మెదక్

మెదక్‌లో దొంగల స్వైరవిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఫిబ్రవరి 14: మెదక్ పట్టణం సాయినగర్, వెంకట్రావ్‌నగర్ కాలనీలలో శనివారం మధ్యరాత్రి ఆరు ఇళ్లలో దొంగలు స్వైర విహారం చేశారు. తాళం వేసివున్న ఈ ఇళ్ల యథేచ్ఛగా దొంగతనానికి పాల్పడ్డారు. వెంకట్రావ్‌నగర్‌లో ఉన్నటువంటి జడ్జి రాజ్‌కుమార్ శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం ముగిసిన తరువాత హైదరాబాద్‌కు వెళ్లారు. తాళం వేసి ఉన్న ఆయన ఇంటి తాళాలను దుండగులు పగులగొట్టారు. ఇంటిలోకి చొరబడి బీరువాను పగులగొట్టి బట్టలు తదితర వస్తువులను చిందరవందర చేశారు. కానీ అక్కడ దొంగలకు ఏమీ దొరకలేదని మెదక్ సిఐ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపారు. కాగా ప్రక్కనే ఉన్న సుంకరి కిష్టయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువాను పగులగొటి బంగారు అభరణాలు, గల్ల్లాపెట్టె, రూ.36 వేల నగదు దోచుకెళ్లినట్లు బాధితుడు సుంకరి కిష్టయ్య తెలిపారు. శనివారం కుటుంబ సమేతంగా బంధువుల వద్దకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. అదే కాలనీలో కిరాయికి ఉంటున్న టీచర్ బాలమల్లు ప్రభుత్వ టీచర్. బావమరిది పెళ్లికి శనివారం ఇంటికి తాళం వేసి వెళ్లగా దొంగలు ఇంటి తాళాలను పగులగొట్టి సామగ్రిని చిందరవందర చేసినా ఏమీ దొరకలేదని పోలీసులు పేర్కొన్నారు. అలాగే రామాయంపేటలో పంచాయితీరాజ్ శాఖ ఇఓగా పనిచేస్తున్న బట్టి శ్రీహరిరాజు సాయినగర్ కాలనీలో కాపురం ఉంటూ కుటుంబ సభ్యులతో బంధువుల పెళ్లగా శనివారం రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి ఇంటిలో ప్రవేశించిన దొంగలు బీరువాను పగులగొట్టి 12 తులాల వెండి, రూ.4 వేల నగదు దోచుకున్నట్లు మెదక్ సిఐ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపారు. అదే విధంగా శ్యామ్ పిఈటి ఇంట్లో కూడా దొంగలు ప్రవేశించారు. కానీ అక్కడ ఏమి దొరకలేదని పోలీసులు తెలిపారు. పర్సులో రెండు భాగాల్లో తెరచి చూశారుగానీ, 3వ భాగంలో దొంగలు తెరవలేదు, ఈ సంచిని సిఐ సాయి ఈశ్వర్‌గౌడ్ పరిశీలించగా మరొక భాగంలో రూ.6800 రుపాయలు గుర్తించి అశోక్‌కు అందజేశారు. ఈ విధంగా దొంగలు సాయినగర్ కాలనీ, వెంకట్రావ్‌నగర్ కాలనీల్లోని తాళాలు వేసిన ఇళ్ల్లలో బీభత్సం సృష్టించారు. పట్టణలో దొంగలు తాళాలు వేసిన ఇండ్లలో దోపిడికి తలపడుతున్నందున ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఉద్యోగ సాధనలోనూ ముందుండాలి

సిద్దిపేట, ఫిబ్రవరి 14 : తెలంగాణ సాధన ఉద్యమంలో మందువరుసలో నిలిచిన సిద్దిపేట..ఉద్యోగ సాధనలో రాష్ట్రంలోనే ముందుండాలని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు సూచించారు. సిద్దిపేట కాటన్ మార్కెట్ యార్డులో గ్రూపు-2 ఉద్యోగ ఉచిత శిక్షణను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట ప్రాంత నిరుద్యోగులకు అధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోనే నిష్ణాతులైన ఫ్యాకల్టీచే గ్రూప్-2 శిక్షణను ప్రారంభించినట్లు తెలిపారు. హైదరాబాద్ గ్రూప్స్‌కు దీటుగా సిద్దిపేటలో రాష్ట్రంలో పేరుగాంచిన శిక్షకులతో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు కృషిచేసినట్లు తెలిపారు. ఇప్పటికే 10వేల కానిస్టేబుల్స్, గ్రూపు-2 పోస్టులు, 10వేలకు పైగా డిఎస్సీ పోస్టులు, వివిధ శాఖల్లో ఇంజనీరింగ్ పోస్టులను సుమారు 30వేల వరకు భర్త్తీ చేసినట్లు తెలిపారు. మరో ఆరు నెలల నుంచి సంవత్సరంలోగా లక్ష ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో ఇటీవలే 550 మందికి కానిస్టేబుల్ శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాలకే పరిమితమై బిసి స్టడీ సర్కిల్ సెంటర్‌ను సిద్దిపేటకు మంజూరు చేసినట్లు తెలిపారు. బిసి స్టడీ సర్కిల్ సెంటర్‌లో ఉచిత కోచింగ్ శిక్షణ నడుస్తుందన్నారు. మరో బ్యాచ్‌కు తన సొంత ఖర్చులతో నిరుద్యోగ యువతకు గ్రూప్- 2 శిక్షణ ఉచితంగా ఇప్పించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో గ్రూపు-2 కోచింగ్‌కు ఫీజు, ఇతర ఖర్చులతో కలసి రూ.30వేల నుంచి 40 వేల ఉందన్నారు. కాగా సిద్దిపేటలో అదే నాణ్యమైన గ్రూప్-2 శిక్షణను ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లని.. అదే తరహాలో అధిక ఉద్యోగాలను ఈప్రాంతం వారు కైవసం చేసుకోవాలనేదే తన ఉద్దేశ్యమన్నారు. గ్రూప్- 2 శిక్షణ శిబిరంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ప్రత్యేక క్లాసులు ఇప్పించి నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఉద్యోగ సాధనకు పూర్తి స్థాయి సన్నద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు చెందిన కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ, ఆర్డీఓ స్థాయి అధికారులతో పాటు, పదవీ విరమణ చేసిన యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్లతో క్లాసులు ఇప్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 17న ప్రారంభమవుతున్న శిక్షణ తరగతులు, ఏప్రిల్ 17న ముగుస్తాయన్నారు. ఇందుకోసం నిరుద్యోగులకు అర్హత పరీక్ష నిర్వహించి ప్రతిభావంతులైన 350 మందిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కనీసం ఇందులో 150కు పైగా ఉద్యోగాలు సాధించటమే లక్ష్యమన్నారు. గ్రూపు-2 శిక్షణ గ్రూపు-1, 3, 4కు సైతం దోహదపడుతుందన్నారు. నిరుద్యోగ యువత అన్ని ఆలోచనలూ పక్కకుపెట్టి ఉద్యోగ సాధనే లక్ష్యంగా చదవాలన్నారు. ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు అండగా నిలవాలన్నారు. పిల్లలు ఉద్యోగాలు సాధిస్తే తల్లిదండ్రులకు మించి ఎవ్వరూ సంతోషపడరన్నారు. పట్టుదలతో ప్రయత్నం చేస్తే సాధించనిది ఏమీలేదన్నారు. ఉద్యోగ సాధనే టార్గెట్‌గా ఎంచుకొని రోజుకు 16నుంచి 18గంటలు పైగా పట్టుదలతో చదవాలన్నారు. మనస్సును నియంత్రించి జయించగలిగితే ప్రపంచానే్న జయించవచ్చన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వందశాతం సద్వినియోగం చేసుకొని సిద్దిపేట టాపర్‌గా నిలిచిందన్నారు. ఉత్తమ మండలం, ఉత్తమ నియోజకవర్గం, ఉత్తమ గ్రామాలు సైతం సిద్దిపేట నుంచి ఎంపికై ఆదర్శంగా నిలిచాయన్నారు. నిరుద్యోగ యువత ఆత్మవిశ్వాసంతో శిక్షణ పొంది అధిక ఉద్యోగాలను సాధించాలని మంత్రి హరీష్‌రావు ఆకాంక్షించారు. రెండునెలల శిక్షణ కాలంలో వరుసగా మూడు రోజులు గైర్హాజరు అయితే వారిని శిక్షణ నుంచి తొలగించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత శిక్షణను సీరియస్‌గా తీసుకోవాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. గ్రూప్-2 శిక్షణలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే సత్వరమే పరిష్కరిస్తానన్నారు. శిక్షక్షుడు జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా గ్రూపు- శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నిత్యం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి శనివారం వరకు శిక్షణ, ఆదివారం వాటిపై పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతచే ఉద్యోగ సాధనే లక్ష్యంగా కష్టపడి చదువుతామని ప్రమాణం చేయించారు. ఈసమావేశంలో జడ్పీ వైస్‌చైర్మన్ సారయ్య, ఎంపిపి జాప శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిన్నా,నాయకం లక్ష్మణ్, గౌటి అశోక్, శ్రీకాంత్, రవీందర్‌రెడ్డి, పాపయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

సానుభూతా.. అభివృద్ధా..?
ఖేడ్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో
ఈవిఎంలలో అభ్యర్థుల భవితవ్యం
16న ఓట్ల లెక్కింపు
నారాయణఖేడ్ ఫిబ్రవరి 14: నారాయణేడ్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలు శనివారంనాడు ముగిశాయి. మొత్తం 286 పోలింగ్ కేంద్రాలకుగాను 1ల 87వేల మంది ఓటర్లు ఉండగా అందులో 82.21 శాతం పోలింగ్ జరిగినట్లు కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 1,54,866వేల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎం, భూపాల్‌రెడ్డి, టిడిపి అభ్యర్థి ఎం, విజయపాల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పి, సంజీవరెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎం. భూపాల్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని ఆపార్టీ నాయకులు పూర్తి ధీమాతో ఉన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి. సంజీవరెడ్డి సైతం గెలుపు ధీమాతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు గెలుపులేక పోయిన డిపాజిట్ వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ప్రతి గ్రామంలో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి మంత్రి హరీష్‌రావు కృషితో ఓట్లు వేసినట్లు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఖేడ్‌లో చరిత్ర సృష్టిస్తానని మంత్రి అన్న మాటలు నిజం అవుతాయా అనే చర్చ రాజకీయ పరిశీలకులు చేస్తున్నారు. మేథావులు విద్యావంతులు. ఉపాధ్యాయులు అధికార పార్టీ వైపే మొగ్గు చూపారని తెలిసింది. ఖేడ్ మండలం జూకల్ గ్రామ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఇవీ ఎంలు భద్రపరిచారు. అక్కడ భారీ బందోబస్తు పోలీసులను ఏర్పాటు చేశారు. 14 రౌండ్‌లు ఓట్ల లెక్కింపు ఏర్పాటు చేస్తునట్లు అధికారులు అంటున్నారు. ఈనెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీ ల నాయకులు ఉప ఎన్నికల ఫలితాలను ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి మంత్రం అధికార దాహంతో టిఆర్‌ఎస్ వైపు ఓట్లు వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీపై ఆంధ్ర పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తారని హరీష్‌రావు ప్రచారం చేయడంతో ప్రజల్లో కొంత మార్పు వచ్చినట్లు తెలిసింది. ఎక్కువ శాతం ఓటర్లు టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరారు. అభ్యర్థుల భవిత్యం 16న పూర్తి తెలిపోతుందని చెప్పావచ్చును.

వారం రోజుల్లో సిద్దిపేట బల్దియా సందిగ్ధానికి తెర
నోటిఫికేషన్ రాకకోసం నేతల ఎదురు చూపు
అడ్వకేట్ జనరల్‌తో కమిషనర్ మంతనాలు
అభ్యర్థుల కోసం పార్టీల వెతుకులాట
కోర్టు తీర్పుపై ఆధారపడిన ‘పుర’పాలన
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, ఫిబ్రవరి 14: నాలుగేళ్లుగా నానుతున్న సిద్దిపేట బల్దియా ఎన్నికలకు వారం రోజుల్లోగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండటంతో సందిగ్దానికి త్వరలోనే తెరపడనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అస్పష్టంగా ఉన్న గ్రామ పంచాయతీల విలీనంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు స్పష్టమైన జివోను జారీ చేయడంతో సిద్దిపేట పురపాలక సంఘానికి త్వరలోనే ఎన్నికలు రావచ్చన్న ఆశలు చిగురిస్తున్నాయి. 2012 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట మున్సిపాలిటీలోకి ప్రశాంత్‌నగర్, హనుమాన్‌నగర్, ఇమాంబాద్, రంగధాంపల్లి, నర్సాపూర్, గాడిచెర్లపల్లి గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ జివోను జారీ చేసింది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండగా ఆర్థికంగా వెనుకబడిన గ్రామ పంచాయతీలను ఏ గ్రేడ్ మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు, నల్లా బిల్లులు చెల్లించడానికి గ్రామీణ ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఆయా గ్రామాలకు చెందిన నాయకులు కోర్టును ఆశ్రయించారు. విలీనం చేసిన గ్రామ పంచాయతీలతో కలిపి ఎన్నికలు నిర్వహించకూడదని కోర్టు స్టే మంజూరు చేసింది. దీంతో 2014లో జరగాల్సిన సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల విలీనంపై నిశితంగా పరిశీలించడమే కాకుండా రాజకీయ నిపుణులతో సమాలోచనలు చేసి పునః పరిశీలన ద్వారా కొత్తగా స్పష్టమైన జివోను విడుదల చేసింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుపై ప్రభుత్వం వాదనలు వినిపించడానికి సిద్దమైంది. ఈ మేరకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ఆడ్వకేట్ జనరల్‌ను సంప్రదించి పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో కోర్టులో ఉన్న పెండింగ్ కేసుకు తుది తీర్పు వెలువడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చేసిన ఆదేశాల మేరకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. బల్దియా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న దరిమిలా ఆయా పార్టీలు పోరుకు సిద్దమవుతున్నాయి. ప్రస్తుత సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు కొత్తగా విలీనం అవుతున్న ప్రశాంత్‌నగర్, హనుమాన్‌నగర్, ఇమాంబాద్, రంగధాంపల్లి, నర్సాపూర్, గాడిచెర్లపల్లి గ్రామాలతో కలుపుకుని మొత్తం 88 వేల ఓట్లు ఉన్నాయి. వీటిని విభజించి 34 వార్డులుగా ఏర్పాటు చేసారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీ పట్టు అధికంగా ఉన్న సిద్దిపేటలో ఆ పార్టీ నుంచి టికెట్ దక్కించుకుని పోటీ చేయాలని ఆలోచిస్తున్న దిగువ శ్రేణి నాయకులంతా మంత్రి హరీష్‌రావు వద్దకు క్యూ కడుతున్నట్లు సమాచారం. తామేమి తక్కువ కాదని, స్థానిక సంస్థల్లో పార్టీలకన్నా ఎక్కువగా వ్యక్తులకే ప్రాధాన్యతను ఇస్తారనే నమ్మకంతా కాంగ్రెస్, టిడిపి, బిజెపి, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపడానికి ప్రజామోదం కలిగిన నాయకుల కోసం వెతుకులాట ప్రారంభించాయి. మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేంద్ర బిందువుగా నిలిచిన సిద్దిపేట ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీని ఆధరించి కారుకు కంచుకోటగా నిలిపారు. అదే నమ్మకంతో మంత్రి హరీష్‌రావు నోటిఫికేషన్ వెలువడిన వెనువెంటనే అన్ని వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి వారికి ఇతర పార్టీల నుంచి పోటీ లేకుండా ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకునేలా చేయాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిహెచ్‌ఎంసి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమానికి పురిటిగడ్డ అయిన సిద్దిపేటలో కూడా ప్రత్యర్థి పార్టీలను వాష్ అవుట్ చేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా వారం రోజుల్లో సిద్దిపేట పురపాలక సంఘానికి ఎన్నికలు రావడం తథ్యమని చెప్పవచ్చు. వారం రోజులు కాకపోయినా మార్చి నెలలోనైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేకపోలేదని మున్సిపల్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.