S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. మీరే డిటెక్టివ్ 34

మీకో ప్రశ్న

శ్రీరామ నామం ఎందుకు
తారకమంత్రం అయింది?

పుట్టినప్పటి నించి కైకేయి దగ్గర దాసిగా ఉన్న మంథర యాదృచ్ఛికంగా (దైవవశాన) తెల్లటి ప్రాసాదం ఎక్కింది. పూలు చల్లి, పతాకాలతో, జండాలతో అలంకరించిన అయోధ్యా నగరంలోని రాజమార్గాలని చూసింది. నిరాటంకంగా నడవడానికి కొత్త మార్గాలు వేశారు. తల స్నానం చేసిన ప్రజలని, చేతుల్లో పూల మాలలని, రుచిగల భక్ష్యాలను పట్టుకుని మంత్రోచ్ఛారణ చేసే బ్రాహ్మణులని, వెల్ల వేసిన దేవాలయాలని, సంతోషంగా ఉన్న పౌరుల్ని చూసింది. వివిధ వాయిద్యాలతో, వేదఘోషతో నగరం మారుమోగుతోంది. ఆంబోతులు రంకెలు వేస్తున్నాయి. ప్రజలు ఆనందంతో తమ ఇళ్ల మీద జండాలని ఎగరేశారు. ఏనుగులు, గుర్రాలు కూడా ఉత్సాహంగా కనిపించాయి. ఓ భటుడ్ని మంథర అడిగింది.
‘లోభి ఐన కౌసల్య ఎందుకు ప్రజలకి డబ్బులు దానం చేస్తోంది? ప్రజలంతా ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు? రాజు ఏదైనా మంచి పని చేస్తున్నాడా?’
‘రేపు పుష్యమీ నక్షత్రంలో దశరథ మహారాజు రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నాడు’ వెంటనే భటుడు ఆనందంగా చెప్పాడు.
ఆ మాటలు వినగానే పాపపు ఆలోచన గల మంథర కోపంతో మండిపడుతూ ఎతె్తైన ఆ ప్రాసాదం నించి దిగి పడుకుని ఉన్న కైకేయి దగ్గరకి వెళ్లి ఇలా చెప్పింది.
‘ఓ తెలివితక్కువదానా! నీకు ఆపద కలుగుతోందని తెలీక పడుకున్నావు. లే. నీ భర్తకి నువ్వంటే ఇష్టం అన్నది నిజం కాదు. సౌభాగ్యవంతురాలివని గర్వపడుతున్నావు. కాని అది గ్రీష్మంలోని నదీ ప్రవాహంలా చంచలమైంది’
గూని ఐన మంథర మాట్లాడిన ఆ పాపపు, కోపపు మాటలు విని కైకేయిలో విచారం కలిగి అడిగింది.
‘మంథరా! మన క్షేమానికి భంగం కలిగిందా? ఎందుకు నువ్వు విచారంగా, దిగులుగా కనిపిస్తున్నావు?’
కైకేయి హితాన్ని కోరే మాటకారైన మంథర ఇంకా దిగులు పడి, రాముడు ఆమెకి వేరే అయేలా, కైకేయికి దుఃఖం పుట్టిస్తూ కోపంగా ఇలా బదులు చెప్పింది.
‘దేవీ! నీకు అంతులేని పెద్ద వినాశనం ఏర్పడింది. దశరథుడు రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నాడు. అది నాకు చాలా భయాన్ని కలిగిస్తోంది. దుఃఖం అనే అగ్నిలో కాల్చబడుతూ ఇక్కడికి నీకు మంచి చేయడానికి వచ్చాను. కైకేరుూ! నిస్సందేహంగా నీ దుఃఖమే నా దుఃఖం, నీ అభివృద్ధే నా అభివృద్ధి. రాజవంశంలో పుట్టి, రాజు ప్రధాన భార్యవై ఉండి కూడా నీకు రాజధర్మంలోని క్రూరత్వం ఎందుకు అర్థం కాదు? ధర్మపన్నాలు చెప్తున్న నీ భర్త క్రూరుడు. మంచి మనసు గల నువ్వు అతను చేసే మోసాన్ని తెలుసుకోలేక పోతున్నావు. నీ దగ్గరికి వచ్చి ప్రయోజనం లేని సాంత్వన మాటలని చెప్పే ఆయన నేడు కౌసల్యకి ప్రయోజనం కలిగే పనిని చేస్తున్నాడు. ఓ అమాయకురాలా! తల్లిలా మంచిని కోరే నువ్వు శత్రువైన ఓ పాముని భర్త పేరుతో ఒళ్లో ఉంచుకున్నావు. వదిలి పెట్టిన పాము కాని, శత్రువు కాని ఏం చేస్తారో దశరథ మహారాజు అలా చేస్తున్నాడు. తెలివిహీనురాలా! నిత్య సుఖాల్లో ఉన్న నిన్ను బూటకపు మాటలు చెప్పి రాజ్యాన్ని రాముడికి కట్టపెట్టే ఆ పాపాత్ముడు, దుష్టబుద్ధిగల ఆయన నీ సంతానంతో సహా నిన్ను దెబ్బ తీస్తున్నాడు. కైకేరుూ! నీకు మేలు కలిగే పని వెంటనే చేయి. నీ కొడుకుని, నిన్ను కూడా రక్షించుకో’
అంతవరకూ పడుకుని ఉన్న అందమైన ముఖంగల ఆమె మంథర మాటలకి సంతోషిస్తూ లేచింది. గూనిదైన మంథర మాటలకి ఆశ్చర్యపడుతూ స్ర్తిలలో ఉత్తమురాలైన కైకేయి ఇలా చెప్పింది.
‘మంథరా! నాకు ఇష్టమైన విషయం చెప్పావు. నువ్వు మళ్లీ ఇంతకంటే శుభవార్తని చెప్పలేవు. అందుకని నీకు మంచి వరాన్ని ఇస్తున్నాను. కోరుకో’
విసుగు, కోపం, దుఃఖాలతో మంథర ఇలా చెప్పింది.
‘తెలివితక్కువదానా! దుఃఖించాల్సిన విషయానికి సంతోషిస్తున్నావేమిటి? నువ్వు విచార సముద్రంలో ఉన్నావని కూడా తెలుసుకోలేక పోతున్నావు. నీ చెడ్డ బుద్ధికి నాలో నేనే నవ్వుకొంటూ విచారిస్తున్నాను. తెలివిగల ఎవరైనా సవతి కొడుకు అభివృద్ధిని చూసి సంతోషపడటం అంటే మృత్యువు రావడం చూసి సంతోషించడమే సుమా! రాజ్యంలో సమానాధికారం గల భరతుడు అంటే రాముడికి నయం. భయపడే వాడి నించే ఆపదలు కలుగుతాయి కాబట్టి ఆలోచించే కొద్దీ నాకు దుఃఖం కలుగుతోంది. గొప్ప విలుకాడైన లక్ష్మణుడు అన్ని విధాలా రాముడ్ని చేరాడు. అలాగే శతృఘు్నడు భరతుడ్ని చేరాడు. లక్ష్మణ శతృఘు్నలు చిన్నవారు కాబట్టి వారికి రాజయ్యే అవకాశం దూరంగా ఉంది.
‘రాముడు విద్వాంసుడు. రాజనీతిలో సమర్థుడు. ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తాడు. అలాంటి రాముడి వల్ల నీ కొడుక్కి కలిగే ఆపదలని ఆలోచిస్తేనే నాకు వణుకు పుడుతోంది. రేపు పుష్యమీ నక్షత్రంలో బ్రాహ్మణులు రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నారు. అదృష్టవంతురాలైన రాజమాత కౌసల్య ముందు నువ్వు మాతో కూడా కలిసి దాసీలా చేతులు కట్టుకుని సేవ చేయాలి. నీ కొడుకు కూడా రాముడికి సేవకుడు అవుతాడు. రాముడి తల్లి, భార్య సంతోషిస్తారు. భరతుడికి క్షీణదశ వచ్చి నీ కోడళ్ల సంతోషం జారిపోతుంది.’
దుఃఖంతో మాట్లాడే మంథరని చూసి కైకేయి రాముడి గుణాలని ప్రశంసించింది.
‘గురువుల దగ్గర శిక్షణ పొందిన రాముడు ధర్మాలు తెలిసినవాడు. కృతజ్ఞత కలవాడు. సత్యం మాట్లాడుతాడు. పరిశుద్ధుడు. దశరథ మహారాజు పెద్ద కొడుకు కాబట్టి రాజ్యాభిషేకానికి అర్హత కలవాడు. చిరంజీవైన రాముడు తన సోదరులని, ఇంకా పోషించదగ్గ అందరినీ తండ్రిలా చూసుకుంటాడు. ఓ గూనిదానా! రాముడికి రాజ్యం వస్తున్నందుకు ఎందుకు బాధపడుతున్నావు? వందేళ్ల తర్వాత తండ్రి, తాతలకి చెందిన రాజ్యాన్ని పురుష శ్రేష్ఠుడైన భరతుడు కూడా పొందుతాడు. మంథరా! మనకి అభ్యుదయం, మంచి వచ్చినా కూడా ఇంకా ఎందుకు విచారిస్తావు? రాముడు నన్ను కౌసల్య కంటే ఎక్కువగా సేవిస్తున్నాడు కదా? రాముడికి రాజ్యం ఉంటే భరతుడికీ ఉన్నట్లే. రాముడు తనని తాను ఎలా చూసుకుంటాడో సోదరులని కూడా అలాగే చూసుకుంటాడు’
ఆ మాటలు విన్న మంథర చాలా విచారంగా, దీర్ఘంగా, వేడిగా నిట్టూర్చి కైకేయితో చెప్పింది.
‘శోకంలో, ఆపదలో నుండి దుఃఖసముద్రంలో మునిగిపోతున్న నువ్వు మూర్ఖత్వం వల్ల స్వప్రయోజనాన్ని తెలుసుకోవడం లేదు. రాముడు రాజు అవుతాడు. అతని తర్వాత అతని కొడుకు అవుతాడు. రాజు అందరు కొడుకులూ రాజులు కాలేరు. అందర్నీ రాజులని చేస్తే నీతి లేకుండా పోతుంది. అందువల్ల రాజులు రాజ్యభారాన్ని పెద్ద కొడుక్కి గాని లేదా గుణవంతులైన మిగిలిన కుమారులకి కాని అప్పచెప్తారు. పుత్ర ప్రేమ గల కైకేయి! నీ కొడుకు అనాధగా సుఖాల నించి, రాజవంశం నించి దూరం అవుతాడు. నేను నీ మేలు కోరుతూంటే నన్ను అర్థం చేసుకోకుండా పైగా నీ సవతికి కలిగే అభివృద్ధికి నాకు బహుమానం ఇచ్చావు. శత్రువులు లేని రాముడు రాజయ్యాక భరతుడ్ని దేశం లోంచి లేదా ఈ లోకంలోంచే తప్పక పంపేస్తాడు. భరతుడు చిన్నపిల్లవాడుగా ఉండగానే నువ్వు వాడి మేనమామ ఇంటికి పంపించావు. దగ్గరగా ఉండటం వల్ల ప్రాణం లేని వాటి మీద కూడా ప్రేమ కలుగుతుంది. లక్ష్మణుడు రాముడ్ని అంటి పెట్టుకుని ఉన్నట్లుగా శతృఘు్నడు కూడా భరతుడి వెంట అంటిపెట్టుకుని వెళ్లాడు. ఆటవికులు కొట్టాల్సిన ఓ చెట్టు దగ్గర ఇషీక అనే ముళ్ల పొదలు ఉండటంతో ఆ చెట్లు రక్షించబడుతున్నాయని అంటారు. రామలక్ష్మణులు అలా ఒకరిని మరొకరు రక్షించుకుంటారు. వారి సోదర ప్రేమ ప్రపంచ ప్రసిద్ధమైంది. అందువల్ల రాముడు లక్ష్మణుడి విషయంలో ఎలాంటి పాపం (చంపడం) చేయడు. భరతుడి విషయంలో రాముడు ఆ పని చేస్తాడనడంలో ఎలాంటి అనుమానం లేదు. అందువల్ల నీ కొడుకు మేనమామ ఇంటి నించే అడవులకి వెళ్లడమే నాకు ఇష్టం. ఇది నీక్కూడా మంచిది. భరతుడికి ధర్మంగా తండ్రి రాజ్యం లభిస్తే నీకు, నీ బంధువులకి మంచి జరుగుతుంది. సుఖాలకి అలవాటుపడ్డ వాడు, చిన్నవాడు ఐన భరతుడు రాముడికి సహజ శత్రువు. రాముడి దేశంలో అతను ఇక ఎలా జీవిస్తాడు? అడవిలో సింహం ఏనుగుల గుంపుని తరిమినట్లుగా రాజు కాని భరతుడు రామరాజ్యంలో రాముడి చేత తరమబడతాడు. కాబట్టి భరతుడ్ని నువ్వే రక్షించాలి. నీ భర్తకి నువ్వంటే ఇష్టం కాబట్టి నువ్వు ఇదివరకు కౌసల్యని చులకనగా చూసావు. అలాంటి రాముడి తల్లి పగ తీర్చుకోకుండా ఉంటుందా? కైకేరుూ! రాముడు ఎప్పుడూ రత్నాలతో కూడిన పర్వతాలని, పట్టణాలని, భూమిని పొందుతాడు. అప్పుడు భరతుడు నువ్వూ దీనులై అశుభకరమైన అవమానాన్ని పొందుతారు. రాముడు రాజు కాగానే తప్పకుండా భరతుడు నశిస్తాడు. అందువల్ల నువ్వు ఇప్పుడే శత్రువైన రాముడ్ని ప్రవాసానికి పంపే ఉపాయం ఆలోచించు’ (అయోధ్యకాండ సర్గ 7-8)
వెంటనే శ్రోతల్లోని ఒకతను లేచి చెప్పాడు.
‘నేనీ రెండు సర్గలని క్షుణ్ణంగా చదివాను. మీరు చెప్పిన వాటిలో నాకు ఐదు తప్పులు కనిపించాయి.’
అతను వాటిని వివరించాడు. మీరు ఆ ఐదు తప్పులని కనుక్కోగలిగారా?

కిందటి వారం ప్రశ్నలకు జవాబులు

1.దశరథుడు లక్ష్మీ, కీర్తి, రాజ్యం లభించడానికి తగ్గ వ్రతాన్ని చేయించమని కోరాడు. హరిదాసు ఉత్తి వ్రతం చేయించమని కోరినట్లు చెప్పాడు.
2.రాముడి ఇంటికి చేరుకుని, వశిష్ఠుడు రథం మీదే మూడు వాకిళ్లని దాటాడు. రెండు వాకిళ్లని కాదు. (వారి వారి స్థాయిలని బట్టి ఆ కాలంలో మొదటి, రెండు వాకిళ్ల దగ్గరే సందర్శకులు నిలిచిపోయేవారు. ఆఖరి మూడో వాకిలి దాకా రాగలిగేవారు ఉన్నత స్థాయికి చెందిన వారై ఉండేవారు.)
3.నహుషుడు యయాతికి చేయించినట్లుగా రేపు నీ తండ్రి నీకు పట్ట్భాషేకాన్ని చేయబోతున్నాడు అని వశిష్ఠుడు రాముడికి చెప్పాడు. నీ తాత నీ తండ్రికి చేసినట్లుగా అన్నది తప్పు.
4.వాల్మీకి ‘ఆడవాళ్లు, పిల్లలు, ముసలి వాళ్లైన అయోధ్యా పౌరులు’ అని రాశాడు తప్ప ఉత్త అయోధ్యా వాసులు అని రాయలేదు.
5.రాముడు సీతతో కలిసి విష్ణు ఆలయంలో వౌనంగా దర్భల మీద పడుకున్నాడు. విష్ణు ఆలయంలో అని హరిదాసు చెప్పలేదు.
6.నాలుగో ఝామున లేచి ఇంటికి అలంకరణని చేయించాడు. తెల్లవారుఝామున అని మాత్రమే హరిదాసు చెప్పాడు.
7.అందరికీ కనపడే చోట రాజ చిహ్నాలు గల జండాలని ఎగరేయసాగారు. హరిదాసు ఉత్త జండాలని ఎగరవేయసాగారు అని చెప్పాడు.

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

రాముడి తర్వాతి తమ్ముడు ఎవరు?
భరతుడు. వారి తమ్ముళ్లు లక్ష్మణ, శతృఘు్నలు..

మల్లాది వెంకట కృష్ణమూర్తి