తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

అంబేద్కర్ ఎవరి పక్షం నిలుస్తాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు నిన్నటితో ముగిసాయి.
ఇవ్వాళ మూడు ముఖ్యమైన సందేహాలు ఉదయించాయి.
మహనీయుల జీవితం నిత్యవినూత్నం. ఇరవై ఏళ్ల కింద అంబేద్కర్ గత చరిత్ర. ఇప్పుడు రేపటి చరిత్ర. అంబేద్కర్ విగ్రహాల్ని ఏర్పాటు చేయడానికి పార్టీల పరంగా ముందుకు వస్తున్నారు. ఏకంగా మన దేశప్రధాని అంబేద్కర్ పుట్టిన స్థలాన్ని దర్శించుకున్నారు. ఎనె్నన్నో విచిత్రాల మధ్య ఈసారి జయంతి వేడుకలు జరిగాయి. వీటి సమీక్షే ఈ వారం ముచ్చట్లు.
అన్నింటికన్నా ముఖ్యం-ఐక్యరాజ్య సమితిలోనూ అంబేద్కర్ జయంతి రోజున ఓ సమావేశం ఏర్పాటు చేయడం. దేశంలోనే కాదు బయట కూడా ఆయనకు నివాళులర్పించారు. ఇది ముగింపు మాత్రం కారాదు. మొదలు మాత్రమే అని ఆశిద్దామా.
అంబేద్కర్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఎందుకు రాలేదో ఆలోచించవలసిందే. జాతీయ స్థాయిలో దళిత వర్గాలలోనే ఎక్కువ గుర్తింపు, ప్రచారం రావడం గమనించాల్సిన విషయం. అంతిమంగా అంబేద్కర్ కులరహిత సమాజాన్ని, సమసమాజాన్ని ఆశించారు. తన మొదటి అక్షరం నుండి మూడు రోజులకి మరణిస్తాడనగా పూర్తి చేసిన 34‘‘బుద్ధ అండ్ హిజ్ ధమ్మ’’2 పుస్తకం రచన దాకా అతనొక భారత ఉపఖండ సమాంతర చరిత్ర నిర్మాత.
ప్రధాన స్రవంతి చరిత్ర మూలాలను ప్రశ్నిస్తూ దానికి దీటుగా చారిత్రక ఆధారాలతో ఇటుకలను, రాతిస్తంభాలతో దీనజన చరిత్ర నిర్మించాడు. అతని ఆలోచనలతో విభేదించే వారు సైతం అతని రచనలను ఖండించలేకపోవడానికి కారణం అతని మేధోపరిజ్ఞానమే. అతనిది దాచుకున్న జ్ఞానం కాదు. విస్తరించే విజ్ఞానం. దానిని తాను బతికి ఉన్నప్పుడు ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చగలిగాడు. ఆ సత్తా ఉన్నవాడు ఎన్నో రకాల ఆధిపత్య పన్నాగాలను ఒంటరిగా ఎదుర్కొంటూ, ఎంతో శ్రమకోర్చి తన లక్ష్యంవైపు లోకాన్ని మరల్చేట్లు చేయగలిగాడు. ఇరవైకి పైగా సంపుటాల రచనలతో, వేలాది పేజీలతో మహారణ క్షేత్రంలో కలం యోద్ధగా నిలిచాడు. అతను తన సమకాలంలో స్పందించని సమస్య అంటూ ఏదీ లేదు. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత రంగాలను కుదిపి వేసిన మనిషి. దేశం ఎదుర్కొంటున్న అననుకూల వాతావరణంలో కూడా తాను నమ్మిన, తాను మాత్రమే పూర్తి చేయగలిగిన భాధ్యతలను నిర్వహించిన కార్య దీక్షాదక్షుడు.
తాను బతికి ఉన్నప్పుడు సుమారు రెండు వందల ఏళ్ల భారత దేశపు,మత సాంఘిక, దురాచారాల చరితని అక్షరీకరించిన ఘనత ఆయనదే. ఈ చరిత్ర విదేశీయులు చదివితే వారి కళ్లలో మనం చిన్నబోతాం. ఇవ్వాళ ఐక్యరాజ్య సమితి ఆయన పేర 3విజ్ఞాన దినోత్సవం2 జరుపుతుందని చాలామంది అనుకున్నారు. కాని అలాంటిదేమీ జరగలేదు. ఎందుకు జరగలేదో ఎవరికీ తెలియదు. కాని అలాంటి ప్రకటన వెలువడుతుందని ఆశించిన వారు దిమ్మతిరిగేలా, నిరుత్సాహ పడిపోక తప్పలేదు. రష్యాలో 1984 నుండి సెప్టెంబర్ ప్రతి మొదటి తారీఖున 3విజ్ఞాన దినోత్సవం జరుపుతుంటారు. ఆరోజు పాఠశాలలో చేరే విద్యార్థులకోసం ఈ దినం ఘనంగా జరుపుతారు. అదే పేరుతో అంబేద్కర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరపబోవడం ఎంతో సబబు. కాని ఈసారి కూడ అంబేద్కర్‌కి సరియైన నివాళి అక్కడ అర్పింపబడలేదు.
మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం, సవర్ణ హిందూ ఆధిపత్యం మీద. ఆయన ప్రతి అక్షరం ఒక సైనికుని వలె యుద్ధం చేస్తుంది. అంటరాని వాళ్ల తరుపున విజయ దుందుభి మ్రోగిస్తుంది. దురాచారాల్ని అనేక రకాల అస్పృశ్యతల్ని నిరాకరిస్తుంది. ఆయన దేవాలయ ప్రవేశం కోసం ఉద్యమించాడు. హిందూ ధర్మాన్ని బుద్ధుని తరువాత అంతగా ప్రశ్నించినవారు మరొకరు లేరు. అలాంటి వాడి విగ్రహాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అట్టహాసంగా స్థాపించడానికి ముందుకు వచ్చాయి. హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహ స్థాపనకోసం చేసిన భూమి పూజను వేదోక్తంగా మంత్రోచ్ఛటనాలతో నిర్వహించడంలోనే అతనికి అపచారం జరిగిందని వాపోయారు ప్రజలు. అతనికి ఇష్టంలేని రీతిలో సంప్రదాయ పూర్వకంగా జరగడం అపచారం అని దళితులు ఎందుకు గుర్తించకపోయారో తెలియరావడంలేదు. అందుకే అంబేద్కర్‌కి నిజమైన నివాళి అర్పించలేకపోయామని కొందరి భావన. విగ్రహం ఎత్తు మోహంలో అసలుకి జరిగిన మోసాన్ని 3దళిత స్టడస్ సెంటర్2 మేధావులు సైతం గుర్తించలేక పోవడం ఎందుకని జరిగిందో. ఈ ప్రశ్న ప్రతి జయంతి రోజున వేయబడుతూనే ఉంటుంది.
విగ్రహం ఎత్తులో అంబేద్కర్ ఆత్మ చిత్తయిపోయింది. ఇంతకాలం దళితులు తమకు తాము ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాలు ఏరూపంలోనూ, ఎక్కడా మైల పడలేదు. భారీ విగ్రహాల ఆవిష్కరణ, ఆవిర్భావాలలోనే ఒక అపశ్రుతి పలికింది. దీనికి రేపు ముగింపు ఉంటుందా? అలాగే కొనసాగుతుందా? తన విగ్రహం కింద తన ఆశయాలు తొక్కివేయబడడం అంబేద్కర్ ఆలోచనా విధానానికి వనె్న తెస్తుందా? ఆలోచించాలి.
జాతీయ, రాష్ట్రీయ ఎన్నికల పార్టీలన్నీ అంబేద్కర్‌ని అంగీకరిస్తున్నాయి. అతని పేరుతో ఓటు బ్యాంకుకు గాలం వేస్తున్నాయి..తాము సైతం ..అని ముందుకు రాక తప్పడం లేదు. నిజానికి విగ్రహాలు స్థాపించడం కోసం కాకున్నా ఆయన రచనల, భావాల అధ్యయన వెలుగులో సమాజ వాస్తవాలను చూడవలసిన వామపక్షాలు అంబేద్కర్ నామ జపం వరకే పరిమితం అయ్యాయి. భారతీయ సమాజం యొక్క నగ్నస్థితిని అర్థం చేసుకొని, దానిని రూపుమాపే క్రమంలో అంబేద్కర్ అవశ్య స్మరణీయుడు. తన భావాలు, పోరాటాల నీడల్లోంచి భవిష్య సమాజాన్ని రూపొందించాల్సి ఉంది. అలా కాకుండా వారు కిమ్మనకపోవడం దివాలాకోరు ఎత్తుగడగానే మిగలక తప్పదు. ఇక పోతే ప్రగతిశీల విప్లవ వాదులు సాంకేతికతల రీత్యా అంబేద్కర్‌ని అంగీకరించి, అంగీకరించనట్లుగా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ వస్తున్నారు. అందుకే వారి సాహిత్య, సాంస్కృతిక రంగం, భావజాల వ్యాప్తిలో విఫలతనే ఎదుర్కొంటున్నది. వారు ప్రజల నామజపం చేస్తున్నారే తప్ప, ప్రజలు వారిని తమలో భాగం అనుకోవడం లేదు.
ఇకపోతే-
అనేక రకాల దళితులు అంబేద్కర్‌ని తమవాడని భావిస్తారు. కాని అందులో ఒక సెక్షన్ మాత్రమే అతడిపై తమకే పూర్తి హక్కు ఉందన్నట్టుగా భావిస్తారు. జాతీయ స్థాయిలో ఈ విధానం చాలాకాలంగా జరుగుతున్నది. రెండు వర్గాల మధ్య ఒక కనబడని లడాయి వాతావరణం కొనసాగుతున్నదని రెండు వైపులా అంగీకరించే పరిస్థితి.
నిజానికి అంబేద్కర్ కొన్ని విశ్వవిద్యాలయాల్లో అక్కడి విద్యార్థులలో ఎక్కువ ప్రజాదరణ పొందాడు. కానీ భారతీయ గ్రామసీమలలో, అనేకానేక వెనుకబడిన కులాలు, బృందాలకి అతడు దూరమే. జయంతి, వర్థంతి సందర్భాలలో మాత్రమే ఒక పండగ. ప్రభుత్వ ప్రచారాల హోరులోనే అక్కడ ప్రతిధ్వనిస్తాడు. నిజానికి ఆయా క్షేత్రాలలో అంబేద్కర్ సజీవశక్తిగా మారాలి. వారి బతుకులకు, పోరాటాలకు దివిటీలా రూపొందాలి. చదుకున్న వర్గం వారు అలా అంబేద్కర్‌కి నిజమైన నివాళి అర్పించగలగాలి. కాని జరుగుతున్నది ఏమిటి?
కొద్దిమంది, కొన్ని బృందాలవారు మాత్రమే సొంతం చేసుకోవడం వల్ల అంబేద్కర్ అందరి వాడు కాలేకపోతున్నాడన్నది సత్యం. ప్రస్తుతం ఈ చట్రంలోంచి అంబేద్కర్‌ని పాలకపక్షం సులభంగా ఈ ఏడాది జయంతి నుంచి వేరు చేసే ప్రక్రియ ఆరంభించింది అని అనిపిస్తున్నది. అంబేద్కర్‌ని పాలకులు తమవాడంటే తమవాడని గుంజుకుపోతున్నారు. సంప్రదాయ వాద పార్టీలు, కాంగ్రెస్, జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్నీ ఇదే తంతు. దీనికి అడ్డుకట్ట పడకపోతే రేపు ఏమవుతుందోననేది అగమ్యగోచరమే. ప్రజలు (పాలితులు) అందరి వాడు కావలసిన అంబేద్కర్ ఆలోచనా విధానం కేవలం అంబేద్కర్ విగ్రహమై పాలక వర్గాల చేతిలో బొమ్మగా మారడం ఈ జయంతి నుండే ప్రారంభమవుతున్నది.
ఒకప్పుడు ప్రచ్ఛన్న బౌద్ధం వలె ఇప్పుడు ప్రచ్ఛన్న అంబేద్కరిజం ప్రవేశిస్తున్నది. ఆయన అసలు తత్వం పక్కనపడి సీట్లు, రిజర్వేషన్ల వరకే పరిమితం అవుతున్నది. ఒకటీ అరా దశాబ్దంగా ఆచరణ, సాధన, పోరాటం, వంటి ఆలోచనలకు దూరమై కాల్పనిక పోరాటం, నిర్దిష్ట కార్యక్రమం లేకపోవడం, లక్ష్యం ఏమిటో నిర్వచించుకోలేనితనంలో కూరుకువడం చూస్తుంటే అంబేద్కరిజం నిస్తబ్దతకి గురవుతోందని అనిపిస్తోంది. ఈ కారణాల వల్ల అంబేద్కర్ ఒక విగ్రహమై దశావతారానికి మరో అవతారం జోడింపుగా మారినా ఆశ్చర్యం లేదు. అప్పుడు అంబేద్కర్‌ని పాలకవర్గమే సొంతం చేసుకుని, పోరాడే ప్రజల చేతిలోనుండి ఒక విప్లవాయుధాన్ని నిశ్శబ్దం చేస్తుంది. ఈ జయంతి సందర్భంగా అలాంటి ఒక వాతావరణం కూడా గోచరిస్తున్నది. ఇది భ్రాంతి అవుతే బాగుండు.
ఇప్పుడు కళ్లు, మేధస్సుల్ని ఒకేసారి తెరచుకోవడం అవసరం. అంబేద్కర్ ఆలోచన, అధ్యయనాలకు కొనసాగింపు వంటి పోరాటాలకు రూపకల్పన వంటి ఆలోచనలు, 125వ జయంతి స్ఫూర్తి కావాలని ఆశించడం తప్పు కాదు. నిజమైన రేపటి ఉత్సవాలకోసం ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించాలి.
అంబేద్కర్‌ని ప్రజలు తమ పక్షం నిలుపు కోవడం కోసం పోరాడాలి.