S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తాయెత్తు మహిమ ( సిసింద్రీ కథ)

చింటూచాలా అల్లరివాడు. అమ్మా నాన్న చెప్పింది విన్నట్టు నటిస్తూ.. బడికి వెళ్లకుండా బలాదూర్ తిరిగేవాడు. ఒకవేళ బడికి వెళ్లినా క్లాసులో మాస్టారు చెప్పింది వినేవాడు కాదు. పరీక్షలలో తప్పి మరలా అదే క్లాసు చదివేవాడు. చింటూ వాళ్ల అమ్మానాన్నా చాలాసార్లు చెప్పి చూశారు. వాడిలో మార్పు రాలేదు. జులాయి అనే పేరు పడ్డాడు.
చింటూకి రోడ్డు మీద మేజిక్ అంటే ఇష్టం. బడి ఎగ్గొట్టి అలా మేజిక్ చూస్తూ ఉండిపోయేవాడు. ఒకరోజు మేజిక్ అయిపోయాక మోలి సాహెబ్ అందరికీ తాయెత్తులు పంచి, డబ్బులు తీసుకున్నాడు. చాలామంది ఆ తాయెత్తుల కోసం ఎగబడ్డారు. ఆ మోలివాడు చింటూని చూసి ‘రేపు వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురా. నీకు తాయెత్తు ఇస్తాను. దాంతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి’ అన్నాడు.
చింటూ ‘డబ్బులు ఎలా సంపాదించాలా’ అనుకున్నాడు. అమ్మా నాన్నలను అడిగితే ఇవ్వరు. ఇంటిలో దొంగతనంగా డబ్బు తీసుకోవాలి. అనుకున్నదే తడవుగా ఆ రోజు రాత్రి నాన్నగారి జేబులోంచి డబ్బులు దొంగిలించాడు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. రేపు మోలి దగ్గరకు వెళ్లాలి. తాయెత్తు సంపాదించాలి. దానితో నేను పెద్ద ధనవంతుడనై పోవాలి. ఇదే ఆలోచన.
మరుసటిరోజు మోలి దగ్గరకు చాలామంది జనం వచ్చారు. అందరిని తోసుకుంటూ చింటూ ముందు వరసలో కూర్చున్నాడు. మోలి మొదలయింది. మోలి సాహెబ్ తన కనికట్టు విద్యతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. జనం మైమరచిపోయి చూస్తున్నాడు. చింటూ సంగతి సరేసరి. కళ్లు మూయకుండా మోలి చూస్తున్నాడు. సాహెబ్ ఒక డబ్బాలో ఏమీ లేకుండా డబ్బులు తెప్పించాడు. పాముని పెట్టెలో పెట్టి మాయం చేశాడు. ఒకటే చప్పట్లు. మోలి పూర్తయ్యాక సాహెబ్.. తాయెత్తులు తీశాడు. అందరికీ పంచిపెట్టాడు. ‘ఎవరూ కదలకండి.. నేను మంత్రం చదివి తాయెత్తుకి ప్రాణం పోస్తాను. దానితో మీ దశ తిరిగిపోతుంది’ అంటూ మంత్రం చదివి తాయెత్తుని చేతికి కట్టుకొమ్మంటూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. చింటూ కూడా డబ్బు ఇచ్చి తాయెత్తు చేతికి కట్టుకున్నాడు. ఇక తనకు ఎదురులేదనే ధీమాతో ఇంటికి బయలుదేరాడు.
దారిలో మాస్టారు కనిపించి ‘ఏరా చింటూ ఈ రోజు బడికి రాలేదు’ అని అడిగితే, ‘ఇక నేను చదవను మాస్టారూ..’ అని తలబిరుసుగా సమాధానం చెప్పి వెళ్లిపోయాడు. ‘్ఛ వెధవ.. చెడబుట్టావు’ అని తిట్టుకుంటూ వెళ్లిపోయారు మాస్టారు. ఇంటి దగ్గర చింటూ దొంగతనం చేశాడని తెలిసిపోయింది. చదువు లేదు. ఆఖరికి దొంగలా మారాడు అని బాధపడ్డారు చింటూ తల్లిదండ్రులు. రోజులు గడిచాయి. చింటూకి తాయెత్తు వల్ల ఏమీ లాభం రాలేదు సరిగదా అమ్మా నాన్న కూడా మాట్లాడటం మానేశారు. తాయెత్తు పని చేయలేదన్న మాట. వెళ్లి ఆ మోలి సాహెబ్‌ని అడగాలి అనుకున్నాడు.
ఆ రోజు మోలి సాహెబ్ ఆట పెట్టలేదు. చింటూ మోలి సాహెబ్ దగ్గరకు వెళ్లి ‘నాకు నువ్వు ఇచ్చిన తాయెత్తు పని చెయ్యలేదు’ అన్నాడు.
‘ఈ రోజు మా పాపకు బాగాలేక నేనే ఆట పెట్టలేదని బాధపడుతున్నాను. నీ గొడవ ఏంటి మధ్యలో.. తాయెత్తు పని చేస్తుంది.. పో’ అని చీదరించాడు మోలి సాహెబ్. చింటూ ఏడుస్తూ.. మోలి సాహెబ్‌ని తిడుతూ.. ఇంటికేసి బయల్దేరాడు. దారిలో చింటూకి వాళ్ల మావయ్య కనిపించాడు. ‘ఏరా చింటూ అలా ఏడుస్తున్నావు?’ అని అడిగాడు.
చింటూ జరిగిందంతా వాళ్ల మావయ్యకు చెప్పాడు.
‘ఒరే చింటూ.. ఒక మాట చెబుతా విను. నిజంగా తాయెత్తు పనిచేస్తే ఆ మోలి సాహెబ్ రోజూ రోడ్డు మీద మోలి ఎందుకు చేసుకుంటాడు చెప్పు. నీ దగ్గర ఒక తాయెత్తు మాత్రమే ఉంది. కాని ఆ సాహెబ్ దగ్గర బోలెడు తాయెత్తులు ఉన్నాయి. నిజంగా అవి పనిచేస్తే.. అతను ఈ రోజు ధనవంతుడై పోవాలి. కాని ఒక్కరోజు మోలి కట్టకపోతే అతను, అతని కుటుంబం పస్తులు ఉండాలి తెలుసా.. ఏదైనా పనిచేసి కష్టపడి డబ్బులు సంపాదించాలి. కాని.. ఇలా తాయెత్తులు, మంత్రాలు అంటే.. డబ్బులు రావురా.. ఇకనైనా బుద్ధిగా చదువుకుని మంచి పేరు తెచ్చుకో.. మీ అమ్మా నాన్న.. నీ గురించి బాధపడుకండా చూసుకో’ అన్నాడు.
నిజమే! తాయెత్తుకి మహిమ ఉంటే మోలి సాహెబ్ అలా ఎందుకుంటాడు అని ఆలోచించాడు. అప్పుడు చింటూకి జ్ఞానోదయమైంది. తాయెత్తులో ఏ మహిమ ఉండదని. ఆ రోజు నుండి బుద్ధిగా బడికి వెళ్లి మంచి విద్యార్థిగా మారాడు.

- కూచిమంచి నాగేంద్ర