క్రైమ్ కథ

ఐక్యు 184

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీస్ ఆఫీసర్ వారి ఇంటికి వచ్చినప్పుడు రీనా హోలీ లివింగ్ రూంలో ఉంది. ఆమె మొహం పాలిపోయి ఉంది. అతన్ని కిటికీలోంచి చూసిన ఛార్లెస్ హోలీ పైనించి కిందకి దిగి వచ్చాడు.
‘ఛార్లెస్. ఇతను లెఫ్టినెంట్ కేసీ. రిచర్డ్ మరణం గురించి విచారించడానికి వచ్చాను’ రీనా చెప్పింది.
ఛార్లెస్ బలంగా, లావుగా ఉన్న అతని దగ్గరికి వెళ్లి కరచాలనం చేశాడు. ఆశ్చర్యంగా ఆ బలమైన మనిషి చేతులు మృదువుగా ఉన్నాయి.
‘గుడ్ ఆఫ్టర్‌నూన్ లెఫ్టినెంట్. మీరు వస్తారని ఎదురుచూస్తున్నాం’ ఛార్లెస్ చెప్పాడు.
‘ఈ విచారకరమైన పరిస్థితిలో వచ్చి మీ ఇద్దర్నీ ప్రశ్నిస్తున్నందుకు సారీ. కాని ఇది పోలీస్ రొటీన్’
‘ఫర్వాలేదు. మీకేం అవసరమో దాన్ని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉందిగా’ చెప్పి ఛార్లెస్ అతని ఎదురు కుర్చీలో కూర్చున్నాడు.
‘రిచర్డ్ ఎలా మరణించాడో తెలుసుకోడానికి వచ్చానన్నారు. కాబట్టి అది చెప్పు’ రీనా మృదువుగా కోరింది.
రీనా మొహంలో ఎలాంటి ఆందోళనా లేకుండా మామూలుగా ఉండటం ఛార్లెస్ గుర్తించి మనసులోనే ఆశ్చర్యపోయాడు. ఆమెలోని భయం, విచారం బయటకి కనపడటంలేదు.
‘మీరేమీ అనుకోకపోతే అసలేం జరిగిందో మొదటి నించీ చెప్పండి. మీకు ఇబ్బంది లేకపోతేనే. లేదా తర్వాత రమ్మన్నా వస్తాను’ కేసీ కోరాడు.
‘మళ్లీ రావడం దేనికి? రిచర్డ్ వీకెండ్‌కి మా ఇంటికి అతిథిగా వచ్చాడు. బహుశ రీనా అది మీకు చెప్పి ఉండచ్చు. ఈ ఉదయం రిచర్డ్ నన్ను బయటకి రమ్మని, కొద్దిదూరం నడిచి వద్దామని కోరాడు. నాకు అది ఇష్టంలేక రానని చెప్పాను. కాని అది తనకి సహాయం అవుతుందని, రమ్మని అర్థిస్తే వెళ్లాను’
‘అతను మిమ్మల్ని ఎందుకు పిలిచాడు?’
‘రీనా గురించి మాట్లాడాలని. అదేదో ఆమెతో మాట్లాడితేనే మంచిదని నా అభిప్రాయం’ ఛార్లెస్ చెప్పాడు.
‘ఓ! మిసెస్ హోలీ?’ కేసీ ఆమె వంక తిరిగి అడిగాడు.
‘ఛార్లెస్ చెప్పినట్లుగా నేను కూడా మీకు అవసరమైంది దాచకుండా చెప్పాలి. రిచర్డ్ నాతో ప్రేమలో పడ్డాడు. నేను కూడా అతన్ని ప్రేమించాను’ ఆమె చేతులు స్కర్ట్ అంచులని కిందకి లాగాయి.
‘మొదట్లో అది మానసిక బంధం కాదు. కాని మా పరిచయం పెరిగే కొద్దీ అది బలమైన మానసిక బంధంగా మారింది. మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక దాచకుండా ఆ విషయం ఛార్లెస్‌కి చెప్పాను. వెంటనే ఛార్లెస్‌కి చాలా కోపం వచ్చింది. అతను ఆ విషయం చర్చించడానికే తిరస్కరించడం నా దురదృష్టం. దాంతో రిచర్డ్ ఛార్లెస్‌తో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు. నేను అయిష్టంగానే అందుకు ఒప్పుకున్నాను. వీకెండ్‌కి రిచర్డ్‌ని నేనే ఇక్కడికి ఆహ్వానించాను. ఛార్లెస్‌ని తనతో వాకింగ్‌కి రమ్మని రిచర్డ్ పిలవడానికి కారణం అదే’ రీనా చెప్పింది.
‘అవును. అందుకే పిలిచాడు. రీనా ముందు కాక బయట ఎండలో వేగంగా నడుస్తూ నాతో మాట్లాడాలని పిలిచానని నేను బయటకి వచ్చాక చెప్పాడు. ఓ మృదువైన విషయాన్ని ఇద్దరు పెద్ద మనుషులు చర్చల ద్వారా తేల్చాలని అనుకోవాలని అతని ఉద్దేశం అని చెప్పాడు. అసలు చర్చే అనవసరం అన్నది నా ఉద్దేశం. రిచర్డ్ పూర్తిగా అమాయకుడు. రీనా తమ ప్రేమ గురించి చెప్తే తిరస్కరించాను. ఐనా అతను చెప్తే నేను తిరస్కరించనని ఎలా అనుకున్నాడో తెలీదు. మర్యాద కోసం అతను చెప్పేది విన్నాను. మేము మాట్లాడుతూ చెట్ల మధ్య నది వైపు చేరుకున్నాం. నది మలుపు తిరిగే చోట ఉన్న ఎతె్తైన కొండ పైకి చేరుకున్నాం. అక్కడ ఉన్న ఓ చెక్క బెంచీ మీద కూర్చున్నాం. అతను చెప్పేది పూర్తి చేసే దాకా నేనేం మాట్లాడకుండా వింటూండిపోయాను. తర్వాత వారి పెళ్లి విషయంలో నా భావాల్లో ఎలాంటి మార్పూ లేదని, అది నాకు ఇష్టం లేదని చెప్పాను. వారి మధ్య సన్నిహిత సంబంధాన్ని నేను అంగీకరించలేదు. అసలు ఆ ఊహే నేను భరించలేక పోయాను’
రీనా అతని వంక చూడకుండా చేతు కట్టుకుని సోఫాలో నిటారుగా కూర్చుని, ఎదురుగా దృష్టిని నిలిపి అతను చెప్పేది వినసాగింది. అది ఆమెకి ఛార్లెస్ ముందుగా చెప్పిందే కాబట్టి కొత్త సమాచారం కాదు.
ఇంతదాకా జరిగింది జరిగినట్లు చెప్పాను. నేను ప్రమాదకరమైన అంశం దగ్గరికి చేరుకున్నాను. ఇక నిజం చెప్తే ప్రమాదం అని ఛార్లెస్ మనసులో అనుకున్నాడు.
‘తర్వాత?’ కేసీ అడిగాడు.
‘రిచర్డ్ నా మీద చాలా కోపం తెచ్చుకున్నాడు. నేను అక్కడ నించి లే వెనక్కి వచ్చేద్దామని అనుకున్నాను. నేను లేచి కొండ అంచు వైపు నడిచాను. రిచర్డ్ కోపంగా నన్ను అనుసరించి నా చేతిని పట్టుకుని ఊపాడు. ఎవరైనా నన్ను ప్రేమగా ముట్టుకోవడం కూడా నాకు నచ్చదు. నేను విడిపించుకునే ప్రయత్నం చేసాను. అతను నాకన్నా బలమైన వాడు. నన్ను వదల్లేదు. చివరికి పెనుగులాడి విడిపించుకున్నాను. దాంతో అతని బేలన్స్ తప్పింది. ఆ సమయంలో మేము కొండ అంచున నిలబడి ఉన్నాం. అతను కాని, నేను కాని ఆ మానసిక స్థితిలో ఎంత అంచున నిలబడి ఉన్నామో గ్రహించలేదు. అతను తూలి కింద పడిపోయాడు. అక్కడ నించి కింద నది ఒడ్డున అనేక బండ రాళ్లు ఉన్నాయి. సరిగ్గా వాటి మీద పడ్డాడు. మీరు అతని శవాన్ని చూసింది అక్కడే. కింద పడ్డ తక్షణమే మరణించాడని అనుకుంటాను. ఎందుకంటే అతన్ని పేరు పెట్టి పిలిచినా బదులు పలకలేదు. కదల్లేదు. పడబోయే ముందు నేను అతని చేతిని పట్టుకుని ఆపే ప్రయత్నం చేశాను. అతని బరువుని ఆపేంత బలం నాకు లేక జారిపోయాడు’ ఛార్లెస్ చెప్పడం ఆపాడు.
తను అవసరమైన, ముఖ్యమైన అబద్ధాన్ని సృష్టించాడు. తప్పు దారి పట్టించాడు. చిన్న అబద్ధం. స్వల్పమైన అడ్డదారి. పట్టుకోడానికి, తోయడానికి మధ్య గల చిన్న తేడా. అమాయకత్వానికి, నేరానికి మధ్య గల తేడా. కేసీ తను చెప్పింది నమ్మినట్లుగా కనిపిస్తున్నాడు. కాని రీనా అలా కనిపించడం లేదు. నోరు విప్పి ఖండించకపోయినా రీనాకి మొత్తం తెలుసు. రిచర్డ్ ఎలా మరణించాడో రీనాకి తెలుసు. ఎందుకు అన్నది ప్రాముఖ్యత లేనిది. ఏది ఏమైనా తను రిచర్డ్‌కన్నా ఆమెని అధికంగా ప్రేమిస్తున్నాడని ఈ హత్య వల్ల ఆమె ఈపాటికే గ్రహించి ఉండాలి. ఆమె తనకి మాత్రమే చెందాలి అన్న తన భావన ఎంత బలమైందో ఈపాటికి రీనా అర్థం చేసుకుని ఉండాలి. ఆమె ఎప్పుడూ ఎవరికీ బయటి వారికి చెందకూడదు.
‘అంతేనా? ఇంకేదైనా చెప్తారా?’ కేసీ తన నోట్‌బుక్‌ని మూసి అడిగాడు.
‘అంతే’
‘పోలీసులు వచ్చేదాకా శవాన్ని ముట్టుకోకపోవడం మీరు చేసిన తెలివైన పని. ఇంత దుఃఖంలో కూడా మీరు చాలా సహకరించినందుకు థాంక్స్ ఛార్లెస్’
ఛార్లెస్ అతనితో మరోసారి కరచాలనం చేశాక చెప్పాడు.
‘ఇక నాతో అవసరం లేకపోతే నా గదికి వెళ్తాను. నేను రిచర్డ్‌కి ఏ సహాయం చేయలేక పోయినందుకు బాధగా ఉంది’
‘అలాగే. ఆ చెడ్డ అనుభవం తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, మీ మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు’
ఛార్లెస్ రీనా వైపు తిరిగాడు. ఆమె ఏదో ఆలోచనల్లోంచి తేరుకుని ఏం మాట్లాడకుండా సరే అన్నట్లుగా తలఊపింది.
ఛార్లెస్ తన గదిలోకి వెళ్లాక కేసీ రీనాతో చెప్పాడు.
‘ఛార్లెస్ తెలివైన కుర్రాడు’
‘అవును’ రీనా చెప్పింది.
‘తన తల్లిని కొడుకు పేరుతో సంబోధించడం నాకు ఆశ్చర్యంగా ఉంది’
‘ఛార్లెస్ నిజానికి కుర్రాడు కాదు లెఫ్టినెంట్. పనె్నండేళ్ల వయసు వాడైనా మినహాయింపు గలవాడని చెప్పాలి. వాడి ఇంటలిజెన్స్ కోషియెంట్ 184.’
ఆమె కంఠంలో సహజంగా ధ్వనించే గర్వం బదులు విచారం ధ్వనించడం కేసీ గ్రహించినా అది రిచర్డ్ ఆకస్మిక మరణానికి చెందిందిగా అతను భావించాడు.
*
(ఫ్లెచర్ ఫ్లోరా కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి