S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట.. ( అమృతవర్షిణి)

ప్రపంచంలో ఏ భాషలోనైనా ముందు పాటే పుట్టి ఉంటుంది. ఆటవిక దశ మొదలు అనేక పరిణామాలు దాటి, ఒక లయలో ఆటతో పాట పుట్టి, ఒక మాటనూ మరొక మాటనూ ఒక పద్ధతిలో కలుపుకుంటూ మనసుకు చేరి తరతరాలను ఆనందింప చేస్తూనే ఉంది. పాటకు లొంగని మనిషంటూ ఉంటాడా? గత శతాబ్దం పూర్వార్థంలో గురజాడ, రాయప్రోలు లాంటి కవుల రాకతో పద్య సాహిత్యాన్ని దాటిపోయి కాస్త పక్కకు జరిగి పాటకు బీజం పడింది. ఆ తర్వాత వచ్చిన వారిలో విశ్వనాథ, కృష్ణశాస్ర్తీ, వేదుల, నండూరి, మల్లవరపు, బసవరాజు అప్పారావు లాంటి కవులు పాటలోని మాధుర్యాన్ని విస్తృతంగా పంచి పెట్టారు.
లలిత సంగీతానికి వేదికగా మారి ఎందరెందరో కవుల పాటలు మధురమైన గళాలలో వినిపిస్తూ తన ఉనికిని చాటుకుని, ప్రజా జీవితంలో ఓ భాగమై నిలిచిపోయింది ఆకాశవాణి.
విజయవాడ, హైద్రాబాద్ రేడియో కేంద్రాల నుండి ప్రసారమవుతూ కొన్ని దశాబ్దాలపాటు సంగీత రసికులైన శ్రోతలకు పరమాన్నం లాంటి పసందైన పాటల విందు చేస్తూ రేడియో ప్రతిష్టను దిగ్దిగంతాలకు వ్యాపింపజేసిన గాయనీ గాయకులు శాశ్వతంగా గుర్తుండిపోతారు.
డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎం.వి.రమణమూర్తి, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, వి.బి.కనకదుర్గ, వింజమూరి లక్ష్మి, మల్లిక్, ఎన్.సి.వి. జగన్నాథాచార్యులు వంటివారి పేర్లు తెలియని వారెవ్వరూ ఉండరు. రేడియోతో అనుబంధం పెంచుకున్న హైదరాబాద్ ఆకాశవాణి శ్రోతలకు బాగా తెలిసిన చిత్తరంజన్, కెబికె మోహనరాజు, వేదవతీ ప్రభాకరరావు, పాకాల సావిత్రీదేవి, పాలగుమ్మి విశ్వనాథం మొదలైన వారు పాడిన పాటలు ఎవరూ మరిచిపోరు.
అప్పట్లో సినిమా పాటలతో సమాంతరంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆనాటి లలిత సంగీత గాయకులు, వారు పాడిన పాటలు గుర్తుకొస్తే చాలు. పరవశించిపోయే వారు నాకు కనిపిస్తూంటారు. సాహిత్యంలో నాణ్యత, పాటలో స్పష్టత, భావంలో ఆర్ద్రత, ఈ మూడూ కలబోసుకుని పదికాలాలపాటు నిలిచిపోయేలా తయారైన పాటలవి.
‘ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పిలుపుతో కులుకుతావట! ఓ! ఆపద మొక్కులసామి, నీ సన్నిధి నా పెన్నిథి’ (శ్రీ వేంకటేశ్వర వైభవం) అనే మధురమైన గీతం మీరు వినే ఉంటారు. ఈ పాట రాసినది రేడియో ప్రొడ్యూసర్ కీ.శే. ఏడిద కామేశ్వర్రావు. విజయవాడ రేడియో కేంద్రంలో పాలవెల్లి, బొమ్మరిల్లు కార్యక్రమాలు నిర్వహిస్తూండేవారు. నా చిన్నతనంలోనే రేడియో సంగీత కార్యక్రమాలలో పాడే అవకాశాన్ని కల్పించిన వ్యక్తి - మోహనరాగం అందరికీ తెలుసు. కానీ, రాజేశ్వర్రావు మోహన రాగం వేరు. మోహన రాగప్రియుడు సాలూరు రాజేశ్వర్రావు ఈ పాటకు బాణీ కట్టారు. సమ్మోహనంగా కుమారి శ్రీరంగం గోపాలరత్నం పాడింది.
1957లో విజయవాడ రేడియో కేంద్రంలో నిలయ విద్వాంసురాలిగా చేరి రెండు దశాబ్దాల కాలంలో ఆమె పాల్గొన్న కార్యక్రమాలన్నీ శ్రోతల అభిమానాన్ని పొందినవే.
1974లో ‘వాజపేయి యాజుల కృష్ణమూర్తి’ రచించిన ‘రాధ’ అనే నా తొలి సంగీత రూపకంలో రాధ పాత్రలో ఆమె పాడిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. రేడియో వల్ల కొందరే గుర్తింపు పొందుతారు. రేడియోకి పేరు తెచ్చేవారెక్కువగా ప్రశంసలు పొందుతూ శ్రోతలకు ఎంతో చేరువై పోతారనటానికి సాక్షి గోపాలరత్నం.
ఎన్నో సంగీత నాటకాలలో పాల్గొన్న గోపాలరత్నానికి బాగా పేరు తెచ్చిన నాటకాలలో రాధాకృష్ణ, సతీసక్కుబాయి ప్రముఖమైనవి. బాలమురళీకృష్ణతో పాల్గొన్న యక్ష గానాలు, సంగీత రూపకాలు ఎన్నో.
ఒకవైపు శాస్ర్తియ సంగీత కచేరీలు విస్తృతంగా చేస్తూ, మరోవైపు లలిత సంగీతం పాడటం, అందులో కూడా ప్రజ్ఞను కలిగి ఉండటం అరుదైన విషయం. కవిరాయని జోగారావుగారనే వైణికుని వద్ద సంగీతాభ్యాసం చేసిన రత్నం, ఆరంభంలో ‘వీణ’ వాయించేవారుట. ఆ తర్వాత గాత్ర విద్వాంసురాలై డా.శ్రీపాద పినాకపాణి, వోలేటి వెంకటేశ్వర్లు, బాలమురళీకృష్ణల సాహచర్యంలో పరిణతి పొందిన గాయనిగా పేరు సంపాదించుకున్నారు. రేడియో కార్యక్రమాల్లో ఆమె పాల్గొనని ప్రక్రియ అంటూ లేదు. రేడియో కార్యక్రమాలన్నింటిలోనూ విజయవాడ ఆకాశవాణి భక్తిరంజనిది ఓ ప్రత్యేకత. ఆ రోజుల్లో చేసిన కార్యక్రమాలే యింకా ప్రసారమవుతూ గౌరవాన్ని తెచ్చిపెడ్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సంప్రదాయ సంగీత మాధుర్యంతో నిండిన కీర్తనలే. రత్నం పాడిన భద్రాచల రామదాసు, తూము నరసింహదాసు, ప్రయాగ రంగదాసు, బొమ్మరాజు సీతారామదాసు కీర్తనలతోపాటు నారాయణ తీర్థుల వారి తరంగాలు, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, ఇలా వేటికవే సాటి.
వీటిలో ఏ ఒక్కటీ సంప్రదాయ సంగీత ధోరణికి భిన్నంగా వుండవు. అందుకే వీటికి ఆదరణ తగ్గలేదు - తగ్గదు కూడా.
ధనుర్మాసంలో ప్రతిరోజు ప్రసారమయ్యే తిరుప్పావై, సప్తపది- ఈమెకు పేరు తెచ్చిన కార్యక్రమం. బాలమురళీకృష్ణ తమిళంలో పాడిన దానికి తెలుగు అనువాదం పాడింది. బహుశా అప్పుడు బాలమురళీ వయస్సు 30-40 మధ్య ఉండవచ్చు. గోపాలరత్నానిదీ చిన్న వయస్సే.
లేతచిగురాకులా, పట్టుదారంలా ఉండే బాలమురళీకృష్ణ గొంతుతోపాటు, ఎంతో మృదుమధురమైన రత్నం కంఠస్వరం ఎనే్నళ్లుగానో వింటున్నాం.
బాలాంత్రపు రజనీకాంతరావు ప్రసక్తి లేని ఆకాశవాణి లేదు. భక్తిరంజని కార్యక్రమ రూపశిల్పి రజనీయే. ఆయన మనసులో పుట్టిన భావాలకు ప్రతీకలై నిలిచిన అనేక వైవిధ్యభరితమైన కార్యక్రమాల రథసారథులెందరో వున్నారు. అందులో గోపాలరత్నం ముఖ్యురాలు. ఆమె పాడిన ‘నాకున్ చెప్పరే వలపు నలుపో తెలుపో’ అనే అన్నమయ్య కీర్తన, రజనీ స్వరకల్పన చేశారు. శ్రోతలెంతో శ్రద్ధగా వినటం నాకు అనుభవమే.
‘ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది’ బాలమురళీ పాడితే, ‘నల్లని మేని నగవు చూపులవాడు’ గోపాలరత్నం పాడారు.
ఆ రోజుల్లో మధ్యాహ్నం 1.30 ని.లకు ‘వనితావాణి’ కార్యక్రమాలు అప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం అవుతూండేవి. ఎనౌన్సర్‌గా నేను స్టూడియోలో కూర్చుంటే చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని మెల్లగా స్టూడియోలో ప్రవేశించి కూర్చుని, వాద్య బృందంతో అప్పటికప్పుడు పాడేసేవారు.
-కనిపించునా గతము, వినిపించునా
ఎదలోని నాదాలు ఏ దారిపోయెనో’
-శివ శివ శివ యనరాదా (దేవులపల్లి కృష్ణశాస్ర్తీ)
-కస్తూరి రంగయ్య కరుణించవేమయ్య
-మ్రొక్కెద రార మోహనరంగా (శంకరాభరణం)
- లాంటి పాటలు ఎప్పుడు విన్నా అప్పుడే విన్న అనుభూతిని మిగిల్చే రసమయ గీతాలు. ఓసారి, అబ్బూరి రామకృష్ణారావు గీతం ‘పూజా శిరీషము లేరుకొంటివి పోయి వచ్చెద జవ్వనీ - సంగీత రూపకం కోసం ఇద్దరమూ పాడాము.
అందులో అన్నమయ్య పాటను బోలిన చరణం ఒకటి ఉంది. ‘ఆనంద వస్తమ్రు లేకుమారుడల్లున్, తెల్లగ నల్లగ’ అనే మాటలు ఆమె గొంతులో ఎంత మధురంగా పలికించిందో మాటల్లో వర్ణించి చెప్పలేను.
దక్షిణాదిలో పుష్కలమైన సంగీత జ్ఞానంతోపాటు, మధురమైన కంఠస్వరాలు కలిగిన గాయనీమణులలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఎన్.సి.వసంతకోకిల, ఎం.ఎల్.వసంతకుమారి పేర్లు వినిపిస్తాయి. ఇక్కడ మన తెలుగుదేశంలో అంతటి ప్రతిభ కల్గి, సుస్వర కంఠం కలిగిన గాయని గోపాలరత్నం. సంగీతం ఎక్కడ, ఎనే్నళ్లు నేర్చుకున్నామనేది ఎప్పుడూ ఎవరూ అడగరు. ఎలా పాడి మెప్పించాలో, తెలిసి పాడటమే ప్రధానం. అన్ని భాషలలోనూ ప్రసిద్ధులైన గాయనీ గాయకులతో, ఆ రోజుల్లో ఆకాశవాణి కొన్ని రికార్డులు తయారుచేసి, దేశంలోని అన్ని రేడియో కేంద్రాలకు పంపేది. (ట్రాన్స్‌స్క్రిప్షన్ రికార్డ్స్). బాలమురళీకృష్ణ, గోపాలరత్నం యుగళ గీతంగా పాడిన ‘మన ప్రేమ, సత్య సుందర సీమ ప్రభవించి ప్రభవించి’ అనే పాట మధురాతి మధురమై, తేనెలొలుకుతూ వీనులవిందు చేస్తుంది. ఈ ఇద్దరూ పాడిన నండూరి వెంకట సుబ్బారావు ఎంకి పాటలు సరేసరి. ఈ పాటలీవేళ వినే (ప్రసారమయ్యే) వీలు లేకుండా సాంకేతిక పరమైన అనేక కారణాలున్నాయి. అన్నమయ్య శృంగార కీర్తన ‘ఇందుకుగా కోపించనేల! నాకు/ ముందుగల కోపమెల్ల ముగిసెనుపోరా!’ అనే ఈ కీర్తన ‘సైంధవి’ రాగంలో, రజనీ కంపోజ్ చేయగా, వోలేటి, గోపాలరత్నం బహు పసందుగా పాడారు. సైంధవి రాగంలో మనకున్న రచనలు చాలా తక్కువ. ఈ రాగంలో స్వాతి తిరునాళ్ ‘ఇటు సాహసములు ఏల నాపై’ జావళి చాలా ప్రసిద్ధమైనది.
నేను 1971లో రేడియోలో పనిచేసే రోజుల్లో అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో పాట రాయగలిగిన కవులలో ప్రసిద్ధుడు వింజమూరి శివరామారావు. ఉదయం పాట రాసివ్వడం, మధ్యాహ్నం వచ్చి చెక్కు తీసుకుపోవడం నాకు తెలుసు. ఆయన పాటలు పాడేందుకు పసందుగా ఉండేవి. ఎన్నో కంపోజ్ చేశాను. ఆ తర్వాత కొనే్నళ్లకు ఆ స్థానం ఇంద్రగంటి శ్రీకాంత శర్మకి దక్కింది. చెప్పిన అరగంటలోగా పాట రాసి టేబిల్ మీద పెట్టేవాడు.
మీరా భజన్‌లన్నీ హిందీలోనే వున్నాయి గదా! తెలుగులో మీరా భజన్‌లు రికార్డు చేయాలనే సంకల్పం కలిగింది.
శ్రీకాంతశర్మ అద్భుతమైన సాహిత్యంతో మీరాభజన్‌లు తయారుచేసి వోలేటిగారి చేతికిచ్చారు. వోలేటి గారిచ్చిన ట్యూన్‌లకు తయారైన కొన్ని పాటలు
-రారా ప్రియ దరిశన మీయరా/ నిను వీడినే నిక మనజాలరా
-ఎవరు నాకు లేరు ఆ గిరిధర/ గోపాలుడే కాక
లాంటి ‘్భజన్’ సంప్రదాయ గీతాలు హిందూస్థానీ రాగాల్లో వోలేటి స్వరపరిచారు.
ఆ పాటల రికార్డింగ్‌లో నేనూ వున్నాను. హిందూస్థానీ బాణీలోని సంగతులను బాగా మనసుకు పట్టించుకుని అత్యంత రమణీయంగా పాడారు గోపాలరత్నం.
రేడియోలో శ్లోకాలు, పద్యాలు పాడవలసిన సందర్భాలు ఉంటుంటాయి. రాగాలాపన తెలిసినంత మాత్రాన శ్లోకాలకూ, పద్యాలకూ మోతాదుకు మించి ఆలాపన విసుగు తెప్పించడమే కాదు, ఔచిత్య భంగం కూడా. ఎంతో అనుభవంతో గోపాలరత్నం పాల్గొని పాడిన ఎన్నో యక్ష గానాల్లో ఆమె రాగాలాపన పరిమితంగా ఉంటూ భావాన్ని ఆవిష్కరించేది.
1977లో ఆకాశవాణి వదిలి హైదరాబాద్ త్యాగరాజ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేసే అవకాశం కలిగింది. 1988లో హైదరాబాద్‌లోనే తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత కళాపీఠానికి తొలి ఆచార్యులుగా కొన్నాళ్లు పనిచేశారు.
సంగీత పీఠానికి స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేసిన రోజుల్లో అత్యంత ఉత్సాహంగా కనిపించిన గోపాలరత్నం సంగీత కళాశాలకు తిరిగి ప్రిన్సిపాల్‌గా మారిన తర్వాత, అక్కడి ‘ప్రభుత్వ’ సంగీతం.. పరిసరాల వాతావరణం ఆమెకు చికాకును తెప్పించి మానసికంగా కృంగదీసిందని ఆమె సన్నిహితులంటారు. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించినా సంగీత కళాశాలలో సంగీతం నేతిబీరకాయ చందంగా తయారయ్యిందనే అసంతృప్తి బాగా ఉండేది. ఆంధ్రదేశపు సంగీత విదుషీమణులలో అగ్రశ్రేణికి చెందిన గాయని, అంకితభావంతో, అత్యంత మనోహరమైన గాత్రంతో, ఆకాశవాణి కీర్తిప్రతిష్టలను దిగ్దిగంతాలకు వ్యాపింపజేసిన శ్రీరంగం గోపాలరత్నం చిన్నవయసులోనే నిష్క్రమించటం సంగీత లోకానికి బాధే. సుస్వరంతో నిండి, చక్కని ఒదుగుతో కూడిన ఆమె పాడిన పాటలు, దివ్యమైన సంగీతం ఎప్పుడు విన్నా ఆమెను గుర్తుకు తెస్తూనే ఉంటాయి.

చిత్రం... శ్రీరంగం గోపాలరత్నం

- మల్లాది సూరిబాబు 9052765490