తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

అసామాన్య చారిత్రక కావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న ఆలేరు పట్టణానికి కొద్దిదూరంలో ఉన్న కొలనుపాక గ్రామానికి వెళ్లాను. అప్పుడు అక్కడ ఉన్న 18 మఠాలాయాలను చూశాను. అప్పుడు ఎప్పుడో ఎక్కడో చదివిన ఈ పద్య పంక్తులు గుర్తొచ్చాయి. అక్కడి నుంచి వచ్చాక ఆ కావ్యం తీసి చదివాను. ఆ విషయాలే ఈ వారం ముచ్చట్లు..
‘ప్రతి జాతి (కులం)కొక్క దేవళము వంతున
సర్వ వర్ణంబులకును దేవళములుండె ఇచట’
సుమారు వందేళ్ళ కింద రాసిన ఈ చరణాలు శేషాద్రిరమణ కవులవి. ఆనాడు కొలనుపాకలో శాసనాలు తవ్వితీయడానికి వచ్చిన ఆయన, అక్కడున్న ఈ ఆలయాలను చూసి రాసిన పద్యం ఇది. నిజానికి పురావస్తు ప్రాధాన్యత, చారిత్రక అంశాలపై కవిత్వం రాయడం కష్టం. ఒక దేశం (కంట్రీ)పైగాని, ప్రాంతం (ప్రావిన్స్)పైగాని పురావస్తు ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా ఒక చారిత్రక కావ్యం ఎక్కడైనా వచ్చిందా?
అందుకు జవాబుగా వచ్చింది అనే చెప్పవచ్చు. 1920 ప్రాంతాలలో శేషాద్రి రమణ కవులు ‘నైజాం రాష్ట్ర ప్రశంస’ అను ‘తెలంగాణ రాష్ట్ర ప్రశంస’ అను ‘హైదరాబాదు సంస్థాన ప్రశంస’ అనే ఖండకావ్యం రచన ప్రారంభించారు. ఆనాటి హైదరాబాదు సంస్థానాన్ని ఏలుతున్న నిజాం రాజు ఏలుబడిలో ఉన్న నేటి తెలంగాణ ప్రాంతంలోని అపురూప పురావస్తు చరిత్ర, నిర్మాణాలు విభ్రమం గొలుపగా వారు ఈ కావ్యాన్ని రాశారు. 1924లో ఆ కావ్యాన్ని మొదటి ముద్రణగా ముద్రించారు. ఇటువంటి కావ్య రచనలు చరిత్రలో చాలా తక్కువ. ఇందులో చారిత్రక ప్రదేశాల గురించి, చరిత్రలో విస్మృతాంశాల గురించి రాశారు. వివిధ రాజుల కాలంలో జీవించిన కవుల గురించి, రాజుల గురించి ప్రస్తావించారు. చరిత్ర ప్రదేశాల ప్రాశస్త్యం కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఈ సంపదను రక్షించుకోవడం కోసం ప్రజలు, ప్రభుత్వాలు ఏమి చేయాలో వారి కర్తవ్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపారు. ప్రజలకు ప్రబోధగీతంగా విడమరిచి చెప్పారు. ఇవి ఈ కావ్యంలోని ముఖ్యమైన విషయాలు. మొదటి ముద్రణకి మంచి పేరు వచ్చింది. అందుకే మరిన్ని పద్యాలు రాసి 1926లో మలి ముద్రణ వేశారు.
శేషాద్రి రమణ కవులు జంటకవులు. తెలుగులో జంటకవులు చాలామంది ఉన్నారు. కాని వీరు సుప్రసిద్ధ పరిశోధకులు, రచయితలు కావడం విశేషం. మరో విశేషం ఏమంటే వీరు ఆంధ్ర ప్రాంతం వారై ఉండి తెలంగాణపై ప్రేమానురాగాలతో ఇక్కడి చరిత్రని అభిమానించారు.
గుంటూరు జిల్లా వాడరేవులో నివసించే వెంకట రంగాచార్యులు, లక్ష్మమ్మ దంపతులకు మూడో కుమారుడైన శేషాచార్యులు (1890-1940), నాలుగో కుమారుడైన వెంకటరమణాచార్యులు (1893-1963) ఇరువురు కలసి జంటగా రాయడం ప్రారంభించారు. కవీ, రచయితలుగా వారు పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు అవధానాలలో దిట్టలు. తిరుపతి వెంకటకవులు, కొప్పరపు సోదరులతో సమఉజ్జీలుగా పేరు తెచ్చుకున్నారు. కావ్య నాటకాలు రాసి పేరు పొందారు. క్షేత్ర పర్యటన చేసి చరిత్ర పరిశోధకులుగా విఖ్యాతి గడించారు. బాపట్లలో ప్లీడరు గుమాస్తాలుగా పనిచేసిన కాలంలోనే సాహిత్య అధ్యయనం కూడా చేశారు. తాము చేస్తున్న పనివల్ల సంతృప్తి పొందలేదు. అందుకే ఆంధ్ర సాహిత్య పరిషత్తు అధినేత జయంతి రామయ్య పంతులుగారి వద్దకు చేరారు. పంతులుగారు వీరికి చరిత్ర సంబంధిత సామగ్రి అయిన శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, కాగితం ప్రతులు, నాణేలు వంటివాటిని సేకరించమని పని అప్పగించాడు. శేషాచార్యుల వారికి గుంటూరు మండలంలో, రమణాచార్యులవారికి నైజాం సంస్థానంలో క్షేత్ర పర్యటన చేసి సమాచార సామగ్రిని సేకరించవలసిందిగా కోరారు. సేకరించిన చరిత్ర, సాహిత్య విషయాలను పరిశోధక వ్యాసాలుగా వివిధ పత్రికలలో ప్రకటించారు. రమణాచార్యులు కొంతకాలం గంపలగూడెం ఆస్థాన పండితునిగా ఉన్నారు. ఆ తరువాత బెజవాడ ఆంధ్ర గ్రంథాలయంలో, నందిగామ బోర్డు హైస్కూలులో పనిచేశారు. శేషాచార్యులు వివిధ ప్రదేశాలలో పనిచేసి చివరకు బందరులోని హిందూ కాలేజీలో పనిచేశారు.
వెంకటరమణాచార్యులు ఆ తరువాత కొల్లాపురం మహారాజు, కొమర్రాజు లక్ష్మణరావు పంతులు కలిసి రామప్ప, కొలనుపాక, పాకాల వంటి అనేక ప్రాంతాలలో శాసనాలు సేకరించే పని అప్పగించారు. కొన్నాళ్ళకు క ట్టమంచి రామలింగారెడ్డి పనువున తెలంగాణ అంతా తిరిగి వేలాది ప్రాచీన తాళపత్ర కాగితం ప్రతులను సేకరించారు. 1930 ప్రాంతంలో తెలంగాణలోనే స్థిరపడాలనే చిరకాల కోర్కె కలిగి ఉ న్నారు. హనుమకొండ కళాశాలలో సంస్కృతాంధ్ర పండితునిగా నియమించబడినారు. అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. హనుమకొండలోనే ‘చారిత్రక పరిశోధక మండలి’ సంస్థను 1931లో స్థాపించారు. 1932లో కాకతీయ వర్థంత్యుత్సవాలలో వారు ప్రాముఖ్యత వహించారు. ఉద్యోగం చేస్తూ కూడా చరిత్ర పరిశోధన కొనసాగించారు. వందలాది శాసనాలు వెలికితీశారు. వాటిపై అనేక విలువైన వ్యాసాలు రాశారు.
కరీంనగర్ జిల్లాలోని ‘పసిరె’ గ్రామంలో ఇల్లు కట్టుకుని అక్కడ వ్యవసాయం చేశారు. నైజాం తెలుగువారిని వారి చరిత్ర పట్ల జాగురూకులను చేయడం, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ అనేక వ్యాసాలు పత్రికలలో రాయడం, తెలుగువారి మహోజ్వల చరిత్రపై ప్రేరణాత్మక రచన రాసినందుకుగాను ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యారు. అందుకే నిర్మల్, కరీంనగర్ మొదలైన మారుమూల చోట్లకు బదిలీ చేయబడినారు. యాభై ఐదు ఏళ్ళకు 1948లో పదవీ విరమణ పొందాక బూర్గుల రామకృష్ణారావు ఆహ్వానం మేరకు హైదరాబాదులోని పురావస్తు శాఖలో చేరారు. 1963లో డెబ్భై ఏళ్ళ వయసులో రమణాచార్యులు మరణించారు.
తన ఇరవై ఏడేళ్ళ ప్రాయంలోనే నైజాంతో సంబంధం ఉండి ఇక్కడి ప్రాంతాలను పర్యటించారు. ఇక్కడి చారిత్రక కట్టడాలను కళ్ళారా చూసిన ఈ కవులు నేటి నల్లగొండ పట్టణ కేంద్రంగా వెలువడిన ‘నీలగిరి’ పత్రికలో తెలంగాణ తెలుగు ప్రజలను ఉద్బోధిస్తూ ఐదు సీస పద్యాలను రాశారు. అవి పాఠక లోకాన్ని అమితంగా ఆకర్షించాయి. తెలంగాణలోని చాలా ప్రదేశాలలో వాటిని ఎలుగెత్తి చదువుకున్నారు. నీలగిరి పత్రికలో శేషాద్రి రమణ కవులు అనేక ఇతర పద్యాలు, చరిత్రాంశాలపై వ్యాసాలు రాశారు. నల్లగొండ పట్టణానికి దగ్గరగా ఉన్న పానగల్లుపై లోతుగా పరిశోధించారు. కేవలం లిఖిత శాసనాలు, చరిత్ర మాత్రమే కాకుండా వౌఖికంగా పాడబడే ‘బాలనాగమ్మ’ కథకి, చాళుక్య రాజుల కింద పరిపాలకునిగా ఉన్న రాజుల గురించి, వారికి, బాలనాగమ్మకి గల సంబంధం గురించి వివరించారు. 16 సెప్టెంబర్ 1926 నాటి సంచికలో బాలనాగమ్మ గురించి రాస్తూ- ‘ఇందలి సారాంశమును చరిత్రతో కలుపుట పరిశోధకుల ధర్మము’ అని తన వ్యాసంలో సూచన చేశారు. ఈ సూచనని ఆధారంగా చేసుకుని ఆ తరువాత టేకుమళ్ళ కామేశ్వరరావు ‘జంగం కథాతత్వం’ పుస్తకాల్లో బాలనాగమ్మ కథకీ, చరిత్రకీ, వౌఖిక కథనానికీ మధ్యగల సంబంధాన్ని విపులంగా చర్చించాడు. ఈ అధ్యయనం వల్లనే ఈ ఖండకావ్యంలో పానగల్లు మీద ఆరు సీస పద్యాలు రాశారు. వీటిలో పానగల్లు రాజ్యంలో శిల్పసంపదను శ్లాఘించారు. ఈ కావ్యం మొదటి ముద్రణ (1924) పుస్తకాలు రెండు నెలల్లో చెల్లిపోయాయి. ఇదే వరుసలో మరికొన్ని పద్యాలు రాయాలని చదువరులు, విజ్ఞులు బలంగా కోరారు. ఈ ప్రోత్సాహం శేషాద్రిరమణ కవులచే మరిన్ని పద్యాలు రాయించేలా చేసింది. సుమారు వంద పద్యాలు రాశామని ‘పీఠిక’లో చెప్పారు. ఈ పుస్తకంలో రాసినవన్నీ సీస పద్యాలే. కావ్య వస్తువు, ఇతివృత్తం కాని అంశంపై కావ్యం రాయడం గొప్ప విషయం. నాయికా నాయకులు లేకుండా, ఎలాంటి అష్టాదశ వర్ణనలు లేకుండా, కేవలం పురావస్తు నిర్మాణాలు, చరిత్రను ఇతివృత్తంగా చేసుకుని కావ్యం రాశారు. నిజానికి ఆనాడు వస్తున్న భావకవిత్వం కన్నా, జాతీయవాద కవిత్వం కన్నా, ఆధునిక గేయ, రచనా కవితారీతుల కన్నా ఈ కవిత్వం పాఠకులను బాగా ప్రభావితం చేసింది.
ఈ కావ్యంలో మొదటి అధ్యాయం ‘కర్తవ్యము’లో ‘సాధ్యమైనంతలో సాహిత్య ధనమును స్ర్తి జనంబునకు అర్పింపవలయును’ అని రాశారు. నిజానికి ఆనాడు నైజాం రాష్ట్రంలో స్ర్తి విద్య చాలా తక్కువ. సర్కారీ బడులలో విద్యాబోధన ఉరుదూలో ఉండేది. స్ర్తిలకు బడులు చాలా తక్కువ. అందుకే బాలికావిద్య వెనకపట్టున పట్టింది. వారు అక్షరాస్యులైతే సాహిత్య గ్రంథాలు పఠిస్తారు. స్ర్తిలే కాదు మాతృభాషాభిమానము, మాతృభక్తి, మాతృశుశ్రూష చేసే విధంగా బాలికలను తీర్చిదిద్దాలని ఆశించారు. ‘్భషకై అవసరపడినచో ప్రాణములు విడుచు సోదరులు లభించుదాక /త్యాగులై నిలువకున్నచో తల్లి బాస వరల నేర్చునే నైజాము వాసులార!’ అని నైజాంలోని తెలుగు భాష అవసరాన్ని గుర్తించాడు. అన్నింటికీ ‘మాతృ’ అనే సంస్కృత పదం వాడి, భాషకు మాత్రం ‘తల్లిభాస’ అనే తెలుగు పదాన్ని, తెలుగులో మొదటిసారి వాడినవారు ఈ కవులే.
‘మాతృభాషాభిమాన సంపన్నులైన / నాయకులు మార్గదర్శుకులై నడవరైరి’ అని నైజాం రాజ్యంలో తెలుగు భాషను కాపాడడానికి నాయకత్వం లేదని బాధపడ్డారు. అందుకే ‘యువక మణులార! మీరైన ఊరక ఉన్న రాదు సత్కీర్తి నైజాము రాష్టమ్రునకు’ అని యువతను ఉద్బోధించారు. వారి కర్తవ్యాన్ని గుర్తుతెచ్చారు. ‘సౌఖ్యంబులన్నియు జన్మభూమికి వెచ్చించు యువకులు వెలయువరకు’ అని త్యాగ గుణం కావాలని ప్రకటించారు.
స్థానిక చరిత్రలు పుస్తకాలలో తెలుసుకుంటున్నారు. కాని అలా కాదు, తృప్తితీర చరిత్ర స్థలముల దర్శించుకొరకు రండి! నిజాము సుతులార!’ అని కర్తవ్య నిర్దేశం చేశారు. చారిత్రకపు దేశాలను, ఆ పరిసరాలను చూడడం వల్ల ఎన్నో అంశాలు తెలియవస్తాయి. అలాంటివాటిలో ‘ఏకవీరాదేవి ఏల్బడిలోనున్న మొగిలిచర్ల చరిత్ర చరిత్రలో లేదు’ అని బాధపడినారు. రాజుల సంస్కృతి వేరు, జానపద ప్రజల సంస్కృతి వేరు. చరిత్ర కూడా వేరువేరే. దానిని గుర్తించిన జానపద విజ్ఞానవేత్తలీ కవులు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే- కొలనుపాక గ్రామంలో ఒకేచోట పడి ఉన్న అనేక శాసనాలను తవ్వి తీయించినది వీరే. ఆ సందర్భంలోనే ఆ గ్రామంలో 18 కులాలు (జాతులకు) 18 మఠాలు, ఆలయాలు ఉన్నాయి. వీటిని మొదట ప్రత్యేక చరిత్రగా గుర్తించింది శేషాద్రిరమణ కవులే. ఈ కోవకి చెందిన మఠాలయాలు మరెక్కడా కానరావు. ప్రధాన స్రవంతి చరిత్రకారులు గుర్తించని చరిత్ర, సంస్కృతి ఇది. దానిని గ్రంథస్తం చేసిన చరిత్రకారులు ఈ రచయితలు. ఇన్ని రకాల విషయాలు వీరిని అతలాకుతలం చేశాయి. అందుకే ఈ కావ్య రచన చేశారు. ఇలాంటి చరిత్రకారులు ఆనాడు అరుదు. అరుదైన అసామాన్య చరిత్ర పరిశోధకులకు అభివాదాలు.
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242