S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జానపదాన్ని జనపదం చేసిన విదుషీమణులు

మధూదయంలో మంచి ముహూర్తం
మాధవీ లతకు పెళ్లి
మాధవి పెళ్లికి మల్లీ...
మందారం పేరంటాళ్లు॥
కొమ్మకొమ్మ కొక సన్నారుూ
రెమ్మ రెమ్మ కొక గవారుూ॥
కొమ్మా రెమ్మా కలిసి మామిడి
గుబురంతా ఒకటే హారుూ॥
పాటల తోటమాలి దేవులపల్లి కృష్ణశాస్ర్తీ
1938లో రాసిన గీతం ఇది.
నవ్య సాహిత్య వైతాళికుడు, భావ కవుల్లో అగ్రగణ్యుడు ‘పద్మభూషణ్’ దేవులపల్లి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి కంఠంలో భీంపలాస్ రాగంలో మొదటిసారి వినిపించిన పాట ఇది. ఈ పాటకో చరిత్ర ఉంది. ఎప్పుడో 1930లో గళం విప్పి, స్వరరచనకు హార్మోనియం మెట్ల మీద సున్నితంగా వేళ్లు కదుపుతూ.. కవి, పండితుల మధ్య మసలుతూ కూడా, జానపద సంగీతాన్ని తొలిసారిగా సంగీత సభా వేదికలెక్కించిన ఒక సాహసురాలు అనసూయ.
శాస్ర్తియం లలిత శాస్ర్తియం అనే పిలుపులకు అలవాటైన ‘సభా సంగీతం’లోకి భావగీతమనే గాన విధానాన్ని పరిచయం చేసి, ఆ తరువాత రేడియో ద్వారా స్పష్టమైన రూపాన్ని ఏర్పరచుకున్న ‘లలిత సంగీత గానానికి’ ఆద్యురాలు, దేవులపల్లి అనే పలుకుబడిగల భావకవికి, బాల్యం నుంచీ దోహదకారి కావడంలో ఆశ్చర్యం లేదు. సహజశుద్ధంగా, కట్టుదిట్టమైన పద్ధతుల్లో శాస్ర్తియ సంగీతాన్ని దీక్షతో నేర్చుకుని, వాడవాడలా గౌరవప్రదమైన జానపద భావగీత రీతుల ప్రచారాన్ని ఒక ఉద్యమంలా నడిపిన ‘సీత, అనసూయ’ల పేర్లు ఈ తరం వారికి ఎక్కువ తెలియకపోవచ్చు. త్యాగరాజ గానసభ ఆధ్వర్యంలో వీరిద్దరి పాట 1955/60 సం.ల మధ్య ఏలూరు, వైఎంహెచ్‌ఎ హాలులో నేను విన్న గుర్తు బాగా ఉంది.
‘అన్నాడే వస్తానన్నాడే నా
నేస్తము విడువలేనన్నాడే’ అంటూ ఈ ఇద్దరూ, కొప్పులో మల్లెపూలు దండిగా పెట్టుకుని శ్రుతి మాధుర్యాన్ని నింపి పాడుతూంటే హాలంతా నాదమయమై పోయేది. కాకినాడలో కొమ్మిరెడ్డి సూర్యనారాయణగారి నిర్వహణలో సరస్వతీ గానసభ, ఏలూరులో కంచంమెట్టు వెంకట సుబ్బారావుగారి సభ, రాజమండ్రిలో (త్యాగరాజ గానసభ) బుగ్గా పాపయ్య శాస్ర్తీ, మల్లాది శ్రీరామమూర్తి (మా నాన్నగారు) గారల ఆధ్వర్యంలో జరిగే సంగీత కచేరీలన్నీ పెద్దపెద్ద విద్వాంసులతోనే ఉండేవి.
దక్షిణాదిలో బాగా ప్రసిద్ధులైన మహారాజపురం విశ్వనాథయ్యర్, కుంభకోణం రాజమాణిక్యం పిళ్లె (వయొలిన్), మహాలింగం (వేణువు), అరియకుడి రామానుజం అయ్యంగార్, మధుర్ మణి అయ్యర్ లాంటి విద్వాంసుల కచేరీల మధ్యలో ఈ సీత, అనసూయల లలిత జానపద సంగీత కచేరీ ఉండేదంటే వీరి పాటకున్న మోజు, వారి పాటల్లోని సంగీత మాధుర్యం ఎంతో తెలుసుకోవచ్చు.
నేను రేడియోలో ఉద్యోగం చేసే రోజుల్లో సీత, అనసూయలు రికార్డింగ్‌లకు వస్తూండేవారు. గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఓసారి ఆలిండియా రేడియో వారు ఏర్పాటు చేసిన లలిత సంగీత కార్యక్రమంలో మాధవపెద్ది సత్యం, ఎం.ఎస్.రామారావు, సీత, అనసూయలతోపాటు నేనూ పాడాను.
నేను సి.నారాయణరెడ్డి రాసిన ‘ఏలా ఈ మధుమాసము, వోలేటిగారు స్వరపరచగా పాడాను. ‘హే భారత జననీ’ దేవులపల్లి వారి పాట వారిద్దరూ పాడారు.
కల్తీలేని స్వచ్ఛమైన తెలుగు జానపద సంగీతంలోని మాధుర్యాన్ని ఆంధ్ర దేశంలోని రసికులకు పంచిపెట్టిన ఈ సీత, అనసూయల సంగీత ప్రస్థానం కర్ణాటక సంగీతం పునాదిగా సాగిందంటే, మీకు కాస్త ఆశ్చర్యం కలిగించవచ్చు.
జానపద గేయాలంటే కొంతమందికి చిన్నచూపు లేకపోలేదు. పద్మశ్రీ ఈమని శంకరశాస్ర్తీ, ఓలేటి వెంకటేశ్వర్లు, టి.కె.యశోదాదేవి, అల్లంరాజు సోమేశ్వర్రావు వంటి విద్వాంసుల్ని తయారుచేసిన గురువే ఈ సీత అనసూయలకు సంప్రదాయ సంగీతంలోని రుచిని అలవాటు చేయడం గమనార్హం.
ఎప్పుడూ శిష్యుల గొప్పతనానికి కారకులు గురువులే. కాకినాడలో మునుగంటి వెంకట్రావు పంతులుగారి శ్రీరామ సమాజం ఒక నాద నిలయం. చాలా ప్రసిద్ధమైనది. ఉచిత వసతి భోజన సదుపాయాలతో సంప్రదాయ సంగీతంలోని మాధుర్యాన్ని జిజ్ఞాసులకు అలవాటు చేసి పెట్టిన మహానుభావుడు పంతులుగారు. ఆయన దగ్గర నేర్చుకున్న వారంతా విద్వాంసులయ్యారు.
సంప్రదాయ సంగీత విద్వాంసుల మాదిరిగా మడికట్టుకోకుండా, సంగీతంలో సమన్వయాన్ని సాధించడానికి నిర్భయంగా ఒక అడుగు ముందేసి ఉభయ సంగీత బాణీల మధ్య సామరస్యం ఉండాలని భావించేవాడాయన.
మన ‘రాగం మోహన - హిందూస్తానీ సంప్రదాయంలో భూప్, మన శంకరాభరణం వారి బిలావత్. ఇలాంటి రాగాలన్నీ బాణీలలో మార్పే తప్ప పదార్థం ఒకటే కదా!
ఈ రెండు విధానాల్లో వున్న మంచిని గ్రహించమని చెప్పే అభ్యుదయ గాయకుడు, విద్వాంసుడు వోలేటి గారు హిందూస్తానీ సంప్రదాయం పట్ల ఆకర్షితుడవడానికి దోహదపడిన వ్యక్తి వెంకట్రావు పంతులుగారే.
సంగీతం అంటే నాద ప్రధానమైన శుద్ధమైన సంగీతం, భాష కేవలం ఒక ఉపకరణం మాత్రమే అంటూండేవారు.
కానీ గాయకుడు పాడే విధానంలో మాధుర్యానికి విఘాతం కలగకుండా, సాహిత్యం అందులో భావం చెడకుండా పాడాలని అనేవారు. క్రమశిక్షణతో కూడిన కట్టుదిట్టమైన గురువు దొరకడం వల్ల సీత, అనసూయ పాడిన పాటల్లో నాణ్యత కనిపిస్తూండేది.
అనసూయ సంగీత ప్రవాహాన్ని పాటల నందనవనంలోకి మళ్లించిన వల్లూరి జగన్నాథరావు ఈమెకు జానపద సంగీత గురువు.
జానపదం అంటే జనపదాల్లో పాడుకునేవి. ఊడ్పుల వేళల్లో పచ్చని పొలాల్లో పనిచేస్తూ తమ కష్టాన్ని మరచి గొంతెత్తి పాడే పల్లెపడుచుల పాటల్లో, జోల పాటల్లో, ఏల పాటల్లో, పెళ్లి పాటల్లో, వదినా మరదళ్ల సరసాల్లో, జముకుల పాటల్లోనూ జనపదుల అమాయకత్వం కనిపిస్తుంది. ఇదే దేశీ సంగీతం. శాస్ర్తియ సంగీతం. భక్త్భివ పునీతం. దేశి సంగీతం నవరస భరితం. సంప్రదాయ సంగీతానికి ఒకప్పుడు రాజాదరణ ఉండేది. ఈ దేశి సంగీతం సామాన్య శ్రోతకి బాగా చేరువైంది. జానపద గేయాలకు ‘కట్టుబాట్లు ఉండక్కర్లేదు’ అనుకునే వారికి సీత, అనసూయల సంగీతంలో సుస్వరం, సునాదం, చక్కని లయ, భావం, పూర్తిగా నిండిపోయి, శ్రోతల్ని కట్టిపడేసేది.
హిందీ సినీ రంగంలో చాలా ప్రసిద్ధులైన నౌషద్ అలీ, సి.రామచంద్ర, అనిల్ బిస్వాస్, పంకజ్ మల్లిక్, వసంత దేశాయ్, హేమంత్‌కుమార్, ఓ.పి.నయ్యర్, శంకర్ జైకిషన్‌లు వివిధ ప్రాంతాల జానపద సంగీతాల్లోని వైవిధ్యాన్ని నిశితంగా పరిశీలించి, అత్యద్భుతమైన గీతాలు చేశారు.
ఆ పాటల్లో వెకిలితనం, వెర్రితనం ఏ మాత్రం ఉండేది కాదు. సినిమాల్లో కనిపించే హీరో హీరోయిన్ల గౌరవానికి భంగం కల్గించే లక్షణాలేవీ ఉండేవి కావు.
జానపద శైలిలోని ఆ పాటల్లో ఎంతో హుందాతనం కనపడేది. ‘మెలోడీ’ని తప్పించకుండా, పాటలు చేసిన ఘనులు వాళ్లు. అనసూయ జానపద సంగీత ప్రస్థానం గమ్మత్తుగా ఆరంభమైంది. ఓసారి కాకినాడ టౌన్‌హాలులో కర్ణాటక సంగీత పోటీలు జరిగాయి. అనసూయ ఆ రోజుల్లో ప్రసిద్ధుడైన బిడారం రాచప్ప (మైసూర్ ఆస్థాన విద్వాంసుడు) గ్రామఫోన్ రికార్డులో ‘మగడొచ్చి పిలిచేడు పోయి వత్తురా స్వామి’ అనే జావళి పాడింది. సభికుల్లో వున్న వల్లూరి జగన్నాథరావుకు ఈమె కంఠం నచ్చింది.
జానపద గీతాలు పాడేందుకు సరిగ్గా ఆ కంఠం నప్పుతుందని, ఒప్పించి కొలంబియా గ్రామఫోన్ కంపెనీ వారికి కొన్ని పాటలు రికార్డు చేశారు.
అనసూయ, జగన్నాథరావు కలిసి కొన్ని పాటలు పాడారు. ‘అయ్యో కొయ్యాడ’ పాట ఆమెకు ఎంతో పేరు తెచ్చింది.
కొయ్యోడు, చిట్టెమ్మ పాడుకునే ఈ యుగళ గీతం..
చుక్కల కోక కట్టుకోని
చుట్టూ గోటూ రైకా తొడిగి
బుర్ర నున్నగ దువ్వూకోని
బొట్టూ, కాటుక పెట్టూకోని
నోటిలో సుట్టా పెట్టూకోని
గోటుగా నే నడసుకుంటూ ఎక్కడికెల్తవు చిట్టెమ్మంటె॥
1928లో వల్లూరి జగన్నాథరావుతో కలిసి అనసూయ పాడిన మొట్టమొదటి గ్రామఫోన్ రికార్డు ఇది. ‘శంకరాభరణం’ రాగంలో తయారైంది. ఎన్ని అవధులూ, అగడ్తలూ దాటుకుంటూ వచ్చాయో ఈ జానపద గేయాలు?
ఎంత ప్రాణం ఉందో వీటికి?
సరళంగా ఉంటాయి. సుందరంగా వినిపిస్తాయి.
తెలుగువారి జానపద సంగీతానికి, లలిత శాస్ర్తియ సంగీతంతోపాటు, గౌరవ స్థానం, సభార్హత రావడానికి ముఖ్య కారకులు సీత, అనసూయలే.
పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరగడం వల్ల, పిఠాపురంలో దేవులపల్లి వారుండటం వల్ల, రెండెడ్ల బండిలో పిఠాపురం వెళ్లే అనసూయకు ‘సత్యభామ కట్టిన భామాకలాపం’ రథోత్సవాల్లో చెక్క భజనలూ, తప్పెటలూ, కోలాటాలూ, తోలుబొమ్మలూ, పడవల్లో పాడుకునే పాటలు, గరగరలూ బాగా గమనిస్తూ ఉండేది.
తు.చ. అలాగే పాడుతూ ఆ పాటలకు సునాదం కూడా జోడించి పాడటంతో రక్తిగా తయారై వినాలపినించేవి.
‘రోజులు మారాయి’ చిత్రంలోని ‘ఏరువాక సాగాలోయ్’ జిక్కి పాడిన పాట ‘అయ్యో కొయ్యోడ’ వరుసే. చాలా భాషల్లో ఈ ట్యూన్ వినిపించేంతగా ప్రసిద్ధమైంది.
అలాగే మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచెకాడ కలుసుకో మరువకు మావయ్యా పాట చాలా ప్రసిద్ధమై పోయింది. ఈ పాట రాసిన ఏలూరులోని కొనకళ్ల వెంకటరత్నం, మా నాన్నగారూ స్నేహితులే.
శ్రుతిశుద్ధంగా, లయబద్ధంగా రక్తిగా జానపద గేయాలు బాగా పాడుకోవచ్చునని చెప్పిన జానపద కళాస్రష్ట వల్లూరి. 1938లో ఆలిండియా రేడియోలో జానపద సంగీతం ప్రవేశపెట్టిన ఘనత అనసూయకు చెందుతుంది. జానపద సంగీతంలో చేసిన కృషికి అనసూయకు ‘కళాప్రపూర్ణ’తో సత్కరించారు. నేను విజయవాడ రేడియోలో వివిధభారతిలో ఉద్యోగం చేసే రోజుల్లో ప్రత్యేకంగా ఈ జానపద గీతాలపై కొన్ని కార్యక్రమాలు సమర్పిస్తూ వుండేవాణ్ణి.
అడివి బాపిరాజు గారి ‘నువ్వూ నేను కలిసి’ అనే లలిత గీతం మోహనరాగంలో పాడిన పాట, ఓ నందగిరి బంగారు మామ, నక్కలోళ్ల సిన్నదాన్ని లాంటి పాటలు.. శ్రోతలకు విపరీతంగా నచ్చేవి. ఎన్నో ఉత్తరాలూ వచ్చేవి.
దశావతారాల పాట - చేట్రాయి సామి దేవుడా! మరో ప్రసిద్ధమైన పాట - మొట్టమొదట ఈ ఇద్దరే పాడారు.
శాస్ర్తియ సంగీతంలో ప్రతి పాటా రాగంలోనే ఉండాలనే నియమం లేదు. కానీ ఈ ఇద్దరి పాటలోనూ, మాధుర్యంతో నిండిన రాగచ్ఛాయలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
జానపద సంగీతానికి ఏ శాస్త్ర గ్రంథాలూ ప్రమాణం కావు. వాళ్ల హృదయాలే వాళ్లకు ఆధారం. పరికించి చూస్తే వాళ్ల పాటల్లో హనుత్తోడి, మాయా మాళవగౌళ, నటభైరవి, కీరవాణి, ఖరహరప్రియ, హరికాంభోజి, ధీరశంకరాభరణం వంటి రాగాల్లోని స్వరాలు కనిపిస్తాయి. ఏ సంగీతానికైనా అలంకారం గమకాలే. ప్రయత్న పూర్వకంగా ప్రయోగించక పోవచ్చు గానీ, ఈ గమకాలు వాళ్ల పాటల్లో కనిపిస్తూనే ఉంటాయి.
1941లో మద్రాసులో సంగీత సాహితీ ప్రియుడైన బెజవాడ గోపాలరెడ్డిగారి వివాహం జరిగింది. రాయప్రోలు, అబ్బూరి, విశ్వనాథ, అడివి బాపిరాజు, మల్లవరపు, దేవులపల్లి, వింజమూరి శివరామారావు మొ.వారే కాక, చెళ్లపిళ్ల వారు, వింజమూరి నరసింహారావు మొ. పండితులంతా విచ్చేశారు. ఆ సందర్భంగా చనువుతో అనసూయ వాళ్ల మామయ్య దేవులపల్లిని ఓ పాట వ్రాయమన్నది. ‘మధూదయంలో మంచి ముహూర్తం మాధవీ లతకు ‘పెళ్లి’ అనే పాట రాశారు. చూస్తుండగానే ఓ ట్యూన్ తట్టి అందరి సమక్షంలో పాడేసింది. అందరికీ నచ్చేసింది. అంతే. పదిమంది నోళ్లలోనూ పడి, గ్రామఫోన్ రికార్డయి విడుదలైపోయింది.
సినిమా రంగంలో కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచానికి కొన్ని తెలియవు. బి.ఎన్.రెడ్డిగారి చెల్లెలు వివాహానికి అనసూయ పాట కచేరీ ఏర్పాటు చేశారు. ‘యమన్’లో పాడిన ‘్ధరసమీరే యమునాతీరే’ అష్టపది రెడ్డిగారికి ఎంతో నచ్చేసింది. కృష్ణశాస్ర్తీ పాటంటే ఇష్టపడే ‘రెడ్డిగారు’ ‘మల్లీశ్వరి’ చిత్రానికి ‘మనసున మల్లెల మాలలూగెనే’ రాయించి ‘్ధర సమీరే’ ట్యూన్ పెట్టమని అనసూయను అడిగారు. అలా ‘మల్లీశ్వరి’కి నాలుగు ట్యూన్లు ఇచ్చారట. కాని సంగీతం పేరు వేయలేదు.
అలాగే ‘బంగారు పాప’ చిత్రానికి అద్దేపల్లి రామారావు సంగీతం, మళ్లీ యమన్‌లో పాట చేయమని అనసూయను కోరారు.
ఏ కొరనోములు ఏమి నోచెనో, తాథిమి తకథిమి,
పండు వెనె్నలా, కనులకొకసారి సంత పాట చేశారు. తీరా చూస్తే ‘సంగీతం’ పేరు వేయనందుకు అనసూయ ఎంతో బాధపడిందని బి.ఎన్.రెడ్డికి తెలుసు. 2008 సం.లో నేను, మల్లాది సోదరులు కలిసి, అమెరికా టూర్‌లో జరిగిన ఓ కచేరీకి కూతుర్ని వెంటబెట్టుకొని వచ్చి ముందు వరుసలో కూర్చుని పరమానందపడి, ఆమె ఇంట్లోనే బస చేసినప్పుడు చెప్పిన కబుర్లే ఇవన్నీ.
జానపద సంగీతానికి శాస్ర్తియ సంగీత మాధుర్యాన్ని నింపిన జంట.. సీత, అనసూయలు.
*

- మల్లాది సూరిబాబు 9052765490