మెయిన్ ఫీచర్

హింసను ఆపండ్రో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దిసేపు హాయిగా, ఆనందంగా గడపడానికి వెళ్లొచ్చేది సినిమా. ఇది ఒకప్పటి మాట. కాలం మారింది. కామన్‌మేన్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తెరొక్కటే అడ్డా అయ్యింది. కాలక్షేపానికి కాసేపు ‘కాకమ్మ కథ’ చూసొద్దామన్న పరిస్థితి వచ్చింది. ఆడియన్స్ వస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు కనుక -ఏ కథనైనా తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలూ ధైర్యం చేస్తున్నారు. ఆహ్లాదాన్ని కలిగించే కథలు ఎప్పటి నుంచో ఎంతమందో వండేశారు కనుక, కొత్తవి వండలేని కొందరు దర్శకుడు భయానక, బీభత్స హింసాపూరిత జోనర్లకు మళ్లుతున్నారు.

సహజంగా ఏ సినిమా అయినా మంచి చెడుల మధ్య జరిగే పోరాటానే్న చూపిస్తుంది. చివరకు మంచిని గెలిపిస్తుంది. ఆది నుంచీ సినిమాది ఇదే ధోరణి. అయితే, ఒకప్పుడు మంచికి ఓటువేసేలా సినిమాలు చిత్రీకరించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు చెడును ప్రోత్సహించేలా సినిమా చిత్రీకరణ సాగుతోంది. ఇది పాతతరం ఆడియన్స్ నుంచి బలంగా వినిపిస్తోన్న మాట. సినిమాకు దూరమైపోవడానికి ఇదే కారణమని చెప్తోన్న మాట. అయితే, సినిమాలు నిర్మిస్తోన్న కొత్తతరం వాదన మరోలావుంది. ‘ఇంకెన్నాళ్లు అదే సినిమా చూస్తారు. ఏదోక వెరైటీ ఉంటేనే, కొత్తదనాన్ని చూపిస్తేనే ఆదరణ ఉంటుంది. నిర్మాతకు నాలుగు డబ్బులొస్తాయి. గాంధీ కాలంనాటి అహింసా బోధనలు జనం వినే పరిస్థితిలో లేరు. అందుకే హింస తాలూకు భయానక బీభత్స రసాలను కరాళనృత్యం చేయించాల్సి వస్తోంది’ అంటున్నారు. శ్రుతి మించుతోన్న ఈ ధోరణి ఎలాంటి తీవ్రతకు దారితీస్తుందో అన్నదే అంతుచిక్కని అంశం.
***
చాలా ఏళ్ల క్రితం ‘ముత్యాల ముగ్గు’ అనే సినిమా వచ్చింది. అందులో చాలా తాపీగా కనిపించే ప్రతినాయకుడు రావు గోపాలరావు. అతను పెట్టే సైకలాజికల్ టార్చర్ ఎంత భయానకంగా ఉంటుందో చిత్రంలోని పాత్రలే కాదు, ప్రేక్షకులూ అనుభవిస్తారు. ‘ప్చ్’ అన్న బాధ వ్యక్తం చేయడం దగ్గర్నుంచీ, ప్రతినాయక రాక్షసుడిని దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడా? అన్నంత ఉత్కంఠతో చూస్తారు. ఆ సినిమాలో ‘మానసిక హింస’ భయానక రీతిలోనే ఉంటుంది. కానీ, సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. మనం గొప్పగా చెప్పుకునే పాత్ర చిత్రాల్లోనూ ‘హింస’ లేకపోలేదు. కానీ, అది సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినట్టే ఉండేది.
ప్రతి కథలోనూ ఓ విలన్ ఉంటాడు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఉంటాడు. కానీ, ఇప్పటి విలన్ల ప్రవర్తనే అసహజంగా ఉంటోంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేది విలనిజమేనన్న గాఢమైన సూత్రం ఇప్పటి దర్శక, రచయితల్లో బలపడిపోవడంతో అది శ్రుతిమించి భయాందోళన కలిగించే స్థాయికి వెళ్లిపోతుంది.
***
ఇప్పటికి వస్తే...
టీవీ మాధ్యమాలలో ప్రసారమయ్యే నేరాలు- ఘోరాల ప్రభావం ప్రేక్షకులమీద బాగా ఉందని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఆ కార్యక్రమాల టీఆర్పీ రేటింగులను చూస్తే, ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమవుతుందనీ చెబుతున్నారు. సో.. ప్రేక్షకులకు అలాంటి ‘హింస’ నచ్చుతుంది కనుక చిత్రాల్లోనూ చూపిస్తున్నామని వాదించేవాళ్లూ లేకపోలేదు. (హింసాత్మక సినిమాలు హిట్టవ్వడాన్ని చూసి, యదార్థగాథలను కల్పిత పాత్రలతో షూట్ చేసి చూపిస్తున్నామని టీవీ చానెల్స్ నిర్వాహకులూ వాదిస్తున్నారు. అది వేరే విషయం). అందుకే అలాంటి చిత్రాలను రూపొందించేందకు ఎక్కువ శ్రమపడుతున్నామని చెబుతుండటాన్ని చూస్తే -ఎటుపోతున్నాం? తరువాత తరాలకు ఎలాంటి ‘విజ్ఞానాన్ని‘ అందిస్తున్నాం అన్న సందేహాలు ముసురుకుంటాయి. కొత్తగా వస్తున్న చిత్రాల్లో హింస ఎంతలా పెరిగిపోతోందీ అంటే -ఒక సినిమాలో హీరో ఇద్దరిని చంపితే, మరో సినిమాలో పదిమందినైనా ఒక్క గుద్దుతో చంపగలగాలి. మనిషిని మాంసపు ముద్ద చేసెయ్యాలి. అప్పుడే ఆ సినిమాను ప్రేక్షకుడు ఆమోదిస్తాడన్న పిచ్చి నమ్మకాలు బలపడిపోయాయి. చిత్రమైన ఆయుధం దగ్గర లేకపోతే, వాడసలు హీరోయే కాదనే స్థాయిలో సన్నివేశాలనూ చిత్రీకరిస్తున్నారు. రోజు రోజుకూ సినిమాల్లో మర్డర్ల మోతాదు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో హింస అనే పదార్థం సినిమాల్లో విశ్వరూపం దాలుస్తోంది. సినిమాలు చూసి దొంగతనాలకు అలవాటుపడేవాళ్లు, మహిళలమీద అఘాయిత్యాలకు తెగించేవాళ్లు, వైట్ కాలర్ నేరాలకు పాల్పడే బుద్ధిజీవులు పెరుగుతున్నారని సర్వేలు ఘోషిస్తన్నా -వాటి వాదనలేవీ తెరముందు నిలబడవు. తెరకెక్కే హింసను నియంత్రించలేవు. నేరస్థుల మనస్తత్వం ఎలా వుంటుంది? వాళ్లు నేరాలు ఎందుకు చేస్తారు అనే మానసికమైన దౌర్బల్యాన్ని చిత్రీకరించే సినిమాలూ వస్తున్నాయి. మనిషి నేరాలు చేయడం మొదలెడితే ఎక్కడ ఆపుతాడు? అతని టార్గెట్ ఏంటి? డబ్బా? కీర్తా? కాంత? ఏది.. చిట్టచివరి క్లైమాక్స్? అలాకాదు, బావ కళ్ళల్లో ఆనందం చూడటానికేనన్న పిచ్చి డైలాగులూ ఆమధ్య వినిపించాయి. బావ కళ్ళల్లో ఆనందం చూడ్డం కోసం ఎంతటి హింసకైనా దిగే కొత్త బావమరులు వచ్చాక తెలుగు కథ, కథనాల మరీ ‘పదును’దేరుతున్నాయి.
సినిమాలు చూస్తే నేరాలు పెరగవంటూ కొందరు కుహనా మేధావులు చెబుతున్న మాటలకు అర్థంలేదని కొట్టిపారేస్తున్నారు. ఒక్క యాడ్ చూసి వేల టూత్ పేస్ట్‌లు కొంటున్న కాలమిది. అంతకంటే బలంగా ఆకట్టుకునే తెరమీది హింసాత్మక దృశ్యాన్ని చూసి, టూత్ పేస్ట్ కొన్నట్టే తుపాకీ కొనడా? పదునైన కత్తిని బొడ్లొ దోపుకుని తిరగడా? అన్నదాన్ని ఆలోచించాలి. అవసరమున్నా లేకున్నా తుపాకిని పైకెత్తి గాల్లోకి ఐదారు రౌండ్లు కాలిస్తేనే హీరోయిజమ్ అన్నట్టూ చూపిస్తున్నారు. ఇటీవల పాతబస్తీలో ఓ యువకుడు గాలిలోకి ఐదారు రౌండ్లు బుల్లెట్లు పేల్చి ఆనందంగా పుట్టినరోజు జరుపుకోవడం అలాంటి సన్నివేశాల ప్రభావంతో కాదనగలమా? కాకపోతే సినిమాల్లో హీరోలు, విలన్లు పోలీసులకు దొరకరు. దొరికినా వాళ్లేమీ అనరు. పాతబస్తీలో మాత్రం ఆ యువకుడిని పోలీసులు ఠాణాకు పట్టుకుపోయారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ చర్చించేది సినిమాలలో హింస ప్రోత్సాహం ఎంతవరకు వుంది అన్న విషయంపైనే. హీరోని అనుకరించడానికి, వాళ్లలా మాట్లాడటానికి ప్రయత్నించే యువతే మనకు తక్కువేం కాదు. సినిమా సన్నివేశాల మాదిరిగానే రోడ్డుపై పోతున్న అమ్మాయిలను టీజ్ చేస్తున్న వాళ్ల సంఖ్యా తక్కువేమీ లేదని చెప్పడానికి నమోదవుతోన్న కేసులను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. యువత పెడదోవ పట్టకుండా, హింసవైపు మొగ్గకుండా కథ కథనాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయస్థానాలు చెబుతున్నా వినే వాళ్లెవరు?
హింసకు తోడు ఇటీవలి చిత్రాల్లో అశ్లీలతా అంతకంతకూ పెరుగుతోంది. కుటుంబమంతా కలిసి చూడదగిన సినిమాలు ఇక వచ్చే అవకాశం లేదన్న బలమైన నమ్మకానికి వచ్చేసిన ఉత్తమాభిరుచి ప్రేక్షకులు ఇప్పటికే థియేటర్ల వైపు రావడం మానేశారు. ఎంత మంచి సినిమా అయినా సరే, అందులో ఓ ఐటెం పాట తప్పనిసరి అవుతోంది. ఎంత వల్గర్‌గా ఆ పాట చిత్రీకరిస్తే అంత గొప్ప అన్నట్టుంది దర్శక నిర్మాతల తీరు. పైగా, ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం యువకులే కనుక వారికోసమే పాట పెట్టామని, పాటలో అన్ని మసాలాలూ ఉంటాయని ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రకటించటం మరీ దారుణం. మొతానికి సినిమాలలో హింస అనే ముడిపదార్థం లేకుండా తెరపై కథను ఆవిష్కరించలేని పరిస్థితి వచ్చేసింది. గతంలోనూ హింసాత్మక సన్నివేశాలు చిత్రీకరించినా ఓ పద్ధతి ఉండేదని, ఇప్పుడు చిత్రీకరిస్తున్న సన్నివేశాల్లో ‘అతి’ కనిపిస్తోందని ప్రేక్షకులే అంటున్నారు. అయితే, రొడ్డకొట్టుడు కథలు ఎంతకాలం తీస్తాం? అందుకే వైవిధ్యం ఉండేలా అశ్లీలత, హింసా కథనాలను చూపిస్తున్నామని సినిమా పరిశ్రమ సమర్థించుకుంటోంది.
అలా కాదు, కుటుంబమంతా కలిసి చూడదగిన చిత్రాలను నిర్మించండని ఉత్తమాభిరుచి కలిగిన ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

-శేఖర్