S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహావిద్వాంసులు - మరపురాని జ్ఞాపకాలు ((అమృతవర్షిణి))

విష్ణ్ధుర్మోత్తర పురాణంలో పురాతన కథ ఒకటుంది. ఓ ఆశ్రమంలో అద్భుత కళా చాతుర్యంతో నిండిన విగ్రహాలను చూసిన మహారాజొకడు పక్కనే ఉన్న ఒక ఋషిని శిల్పకళా విద్యను నేర్పమన్నాడు.
వారిద్దరి మధ్య సాగిన సంభాషణ:
‘మహారాజా! చిత్రకళా రహస్యాలు తెలిస్తేగాని, శిల్పకళలో నైపుణ్యం రాదు.’
‘అయితే! నాకు ఆ చిత్రకళా మర్మాలు ముందు బోధించండి.’
‘రాజా! నృత్యాభినివేశం వుంటే గానీ, చిత్రకళలో ప్రవేశించటం కష్టం మరి.’
‘అలాగైతే, నాకు నృత్యమే నేర్పించండి’
‘రాజా! మీ ఉత్సాహం మెచ్చుకోదగినదే. కానీ లయ వాద్య సంగీత మర్మాలు తెలిస్తే గానీ, నృత్యంలో అనుభవం రాదు.’
‘దయచేసి ఆ వాద్య పరికరాలు వాయించటమెలాగో! అదైనా బోధించండి’
‘మహారాజా! వాద్య ధర్మం తెలియాలంటే గాత్ర ధర్మం బాగా తెలియాలి. నాభిలో నుంచి వచ్చే నాదం, పరిణామం చెంది కంఠంలో ఎలా పలుకుతుందో తెలియాలి. గాత్ర సంగీతం తెలిస్తేనే అది సాధ్యం.’
ఈ మాట విన్న మహారాజు సంతృప్తి చెంది,
‘అన్నిటికంటే గాత్ర సంగీతమే ఉత్కృష్టమైన సంగీత సాధనమైతే, అదే నేర్పించండి’ అన్నాడు.
గొంతు విప్పి, మధురంగా పాడగలగడం భగవంతుడిచ్చే వరం. ప్రయత్నపూర్వకంగా లభించేది కొందరికైతే, అప్రయత్నంగానే సిద్ధించేది మరి కొందరికి. వినికిడితో లభించే జ్ఞానం కలిగిన వారు మరి కొందరు.
మనకంటే ముందు తరంలోని మహా విద్వాంసులు సంగీతం మనకు తెలిసే అవకాశం ఈవేళ లేదు. కానీ వారి సంగీతాన్ని భావి తరాలకు పుష్కలంగా పంచేసి వెళ్లిపోయారు. వారే సంప్రదాయ సంగీత వారధులు, స్ఫూర్తిదాతలు. వారికి లభించిన విభూతిని దైవపరం చేసి నిజాయితీగా పాడుకున్నారు. శ్రోతలను తమ వైపునకు లాక్కున్నారు. పరమానందాన్ని అనుభవించారు. దైవాన్ని మెప్పిస్తూ తృప్తిపరచగలిగే గానం సామాన్యుడి వల్ల సాధ్యమవుతుందా?
ధ్యాస వేరైతే ధ్యేయం, లక్ష్యం మరోలా ఉంటుంది. సంగీతం వేదజనితమైన విద్య. ఈ విద్యనుపాసించి, పరవశించే లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, నారదాది మునులు, ఆంజనేయుడు, సప్తర్షుల్లో కాశ్యపుడు, కుమారస్వామి, గణపతి, మార్కండేయుడు, అగస్త్యుడు, సోమేశ్వరుడు, తుంబురుడు, ప్రమథ గణాల్లో ప్రముఖుడైన నందీశ్వరుడాదిగాగల వారందరికీ తన రెండు చేతులూ యెత్తి నమస్కరించి పరవశించి పాడుకున్నారు.. త్యాగరాజస్వామి (విదులకు మ్రొక్కెద)
స్వరానికీ సాహిత్యానికీ వున్న సంబంధం ప్రాణానికీ శరీరానికీ వున్న అనుబంధం లాంటిదే. అందుకే ప్రణవ నాద సుధారసమే నరాకృతైందంటారు ఆయన. పాడే ప్రతీ పాటలోనూ ప్రణవ నాదం నిక్షిప్తమై ఉండదు. ఆ నాదానుభవం తెలియాలి. ఆ ప్రయత్నం చేసి పాడగలిగేది గాయకుడు లేదా వాదకుడూను.
క. లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగిన తుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్’ అన్నట్లు,
భక్తులైన వారందరూ దర్శింపగలిగినదీ వెలుగునే.
సంగీత మార్గంలో వెళ్తే ఈ కాంతి మరింత శీఘ్రంగా దొరుకుతుందనీ, కన్పిస్తుందని నిరూపించారు.
అవే ఏడు స్వరాలు. కానీ త్యాగరాజుకు కన్పించిన స్వరాల రూపం వేరు. ఇళయరాజాకు కనిపించేది వేరు. తీగలతో అల్లిన పంజరంలో చిలక ఉంటుంది. అదే దానికి ఆధారం. పంజరంలో ఉన్నంతసేపూ అక్కడే తిరుగుతుంది. ఒక్కసారి తలుపు తీయగానే, స్వేచ్ఛ లభించి, ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంది. ఆకాశమే దానికి హద్దు. గాయకుని పాటలో కనిపించే మనోధర్మ జ్ఞానం కూడా అలాగే ఉంటుంది. స్వరలిపి అంటే నొటేషన్ కేవలం ఆధారం మాత్రమే. కంటికి కనిపించే స్వరాలకు ప్రాణ ప్రతిష్ట చేసేది గాయకుడు. పాట ఎలా వినిపిస్తుందో, యథాతథంగా అలాగే స్వరలిపి (నొటేషన్) వ్రాయటం కష్టం. కనిపించిన స్వరాన్ని సాహిత్యానికి అన్వయం చేసుకుని మనోధర్మంతో పాడిన వారివల్లే మన సంగీతం పెరుగుతూ వస్తోంది.
అసాధారణమైన ప్రజ్ఞతో, మనోధర్మంతో వేలాది సంగీత రసికులను మెప్పించి చరితార్థులైన వెనుకటి తరంలోని మహా విద్వాంసులు జీవితంలోని మధురమైన ఘట్టాలను ఓసారి గుర్తుకు తెచ్చుకుంటే అదే భావితరాలకు స్ఫూర్తిగా నిలిచి, మార్గదర్శనం చేస్తాయి. రాళ్లను సైతం కరిగించగలిగే గాంధర్వుల దివ్యమైన గానం వారితోనే అంతరిస్తుందనే వారు హరికథా పితామహుడైన శ్రీమదజ్జాడ ఆధిభట్ల నారాయణదాసు. వెనకటి తరంలోని మహావిద్వాంసులు, వారి గానం గురించి ఎవరెవరో చెప్పగా వినటమేగాని, వారి గాన విద్యా రహస్యాలు ఈ తరం వారికి తెలియవు. సంగీత మూర్తి త్రయం వారి తర్వాత వచ్చిన మొదటి తరంలోని మహావిద్వాంసుల గానం ఆ రోజుల్లో ఎక్కడా నిక్షేపించే అవకాశాలూ లేవు - రికార్డింగ్ వసతి ఏర్పడినా, కొందరు విద్వాంసులకు రికార్డు చేయాలనే ఉత్సాహం లేక ఇష్టపడేవారు కాదు.
కర్ణాటక సంగీత చరిత్రలో బాగా పేరున్న ఇద్దర్ని ప్రస్తావిస్తాను. ఒకరు మహావైద్యనాథయ్యర్ (1844-1893), మరొకరు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ (1845-1902).
మొత్తం 72 మేళకర్త రాగాలు పూసగుచ్చి తయారుచేసిన మేళ రాగమాలిక రూపకర్త మహావైద్యనాథయ్యర్. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాడిన రికార్డు ఉంది. ‘రఘు వంశ సుధాంబుధి చంద్ర శ్రీ రామ రాజరాజేశ్వర - అనే ‘కదన కుతూహలం’ రాగంలోని కీర్తన బహుజన హితమై ప్రసిద్ధమై, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తిని చాటింది. సినిమా వాతావరణం లేని ఆ రోజుల్లో, పెళ్లిళ్లలోనూ, శుభ కార్యాలలోనూ ఈ కీర్తన వాద్య బృందంలో విస్తృతంగా వినిపిస్తూండేది. నాదస్వర మేళమే కాదు, 1940-50 మధ్య ప్రసిద్ధమైన ‘నాదముని బ్యాండ్’ ఇటువంటి కీర్తనలు అద్భుతంగా వాయించేవారు. హెచ్‌ఎంవి కంపెనీ వారు ‘నాదముని’ బ్యాండ్ వాయించిన వాద్య బృంద కృతులను గ్రామఫోన్ రికార్డులుగా విడుదల చేశారంటే ఆ కీర్తనకున్న జనాదరణ గ్రహించవచ్చు. ఈ ఇద్దరు మహా విద్వాంసులూ ఆ రోజుల్లో సమానమైన పేరు ప్రఖ్యాతులున్నవారే. ఈయన శిష్యుడే పూచి శ్రీనివాసయ్యంగార్, అరియక్యుడి రామానుజయ్యర్ శ్రీనివాసయ్యంగార్ శిష్యుడై సంప్రదాయ సంగీత పద్ధతికి ఆద్యుడైయ్యాడు.
అత్యంత వేగం (జనిద్హిఉనిది డ-ఉఉ) తో పాడినా ఉచ్చారణ దోషాలు లేకుండా మైకులే లేని ఆ రోజుల్లో పది, పదిహేను వేల మంది రసికులైన శ్రోతలు అత్యంత స్పష్టంగా వినగలిగేలా శ్రావ్యమైన కంఠస్వరంతో పరమానందంగా పాడగలిగిన మహా విద్వాంసుడైన వైద్యనాథయ్యర్ సర్వ స్వతంత్రమైన వ్యక్తిత్వం కలిగిన గాయకుడు - ఆయన పెద్దన్నయ్య కచేరీల్లో సవ్యాకారంగా వేదికపై కూర్చునేవాడు. మహా వైద్యనాథయ్యర్ కచేరీ ఏర్పాట్ల బాధ్యతంతా సోదరుడే చూసుకునేవాడు కూడా.
ఓ సంగీత రసికునింట్లో వైద్యనాథయ్యర్ కచేరీ జరుగుతోంది. కచేరీ ‘్భరవి’ రాగంలో, ‘ముత్తుస్వామి దీక్షితుల వారి ‘చింతయ మాకందమూలకందం’ అనే కృతితో ప్రారంభమయ్యింది. మెరుపు వేగంతో,
అనుపల్లవిలో ‘అఖండ సచ్చిదానందం’ విస్తారంగా పాడుతూ గంటన్నరసేపు నెరవు పాడి సభికుల హర్షద్వానాలు మిన్నంటగా కీర్తన ముగించాడు. అంతవరకూ బాగానే ఉంది. ఆ సంగీత రసికుడు వైద్యనాథయ్యర్ అన్న చేతికి చీటీ ఇచ్చి తనకిష్టమైన కీర్తన వినాలని కోరిక వ్యక్తపరిచాడు.
ఆ చీటీ చూసిన వైద్యనాథయ్యర్ సోదరుడు కోపంతో ఊగిపోతూ, వెంటనే సర్దుకుని తమ్ముణ్ణి దిగమని, వేదిక ఖాళీ చేసి ఇద్దరూ దిగిపోయారు.
‘వైతా! శ్రోతల స్థాయికి దిగిపోయి, పాడవలసిన దుస్థితి నీకు లేదు. దివ్యమైన నీ సంగీతం నీ కోసమే పాడుకో. ఇటువంటి కచేరీలు ఎన్నడూ ఒప్పుకోకు’ అంటూ, సభా ప్రాంగణం నుంచి ఇద్దరూ నిష్క్రమించారు. రసజ్ఞులు కాని వారికి సంగీతం వినిపించటం, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. శ్రోతల స్థాయికి దిగిపోయిన సంగీతం పెరగదు, పెరగనివ్వదు. ఉత్తమాభిరుచిని కలిగించవలసిన బాధ్యత విద్వాంసులదే’ అనేవారు ‘సంగీత కళానిధి’ డా.శ్రీపాద పినాకపాణి.
సమ్మోహనకరమై, త్రిస్థాయిల్లో పలకగలిగిన గాత్రం మహావైద్యనాథయ్యర్‌ది. విలంబకాలంలో మందగమనంలో సాగే గానం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్‌ది.
ఖమాస్ రాగంలో ‘బ్రోచే వారెవరురా? రఘువరా! నిను వినా’ అనే ప్రసిద్ధమైన కీర్తన రాసిన మైసూర్ వాసుదేవాచారి ఈయన శిష్యుడే. సంగీతలోకంలో వైద్యనాథయ్యర్, పట్నంలు ఇద్దరూ సమాన స్థాయి కలిగిన ఉద్దండులు. ఇద్దరి నివాసం తిరువయ్యూరుకు సమీపంలోనే. సద్గురు త్యాగరాజస్వామి కీర్తనలు ఎంతో నియమబద్ధంగా కట్టుదిట్టంగా పాడి ప్రచారం చేసిన వారిలో పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ ప్రముఖులు. లక్ష్య లక్షణ జ్ఞానం తెలిసి ఎన్నో అద్భుతమైన కీర్తనలు సంగీత లోకానికి అందించిన వాగ్గేయకారుడు.
‘బెగడి’ రాగం పాడటంలో ప్రత్యేక ప్రతిభ కల్గినవారు. ఆ రాగమే ఆయన ఇంటిపేరైంది. తిరువయ్యార్ ప్రజలు ఎంతో గొప్ప సంగీత రసికులు. ప్రణతార్తి హరుని దేవాలయంలో సంగీత కచేరీలు జరుగుతూండేవి. ఈ ఇద్దరి కచేరీలూ రోజు విడిచి రోజు ఏర్పాటయ్యేవి. ఈశ్వర సన్నిధానంలో ఒకరి కచేరీ, ఆ మరునాడు పార్వతీదేవి సన్నిధానంలో మరొకరి కచేరీ వుండేది. మహావైద్యనాథయ్యర్, పట్నం ఇద్దరూ పోటాపోటీగా పాడేసేవారట. వృత్తిపరమైన పోటీ ఎప్పుడూ వుంటూనే వుండేది. తన శిష్యుడైన మైసూర్ వాసుదేవాచారిని పిలిచి ఓ రోజు గదిలో బీరువా తెరిచి, ‘వాసూ! నేనూ, వైద్యనాథయ్యర్ శత్రువుల మనుకుంటున్నావేమో? నా పాటంటే వైద్యనాథయ్యర్‌కు ఎంతో ఇష్టం. తన పాటంటే నాకు చాలా గౌరవం. వృత్తిపరమైన అభిప్రాయ భేదాలు సహజం’ అంటూ ‘విజయ సంగ్రహ’మని తన సంగీత కచేరీల విజయాలపై ఓ గ్రంథాన్ని వైతా రాశాడు. ఆ గ్రంథానికి దీటుగా నేను కూడా ‘విజయ సంగ్రహ ఖండన’మని మరో గ్రంథాన్ని రాశాను. అక్కడితో ఆగక ‘విజయ సంగ్రహ ఖండన దండన’మని మరో పుస్తకం వదిలాడు, చూడమ’ని వాసుదేవాచారి చేతిలో ఆ గ్రంథాలుంచి,
ఇప్పుడే గ్రంథానికి విరుగుడుగా మరో పుస్తకం నేను సిద్ధం చేస్తున్నాను. దీనికి పేరు ఆలోచించి సూచించగలవా? అన్నాడు. వెంటనే వాసుదేవాచారి అలవోకగా, దానికేముంది గురువుగారూ! విజయ సంగ్రహ ఖండన దండన ముండన’ అని పెట్తే పోలా? అన్నాడు. నిజమే బాగుందనిపించింది.
పరిపూర్ణ ప్రజ్ఞావంతులైన పండితులు, విద్వాంసులు వంగి వంగి దండాలు పెట్టరు. కర్ణాటక సంగీత సౌధ నిర్మాతలై సంప్రదాయ సంగీత సౌరభాన్ని ఆబాలగోపాలానికి పంచిన ఆనాటి మహా విద్వాంసులలో ఉమయాల్పురం సోదరులు, రామ్నాడ్ శ్రీనివాసయ్యంగార్, తంజావూర్ నారాయణ స్వామి, సిమిళి సుందరమయ్యర్, మధురై పుష్పవనం అయ్యర్, కోనేరి రాజపురం వైద్యనాథ భాగవతార్ వంటి ప్రముఖులు, మనకంటే ముందే పుట్టి, ఏ పని కోసం జన్మించారో తెలుసుకుని పాడేసి వెళ్లారు. మన తెలుగు వారిలో మహా విద్వాంసుడైన ఆకుమళ్ల (మానాంబుచావిడి) వెంకట సుబ్బయ్య త్యాగయ్యకు ప్రత్యక్ష శిష్యుడు. సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రులు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి మొదలైన అనేక మంది శిష్య ప్రశిష్య వర్గంతో సంగీత వృక్షం శాఖోపశాఖలై విస్తరిల్లింది.
వీరితోబాటు ఒకప్పుడు తాడిగడప శేషయ్య, పిరాట్ల శంకరశాస్ర్తీ, రామసుబ్బయ్య, బలిజేపల్లి సీతారామయ్య వంటి ప్రముఖులు కూడా ఆంధ్రదేశంలో వుండేవారు.
ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే సద్గురువులు వల్ల మాత్రమే సంప్రదాయ సంగీతం విస్తరిల్లి ప్రచారమవుతుంది. వంచనతో కించిత్ ప్రయోజనం వుండదు. హరికథా పితామహుడైన ఆదిభట్ల వారు సాధారణంగా కావాలని ఎవరినీ ఎదుర్కొనే స్వభావమున్న వ్యక్తి కాదు. ఎదిరించినా, ఆక్షేపించినా ఆసీమాంతం చూసే రకం. ప్రతిభ కనిపిస్తే పట్టం కట్టేవాడు. ఓ రోజు విజయనగరంలోని పార్కులో చామర్తి సత్యనారాయణ గారి (అప్పట్లో బాగా ప్రసిద్ధమైన పేరు) భామా కలాపం జరుగుతోంది.
వీధి భాగవతమన్న మాట. పిలవకపోయినా ఆ సమయం తెలుసుకుని సత్యభామ తెరలోకి వచ్చి ‘అంచాస్తవం’ ఆరంభించే సరికి దాసుగారు వెళ్లి ఎవరికీ తెలియని విధంగా ఒక ఉత్తరీయంతో ముసుగు వేసుకుని అందరికీ చివర ఓరగా నిల్చుని చూస్తున్నారు. సమయం అర్ధరాత్రి. ఉదయం మంగళ హారతి పాడేవరకూ అలాగే నిల్చుకుని, అంతా అయాక జనం మధ్య నుంచి వెళ్లి ‘ఒరే! నిజంగా నువ్వు వేషానికి సత్యభామవేరా! నీ గానం గంధర్వగానం ‘వీధిభాగవతులు’ వినికిడి మాత్రమే చేసేవారే కాదు, పెద్దపెద్ద బిరుదులు అంటగట్టుకుని పాటకచేరీలు చేసే గాయకులు కూడా నీ ముందు దిగదుడుపేరా! మళ్లీ అంటున్నా విను. నీ నోట గంధర్వ గానం ఈ వేళ విన్నాను. ఇలా రా!! ‘ఇదిగో బహుమతి’ అని తాను కప్పుకున్న కాశ్మీరు శాల్వా యిచ్చి మెచ్చి దీవించారట, ఆ గుణగ్రాహి.
ఆయనంటూండేవారట.
గుణాః పూజాస్థానం గుణిషు
న చ లింగం న చ వయః - అని.
సంగీతానికైనా, సాహిత్యానికైనా గుణాన్ని ఎంచి ప్రేమించి, ఆదరించి గౌరవించడం, ఆ వ్యక్తి యొక్క ప్రత్యేక వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.
కొందరు సంగీత కచేరీలకు వచ్చి విద్వాంసుని ఎదురుగా మొదటి వరుస కుర్చీల్లోనే కూర్చుంటారు. గాయకుడి ప్రతిభను గ్రహిస్తున్నారో లేదో తెలియదు. ఏదో పోగొట్టుకున్న వారిలా కూర్చుని చూస్తూ నిశే్చష్టులై వింటూంటారు. స్పందనా, ప్రతిస్పందనా రెండూ వుండవు. మీరు గమనించే వుంటారు.
కానీ దక్షిణాదిలో కచేరీలు వినే శ్రోతల ధోరణి, మనలా వుండదు. అడుగడుగునా, ఆనందిస్తూ అర్థం చేసుకుంటూ వింటారు. పక్కవారితో మాట్లాడరు. తదేక దృష్టితో, ఏకాగ్రంగా వింటారు. వారికి బాగా మనసుకు నచ్చితే, సదరు కళాకారుణ్ణి వేదిక వద్దకు వెళ్లి అభినందించి మరీ వెళ్తారు. అదీ అక్కడివారి సంస్కారం. సాధారణంగా అక్కడ కచేరీలు చేసే వారంతా అంకితభావంతోనే పాడతారు. పాడేలా చేసేది అక్కడున్న సంగీత రసికులే. శృతిపక్వమైన గానం అమృతత్వాన్ని పొందుతుంది. దానివల్ల పాడినవాడు, విన్నవాడూ అమృతత్వాన్ని పొందుతారు.
*

చిత్రాలు..మహావైద్యనాథయ్యర్ * పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

- మల్లాది సూరిబాబు 9052765490