున్నారు. వేరొకరి రచనల గురించి పట్టించుకోలేదు. ఇదే కాలంలో కొన్ని ‘అజ్ఞాత కర్తృత్వాలు’ కూడా వెలువడ్డాయి. ఇప్పటికీ కొన్ని కవితలు, కథలకు రచయితలు ఎవరో తెలియదు. మరి కొందరు రచయితలు మారుపేర్లతో రచనలు చేశారు. ఆ తరువాతి కాలంలో రచయితలుగా, పుస్తకాలు ప్రచురించుకోనివారు వాటిని అలాగే వదిలివేశారు. మరి కొందరు తమ రచనలుగా చేర్చుకున్నారు. ఇది ప్రగతిశీల సాహిత్యోద్యమంలోని ఒక మంచి గుణం.
తెలంగాణ వచ్చాక నల్లవలస కవితపై ప్రస్తుత వివాదం, అనుముల శ్రీహరి, ఎస్వీల పాట ‘‘ఈ తెలంగాణ సంజీవ దీవిరా’’పై వివాదం, తెలంగాణ రాష్ట్ర గీతంగా ‘‘జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం’’అనే పాటని ప్రజలు ఆమోదించారు. అందెశ్రీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరూ ఆ పాటలో కొన్ని చరణాల తమవేనని ప్రకటించడంతో వివాదం నెలకొని ఉంది. పై రెండు రచనల మీద వివాదం రచ్చన పడింది. కాని ‘జయ జయ’ పాట వివాదం నొక్కిపెట్టబడింది. ఈపాటికి తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించవలసిన పాట అది. సాహిత్యకారుడంటే సమాజంలో ఒక విలువ, గౌరవం ఉంది. ప్రజల పక్షాన నిలుస్తాడనే ప్రతీతి. చిన్నచిన్న కారణాలతో తమ వ్యక్తిత్వాలకి అగౌరవం తెచ్చుకోవడం ఇటీవలి పరిణామం. రచయితలను ఇతర రచయితలు భయపెట్టడం శోచనీయం. సభలకు వెళ్ళవద్దు అని ఆంక్షించడం పాలకవర్గ స్వభావం. ఎస్టాబ్లిష్‌మెంట్‌తో అంటకాగే పరిస్థితులలో ఇలాంటి అవాంఛనీయ ధోరణులు పెచ్చుపెరుగుతాయి. వాటి పట్ల జాగ్రత్త అవసరం.
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242